
‘‘ఖైదీలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వాళ్ల మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. కుటుంబాలతో వాళ్ల బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి. పైగా అది వాళ్లకు ఉన్న హక్కు కూడా’’ అంటూ ఇటలీ సుప్రీం కోర్టు(Italy Constitution Court) తాజాగా ఇచ్చి తీర్పు ఇది. ఈ తీర్పునకు అనుగుణంగానే..
ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు(S*X Rooms) అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్ రూమ్(Love Rooms) పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖత్‌ల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఈ ఏకాంత ములాఖత్‌లో ఎవరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయ శాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం గమనార్హం.
ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
తాజా గణాంకాల ప్రకారం.. ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేలమంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్ రైట్స్ గ్రూప్ సంబురాలు చేసుకుంటోంది.
అయితే ఈ తరహా ఏర్పాట్లు ఇటలీ(Italy)లోనే మొదటిసారి కాదు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌లాంటి యూరప్ దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి ుంచో ఉన్నాయి.