అమ్మతనం | Mothers love towards children | Sakshi
Sakshi News home page

అమ్మతనం

Published Sun, Feb 23 2025 5:56 AM | Last Updated on Sun, Feb 23 2025 5:56 AM

Mothers love towards children

‘‘అమ్మా, సరితా! నువ్వేమీ కంగారు పడకు. మీటింగ్‌ అయిపోయాకే నిదానంగా ఇంటికి రా! నేను మీ ఇంటికి వస్తూ వస్తూ, డే కేర్‌ సెంటర్‌లో ఉన్న మీ అబ్బాయిని తీసుకుని ఇంటికి వస్తున్నాను’’ అంటూ విషయం అంతా చెప్పి ఫోన్‌ పెట్టేసింది అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ సరితకి మేనత్త అయినా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అన్నీ అమ్మలా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది.ఆరోజు ఆఫీసులో మీటింగు లేటుగా ముగియడంతో రాత్రి 8 తర్వాతే ఇంటికి చేరుకుంది సరిత. అప్పటికే అన్నపూర్ణమ్మ అన్నం పెట్టడంతో బాబు తిని నిద్రపోయాడు. నిద్రపోతున్న బాబును చూసుకుని, అన్నపూర్ణమ్మను చూసి ‘‘అత్తమ్మా! తిన్నారా లేదా?’’ అడిగింది సరిత. 

‘‘నేను తిన్నానమ్మా! పాపం అసలే ఆఫీసులో హడావిడిలో సమయానికి తింటున్నావా లేదో! నీకు ఇష్టమని గుత్తొంకాయ కూర చేశాను. కడుపునిండా తిని పండుకోరా బుజ్జీ!’’ అని సరితకి  చెప్పి, తను కూడా వెళ్లి నిద్రపోయింది. సరిత భోజనం పూర్తి చేసుకున్నాక బాబు దగ్గరికి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం– తెల్లారింది.ఆ రోజు ఆదివారం. ఆఫీసుకు సెలవు కావడంతో లేటుగా లేచి, గది నుండి బయటికి వస్తున్న సరితని చూస్తూ, ‘‘అమ్మా! సరితా, రాత్రి అసలే ఇంటికి లేటుగా వచ్చావు. రావడం అలసిపోయి ఉంటావని ఏమీ మాట్లాడ లేకపోయాను. ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి అమెరికాలో జాబు కదా, అప్పుడప్పుడు బాబుతో మాట్లాడుతూ ఉంటాడా? ఎలా ఉన్నాడు? మళ్లీ ఇండియాకి ఎప్పుడు వస్తాడంట?’’ అని ఆరా తీసింది అన్నపూర్ణమ్మ. 

‘‘గత ఏడాదే కదా అత్తమ్మ వచ్చి వెళ్లారు. ఈ ఏడాది చివర్లో రావచ్చు’’ చెప్పింది సరిత .
‘‘ ఏమ్మా? సరితా! బాబు రాత్రి ఏడుస్తా ఉన్నాడు, ఎందుకు?’’ అడిగింది అన్నపూర్ణమ్మ. 
‘‘అదే అత్తమ్మా! ఇంతకుముందు ఇలా లేదు కాని ఈమధ్య ఎందుకో అబ్బాయి రాత్రి అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి ఏడుస్తున్నాడు. కారణం తెలియదు. మళ్లీ నచ్చజెప్పి పడుకోబెడితే పడుకుంటున్నాడు. ఏమిటో! అత్తమ్మా నాకు ఏమీ తెలియడం లేదు. బాల్యంలో ఇవన్నీ మామూలే ఏమోనని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను’’ అంది సరిత.           

సరిత బాబును తీసుకొని హాలులో బొమ్మలతో ఆటలాడిస్తుండగా టిఫిన్‌ సంగతి చూద్దామని వంట గదిలోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. హాలులో హఠాత్తుగా పిల్లోడి ఏడుపు విన పడడంతో ‘ఏమైందమ్మా?’ అంటూ హాలులోకి వచ్చింది  అన్నపూర్ణమ్మ. పిల్లవాడి తీరును చూసి ఒకింత ఆందోళనకు లోనయ్యింది ఆమె.  
‘‘ఏమైందమ్మా? సరితా! బాబు అంతగా భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు కారణమేంటి?’’  అడిగింది అన్నపూర్ణమ్మ. 

