రసోన్మాది | Funday story about to love | Sakshi
Sakshi News home page

రసోన్మాది

Published Sun, Feb 23 2025 5:52 AM | Last Updated on Sun, Feb 23 2025 5:52 AM

Funday story about to love

‘‘రహస్యాలకే జీవితవంతా ఖర్చుపెడతన్నట్టు ఉంది’’ మావిడిచెట్టు చుట్టూ కట్టిన గట్టుమీద కూర్చుంటూ అంది ప్రశాంతి. ఆమె మొహం వంక చూస్తూ మాట్లాడటానికి సదుపాయంగా ఉండేలా సర్దుకుని, ‘‘ఇపుడు బానే ఉందికదా! కుదిరినపుడల్లా కలుస్తూనే ఉన్నాం. ఒకేళ కుదరక దూరమైపోయామనుకో! పదేళ్ళ తర్వాత కలిసినా నీమీద ఇదేప్రేమ ఉంటుంది, నేనేం మారను.’’ అంటున్నపుడు భార్యాపిల్లలు గుర్తొచ్చారు మాధవకి. ఏవనలేదామె. మసక వెన్నెల్లో అతని స్నేహితుని తోట పూల సువాసనలతో ఊరడిస్తోంది. తోటని దాటి పొలాల మీదుగా చూపు సాగుతూ పోతోంది. తారలతో మిలమిల మెరుస్తున్న ఆకాశం నుంచి ఉన్నట్లుండి వెలుగుగీత గీస్తూ ఉల్క జారిపడడాన్ని చూసి ఉద్వేగంతో నిల్చుంది ప్రశాంతి. 

‘‘నువ్వే కావాలనుకున్నాక ఇదంతా ఇరుగ్గా ఉంది. మణి చాలా మంచాడు. కానీ అతని మొహం కూడా చూడబుద్ది కావడంలేదు. పెద్ద ఇనపచేత్తో నొక్కేసుకుంటున్నట్టు ఉంది. ఆ సంసారంలో ఉండలేను. అదుగో ఉల్క రాలింది చూశావా! నేనక్కడకి పోతాను’’ చున్నీ గట్టుమీద పడేసి భూమి, ఆకాశం కలిసినట్లున్న అంచువైపు అకస్మాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అయోమయం అయిపోయాడు మాధవ. ఆడవాళ్ళు ఇలా మాట్లాడడం, ముప్ఫైమూడేళ్ళ వయసులో శరీరమంతా తాండవం చేస్తున్నంత వేగంతో కదలడం చూసెరగడు. అలా వదిలేస్తే ఆ అంచుని చేరుకుని అది పట్టుకుని పైకి ఎగబాకి, ఆకాశంలోకి దూకి మాయమైపోతుంది. తనకిక జీవితంలో దొరకదు. 

పిచ్చి ఉద్రేకంతో ‘వస్తున్నా ఆగూ’ అంటూ చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయి చేలకి అడ్డంబడి ఆమె వెనకాల పరుగుపెట్టాడు. పాదాలకి తుప్పలు, ఎండుమొరళ్లు గుచ్చుకుని రక్తం చిగురిస్తున్నది. ఎగుడు దిగుడు నేలలోపడి కాలిమడమలు నెప్పి పుడుతున్నాయి. అలవాటు తప్పిన పరుగువల్ల ఆయాసంతో పడతాలేస్తా ఎట్టకేలకి ఆమెని చేరుకుని గట్టిగా కావిలించుకున్నాడు.

పోటెక్కిన రెండుసముద్రాలు కావిలించుకున్నట్లు కల్లోలం ఎగసిపడతా ఉంది. ఏదో అనబోతున్న ఆమె పెదాలకి చేతివేళ్లు అడ్డంపెట్టి ‘‘మనిద్దరం ఇల్లు తీసుకుందాం’’ అన్నాడు. ఎంతగట్టిగా ఊపిరిపీల్చి వదిలిందీ అంటే ఆ వేడికి కనలినట్లయ్యాడు.చేతులు చేతులు పట్టుకుని తిరిగివచ్చాక– పరిగెత్తి వచ్చిన నేలని, కోసుకుపోయి మంటపెడుతున్న పాదాలను చూసుకున్నపుడు బైటకి రాలేని చాలాలోతుకి దిగబడిపోయినట్లు భయంవేసింది మాధవకి. అంతలోనే మొండిధైర్యం తెచ్చుకుని ఆమెచేతిని బిగించి పట్టుకున్నాడు.

‘అతను మిగతావాళ్ళని చూస్తున్నపుడు జీసస్‌ లాగా నన్ను చూస్తున్నపుడు మాత్రం గ్రీక్‌ దేవుడు ఎరోస్‌ లాగా అనిపించాడు’ అని ప్రశాంతి చెప్పిన రోజే మణిశంకర్‌కి అనుమానం వచ్చింది. ఆ మాటకి కాదు, ఆమె ముఖంలో కనిపిస్తున్న వెలుగుకి. అపుడు అతని గుండె కొద్దిగా వణికింది. ‘ఎవర్నో పొగిడి తనలో అసూయ తెప్పించి మరింతగా ఆమె కొంగుపట్టుకు తిరిగేలా చేసుకోడానికి వాడిన జాణతనపు ట్రికీ మాటలివి’ అనుకుంటేగానీ అతనికి ఊపిరాడలేదు. 

కానీ, ఇపుడు లగేజ్‌ సర్దుకుని ‘అతను నాకు నచ్చాడు, ఇంట్లోంచి వెళ్లిపోతాను’ అంటుంటే మణికి ఏమీ అర్థంకాలేదు. వెర్రిపిల్ల అని తెలుసుగానీ, ఇలా వెళ్లిపోతానూ అనేంత వెర్రితనం ఆమెనుంచి తనకు ఎదురైతే ఎలా రియాక్టవ్వాలో తెలీడంలేదు. పెళ్ళిచూపుల కోసం ప్రశాంతి ఇంటికి వెళ్ళినరోజు గుర్తువస్తా ఉంది. ఆరోజు ప్రశాంతి వాళ్ళమ్మ కూతురి అందం, మంచితనం, తెలివితేటలు, ప్రైవేటు ఉద్యోగాన్ని ఎంత ఓర్పుతో చేసుకువస్తున్నదీ చెప్పింది. ఔనన్నట్లు తలూపుతూ ఉన్న వాళ్ళనాన్న ఉన్నట్లుండి జోక్యం చేసుకుని వీరగాథ ప్రారంభవాక్యంలా ‘ఇంటర్‌ ఫస్టియర్లో ప్రశాంతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, వారంపోయాక తిరిగివచ్చింది’ అన్నాడు. 

తుళ్ళిపడ్డాడు మణిశంకర్‌. వాళ్ళమ్మ నిమిషంలో తేరుకుని, ‘అసలు విషయం సరిగ్గా చెప్పండి’ కసిరింది భర్తని. కథంతా చెప్పుకొచ్చాడతను. సినిమా పిచ్చితో ఇంట్లోంచి వెళ్ళిపోయి, వారంరోజులు స్టూడియోల చుట్టూ తిరిగింది టీనేజ్‌ ప్రశాంతి. మోసం చేయబోయిన ఒకరిద్దరు మగాళ్లని చూసి భయంవేసి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఎవరితోనో లేచిపోయి కన్నవాళ్ళ పరువుతీసిందని ఊరంతా గగ్గోలుపెట్టినా తిట్టకుండా కొట్టకుండా మంచిమాటలు చెప్పి కూతుర్ని కాపాడుకున్నారు. అక్కడితో ఆ పిచ్చి వదిలిపోయింది. 

‘‘వాళ్ళనాన్నలా ఏదొచ్చినా పట్టలేం. ఇద్దరికీ ఏ పిచ్చిబడితే అదే. అంతే తప్ప మా పిల్ల మనసు బంగారం బాబూ!’’ వాళ్ళమ్మ చెప్పింది. ఆమె మాటల వెనుక ఈ సంబంధం కూడా తప్పిపోతుందేమోనన్న భయం, దిగులు వినబడ్డాయి. తను నచ్చాడని నిర్భయంగా చెప్పిన ప్రశాంతి ఆసక్తిగా అనిపించింది మణికి. ఆ ఆసక్తి పెళ్ళికి పనికివచ్చేదో కాదో అర్థం చేసుకోడానికి కొంతసమయం తీసుకుని రెండుసార్లు ఆమెని బైటకలిశాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారిద్దరూ. 

