అనగనగా ఒక ఊళ్లో పాపన్న అనే సంపన్నుడు ఉండేవాడు. అతని చేతి కింద జీతానికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది .జీతంతో పాటు భోజనం, వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు పాపాన్న. పొరుగూరి నుంచి గంగన్న అనే యువకుడు పని వెదుక్కుంటూ పాపయ్య వాళ్ల ఊరికి వచ్చాడు. గంగన్న ఒక అనాథ. తెలివైన యువకుడు. నిరుపేద. క్రితం రోజు నుంచి భోజనం కూడా చేయలేదు.
కూడలిలో ఒక ఆసామిని ‘అయ్యా! పాపన్న గారింట్లో జీతానికి పనివాడు కావాలని తెలిసింది. అతని ఇల్లు ఎక్కడో చెపుతారా?’ అని అడిగాడు. ఆ ఆసామి గంగన్నను ఎగాదిగా చూసి ‘ఏ ఊరు బాబూ నీది? పోయి పోయి పాపన్న కింద పనిచేస్తావా?’ అన్నాడు. ‘ఎందుకండీ.. అలా అంటున్నారు?’ అంటూ ఆశ్చర్యపోయాడు గంగన్న. ‘పాపన్న ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు. నీకు జీతం రాళ్ళేమిస్తాడు?’ అన్నాడు ఆ ఆసామి.
‘పరవాలేదు. అతని ఇల్లెక్కడో చెప్పండి’ అని అడిగాడు గంగన్న. ‘ఇలా తిన్నగా వెళ్ళి కుడిచేతి వైపు తిరిగి ఎవరిని అడిగినా చూపిస్తారు’ అని చెప్పాడు ఆసామి.
సందు చివరి దాక వెళ్ళిన గంగన్న.. అక్కడ కొబ్బరికాయలు అమ్మే వ్యక్తిని పాపన్న ఇల్లు గురించి వాకబు చేశాడు. విషయం తెలుసుకున్న ఆ కొబ్బరికాయల వ్యాపారి ‘ఆ పాపన్న పిల్లికి కూడా బిచ్చం వేయడు. ఇక నీకు తిండేం పెడతాడో’ అన్నాడు.
‘నాకు పని అత్యవసరం. ఉండటానికి ఇంత చోటిస్తే చాలు .. సర్దుకు పోతాను’ చెప్పాడు గంగన్న. ‘సరే, నీ ఇష్టం’ అంటూ ‘అదిగో ఆ కనిపించే రామాలయం దగ్గర ఉంటుంది అతని ఇల్లు’ అని చూపించాడు ఆ వ్యాపారి. గంగన్న రామాలయం దగ్గరకు వెళ్లి.. గుడి ముందు నిలబడి అటూ ఇటూ చూశాడు. గుడిలోంచి ఓ పంతులు బయటికి రావటం గమనించి అతనికి తను వచ్చిన విషయం చెప్పి ‘పాపన్న ఇల్లు ఎక్కడ?’ అని అడిగాడు.
అతను నెమ్మదిగా నవ్వుతూ ‘పాలు చిలికితే వెన్న వస్తుంది. జలము చిలికితే శ్రమ, అలసట, నొప్పులు తప్ప ఒరిగేదేమి లేదు! పాపయ్య దగ్గర పనికి కుదిరినా అంతే!’ అంటూ ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపన్నను చూపించాడు. పాపన్న దగ్గరకు వెళ్లి.. తన పరిస్థితి వివరించి పని కావాలని అడిగాడు గంగన్న. అతని అవసరాన్ని గ్రహించిన పాపన్న.. అతనికి భోజనం పెట్టి, ఉండటానికి గది చూపించాడు.
‘పొలానికి పోదాం పద’ అన్నాడు. ‘ అయ్యా! బండి కట్టమంటారా?’ అడిగాడు గంగన్న . ‘ఊరి చివర పొలానికి వెళ్ళటానికి బండెందుకురా!’ అన్నాడు పాపన్న. ఇద్దరూ నడుచుకుంటూ పొలానికి వెళ్ళారు. పొలం నుంచి ఇంటికి రాగానే నలుగురు వ్యక్తులు లెక్కల పుస్తకాలతో సిద్ధంగా ఉన్నారు. లెక్కలు చూసి నలుగురికీ పెద్దమొత్తంలో నగదు ఇచ్చి పంపాడు పాపన్న. తను ఇంతకాలం ఉన్న అనాథ ఆశ్రమం, చదువుకున్న బడి పాపన్న కట్టించినవేనని, ఆడంబరాలకు పోకుండా, సాధారణ జీవితం గడుపుతూన్న అతను గుప్తదానాలు చేసే పుణ్యాత్ముడని తెలుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు గంగన్నకు. -మహంకాళి స్వాతి
Comments
Please login to add a commentAdd a comment