తన కారు బొమ్మతో ఆడుతూ ఉండగా కారు బొమ్మ చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది అత్తమ్మా! దానికే వాడు ఏడుస్తున్నాడు. నేనేమీ అనలేదు, కొట్టలేదు’’ అంటూ వాపోయింది సరిత.
అన్నపూర్ణమ్మ ఆ బాబు దగ్గరికి వెళ్లి ఓదార్చి ఎత్తుకొని, ‘‘కన్నా! ఏమైందిరా! బొమ్మ పోతే పోయింది, మరొకటి తెచ్చుకోవచ్చులే! దాని కోసం అంతగా ఏడవకు నాన్నా!’’ అంటూ బుజ్జగించింది.
వెంటనే ఆ బాబు వచ్చిరాని మాటలతో ‘‘నేను కావాలని చేయలేదు. అది అదే విరిగిపోయింది నన్ను కొట్టొద్దు. నా చెయ్యి మెలి పెట్టొద్దు నాకు నొప్పిగా ఉంటుంది’’ అంటూ ఏడుపు మొదలెట్టాడు.
అన్నపూర్ణమ్మకు ఆ డే కేర్‌ సెంటర్‌లో చూసుకునే విధానం పూర్తిగా అర్థమైపోయింది. 

అన్నపూర్ణమ్మ ఏదో చెప్పే లోపల సరితకి కూడా విషయం అర్థమైనా, ‘‘డే కేర్‌ సెంటర్లో అంతమంది పిల్లల్ని చూసుకున్నప్పుడు ఒక దెబ్బ కొట్టినా తప్పేమీ లేదులే అత్తమ్మా! మనం సీరియస్‌గా తీసుకుంటే ఎలా? అని ప్రశ్నించింది సరిత.
‘‘అబ్బాయి ఉద్యోగంలో బిజీ. నువ్వు ఉద్యోగంలో బిజీ. ఇలా అయితే మీ బిడ్డ చాలా ఇబ్బంది పడతాడు  కదమ్మా! అది కూడా ఆలోచించాలి కదా!’’ అంది అన్నపూర్ణమ్మ.
‘‘అలా అయితే ఏం చేయమంటారు అత్తమ్మా! బాగా చదువుకొని ఉద్యోగం చేసేది నా కాళ్ళ మీద నేను నిలబడాలనే కదా! ఇప్పుడు నన్ను ఉద్యోగం మానేసి, బాబును చూసుకోమంటారా? ఇది ఎంతవరకు న్యాయం? ఉద్యోగం అనేది మగవాళ్ళ పనేనా ఆడవాళ్ళది కాదా?’’ అంటూ గొంతు పెంచి ఉక్రోషంతో సమాధానం చెబుతున్న సరితని చూసి నవ్వుకుంది అన్నపూర్ణమ్మ. 

‘‘నువ్వు చదువుకున్నావు కాబట్టే, అర్థం చేసుకుంటావని నీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. డే కేర్‌ సెంటర్‌ అనే చట్రంలో పిల్లల్ని బిగించి, వారి స్వేచ్ఛను హరించివేస్తే వారి మనోవికాసం దెబ్బతింటుందని తెలియదా నీకు? తల్లి తొలి గురువు. పిల్లల్ని ఎలా బుజ్జగించాలో? ఎలా దండించాలో? వాళ్ళు ఎలా స్పందిస్తారో? వివిధ దశల్లో వాళ్ళల్లో వచ్చే మార్పులు  ఎలా వుంటాయో? అన్నీ తెలుసుకోగలిగేది కేవలం తల్లి మాత్రమే అనే చిన్న విషయం నీకు తెలియదా సరితా?’’ అంటూ హితబోధ చేస్తున్న అన్నపూర్ణమ్మని మధ్యలోనే ఆపి, ‘‘అంటే అత్తమ్మా! నేను డే కేర్‌లో వేయడం తప్పంటావా?’’ అని ఎదురు ప్రశ్న వేసింది.

