సునీత ఇంటి ఎదుట గుమికూడిన గ్రామస్తులు, మృతిచెందిన సునీత (ఫైల్), ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి పూజ
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచీ తల్లిదండ్రులకు భయమే.. జాగ్రత్తగా ఉండు తల్లీ.. బయట ఎక్కువగా తిరగొద్దు అంటుంటారు. మెట్టినింటికి పంపిన తరువాత కూడా అనేక జాగ్రత్తలు చెబుతారు. అమ్మాయిల జీవితం దుర్భరమైనదనే భావన చిన్నప్పటి నుంచీ కల్పిస్తారు. ఈ అభద్రతే ఎంతో మంది మహిళలకు శాపంగా మారుతోంది. లేనిపోని భయాలు.. జీవితంపై అపనమ్మకాలు.. వెరసి మానసిక సంఘర్షణ.. ఇవే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన సునీతను బలితీసుకున్నాయి.
రెండున్నరేళ్ల చిన్నారి సుమను కూడా పొట్టనపెట్టుకున్నాయి.. పెళ్లికాక ముందు సునీతకు ఎన్నెన్నో కలలు.. భవిష్యత్‌పై ఆశలు అయితే ఆమె తల్లి అయిన తరువాత ప్రతి రోజూ కలత నిద్రే! ఇద్దరు ఆడపిల్లలు.. ఒకరికి మతిస్తిమితం లేదు.. కన్నబిడ్డ దుస్థితిని చూసి ఏడ్వని రోజు లేదు.. ఉన్నట్టుండి ఇంటి పక్కన ఓ మహిళ ఉరేసుకుంది.. సున్నిత మనసుకు గాయమై.. మూఢనమ్మకం జడలు విప్పింది.. దయ్యమనే భయం.. ఉరితాడై ఇద్దరి ప్రాణాలు తీసింది!!
కర్నూలు, సంగాల(చిప్పగిరి): కుమార్తెకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరప్ప, లక్ష్మి దంపతుల కుమారుడైన శివరుద్రకు అదే గ్రామానికి చెందిన సికిందర్, సుంకమ్మ దంపతుల కుమార్తె సునీతతో 2015 ఏప్రిల్ 22వ తేదీన వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమార్తె సుమ, యేడాది పాప పూజ ఉన్నారు. మొదటి కుమార్తె సుమకు మానసిక స్థితి సరిగా లేకపోవడం, మాటలు సరిగా రాకపోవడంతో పలుచోట్ల వైద్యులకు చూపించారు.
అత్తగారింట్లో తనకు ప్రాణహాని ఉందని కొన్ని రోజులుగా సునీత భయాందోళనకు గురయ్యేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, అత్తమామలకు చెప్పేది. ఇదే క్రమంలో కొన్ని నెలల క్రితం ఇంటి పక్కన ఉన్న ఒక మహిళ ఉరి వేసుకోవడం చనిపోయింది. ఈ క్రమంలో చనిపోయిన మహిళ తనకు కలలో వస్తున్నట్లు సునీత చెప్పి భయపడేది. బుధవారం సాయంత్రం పుట్టినింటికి వెళ్లిన సునీతను తిరిగి భర్త శివరుద్ర ఇంట్లో వదిలిపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు. గురువారం తెల్లవారు జామున భర్త శివరుద్ర గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. ఇంట్లో భర్త లేని సమయం చూసుకొని కుమార్తె సుమకు ఉరి వేసి తాను కూడా ఉరికి వేలాడింది. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులు, బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఆలూరు సీఐ దస్తగిరిబాబు, చిప్పగిరి ఎస్‌ఐ అబ్దుల్‌జాహీర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఒకపక్క కూతురి మానసిక స్థితి సరిగా లేకపోవడం, తనకు జరుగుతున్న భయాందోళనను ఎవరూ పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సునీత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత భర్త శివరుద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్‌కు తరలించారు. సునీత రెండో కుమార్తె పూజను అవ్వ.. పెళ్లి ఇంటి వద్దకు తీసుకెళ్లడంతో బతికిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment