
మహేంద్రతనయ– ఒడిశాలోని గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే జీవనది. మహేంద్రగిరి కొండల్లో పుట్టినందునే ఈ నదికి మహేంద్రతనయ అనే పేరు వచ్చింది. మహేంద్రగిరి కొండలకు మరో విశిష్టత కూడా ఉంది. రోజున ఈ కొండలు అశేష శివభక్తకోటితో కళకళలాడుతూ కనిపిస్తాయి.
శివపూజా విధానంలో మూర్తి పూజకంటే లింగార్చనే అనంత ఫలప్రదమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాసం చేసినప్పుడు పంచపాండవులు ఇదే విశ్వసించారు. మహేంద్రగిరిపై మహాశివుడిని భక్తి ప్రపత్తులతో కొలిచి తరించారు. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి శిఖరం 1,501 మీటర్ల ఎత్తులో (4,925 అడుగులు) ఉంటుంది. మహేంద్రగిరి శిఖరాగ్రాన పంచపాండవుల ఆలయాల నిర్మాణం అప్పటి అద్భుత వాస్తునిర్మాణ ప్రతిభకు తార్కాణం.
వీటి నిర్మాణం నేటికీ అంతు చిక్కని రహస్యమే! పాండవులు అరణ్యవాస సమయంలో మహేంద్రగిరిపై కొంతకాలం నివసించినప్పుడు శివలింగాలను ప్రతిష్ఠించి, ఆరాధించారని భక్తులు చెబుతారు. ఇక్కడ ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావి శిథిలమయ్యాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉండటం విశేషం. ముప్పయి అడుగుల ఎత్తులో అరుదైన రాతికట్టుతో నిర్మించిన కుంతీ ఆలయం అబ్బురపరుస్తుంది.
ఆలయం ఎదురుగా రెండు పురాతనమైన బావులు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన మహేంద్రగిరులపై వాటిని ఎలా తవ్వారన్నది అంతుబట్టని విషయం. కుంతీ మందిరం ఉత్తరదిశలో ధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండపై భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాలలోనూ ఇదే పురాతనమైనది.
పర్వతం చివర ఒక కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంటుంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. మాఘమాసంలో కనుచూపు మేరంతా మంచుదుప్పటి కప్పుకుని కనిపించే మహేంద్రగిరుల మహోన్నత ప్రకృతి సౌందర్యం చూసి తరించాల్సిందే! ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడి ఆలయాల్లో భారీస్థాయిలో శివార్చన జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాశివరాత్రికి ముందురోజే ఇక్కడకు చేరుకుంటారు. మహాశివరాత్రి రోజంతా పూజ, పురస్కారాలతో జాగరం చేస్తూ ‘జాగరమేళా’ నిర్వహిస్తారు.
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దేవమాలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో ఎత్తయిన పర్వతం మహేంద్రగిరి. రామాయణంలో మహేంద్రగిరి కొండను మహేంద్రపర్వతంగా పేర్కొన్నారు. దాదాపు 1200 వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి అధ్యయనంలో తేలింది. దాదాపు మూడువందలకు పైగా ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయి.

మహా శివరాత్రి యాత్రకు ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. మందస సమీపంలోని సాబకోట, సింగుపురం గ్రామాల వద్ద నడకయాత్ర భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తాయి. సుమారు 32 కిలోమీటర్లు కొండలు, వాగులను దాటి కాలిబాటన మహేంద్రగిరులను చేరుకోవాలి.

శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని పర్లాకిమిడి, కొయిపూర్ మీదుగా కూడా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. పర్లాకిమిడి నుంచి 66 కిలోమీటర్లు ప్రయాణించి మహేంద్రగిరిని చేరుకోవచ్చు. శివరాత్రి రోజు తప్ప ఏడాదంతా మానవ సంచారం కానరాని ఈ మార్మిక మహేంద్రగిరి సందర్శన ఆద్యంతం అద్భుతం.
బాలు అయ్యగారి
Comments
Please login to add a commentAdd a comment