దానికి సమాధానంగా, ‘‘డే కేర్‌ సెంటర్‌లో బాగా చూసుకోరు అని నేను చెప్పటం లేదు. అందులో వదలాల్సిన అవసరంలో నీవు లేవు అని గుర్తు చేస్తున్నాను. కనీసం పిల్లవాడు బడికి వెళ్లే సమయం వరకైనా నువ్వు ఉద్యోగం మాని ఈ బిడ్డ సంరక్షణలో గడపాలి అనేదే నా ఆశ. నిన్న నేను బాబుని తీసుకురావడానికి డేకేర్‌ సెంటర్‌కి వెళ్లినప్పుడు నాలాగే తమ పిల్లల కోసం అక్కడికి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రావడం చూశాక నా మనసుకు ఎంతో బాధ కలిగిందమ్మా! 

మీ బాబు కూడా నా దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చినప్పుడు నాకు ఎంత బాధ అయిందో తెలుసా? కనీసం నన్ను చూసి ఒక నెల పైనే అయ్యి ఉంటుంది. కానీ ఇంటికి తీసుకు వెళ్లడానికి ఒకరు వచ్చారు అని తెలియగానే ఆ బాబు పరిగెత్తుకుంటూ  నా దగ్గరికి వచ్చి హత్తుకొని బోరున ఏడ్చినప్పుడు నా మనసు ద్రవించి పోయిందమ్మా!’’ అంది అన్నపూర్ణమ్మ.
‘‘అంటే నేను బాగా చూసుకోవట్లేదు అంటున్నారా?’’ అని అడిగింది సరిత.
‘‘పిల్లల్ని చూసుకోవలసినప్పుడు చూసుకోలేని తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం. ఇది గుర్తుంచుకో అమ్మా! పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో అశ్రద్ధ వహిస్తే రేపు వీళ్లు కూడా పెద్దవాళ్ళు అయ్యాక ప్రతిదానికి భయపడతారు. 

అంతేకాదు, మనసున్న మనుషుల్లా కాకుండా, మరమనుషులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. నేడు మీరు డేకేర్‌ సెంటర్‌లో వేసినట్టు రేపు మిమ్మల్ని ఓల్డేజ్‌ హోమ్‌లో వేసే అవకాశం లేకపోలేదు. వాళ్ల బాల్యం తల్లిదండ్రుల వద్ద గడిపినప్పుడే తల్లిదండ్రులు వాళ్ల కోసం చేసే త్యాగం, సేవ, పెద్దల పట్ల వినయం, ఇరుగుపొరుగు వారితో నడుచుకోవలసిన తీరు, తోబుట్టువులతో సఖ్యతగా మెలగడం అలవాటవుతాయి. పాఠంలా చెబితే వచ్చేవి కాదమ్మా ఇవన్నీ, మనతో గడిపినప్పుడే, మనలో ఒకరిగా ఉన్నప్పుడే వాటంతట అవే అలవడతాయి. బిడ్డను తన బాల్యం నుంచి తనను వేరు చేసే ఈ కేర్‌ సెంటర్‌లో వేయడం వద్దమ్మా! ఇవన్నీ నీకు ఒక మేనత్తగా కంటే అమ్మగా చెబుతున్నాను అని అనుకో’’ చెప్పింది అన్నపూర్ణమ్మ.  

