
జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే! కాని, తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషుల ప్రదర్శనశాలను ఎక్కడైనా చూశారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్‌లో ఉన్న దృశ్యం.
అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. ‘మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే, ఇక్కడకు రండి’ అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే తెరిచే ఈ జూను చూడటానికి చాలామంది పోటీ పడుతున్నారు.
పైగా దీని ఎంట్రీ ఫీజుతోపాటు, మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే, ఒక నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్‌లు (అంటే రూ. 27 వేలు) వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేస్తానని టోకో చెబుతున్నాడు.