ఆమె చేతిలోని లగేజీ లాక్కుని పక్కకి విసిరికొట్టి ‘పిచ్చిమాటలు ఆపు’ అన్నాడు మణిశంకర్‌. 
మొండిగా నిల్చుంది ప్రశాంతి. 
‘‘ఏంటీ?’’ రెట్టించాడు.
‘వెళ్లిపోతాను’ మళ్ళీమళ్ళీ అదేమాట.  
‘‘మరి పిల్లాడిని ఏం చేస్తావ్‌?’’ ఆశ్చర్యంగా అన్నాడు 
ఏం చెప్పాలో తోచనట్లు తలవంచుకుంది. పిల్లాడు కడుపున పడ్డాడని తెలిసిన దగ్గర్నుంచీ ఆ ఎనిమిదినెలలు పుట్టబోయే బిడ్డకోసం అటు లోకాన్ని ఇటు తిరగేసి చుట్టూ అందర్నీ అల్లల్లాడించిన తల్లి ఈరోజు కఠినమైన ప్రియురాలు అయ్యింది. 
ఆపుకోలేని కోపంతో ఆమెని బెడ్రూమువైపు తోసి, ‘‘ఎక్కడికీ వెళ్ళేది! కొడ్తే.. మూతిపళ్లు రాల్తాయ్‌! ఇంత రంకుతనం ఎపుడు నేర్చావసలు!’’ అన్నాడు. 

అపుడే స్కూలునుంచి వచ్చిన కొడుకు ఇంట్లో ఎపుడూ వినని ఈ మాటలు మంచివో చెడ్డవో తెలీక మొహంలో ఏ భావం పలికించాలో తెలీని కన్ఫ్యూజన్‌లో అటూ ఇటూ చూస్తున్నాడు. ప్రశాంతి మళ్ళీ లగేజీ అందుకోబోయింది. వంగిన ఆమెని మణిశంకర్‌ నిటారుగాలేపి చెంపలమీద, వీపుమీద కొట్టి లోపలిగదివైపు నెట్టుకుంటూ వెళ్తుంటే పిల్లాడు గింగుర్ల గొంతుతో ఏడుపు అందుకున్నాడు. ఆ ఏడుపు వినలేనట్లు మొహం తిప్పుకుని చెయ్యి విదుల్చుకుని తనే లోపలికి వెళ్ళి కూచుంది. కదలకుండా కళ్ళు విప్పకుండా కళ్ళు తడవకుండా అలానే కూచుంది. రాత్రి పదయింది, పన్నెండు రెండు మూడయింది. 

గుండెల్లో గుబులు, భయం, అవమానం– కళ్లమీదకి మగత కమ్ముకొస్తుంటే కళ్ళుమూస్తూ తెరుస్తూ ఆదమరిస్తే ఎక్కడ మాయం అవుతుందోన్నట్లు కాపలా కాస్తున్నాడు. అపుడే కన్నంటుకున్న సమయంలో ఆమె చేతిగాజు నేలకి రాసుకుని చిన్నశబ్దం వచ్చింది. దానికే తుళ్ళిపడి లేచి నిల్చున్నాడు. ఎర్రబడిన కళ్ళతో తూలుతూ ఊగుతున్న అతన్ని బిక్కమొహంతో చూసింది ప్రశాంతి. మనసు కలిచివేసింది మణికి ‘ఈ తొమ్మిదేళ్లలో విడిపోయేన్ని గొడవలులేవు సరికదా, అన్యోన్యంగా ఉన్నాము కూడా’ విచారంగా అనుకున్నాడు. 

అయిదునెలల కడుపుతో ఉండి, బాగా జబ్బుపడిన ఆడబడుచుని, పిల్లల్ని ఇంటికితెచ్చి కంటికిరెప్పలా చూసుకుని బాగుచేసి పంపిన ప్రేమమయి తను. మారుమూల పల్లెకి ఏదో పనిమీద ఇద్దరూ వెళ్ళినపుడు తను తలనొప్పితో పడుకుంటే రాత్రిపూట సైకిల్‌ మీద పది కిలోమీటర్ల దూరమున్న టౌనుకి వెళ్ళి సారిడాన్‌ టాబ్లెట్స్‌ తెచ్చినప్పుడు మాత్రం ఆ ప్రేమ బాగా భయపెట్టింది. ఇపుడిలా వెళ్లిపోతానన్న పంతం!