అన్నపూర్ణమ్మ మాటలకి ఆలోచనలో పడింది సరిత.
‘‘అయినా ఎవరిని అనుకుని ఏమి లాభంలే, బిజీబిజీ బతుకులాయే! ఈ హడావిడి ప్రపంచంలో స్త్రీలు పురుషులతో సమానంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మాతృమూర్తులుగా బతకడానికి ప్రయత్నించడం లేదని అనిపిస్తోంది. నేటి కాలపు మనుషులు ఆకాశంలోని చంద్రుని తాకాలి అనే అంత ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మన మనసులలోని లోతులోకి వెళ్ళి ఆ లోటుపాటుల్ని సవరించుకొని ఎదగడానికి ప్రయత్నించడం లేదు కదా!’’ వాపోయింది అన్నపూర్ణమ్మ.
‘‘అంటే అత్తమ్మ నన్ను ఉద్యోగం చేయొద్దంటారా?’’ ప్రశ్నించింది సరిత.

‘‘అమ్మా, సరితా! నేను చెప్పేది బాగా అర్థం చేసుకో తల్లీ, అబ్బాయి సంపాదిస్తున్నాడు కదా! అని అంటున్నాను. నీ ఉద్యోగంపైనే నీ జీవితం ఆధారపడలేదు అని గ్రహించమంటున్నాను. నీ బిడ్డ జీవితం మాత్రం నీపైనే ఆధారపడి ఉంది. అది తెలుసుకోమంటున్నాను. దీని పట్ల మాత్రం అశ్రద్ధ వహించకు అని చెబుతున్నాను. అయినా అంతదాకా ఎందుకు? ఇందాక నువ్వే చెప్పావు కదమ్మా! ‘ఇంతకుముందు లేదు గాని, ఈమధ్య కాలంలోనే బాబు రాత్రి ఉలిక్కిపడి లేస్తున్నాడు అని’, అంటే బహుశా ఇది తనని డే కేర్‌ సెంటర్‌లో వేయడం వల్ల కూడా ఒక కారణం కావచ్చు అని. చదువుకున్న తల్లిగా నువ్వు గుర్తించలేకపోయావా?’’ ప్రశ్నిస్తున్న అన్నపూర్ణమ్మ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది సరిత.

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన తనని అత్తమ్మ ఎలా చూసుకుందో, తనను ఏనాడూ ఇటువంటి డేకేర్‌ సెంటర్‌లో కాని, హాస్టల్‌లో కాని వేయకుండా తన దగ్గరే పెట్టుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తన అత్తమ్మ కంటే కన్నతల్లి అయ్యుండి తన బిడ్డకు ఎటువంటి పరిస్థితి కలిగించిందో, బిడ్డను చూసుకునే విధానంలో తన పరిస్థితి ఏమిటో తలచుకొని మనసులోనే బాధపడింది సరిత.

తనలో మార్పును కలిగించిన తన అత్తమ్మకు మనసులోనే చేతులు జోడించి నమస్కరించుకుంటూనే, మరో వైపు అపరాధ  భావంతో అన్నపూర్ణమ్మని చూస్తూ, ‘‘నన్ను క్షమించండి అత్తమ్మా! ఇకమీదట ఉద్యోగానికి వెళ్ళను. పూర్తిగా బాబు బాగోగులకే సమయం కేటాయిస్తాను. కనీసం మా బాబుకు పదేళ్ళు నిండే వరకు ఉద్యోగం జోలికి పోను’’ అని చెప్పింది సరిత. ఆమెలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించింది అన్నపూర్ణమ్మ.

మరుసటి రోజు.. 
ఉదయాన్నే నిద్ర లేచి తయారయ్యి హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకొని బయలుదేరింది సరిత . అది చూసిన అన్నపూర్ణమ్మ నిన్ననే కదా ఉద్యోగం మానేస్తాను అంది మళ్లీ ఇలా ఆఫీసుకు తయారయ్యిందేమిటి? అని ఆశ్చర్యంగా సరిత వైపు చూస్తూ ఉండగా, సరిత ఒక చిన్న నవ్వు నవ్వి, ‘‘అత్తమ్మా! కంగారు పడకండి. నేను ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఆఫీసుకు వెళ్ళేది నా రాజీనామా ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరుతున్న సరితని చూసి, ఆనందంగా సాగనంపింది అన్నపూర్ణమ్మ.
         
- కె. అమృత జ్యోత్స్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement