Kids Stories
-
పిల్లల కథ: దొంగ చెప్పిన తీర్పు!
పూర్వం అవంతీపురంలో రామగుప్తుడు, ధనగుప్తుడు అనే వర్తకులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై ధనగుప్తుడు రామగుప్తుని దగ్గరకు వెళ్ళి వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తోటి వర్తకుని మాట కాదనలేక రామగుప్తుడు వెయ్యి వరహాలు ధనగుప్తుడికి అప్పుగా ఇచ్చాడు. చాలాకాలం గడిచింది. అయినా ధనగుప్తుడు రామగుప్తునికి ఇవ్వవలసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదు అనుకుని రామగుప్తుడు స్వయంగా ధనగుప్తుడిని కలసి తాను ఇచ్చిన వెయ్యి వరహాలు ఇవ్వమని అడిగాడు. రేపు, మాపు అంటూ మాట దాటవేశాడు తప్ప అప్పు తీర్చలేదు ధనగుప్తుడు. అటు తర్వాత ధనగుప్తుడు ఆ ప్రాంతంలో కనిపించనేలేదు. చేసేదేమీ లేక బాధపడ్డాడు రామగుప్తుడు. ఓసారి వ్యాపార నిమిత్తం చంద్రగిరికి వెళ్ళాడు రామగుప్తుడు. పనులన్నీ ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తారసపడ్డాడు ధనగుప్తుడు. వెతకబోయిన తీగ కాళ్ళకి తగినట్లు సంబరపడ్డాడు రామగుప్తుడు. ‘మిత్రమా బాగున్నావా?’ అని పలకరించాడు. రామగుప్తుణ్ణి చూడగానే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది ధనగుప్తుడికి. ‘ఏం బాగు? వ్యాపారం దివాళా తీసింది. దేశ దిమ్మరిలా తిరుగుతున్నాను’ అన్నాడు. ‘నీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే చాలా కాలమైంది. నా వెయ్యి వరహాలు ఇస్తావా? ఇవ్వవా? స్నేహితుడివని వడ్డీ కూడా అడగలేదు. అసలు కూడా ఇవ్వకపోతివి’ అని గట్టిగా నిలదీశాడు రామగుప్తుడు. ‘ఏంటి మీ గొడవ?’ అంటూ పూటకూళ్ళవ్వ అడిగింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామగుప్తుడు. ‘సరే! ఏదో పని మీద మా మంత్రి గారు ఈ ఊరు వచ్చారు. మీరిద్దరూ మంత్రి సులోచనుడి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది’ అని సలహా ఇచ్చింది పూటకూళ్ళవ్వ. సరేనని ఇద్దరూ మంత్రి సులోచనుడి వద్దకు వెళ్ళారు. ‘అయ్యా మా ఇద్దరిదీ అవంతీపురం. చాలా కాలం క్రితం వ్యాపార నిమిత్తం నా దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు ఈ ధనగుప్తుడు. నా అప్పు తీర్చమంటే తీర్చడం లేదు’ అని ఫిర్యాదు చేశాడు రామగుప్తుడు. ‘అదంతా వట్టి అబద్ధం. నేను ఇతని వద్ద అప్పు తీసుకోలేదు. తీసుకుంటే వడ్డీ ఎంత? పత్రం ఏదీ?’ అని బుకాయించాడు ధనగుప్తుడు. మంత్రి సులోచనుడు కాసేపు ఆలోచించి.. ‘రామగుప్తా నువ్వు అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’ అడిగాడు. ‘నా దగ్గర ఏ ఆధారాలు లేవు’ అని జవాబిచ్చాడు రామగుప్తుడు. ‘ఆధారాలు లేనప్పుడు ఎలా శిక్షించగలను? నువ్వు అప్పు ఇవ్వడం నిజమే అయినా నీ సొమ్ము ఎలా ఇప్పించగలను?’ అన్నాడు మంత్రి. చేసేదేమీ లేక దిగాలుగా రామగుప్తుడు, ‘నన్నేమీ చేయలేవు’ అనే అహంభావంతో ధనగుప్తుడు పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కబుర్లు చెప్పుకుని హాయిగా పడుకున్నారు. రెండో ఝాము అయ్యింది. ‘ధడేల్’మని చప్పుడు అయ్యింది. భయపడుతూ అందరూ ఒక్కసారి నిద్రలేచారు. ఏమయ్యిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ‘ఎవ్వరైనా కదిలారో చంపేస్తా’ అన్న మాటలు గట్టిగా వినిపించాయి. లాంతరు వెలుగులో అతని ఆకారాన్ని బట్టి గజదొంగ అని గుర్తించి భయం భయంగా కూర్చున్నారు అందరూ. ఆ గజదొంగ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ‘మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మాట్లాడకుండా ఇచ్చేయండి లేదా పీక కోస్తా’ అని బెదిరించాడు. ‘బతికుంటే బలుసాకైనా తినవచ్చు’ అనుకుని ఒంటి