ఆమె పక్కనే కూలబడి, పొదివిపట్టుకుని, ‘‘మనకి ఎందుకమ్మా ఇలాటి పరువుతక్కువ పనులు! చక్కగా ఉందాం’’ అన్నాడు. అతని మొహం వంక దీనంగా చూస్తూ గడ్డం పట్టుకుని ‘‘మణీ నన్ను వెళ్లనివ్వా ప్లీజ్‌’’ బతిమలాడుతూ అంది. ఆమెని దూరంగా విసిరికొట్టి టపటప తల బాదుకున్నాడు. పొద్దున్నే ప్రశాంతి అమ్మానాన్నలకి మణి ఫోనుచేసి విషయం చెపుతుంటే– గదినుంచి బైటకివచ్చి చెప్పి వెళ్లడానికన్నట్లు పక్కన నిల్చుంది. అతనికి తిక్కరేగిపోయింది. ఫోన్‌ విసిరికొట్టే ముందు వాళ్ళపెంపకాన్ని ఓ బూతుమాటతో తిట్టాడు. ప్రశాంతిని బరబరా లాక్కువెళ్ళి మెయిన్‌ డోర్‌ అవతలకి నెట్టి, మొహాన దడాలున తలుపుమూసి, వెనక్కి తిరిగిచూస్తే  టేబుల్‌ చాటునుంచి భయంగా నక్కినక్కి చూస్తున్న కొడుకు. వాడిని గట్టిగా పట్టుకుని బావురుమన్నాడు మణిశంకర్‌. 

చిన్నయిల్లు. బాల్కనీ మీదకి కమ్ముకొచ్చిన కాడమల్లిచెట్టు, నాలుగుగోడల మధ్య ఎటువంటి భయాలులేని ఏకాంతం. గుమ్మంలోకి అడుగుపెట్టగానే హాలుమధ్యన నిలబడి చేతులు చాపిన మాధవ. కంటిచివర్లు పిగిలిపోయేంతగా అతన్నేచూస్తూ, అన్నీ, అందరూ మాయమై తన విశ్వమంతా అతనొక్కడే. మూడురోజులు అవసరమైన షాపింగ్‌ చేస్తూ ఇల్లంతా సర్దుకుంటూ వండుకుని తింటూ ఒకరినొకరు విడవకుండా లంకెవేసుకుని తిరుగుతూ ఒకటే కబుర్లు. వాటికి అర్థంపర్థం ఏమీలేదు. పనికిమాలిన మాటలకి కూడా ఇంత ఆకర్షణ ఉన్నదా అని అబ్బురపడుతూ మూడుక్షణాలుగా గడిచిపోయాయి. 

నాలుగోరోజు భార్యకి చెప్పడానికి వెళ్ళిన మాధవ ఒకపూటంతా రాలేదు. మెట్లదగ్గర బెంగగా కూచుని ఎదురుచూసింది. మూడుసార్లు ఫోన్‌ చేసింది. అతను కట్‌ చేస్తూ ఉన్నాడు. సాయంత్రం నాలుగింటికి వచ్చాడు. రాగానే ఆమెని గట్టిగా కావిలించుకుని, ‘‘చెప్పేసాను. ‘కేసుపెడితే గవర్నమెంట్‌ ఉద్యోగం ఊడుతుందని భయంలేదా’ అంది. జీతం మొత్తం ఆమెకి అందే ఏర్పాటు చేస్తానని, కష్టంవస్తే  నిలబడతానని చెప్పాను. అయిపోయిందిక, కానీ చాలా అన్యాయం చేశా వాళ్ళకి’’ దిగులుగా అన్నాడు. 
అయిపోలేదని ఇంకోగంట తర్వాత తెలిసింది. మాధవభార్య, ఆడపిల్లలిద్దర్నీ తీసుకుని బంధువులతో సహా వచ్చింది. ప్రశాంతిని కొట్టయినా మాధవని తీసుకుపోవడానికి. 

ప్రశాంతిని లోపలపెట్టి తాళంవేసి, తాళం జేబులో వేసుకుని గుమ్మానికి అడ్డంగా నిలబడిపోయాడు మాధవ. ఎంతగొడవ జరుగుతున్నా అక్కడనుంచి కదలలేదు. అతన్ని చెప్పు తీసుకుని ఎడాపెడా కొడుతూనే ఉంది భార్య. ఎంతోముద్దుగా పెంచుకున్న పిల్లలిద్దరూ తండ్రిని చుట్టుకుని ‘నాన్నా భయంవేస్తోంది. ఇంటికి పోదాం’ అంటున్నారు. ‘రేపు వస్తానమ్మా’ మెల్లిగా చెపుతున్నాడు. మాధవ మొండికెత్తి ఉన్నవిషయం గ్రహించి నాలుగుదెబ్బలు వేసి కాండ్రించి మొహంమీద ఉమ్మి, వెళ్లిపోయారు వాళ్ళంతా. 

