
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్
ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.
మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.
ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.
రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు.
పల్లవుల జైనాలయం
పల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.
విజయదాసుల కట్ట
కర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment