
సూత మహర్షి ఒకసారి నైమిశారణ్యంలోని మునులకు పరమశివుడి అవతార గాథలను చెప్పాడు. పశుపతి అయిన పరమశివుడు గృహపతిగా అవతరించిన గాథ ఇది.పూర్వం నర్మదాతీరంలోని నర్మపురంలో విశ్వానరుడు అనే ముని ఉండేవాడు. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుల వద్ద వేదశాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. యుక్తవయస్సు రాగానే శుచిష్మతి అనే శ్రోత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాక విశ్వానరుడు తన సహధర్మచారిణితో కలసి నిత్యాగ్నిహోత్రిగా, పంచయజ్ఞ పరాయణుడిగా, షట్కర్మ నిరతుడై, దేవ, పితృ, అతిథిసేవా తత్పరుడై, నిత్య శివార్చన కొనసాగిస్తూ, ప్రశాంత జీవనం సాగించేవాడు.
ఒకనాడు శుచిష్మతి భర్తను సమీపించి, ‘నాథా! పరమశివుడి దయవల్ల ఇప్పటి వరకు మనకు ఏ లోటు లేదు. మనకు లేనిదల్లా సంతానభాగ్యం ఒక్కటే! సాక్షాత్తు శంకరుని వంటి పుత్రుని అనుగ్రహించమని శంకరునే కోరండి’ అని అడిగింది.భార్య కోరిక మేరకు విశ్వానరుడు వారణాసి నగరానికి చేరుకున్నాడు. విశ్వేశ్వర లింగం సహా అక్కడ కొలువై ఉన్న అన్ని శివలింగాలను అర్చించాడు. తొలిగా గణనాథుడికి ప్రణమిల్లి, ఆ తర్వాత విశాలాక్షిని, అన్నపూర్ణను, కాలభైరవుడిని, ఆదికేశవుడిని పూజించి, శాస్త్రోక్తంగా కాశీ నగరాన్ని సేవించాడు. ఎందరో సిద్ధపురుషులు ఆరాధించి, సిద్ధి పొందిన వీరేశలింగం ఎదుట కూర్చుని తపస్సు ప్రారంభించాడు.
ఒక నెల ఏకభుక్తాన్ని, రెండోనెల నక్తాన్ని, మూడోనెల అయాచిత ఆహారాన్ని, నాలుగోనెల ఉపవాసాన్ని, ఐదోనెల పాలను, ఆరోనెల పండ్లను, ఏడోనెల నువ్వులను, తొమ్మిదోనెల పంచగవ్యాన్ని, పదోనెల చాంద్రాయణాన్ని, పదకొండోనెల దర్భాగ్ర జలాలను, పన్నెండోనెల వాయుభక్షణంతోను– ఇలా క్రమక్రమంగా తపోదీక్షను కఠినతరం చేస్తూ వచ్చాడు. పదమూడోనెల వేకువ జామునే గంగా స్నానం చేసి, విశ్వేశ్వర దర్శనానికి వెళుతున్న వేళ సుందర వదనారవిందుడు, చితాభస్మాలంకారుడు, దిగంబరుడు అయిన ఎనిమిదేళ్ల బాలుడు వేద సూక్తాలను వల్లె వేస్తూ కనిపించాడు. అతడు బాలశివుడిలా కనిపించాడు. అతడిని చూడగానే విశ్వానరుడు పులకాంకితుడయ్యాడు. చేతులు జోడించి, ఆశువుగా అష్టకాన్ని పలుకుతూ, శివస్తుతి చేశాడు.
విశ్వానరుడి స్తోత్రానికి బాలుడి రూపంలో ఉన్న పరమశివుడు పరమానందం చెందాడు.
‘భక్తా! నీ భక్తిశ్రద్ధలకు పూర్తిగా సంతుష్టుడినయ్యాను. ఏదైనా ఉత్తమ వరం కోరుకో, తప్పక తీరుస్తాను’ అన్నాడు.‘పరమేశ్వరా! నువ్వు సర్వజ్ఞుడివి. నీకు తెలియనిదేముంది? నాకు అర్హమైనదానిని నువ్వే అనుగ్రహించు’ అన్నాడు విశ్వానరుడు.విశ్వానరుడి మాటలకు పరమశివుడు మరింతగా సంతోషించాడు.
‘విప్రోత్తమా! త్వరలోనే నేను నీకు పుత్రుడినై పుడతాను. గృహపతి నామంతో దేవతలకు సైతం ప్రీతిపాత్రుడనవుతాను. సంతానాభీష్టులైన దంపతులు నువ్వు నన్ను స్తుతిస్తూ పలికిన అభిలాషాష్టకాన్ని పఠించినట్లయితే, తప్పక సంతానవంతులవుతారు’ అని వరమిచ్చాడు.కొన్నాళ్లకు శుచిష్మతికి పండంటి బాలుడు పుట్టాడు. విశ్వానరుడు అతడికి గృహపతి అని నామకరణం చేశాడు. ఏడో ఏట ఉపనయనం చేశాడు. తొమ్మిదేళ్లు నిండేసరికి ఆ బాలుడు చతుర్వేదాలను, షడంగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
ఒకనాడు నారద మహర్షి విశ్వానరుడి ఆశ్రమానికి వచ్చాడు. విశ్వానరుడు ఆయనకు తన కొడుకును పరిచయం చేశాడు. బాలుడైన గృహపతి సాముద్రిక లక్షణాలను పరిశీలించిన నారదుడు ‘విశ్వానరా! ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండో ఏట అగ్నిగండం ఉంది. జాగ్రత్తగా కాపాడుకో’ అని చెప్పి వెళ్లిపోయాడు. నారదుడు చెప్పిన మాటలకు విశ్వానరుడు, శుచిష్మతి దంపతులు దుఃఖంలో కూరుకుపోయారు.
తల్లిదండ్రుల దుఃఖాన్ని గమనించిన గృహపతి వారిని ఓదార్చాడు. ‘మీరు శోకాన్ని విడిచిపెట్టండి. నా జన్మకు కారణం నాకు తెలుసు. సాక్షాత్తు పరమశివుడిని ఆరాధించి, జనన మరణాలను జయించి తిరిగి వస్తాను. కాశీ నగరానికి వెళ్లేందుకు అనుమతించండి. అక్కడ తపస్సు చేసి, అనుకున్నది సాధిస్తాను’ అని పలికాడు. తల్లిదండ్రులు అనుమతించడంతో గృహపతి వారణాసి చేరుకున్నాడు. ముందుగా మణికర్ణికా ఘట్టంలో స్నానమాచరించి, విశ్వేశ్వరుడిని సేవించుకున్నాడు. తర్వాత అనుకూల ప్రదేశాన్ని చూసుకుని, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి, దాని ఎదుట కూర్చుని తపస్సు ప్రారంభించాడు. గృహపతి ప్రతిరోజూ మానసపూజ కొనసాగిస్తూ, కఠిన నియమాలతో తపస్సు చేయసాగాడు.
కొన్నాళ్లు గడిచాక, ఒకనాడు దేవేంద్రుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
‘బాలకా! వరం కోరుకో’ అన్నాడు.
‘నేను పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నాను. అతడి నుంచి మాత్రమే వరం స్వీకరిస్తాను. నువ్వు తప్పుకో’ అన్నాడు.
బాలుడి ధిక్కారానికి కుపితుడైన ఇంద్రుడు అతడి పైకి తన వజ్రాయుధాన్ని దూశాడు. వజ్రఘాతానికి బాలుడు మూర్ఛపోయాడు.
వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఛితుడైన బాలుడిని తన చేతులతో స్పృశిస్తూ, ‘నాయనా! గృహపతీ! లే! నీకు శుభాలు కలుగుతాయి’ అన్నాడు. నిద్రలోంచి మేల్కొన్నట్లుగా లేచిన బాలుడిని పరమశివుడు తన ఒడిలోకి తీసుకుని, లాలించాడు.
Comments
Please login to add a commentAdd a comment