ఆర్నెల్లపాటు ప్రశాంతి, మాధవల్ని ఇళ్ళకి రప్పించడానికి చాలా జరిగాయి. విడదీయాలని చూసేకొద్దీ మరింత దగ్గరయ్యారు. ఉద్యోగాలకి వెళ్ళినపుడు తప్ప ఇల్లుదాటి ఎరుగరు. ఇంట్లోకూడా స్పర్శకి అందేంత దూరంలో ఉండేవారు. విడాకులు లేకుండానే రెండుజంటలూ విడిపోయాయి. మణిశంకర్‌ ఏడాదిలో మళ్ళీ పెళ్లిచేసుకున్నాడు. మాధవభార్య రోజుకి పదిసార్లు వాళ్లిద్దర్నీ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది.   

కేవలం వాళ్ళిద్దరి మధ్యే అయితే చాలాగొప్పగా ఉంది. ఆటపాటలు, ముచ్చట్లు, రోజుకొక కొత్తవంట, టీవీలో నచ్చిన సినిమాలు చూడటం, నది ఒడ్డున రికామీగా కూచోవడం. ‘‘ఆమెకేమీ! ఇంకో ఆడదాని మొగుడిని తగులుకుని అసలామె ఉసురు పోసుకుని కులుకుతా తిరుగుతోంది’’ అని పక్కింటామె తను వినేట్లు ఎవరితోనో అంటున్నపుడు ఇద్దరి మధ్యా ఇంకా చాలామంది ఉన్నారన్నది తెలిసింది. ఇలాంటి మాటల వల్ల పాతసర్కిల్స్‌లో తిరగడానికి మాధవ ఇబ్బందిపడేవాడు. ‘మనం నిలబడాలి’ గట్టిగా చెప్పేది ప్రశాంతి. 

ఓసారి బజారుకి వెళ్ళినపుడు ప్రశాంతి– మాధవ భుజంమీద చెయ్యేసి ఏదోచెపుతూ నడుస్తుంటే ఉన్నట్లుండి చెయ్యిలాగేసి ఆమెవరో తెలీనట్లు గబగబా దూరం జరిగిపోయాడు. భార్య తరఫు బంధువును చూసి ఇలా చేశాడని తెలిసి ఇల్లు యుద్ధరంగమయింది. ఎంత పెద్దగొడవ అంటే ఇలా తిట్టుకోగలమని తమకే తెలీనంత విభ్రమ. తనచేతిని విసిరికొట్టి అతను దూరంగా పోవడం గురించి ప్రశాంతి పదేపదే నిలదీసి అడుగుతుంటే మాధవకి చాలా విసుగు, చిరాకు వచ్చాయి.

‘‘బైటకూడా అంత రాసుకుపూసుకు తిరగాలా? ఉచ్చ ఇంట్లో పోసుకుంటాము గానీ బజారున కాదు’’ అనేసి వెళ్ళిపోయాడు. నిశ్చేష్ట అయింది ప్రశాంతి. తమప్రేమ దేనితో సమానమని అతనన్నాడు! రెండుగంటలు ఊరంతా తిరిగి ఇంటికి వచ్చిచూస్తే మణికట్టు కోసుకుని రక్తంకారుతున్న చేత్తో బాత్రూములో పడుంది ప్రశాంతి. అంత భయం జీవితంలో ఎరగడు మాధవ. నిలువెల్లా వణుకుతూ దగ్గరకి వెళ్ళాడు. తన చేతుల్లో గింజుకుంటున్న ఆమెని లేపి కూచోబెట్టి తలుపు ఓరగావేసి, ఫోను తీసుకుని బైటకి వచ్చేశాడు. మణికి కాల్‌ చేసి విషయం చెప్పి ‘హాస్పిటల్‌కి మీరే తీసుకువెళ్లాలి’ అన్నాడు. అటు చెప్పేది వినకుండా ఫోనుపెట్టేసి ఆగమాగంగా నడుస్తూ ఎటో వెళ్ళిపోయాడు. 

వచ్చాడు మణిశంకర్‌. తననిలేపి కారువైపు నడిపిస్తున్న అతని మొహంలో అంతులేని సంతృప్తిని మూతలు పడుతున్న కళ్లతో చూసింది ప్రశాంతి. తమ్ముడు వరసయ్యే డాక్టర్‌ దగ్గరికి తీసికెళ్లాడు మణి. మాధవ గవర్నమెంట్‌ ఉద్యోగి కనుక పారిపోయాడని, ఇంకా విడాకులు ఇవ్వలేదు కనుక కేసు తనమీదకి వచ్చే అవకాశం ఉందని, అందుకే తీసుకొచ్చాననీ చెప్పాడు. రహస్యంగా ట్రీట్‌మెంట్‌ ఇప్పించి, నాలుగోరోజు ఆమె ఇంట్లో దింపాడు. 