మీద ఉన్న బంగారం, సంచిలో ఉన్న డబ్బులు ఒక్కొక్కరుగా ఇవ్వసాగారు. ఇది గమనించిన ధనగుప్తుడు.. తన దగ్గర ఉన్న వెయ్యి వరహాల సంచిని రామగుప్తుడి చేతిలో పెట్టి ‘నీ అప్పు తీరిపోయింది.. తీసుకో’ అన్నాడు. ఇప్పుడు తీసుకుంటే దొంగ పాలు అవుతుందని గ్రహించిన రామగుప్తుడు ఆ వరహాలను తీసుకోలేదు. ఆ గజదొంగ నేరుగా ధనగుప్తుడి దగ్గరికి వచ్చి ‘నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం బయటకి తియ్’ అని గద్దించాడు. ‘ఈ వెయ్యి వరహాలు ఇతనికి అప్పు తీర్చవలసినవి. నా దగ్గర మరేమీ లేవు’ అన్నాడు ధనగుప్తుడు వణుకుతూ. ‘అయితే నీకు ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు’ అన్నాడు గజదొంగ. గజదొంగ వేషంలో ఉన్నది సులోచనుడని గ్రహించి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ధనగుప్తుడు. ‘ఆధారం లేకపోతే అన్యాయం చేస్తావా? నీతిగా బతకడం నేర్చుకో’ అని మందలించి విడిచిపెట్టాడు సులోచనుడు. తన తప్పును మన్నించమని రామగుప్తుణ్ణి కోరాడు ధనగుప్తుడు. -కాశీ విశ్వనాథం పట్రాయుడు -
Pillala Katha: పాపన్న కొలువు!
అనగనగా ఒక ఊళ్లో పాపన్న అనే సంపన్నుడు ఉండేవాడు. అతని చేతి కింద జీతానికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది .జీతంతో పాటు భోజనం, వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు పాపాన్న. పొరుగూరి నుంచి గంగన్న అనే యువకుడు పని వెదుక్కుంటూ పాపయ్య వాళ్ల ఊరికి వచ్చాడు. గంగన్న ఒక అనాథ. తెలివైన యువకుడు. నిరుపేద. క్రితం రోజు నుంచి భోజనం కూడా చేయలేదు. కూడలిలో ఒక ఆసామిని ‘అయ్యా! పాపన్న గారింట్లో జీతానికి పనివాడు కావాలని తెలిసింది. అతని ఇల్లు ఎక్కడో చెపుతారా?’ అని అడిగాడు. ఆ ఆసామి గంగన్నను ఎగాదిగా చూసి ‘ఏ ఊరు బాబూ నీది? పోయి పోయి పాపన్న కింద పనిచేస్తావా?’ అన్నాడు. ‘ఎందుకండీ.. అలా అంటున్నారు?’ అంటూ ఆశ్చర్యపోయాడు గంగన్న. ‘పాపన్న ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు. నీకు జీతం రాళ్ళేమిస్తాడు?’ అన్నాడు ఆ ఆసామి. ‘పరవాలేదు. అతని ఇల్లెక్కడో చెప్పండి’ అని అడిగాడు గంగన్న. ‘ఇలా తిన్నగా వెళ్ళి కుడిచేతి వైపు తిరిగి ఎవరిని అడిగినా చూపిస్తారు’ అని చెప్పాడు ఆసామి. సందు చివరి దాక వెళ్ళిన గంగన్న.. అక్కడ కొబ్బరికాయలు అమ్మే వ్యక్తిని పాపన్న ఇల్లు గురించి వాకబు చేశాడు. విషయం తెలుసుకున్న ఆ కొబ్బరికాయల వ్యాపారి ‘ఆ పాపన్న పిల్లికి కూడా బిచ్చం వేయడు. ఇక నీకు తిండేం పెడతాడో’ అన్నాడు. ‘నాకు పని అత్యవసరం. ఉండటానికి ఇంత చోటిస్తే చాలు .. సర్దుకు పోతాను’ చెప్పాడు గంగన్న. ‘సరే, నీ ఇష్టం’ అంటూ ‘అదిగో ఆ కనిపించే రామాలయం దగ్గర ఉంటుంది అతని ఇల్లు’ అని చూపించాడు ఆ వ్యాపారి. గంగన్న రామాలయం దగ్గరకు వెళ్లి.. గుడి ముందు నిలబడి అటూ ఇటూ చూశాడు. గుడిలోంచి ఓ పంతులు బయటికి రావటం గమనించి అతనికి తను వచ్చిన విషయం చెప్పి ‘పాపన్న ఇల్లు ఎక్కడ?’ అని అడిగాడు. అతను నెమ్మదిగా నవ్వుతూ ‘పాలు చిలికితే వెన్న వస్తుంది. జలము చిలికితే శ్రమ, అలసట, నొప్పులు తప్ప ఒరిగేదేమి లేదు! పాపయ్య దగ్గర పనికి కుదిరినా అంతే!’ అంటూ ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపన్నను చూపించాడు. పాపన్న దగ్గరకు వెళ్లి.. తన పరిస్థితి వివరించి పని కావాలని అడిగాడు గంగన్న. అతని అవసరాన్ని గ్రహించిన పాపన్న.. అతనికి భోజనం పెట్టి, ఉండటానికి గది చూపించాడు. ‘పొలానికి పోదాం పద’ అన్నాడు. ‘ అయ్యా! బండి కట్టమంటారా?’ అడిగాడు గంగన్న . ‘ఊరి చివర పొలానికి వెళ్ళటానికి బండెందుకురా!’ అన్నాడు పాపన్న. ఇద్దరూ నడుచుకుంటూ పొలానికి వెళ్ళారు. పొలం నుంచి ఇంటికి రాగానే నలుగురు వ్యక్తులు లెక్కల పుస్తకాలతో సిద్ధంగా ఉన్నారు. లెక్కలు చూసి నలుగురికీ పెద్దమొత్తంలో నగదు ఇచ్చి పంపాడు పాపన్న. తను ఇంతకాలం ఉన్న అనాథ ఆశ్రమం, చదువుకున్న బడి పాపన్న కట్టించినవేనని, ఆడంబరాలకు పోకుండా, సాధారణ జీవితం గడుపుతూన్న అతను గుప్తదానాలు చేసే పుణ్యాత్ముడని తెలుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు గంగన్నకు. -మహంకాళి స్వాతి -
పిల్లల కథ -‘తెలిసొచ్చింది మహా ప్రభో’
మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు. సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు. వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి -
ఈ వారం పిల్లల కథ - ‘దత్తత’
బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న మాజాలీ ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి. ఆ అడవిలోని జంతువులన్నిటికీ కృపి అంటే ఎంతో గౌరవం. ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే. ‘నా తరువాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటీ?’ అంటూ దిగులుచెందుతూ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేది. ఒకరోజు.. ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి ‘మృగరాజా.. ఆహార వేట కోసం నేను వెళ్లే పల్లెల్లో.. పిల్లలు లేనివాళ్ళు మరొకరి పిల్లలను తెచ్చి పెంచుకుంటుంటారు. దాన్ని దత్తత అంటారట. అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది’ అంది. అక్కడే ఉన్న ఎలుగుబంటి ‘ఓ కరటం.. నీకు మతి పోయిందా? పక్కవాళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ మనం వేరు వేరు జంతువులం. పిల్లి పిల్లను తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా ?’ అంది. ‘మరైతే ఎలా ఈ సమస్య తీరేది?’ అంటూ కలతచెందింది కరటం. అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద ‘మహారాజా.. దిగులుపడకండి. నేను అనేక అడవులు తిరుగుతాను. ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను. అప్పడు దత్తత గురించి ఆలోచించవచ్చు’ అంది. ‘ఈ ఆలోచన బాగుంది. అయితే ఈ రోజు నుండే వెతకడం మొదలుపెట్టు’ అంది ఎలుగుబంటి. అలా వెళ్ళిన గద్ద పక్కనున్న అడవులన్నిటినీ గాలించడం మొదలుపెట్టింది. నదీ తీరంలో దానికి ఓ పావురం కలసింది. ‘నిన్నటి నుండి చూస్తున్నా .. ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టున్నావ్?’ అని అడిగింది. ‘అవును’ అంటూ తన రాజు గురించి, ఆయన బాధ గురించి చెప్పింది గద్ద. ‘ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా వెదికినట్టుంది. మన పక్కనున్న కంజీరా అడవి రాణికి రెండు మగ పిల్లలు పుట్టాయి. జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు’ అంది పావురం. వెంటనే గద్ద కంజీరా అడవి వైపు ఎగిరి అక్కడి రాణి బిడ్డలను చూసింది. ముద్దుగా ఉన్నాయి. దయతలచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లేడనే లోటుండదు అనుకుంది. ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్లి రాజు సహా అక్కడి జంతువులన్నిటికీ తను చూసిన విషయాన్ని చెప్పింది. ‘మహారాజా .. ఒక తల్లి నుండి పిల్లను తేవడం చిన్న విషయం కాదు. చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి’ అంది కరటం. ‘అవును.. మహారాజా! నానొక ఆవకాశం ఇవ్వండి. యువరాజును తీసుకొస్తా!’ అంది ప్రవాళం అనే కుందేలు. ‘అది నీవల్ల అయ్యే పనికాదు’ అని కుందేలును విదిలించి ‘మహారాజా.. ఆ అవకాశం నాకు ఇవ్వండి. నేను తీసుకొస్తా’ అంది త్రిశిర అనే నక్క. ‘అవును.. మహారాజా! త్రిశిర తెలివైనది. అవసరమైతే తన దొంగ తెలివితేటలనూ ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా!’ అంది ఎలుగుబంటి. అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిశిర. కొంత దూరంలో దానికి ఓ తోడేలు జత కూడింది. రెండూ కలసి కంజీరా అడవికి చేరుకున్నాయి. రెంటికీ ఆకలి దంచేయసాగింది. ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి. కొద్దిదూరంలోనే బాగా బలిసిన అడవి కోడి కనిపించింది. పొట్టికాళ్ళు.. మెలితిరిగిన పంచరంగుల తోక.. నెత్తిమీద ఎర్రని జుట్టు.. దాన్ని చూడగానే నోట్లో నీళ్లూరాయి తోడేలుకు. ‘రాజు సంగతి తరువాత.. ముందు దీన్నో పట్టుపడదాం’ అంది త్రిశిరతో. ‘తొందరపడకు. ఇది మన అడవి కాదు. పైగా మనం ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం’ హెచ్చరించింది త్రిశిర. ‘నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి. నీరసంతో పని చేయలేం కదా! అయినా కోడిని కొడితే ఎవరూ పట్టించుకోరు!’ అంది తోడేలు. ఆ కోడి మీదకు దూకుదాం అని ఆ రెండూ అనుకునేలోపు చాలా జంతువులు నక్కను, తోడేలును చుట్టుముట్టాయి. ‘మా మృగరాజును నిద్రలేపే కోడి పుంజునే చంపుదామని వచ్చారంటే.. మీ కెంత ధైర్యం?’ అని బెదిరించాయ్. భయపడిపోయిన త్రిశిర ‘అమ్మబాబోయ్’ అంటూ పరుగు తీసింది. తోడేలూ దాన్ని అనుసరించింది. అలా బెదిరిపోయి వచ్చిన త్రిశిరను చడామడా తిట్టాయి జంతువులన్నీ! ‘మహారాజా.. ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం’ అని మళ్లీ అడిగింది ప్రవాళం. ‘ఏ పుట్టలో ఏ పాముందో.. సరే’ అంటూ అనుమతిచ్చింది మృగరాజు. వెంటనే ప్రవాళం.. వైద్యుడు కోతి బావను కలసి సువాసన తైలం తీసుకుంది. దాన్ని ఆనప బుర్రలో పోసుకుని.. భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాళం. కంజీరా రాజును కలసింది. చాలా వినయంగా ‘రాజా .. మీరు చాలా మంచివారని.. జంతువుల పట్ల స్నేహభావంతో మెలగుతారని తెలిసింది. మా మంజీరా మహారాజు మీ కోసం ఈ సువాసన తైలం పంపారు. దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు’ అంటూ మాటల్లో పెట్టింది. ‘భలే మాట్లాడుతున్నావే’ అంది కంజీరా మృగరాజు. కొంత స్థిమితపడ్డాక మెల్లగా ‘రాజా.. మీకిద్దరు బిడ్డలని తెలిసింది. ఒకరు ఈ అడవికి రాజయితే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు’ అన్నది ప్రవాళం. ‘పక్క అడవికి రాజా? అదెలా?’ అని ఆశ్చర్యపోయింది మృగరాజు. అప్పుడు ప్రవాళం తమ మృగరాజుకు పిల్లల్లేని విషయం చెప్పి, దత్తత గురించీ చెవిన వేసింది. అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు. ‘ఈ కుందేలు చెప్పింది బావుంది. పక్క అడవినీ నా బిడ్డే ఏలుతాడంటే అంతకంటే ఇంకేం కావాలి! ఇక్కడుంటే రెండిటిలో ఒకటే రాజవుతుంది. రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే. ఈ భేదం వల్ల భవిష్యత్తులో రెండిటి మధ్య విరోధమూ తలెత్తొచ్చు. కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి. పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది. కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి’ అనుకుంది. ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది. రాణీ సరే అంది. ఆ రెండూ కలసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనంపాయి. అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘన స్వాగతం పలికాయి. తెలివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. -కూచిమంచి నాగేంద్ర -
చిట్టి బాతు... బుజ్జి కొంగ..!
