Chippagiri
-
'బంగారు' బాటలో.. కర్నూలు జిల్లా చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బంగారు గనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా గనుల్లో తవ్వకాలు ప్రారంభించి ఆదాయాన్ని సమకూర్చుకునేలా అడుగులు వేస్తోంది. కొత్త బంగారు గనులకు టెండర్లు పిలిచి ఖరారు చేయడంతోపాటు గతంలో తవ్వకాలు నిలిచిపోయిన గనులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. బంగారు గనుల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. చిప్పగిరిలో మైనింగ్ ప్రారంభం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత కర్నూలు జిల్లా చిప్పగిరి బంగారు గనిలో ఇటీవలే తవ్వకాలు మొదలై ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 2002లో ఇక్కడ తవ్వకాలకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి లీజు మంజూరు కాగా పలు కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలను సీఎం జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఓ కొలిక్కి తెచ్చింది. ఆ కంపెనీతో పలుదఫాలు సంప్రదింపులు జరిపి మైనింగ్ ఆపరేషన్స్ మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంది. చేసింది. కంపెనీ ఇటీవల ప్రభుత్వానికి రూ.2 కోట్ల రాయల్టీ చెల్లించింది. బంగారాన్ని ప్రాసెస్ చేసే మినీ స్మెల్టర్ని గనిలో సొంతంగా ఏర్పాటు చేసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో బంగారం వెలికితీత ప్రారంభం కానుంది. చిగురుకుంట, బిసనాతంలో లైన్ క్లియర్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 118 హెక్టార్లలో ఉన్న చిగురుగుంట, బిసనాతం బ్లాకుల్లో మైనింగ్ ఆపరేషన్స్ త్వరలో మొదలు కానున్నాయి. ఈ గనిని గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి చెందిన భారత్ గోల్డ్ మైన్స్ లీజుకు తీసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల లీజు రద్దయింది. 2018లో మళ్లీ నిర్వహించిన వేలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) దీన్ని దక్కించుకుంది. ఇటీవలే స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేయడంతో ఎన్ఎండీసీకి లైన్ క్లియర్ అయింది. వచ్చే ఏడాది ఈ గనిలో కూడా బంగారం ఉత్పత్తి మొదలుకానుంది. 10 గనులపై ఫోకస్ కొత్త గనులపైనా దృష్టి సారించిన ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 బంగారు గనులకు (ఏరియాలు) కాంపోజిట్ లైసెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత నూతన గనుల చట్టం ప్రకారం (ఎంఎండీఆర్ చట్టం) వేలం ద్వారా కాంపోజిట్ మైనింగ్ లైసెన్సులు (అన్వేషణ, ఆ తర్వాత మైనింగ్ లీజు) ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. రామగిరి నార్త్, రామగిరి సౌత్, బొక్కసంపల్లి నార్త్, బొక్కసంపల్లి సౌత్ ఏరియాలకుగాను మూడు లీజులు ముంబై కేంద్రంగా ఉన్న ఆంధ్రా మైనింగ్ కంపెనీకి దక్కాయి. దేశంలోనే అత్యధికంగా మినరల్ వాల్యూలో 20 శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఈ బిడ్లు ఖరారయ్యాయి. మరో లీజు మంజూరు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా జవుకులలో 57 చదరపు కిలోమీటర్లను ఆరు బ్లాకులుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదటిసారి సరైన స్పందన రాకపోవడంతో ఇటీవల మళ్లీ టెండర్లు ఆహ్వానించారు. ఫిబ్రవరిలో వాటికి వేలం జరగనుంది. మారిన పరిస్థితుల్లో ఆ బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుచూపుతో ప్రణాళిక.. మైనింగ్ రంగంలో ఉన్న విస్తారమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ ఇచ్చారు. అందులో భాగంగానే బంగారు గనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. రానున్న రోజుల్లో వీటి ద్వారా రాష్ట్రానికి ఊహించనంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రూపొందించిన ప్రణాళిక విజయవంతమైంది. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ చదవండి: అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి -
భయమే ఉరితాడై..!
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచీ తల్లిదండ్రులకు భయమే.. జాగ్రత్తగా ఉండు తల్లీ.. బయట ఎక్కువగా తిరగొద్దు అంటుంటారు. మెట్టినింటికి పంపిన తరువాత కూడా అనేక జాగ్రత్తలు చెబుతారు. అమ్మాయిల జీవితం దుర్భరమైనదనే భావన చిన్నప్పటి నుంచీ కల్పిస్తారు. ఈ అభద్రతే ఎంతో మంది మహిళలకు శాపంగా మారుతోంది. లేనిపోని భయాలు.. జీవితంపై అపనమ్మకాలు.. వెరసి మానసిక సంఘర్షణ.. ఇవే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన సునీతను బలితీసుకున్నాయి. రెండున్నరేళ్ల చిన్నారి సుమను కూడా పొట్టనపెట్టుకున్నాయి.. పెళ్లికాక ముందు సునీతకు ఎన్నెన్నో కలలు.. భవిష్యత్‌పై ఆశలు అయితే ఆమె తల్లి అయిన తరువాత ప్రతి రోజూ కలత నిద్రే! ఇద్దరు ఆడపిల్లలు.. ఒకరికి మతిస్తిమితం లేదు.. కన్నబిడ్డ దుస్థితిని చూసి ఏడ్వని రోజు లేదు.. ఉన్నట్టుండి ఇంటి పక్కన ఓ మహిళ ఉరేసుకుంది.. సున్నిత మనసుకు గాయమై.. మూఢనమ్మకం జడలు విప్పింది.. దయ్యమనే భయం.. ఉరితాడై ఇద్దరి ప్రాణాలు తీసింది!! కర్నూలు, సంగాల(చిప్పగిరి): కుమార్తెకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరప్ప, లక్ష్మి దంపతుల కుమారుడైన శివరుద్రకు అదే గ్రామానికి చెందిన సికిందర్, సుంకమ్మ దంపతుల కుమార్తె సునీతతో 2015 ఏప్రిల్ 22వ తేదీన వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమార్తె సుమ, యేడాది పాప పూజ ఉన్నారు. మొదటి కుమార్తె సుమకు మానసిక స్థితి సరిగా లేకపోవడం, మాటలు సరిగా రాకపోవడంతో పలుచోట్ల వైద్యులకు చూపించారు. అత్తగారింట్లో తనకు ప్రాణహాని ఉందని కొన్ని రోజులుగా సునీత భయాందోళనకు గురయ్యేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, అత్తమామలకు చెప్పేది. ఇదే క్రమంలో కొన్ని నెలల క్రితం ఇంటి పక్కన ఉన్న ఒక మహిళ ఉరి వేసుకోవడం చనిపోయింది. ఈ క్రమంలో చనిపోయిన మహిళ తనకు కలలో వస్తున్నట్లు సునీత చెప్పి భయపడేది. బుధవారం సాయంత్రం పుట్టినింటికి వెళ్లిన సునీతను తిరిగి భర్త శివరుద్ర ఇంట్లో వదిలిపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు. గురువారం తెల్లవారు జామున భర్త శివరుద్ర గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. ఇంట్లో భర్త లేని సమయం చూసుకొని కుమార్తె సుమకు ఉరి వేసి తాను కూడా ఉరికి వేలాడింది. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులు, బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆలూరు సీఐ దస్తగిరిబాబు, చిప్పగిరి ఎస్ఐ అబ్దుల్‌జాహీర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఒకపక్క కూతురి మానసిక స్థితి సరిగా లేకపోవడం, తనకు జరుగుతున్న భయాందోళనను ఎవరూ పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సునీత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత భర్త శివరుద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్‌కు తరలించారు. సునీత రెండో కుమార్తె పూజను అవ్వ.. పెళ్లి ఇంటి వద్దకు తీసుకెళ్లడంతో బతికిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
ఏసీబీ వలలో చిప్పగిరి ఎమ్మార్వో
కర్నూలు : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మార్వో అక్బర్ ఏసీబీ అధికారులకు రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన కర్నూలులో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చిప్పగిరి ఎమ్మార్వోగా అక్బర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించ వలసిందిగా వ్యక్తి ... ఎమ్మార్వోను ఆశ్రయించారు. అందుకు సదరు వ్యక్తిని అక్బర్ రూ. 7 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని ఎమ్మార్వోను అరెస్ట్ చేశారు.