కాడమల్లి చెట్టొకటే తోడుగా మరి నాలుగురోజులు గడిచాక బెరుగ్గా ఇంట్లో అడుగుపెట్టాడు మాధవ. మాటలులేవు. యుగాలుగా వేచిచూస్తున్న అద్భుతం నట్టింట్లోకి వచ్చినట్లు చేతులు చాపింది. పసిపిల్లాడిలా పరిగెత్తుకువచ్చి అంటుకుపోయాడు. కట్టువేసి ఉన్నచేతిని అపురూపంగా పట్టుకుని, ‘ఇక ఎవరికీ దేనికీ భయపడను, ఈ చెయ్యి విడిచిపెట్టను’ అన్నాడు. అదెంత నిజమైపోయిందంటే ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆ చేతిని వదిలేవాడుకాదు. వారి రిలేషన్‌ గురించి ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడుతున్నపుడు ఆమె మొహంలో స్థిమితపు నవ్వు ఎందుకు మెరిసేదంటే– మాధవ ఆమె మణికట్టు మీది గీతలని రహస్యంగా నిమురుతూ ఓదార్చేవాడు కనుక.     

ఇంటి జరుగుబాటు అంతా ప్రశాంతి చూసేది. తన జీతమంతా భార్య ఎకౌంటుకి పంపేసేవాడు మాధవ. అదికాక భార్యాబిడ్డలకి చేసిన అన్యాయం గుర్తువచ్చినపుడల్లా పిల్లలకి, భార్యకి బోనస్‌ డబ్బులతోనో ప్రశాంతి దగ్గర తీసుకునో బహుమతులు పట్టుకు వెళ్ళేవాడు. ‘ఎందుకివన్నీ! మనిషికి సాటి వస్తాయా?’ అని మాధవ భార్య ఏడ్చేది.ప్రశాంతికి ఆ అవకాశం లేదు. పిల్లాడిని కలవడానికి మణి ఒప్పుకోలేదు. ‘గట్టిగా అడిగేహక్కు నాకులేదు’ అనుకుంటుందామె. వాడిని చూసి అప్పటికే ఏడెనిమిదేళ్లు అయింది. తల్లిదండ్రులు ఆశ్రమ జీవితంలో మునిగిపోయారు. మాధవ తప్ప ఆమెకి ఎమోషనల్‌ బంధం ఎవరితోనూ మిగలలేదు. దానివల్ల కూడా అతనే ఆమెకి పూర్తిలోకం. 

మాధవ భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళినపుడల్లా ప్రశాంతికి మనసు కలుక్కుమంటూ ఉండేది. రాన్రానూ అది ఓపలేని కుళ్లుగా మారిపోవడం గ్రహించుకున్నపుడు పశ్చాత్తాపంగా అనిపించి కొంతడబ్బు మాధవ చేతబెట్టి పిల్లలకి ఏవైనా కొని పట్టుకెళ్లమని చెప్పేది. మాధవ రెండురోజులు వాళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళినపుడు గుండె బద్దలవుతున్నట్లు ఉండేది. ఆఫీసుకి పనిమీద వచ్చే కొత్తమనుషులతో స్నేహంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేసి ఆ కాలాన్ని దాటేది. 

ఓరోజు మాధవ భార్యాపిల్లలు అద్దెకి ఉంటున్న ఇల్లు అత్యవసరంగా ఖాళీచేయాల్సి వచ్చింది. అపుడు చాలా బాధపడ్డాడు. ఇకమీదట వారు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, ఒక ఫ్లాట్‌ కొనాలని చెప్పి లెక్కలు వేశాడు. లోనుపెట్టినా ముందుగా కట్టాల్సిన డబ్బు చాలడంలేదు. అతను ఇంట్లో దిగులుగా తిరుగుతుంటే చూడలేక బీరువాలో దాచిన నగలు పట్టుకొచ్చి ఇచ్చింది ప్రశాంతి. అయిదారు లక్షలు విలువైన నగలవి. ఇవ్వడానికి ఇంకేమీ మిగలనంతగా ఖాళీ చేసుకుంటున్న ఆమెని చూస్తే మణికిలానే భయంవేసింది మాధవకి.    

రెండేళ్ళు నలిగాక ఇల్లు పూర్తయింది. గృహప్రవేశంరోజు మాధవ, భార్యతోకలిసి పీటలమీద కూచుని సత్యన్నారాయణవ్రతం చేసాడని, పెద్దకూతురు ఇన్‌స్టాలో ఫోటోలు పెట్టినపుడు తెలిసింది ప్రశాంతికి. మాధవ ఆ విషయం తనదగ్గర దాచిపెట్టడం ఆమె తట్టుకోలేకపోయింది. పూర్తి ఒంటరినని అనిపించినపుడు ఆమెకి ఏడుపు రాలేదు. అవమానం, కక్షలతో దహించుకుపోయింది. పైకి నిమ్మళంగా ఉంది. 

మాధవ ఇంటికివచ్చాక ఎటువంటి గొడవపడే ఉద్దేశంలేని గొంతుతో ‘ఆఫీసులో పరిచయమయిన ఒకఫ్రెండ్‌ దగ్గరికి వెళ్లిపోతున్నానని, అతను భార్యకి దూరంగా ఒక్కడే ఉంటున్నాడ’ని చెప్పింది ప్రశాంతి. వ్రతం గురించి చెప్పకపోవడంవల్ల గాయపడుతుందనుకున్నాడు కానీ ఇంతశిక్ష ఊహించలేదు. బతిమలాటలు ఏడుపులు మొత్తుకోళ్ళు అయ్యాయి. ఫలితంలేదు. ప్రశాంతి తిండిమానేసి రెండురోజుల్లో వేలాడిపోయేసరికి ఇక తప్పలేదు. మాధవ స్వయంగా కారులో కాకినాడ తీసుకువెళ్ళి ఆమెచెప్పిన వ్యక్తి ఇంటిదగ్గర దింపి వెనుతిరిగి చూడకుండా బయల్దేరాడు. ఎవరూలేని చోట కారాపి తనచేతుల వంక నమ్మలేనట్లు చూసుకుంటూ– ‘‘ఈ చేతులతో నా అమ్మని, నా బంగారుతల్లిని ఎవరికో అప్పగించి వచ్చానా!’’ అని గొణుక్కుంటూ స్టీరింగ్‌ కేసి చేతులు బాదుకున్నాడు.  
ఇల్లు కదలకుండా తరుచూ గుమ్మంవంక చూస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ ఆమెకి ఇష్టమైన వంటచేసి డైనింగ్‌ టేబిల్‌ మీద ఉంచేవాడు. పక్కలు శుభ్రంగా దులిపి ఉతికిన దుప్పట్లు మార్చి, తువ్వాళ్ళు పువ్వుల్లా మడతపెట్టి– ఆమెకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసేవాడు. ‘నా అమ్మలు, నా బంగారం ఎక్కడా ఉండలేదు, వచ్చేస్తుంది చూడు’ అని కాడమల్లిచెట్టుతో పదేపదే చెప్పేవాడు. అతని నమ్మకం వమ్ముకాలేదు.రక్తంమడుగులో ఉన్న మనిషిని వదిలేసి పారిపోయి, అన్నీ బాగయ్యాక తిరిగొచ్చిన మాధవకోసం ఆమె ఎలా చేతులు చాపిందో అతనూ అంతే. తప్పిపోయిన గువ్వపిట్ట తిరిగొచ్చి గుండెమీద వాలినంత సంబరంతో  హత్తుకున్నాడు. 

పొద్దున్నే కారేజీ కట్టుకుని వెళ్లొస్తానని తలూపి ఆఫీసుకి వెళ్ళిన మాధవ తిరిగిరాలేదు. ‘జీతాలు బహుమతులు ఎందుకు నాకు! మనిషి కావాలి’ అని తపించిపోయిన భార్య దగ్గరికి ఎట్టకేలకి జీవంలేని శరీరంతో చేరుకున్నాడు. ఆఫీసువాళ్ళు, బంధువులు, పాతస్నేహితులు అందరూ వచ్చారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న మాధవ భార్యాపిల్లల్ని చూస్తుంటే ఎవరికీ దుఃఖం ఆగడంలేదు  యాభైఏళ్లకే అతనికి నూరేళ్ళు నిండిపోవడానికి ప్రశాంతి కారణంగా కనిపించింది మాధవ భార్య తరఫు వారికి. 