‘ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు?’ అని చిట్టిబాతును అడిగింది బుజ్జి కొంగ. ‘మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్నాను’ చెప్పింది చిట్టి బాతు. ‘నేను కూడా వస్తాను. నన్నూ మీ అమ్మమ్మగారి ఇంటికి తీసుకువెళ్ళవా?’ అడిగింది బుజ్జి కొంగ. ‘నిన్ను మా అమ్మమ్మగారింటికి తీసుకెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీ అమ్మను అడుగు. అమ్మ వెళ్ళమంటే నాతో రా!’ అంది చిట్టి బాతు. ‘మా అమ్మ ఏమీ అనదు’ చెప్పింది బుజ్జి కొంగ. అయినా చిట్టి బాతు ‘అమ్మ ఒప్పుకుంటేనే’ అని పట్టుబట్టింది. ‘అయితే ఉండు.. క్షణంలో వెళ్లి అమ్మను అడిగొస్తాను’ అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టు పైకి ఎగిరింది. కాసేపటి తర్వాత వచ్చి ‘అమ్మ వెళ్ళమంది’ అంది బుజ్జి కొంగ. ‘అయితే పదా’ అంటూ బుజ్జి కొంగను తన అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్లింది చిట్టి బాతు. అమ్మమ్మ ఇద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందును ఏర్పాటు చేసింది. చిట్టి బాతు, బుజ్జి కొంగ హాయిగా భోంచేసి.. చాలాసేపు ఆడుకున్నాయి. కబుర్లతో కాలక్షేపం చేశాయి. సమయమే తెలియలేదు. ఇక్కడ.. బుజ్జి కొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగానే గూటికి చేరింది. వచ్చేటప్పటికి బుజ్జి కొంగ కనపడలేదు. చెట్టు పైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి. ‘ఉదయం నుండి బుజ్జి కొంగను చూడలేద’ని చెప్పాయి అవి. తన బిడ్డ కోసం అంతటా వెదికింది. ఎక్కడా కనబడలేదు. చివరకు చిట్టి బాతు తల్లినీ వాకబు చేసింది తన బిడ్డ గురించి. అది కూడా తనకు తెలియదనే చెప్పింది. దాంతో బుజ్జి కొంగ తల్లి ఏడుస్తూ తన గూటి కొమ్మపై కూర్చుంది. అంతలోకే చీకటి పడిపోయింది. చిట్టి బాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బుజ్జి కొంగ గాభరా పడింది. ‘అమ్మో.. చీకటి పడిపోయింది.. త్వరగా మనిళ్లకు పోదాం పదా’అని చిట్టి బాతును తొందరపెట్టింది. ‘ఎందుకంత కంగారు? అమ్మకు చెప్పావ్ కదా.. నిదానంగా వెళ్దాంలే!’ అంది చిట్టి బాతు. ‘ఆ.. ఆ.. చెప్పానులే’ అనైతే అంది కానీ బయలుదేరే వరకు చిట్టి బాతును స్థిమితపడనివ్వలేదు. ఎట్టకేలకు రెండూ కలసి తిరుగుప్రయాణమయ్యాయి. ఇక్కడ.. చెట్టు కొమ్మ పై ఏడుస్తూ కూర్చున్న బుజ్జి కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి. అంతలోకే దూరం నుంచి చిట్టి బాతు, బుజ్జి కొంగ రావడం కనిపించింది. ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ. అక్కడే కొలను దగ్గర చిట్టి బాతు తల్లి కూడా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంది. దాన్ని చూడగానే ‘చూడు.. నీ బిడ్డ మాటమాత్రమైనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకెళ్లిపోయిందో? తప్పు కదా! నేనెంత కంగారుపడ్డాను?’ అంది కాస్త కోపంగా.. బుజ్జి కొంగ తల్లి. ఆ మాటకు చిట్టి బాతు తల్లి చిన్నబుచ్చుకుంది. గబగబా పిల్లలకు ఎదురెళ్లి ‘బుజ్జి కొంగ వాళ్లమ్మకు చెప్పకుండా బుజ్జిని నీతో తీసుకెళ్లడం తప్పు కదూ? తనెంత గాభరా పడిందని.. బిడ్డ కనిపించక?’ అంటూ చిట్టి బాతును చీవాట్లేసింది వాళ్లమ్మ. ఆ మాటకు తెల్లబోయింది చిట్టి బాతు. ‘అదేంటీ వాళ్లమ్మకు చెప్పే వచ్చానందే నాతో! అమ్మమ్మ గారి దగ్గరికి నా కూడా వస్తానంటే మీ అమ్మకు చెప్పందే రావద్దు.. వెళ్లి చెప్పిరా అంటే నా ముందే చెట్టెక్కింది వాళ్లమ్మను అడగడానికి’ అని వాళ్లమ్మకు చెబుతూ వెంటనే బుజ్జి కొంగ వైపు తిరిగి ‘వెళ్లావ్ కదా.. అమ్మను అడగడానికి?’ అంది చిట్టి బాతు. తల దించుకుంది బుజ్జి కొంగ అబద్ధం చెప్పినందుకు. అప్పటికే అక్కడకు వచ్చిన బుజ్జి కొంగ తల్లి.. ఆ మాటలన్నీ విన్నది. ‘అలా అబద్ధం ఎందుకు చెప్పావ్?’ అంటూ కోప్పడింది. తన తప్పు గ్రహించిన బుజ్జి కొంగ.. అమ్మను చుట్టేసుకుని ‘నీకు చెప్పే వెళదామని మన గూటి దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి.. అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి చిట్టి బాతుతో వెళ్లిపోయాను. తప్పయిపోయింది అమ్మా.. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను’ అంటూ ఏడ్చేసింది. ‘చూడు.. నీ అబద్ధం వల్ల నేను కంగారుపడ్డమే కాదు.. చిట్టి బాతునూ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో! ఇక నుంచి అనుమతి కోసమే కాదు.. ఏం జరిగినా నిజమే చెప్పాలి.. సరేనా!’ అంటూ బిడ్డను సముదాయించింది బుజ్జి కొంగ తల్లి. ‘బిడ్డ కనపడకపోయేసరికి గాభరా పడ్డాను. ఆ గాభరాతోనే నిన్నూ రెండు మాటలన్నాను. తప్పు పట్టుకోకు’ అంటూ చిట్టి బాతునూ దగ్గరకు తీసుకుంది బుజ్జి కొంగ తల్లి. ‘హమ్మయ్య.. ఏమైతేనేం పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు’ అనుకుంటూ వాళ్ల పిల్లలను తీసుకుని ఆ తల్లులు వాళ్ల వాళ్ల నివాసాలకు వెళ్లిపోయాయి. -
మైరావణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో
లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు. ‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు. ∙సాంఖ్యాయన (చదవండి: విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం ) -
అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం!
పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది. ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు. సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు. ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను. అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు. వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..) -
పిల్లల కథ: ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?
వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్ కావ్ అంటూ ఎగిరిపోయింది. ‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది. వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్ ఉష్ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి. పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత. అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది. -
Telugu Children Books: మణిరత్నాలు ఈ పుస్తకాలు
ఆడుతూ పాడుతూ కాలం గడిపే పిల్లలను అందమైన ఊహా లోకంలోనికి తీసుకెళ్ళేవి కథలు. కథలు వినడమన్నా, చదవడమన్నా పిల్లలకు చాలా ఇష్టం. భావి భారతాన్ని అందంగా ఆవిష్కరించేది బాల సాహిత్యం. నేటి పిల్లలలో నైతికత, సామాజిక భావం, మానవత్వం, సహృదయత, ఆధ్యా త్మికత, క్రమశిక్షణ వంటి సుగుణ లక్షణాలు అలవడాలంటే, వారి కల్మషం లేని మనసులను సాహిత్యం వైపునకు మరల్చాలి. అందుకు సరైన వేదిక బాల సాహిత్యం. పాఠ్యపుస్తకాలు పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తే, కథల పుస్తకాలు వారిలో ఉన్న సృజనాత్మక అంశాలను, జీవన నైపుణ్యాలను అందిస్తాయి. సాహిత్యం ద్వారానే బాలలలో సంపూర్ణ వికాసం కలుగుతుందని వారికోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో సదా ముందుంటారు మణికొండ వేద కుమార్. వీరు ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి’ ఛైర్మన్‌గా ఉంటూ, దాదాపు మూడు దశాబ్దాలుగా బాల వికాసం కోసం పనిచేస్తున్నారు. ‘బాల చెలిమి’ పత్రిక, ‘బాల చెలిమి’ గ్రంథాలయాలు, నెల నెలా ‘బాల చెలిమి ముచ్చట్లు’ నిర్వహిస్తూ బాల సాహి త్యానికి ఎనలేని సేవ చేస్తున్నారు. తమ అకాడమీ ద్వారా పిల్లలు రాసిన అనేక పుస్తకాలను ముద్రించి, వారి రచనలు వెలుగులోకి తెస్తున్నారు. వేదకుమార్ సంకల్పానికి, బాల సాహితీ వేత్తలు గరిపెళ్లి అశోక్, పత్తిపాక మోహన్ తోడయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడి పిల్లలు రాసిన కథలను సేకరించారు. గరిపెళ్లి అశోక్ రాష్ట్ర కన్వీనర్‌గా ఉంటూ, వివిధ జిల్లాల్లోని కన్వీనర్లను సమన్వయపరుస్తూ, ఉపాధ్యాయుల ద్వారా పిల్లలు రాసిన కథలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 కథలు రాగా, కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు పలుమార్లు కథలను పరిశీలించి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారీగా ప్రచురణ కొరకు కథలను ఎంపిక చేశారు. ( క్లిక్ చేయండి: Writers Meet 2022.. కొత్త రచయితల గట్టి వాగ్దానం) 2020 జనవరి 29న హైదరాబాద్‌లో పది జిల్లాల బడిపిల్లల కథలను బాలల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అలాగే పిల్లల కోసం తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల బాల సాహిత్య రచయితలు రాసిన ‘పెద్దలు రాసిన పిల్లల కథలు’ ఉమ్మడి పది జిల్లాల పేరుతో పది సంకలనాలను అందమైన బొమ్మలతో వెలువరించడమనేది బాల సాహిత్యంలో చరిత్రాత్మక ఘట్టం. ఈ బాల సాహిత్య యాగం తెలంగాణకే పరిమితం కాకూడదని ఆంధ్రప్రదేశ్‌లోని బడి పిల్లల నుండీ కథల సేకరణ ప్రారంభించడం ముదావహం. (క్లిక్ చేయండి: GN Saibaba Poems.. ఒంటరి గానాలాపన) – దుర్గమ్ భైతి ఉపాధ్యాయులు, సిద్దిపేట -
పిల్లల కథ: ఎగిరే కొండలు
సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. ‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. ‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. ‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?) -
పిల్లల కథ: ఎవరికి విలువ?
ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ‘ఏం చెప్పుమామా! దిగాలుగా ఉన్నావు’ అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు ‘ఏంలేదు అల్లుడు! రోజంతా నన్ను తొక్కి తొక్కి.. నా నారతీసి చివరికి ఇలా మూలనపడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక, వాళ్లు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురుగు వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదు. అవసరం తీరిపోగానే, కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పడేస్తారు’ అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. ‘నా బాధ ఎవరోతో చెప్పుకోను మామా! నన్ను ఎండలో మాడ్చేసి, వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మన ఉపయోగం. తర్వాత మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు’ అంటూ వాపోయింది టోపీ. వీళ్ల సంభాషణ మధ్యలోకి బట్టలు వచ్చాయి.. ‘మీ పని పరవాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము, ధూళి, చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు’ అంటూ భోరున కన్నీరు కార్చాయి. చెప్పు, టోపీ, బట్టల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది. ‘మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి.. నన్ను ