
కోరిన కోర్కెలు తీర్చే మణుగూరులోని నీలకంఠేశ్వరాలయం
ఉజ్జయిని తర్వాత ద్విలింగ దర్శనం ఇక్కడే..
స్వయంభూగా వెలిసిన శివుడు
ఏటా మహాశివరాత్రికి వేలాదిగా భక్తుల రాక
మణుగూరు టౌన్: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన పరమశివుడు నెలవైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని నీలకంఠేశ్వర ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. కాకతీయుల కాలం నాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివుడు ద్విలింగ రూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో వేలాదిగా భక్తులు నీలకంఠేశ్వరుడిని కొలిచేందుకు బారులుతీరతారు.
దేశంలో రెండో ద్విలింగ దర్శనం
ఆలయానికి వచ్చే భక్తులకు పాతాల లింగేశ్వరుడు స్తూపాకారంలో, నీలకంఠేశ్వరుడు బాణాకారంలో దర్శనమిస్తాడు. భూగర్భంలో భక్తులకు కనిపించేలా పాతాల లింగేశ్వరుడు ఉంటాడు. ఈ లింగాకారం అందరికీ కనిపించినా అర్చకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అలాగే పైన నీలకంఠేశ్వరుడు ఉంటాడు. రెండు లింగాలకు రాగి తీగలతో అనుసంధానంగా ఏర్పాట్లు చేశారు. దీంతో పైన ఉన్న నీలకంఠేశ్వరుడికి భక్తులు అభిõÙకం చేయడం ద్వారా.. పాతాళంలోని లింగేశ్వరుడికి కూడా పూజలు చేసినట్లేనని నమ్ముతారు.
కింద, పైభాగాల్లో ద్విలింగాలు దర్శనమిచ్చే ఆలయాలు దేశంలో రెండే ఉండగా, ఒకటి ఉజ్జయినీ మహంకాళి ఆలయమని, రెండోది మణుగూరులోనే ఉందని చెబుతారు. అంతేకాక రాగి తీగలతో అనుసంధానం చేసి రెండు లింగాలను ఒకటిగా కలిపే ప్రక్రియ దేశంలో మొదటిగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతారు.
ఎన్నో పురాణ కథనాలు
» శివాలయం నుంచి కర్ర, ఇనుము, రాయి, నూనె, విభూది తీసుకెళ్లరాదని శాసనాలు చెబుతున్నాయి. అయితే, మొగలాయిల కాలంలో ఓ రాజు దాడులు నిర్వహించి ఆలయాన్ని నామరూపాలు లేకుండా కూల్చివేసి ఆ శిథిలాలతో కోట నిర్మించుకున్నాడట. అనంతరకాలంలో ఆ రాజు కాలగర్భంలో కలిసిపోయాడని చెబుతారు.
» భూభాగంలోని పానవట్టంపై స్తూపాకారంలో ఉన్న లింగాన్ని మరోచోట ప్రతిష్టించేందుకు అనేక మంది ప్రయత్నించినా సాధ్యం కాలేదట. అంతేకాక వారు పరమపదించారని ప్రచారంలో ఉంది.
» వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పాతాల లింగేశ్వరుడికి సహస్రఘటాభిõÙకం (వెయ్యి బిందెలతో అభిõÙకం) చేసి స్వామిని జలబంధం చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయని భక్తులు నమ్ముతారు.
శివరాత్రికి భక్తుల తాకిడి
మణుగూరులోని ప్రాచీన నీలకంఠేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో స్వయంభూగా వెలిసిన శివుడు కావడంతో ఇక్కడికి భక్తులు శివరాత్రి ఉత్సవాల సమయంలో వేలాదిగా తరలివస్తారు. మనస్ఫూర్తిగా, నియమ నిష్టలతో పూజలు చేస్తే పరమశివుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.
– పంచాఘ్నల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ పూజారి
Comments
Please login to add a commentAdd a comment