మణికి విషయం తెలిశాక, ఆ ఇంటికివెళ్ళి అక్కడ ప్రశాంతి కనపడక వెతుక్కుంటూ ఈ ఇంటికి వచ్చిచూస్తే– పళ్ళెంనిండా వంటకాలు ఏవో పెట్టుకుని కిందామీదా పోసుకుంటూ ఆబగా తింటున్న ప్రశాంతి కనపడింది. అతనికేదో అర్థమయి జాలి కలిగింది. ‘‘వస్తావా, అక్కడికి వెళ్దాం.’’ అన్నాడు. అతనివంక అసహ్యంగా చూసింది. కాసేపు ఆగి ‘‘ఆ మాధవ చేతకాని పిరికిపంద. అతనికి, అతని కుటుంబానికి ఎంత పెట్టానో తెలుసా? ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? అతను మంచివాడు కాదు’’ అంటూ తలపోతలో చెప్పుకుంటూ పోతోంది. వింతగా చూశాడతను. 

మాధవ పోగానే ప్రశాంతి మారిపోయిందని వాళ్లిద్దరికీ పరిచయం ఉన్నవారు అనుకున్నారు. ఎవరు పరామర్శకి వచ్చినా మాధవని తిట్టిపోస్తూ ఉండేది. ఒంటికి అతుక్కున్న చర్మపు తీరున అతన్ని పోషణ చేసినామె ఇంత ద్వేషంతో ఎందుకు మాట్లాడుతుందో ఎవరికీ అర్థంకాలేదు. కాకినాడ ఫ్రెండుకి ఫోనుచేసి, ‘నీ దగ్గరికి వచ్చేస్తాను’ అంది ఓరోజు. భార్య తిరిగి వచ్చేసింది కాబట్టి తీసుకువెళ్లలేను అన్నాడతను ఇబ్బందిగా. ‘సరేలే చక్కగా బతకండి’ నవ్వుతూ చెప్పింది. 

ఎపుడు చూసినా పెద్దగా నవ్వుతూ, గలగలమంటూ సందడిగా ఉన్నట్లు కనబడేది. మాధవపోయిన నెలకి కాబోలు బజారులో అతని పెద్దకూతురు ఎదురైనపుడు ఇలాగే పలకరించింది. ఆమె నవ్వుమొహం చూసో, మరెందుకో! ఆ పిల్లకి ఒళ్ళుమండి నడిబజారులో ప్రశాంతి చెంపమీద లాగిపెట్టి కొట్టింది. చుట్టూ అందరూ అయ్యో అంటుంటే ‘నాకు ఇది చాలదు, ఇంకా కావాల’ని గొణుక్కుంటూ వచ్చేసింది. 

నాలుగునెలల తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండేది. రోజుల తరబడి స్నానం చేసేదికాదు, పళ్ళు తోముకునేది కాదు. చేతికి ఏది దొరికితే అది తినేది. ఒకటే ఆలోచనలు. వాటిమధ్య వాళ్ళమ్మ ఎపుడూ అనేమాటలు ఓరోజు గుర్తొచ్చాయి. చాలా రిలీఫ్‌ అనిపించింది.అంతే! హుషారుగా లేచి అన్నిపనులూ చేసుకుంది. మాధవ వస్తువులు పదేపదే ముట్టుకుని, ఒంటికి పులుముకుని చివరికి శుభ్రంగా సర్దిపెట్టింది. అర్ధరాత్రయ్యాక పేపర్, పెన్ను తీసుకుని రాయడం మొదలుపెట్టింది. 

‘నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడు మేడమీద గాలిపటం ఎగరేస్తుంటే చేతినుంచి కొస, జారి గాలిపటం ఆకాశంలోకి ఎగిరిపోయిందట. నేను ఏడుపు లంకించుకుని గాలిపటాన్ని పట్టుకోడానికి కిందామీదా చూడకుండా పిట్టగోడ మీదకి ఎక్కి గాల్లోకి దూకబోతుంటే చివరి నిమిషంలో చూసిన నాన్న రెండుకాళ్ళూ పట్టుకుని వెనక్కి లాగారట. ఈ విషయం చిన్నప్పటినుంచీ వందసార్లు చెప్పి ‘దీనికి ఉన్మాదం ఎక్కువ’ అనేది అమ్మ. ఇపుడు కూడా నా రంగురంగుల గాలిపటం ఎగిరిపోయింది. వెతుక్కోడానికి వెళ్తున్నా. ఇక కాళ్ళుపట్టి వెనక్కిలాగేవాళ్ళు లేరు’

– ఎవరూ క్షమించాల్సిన అవసరం లేని ప్రశాంతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement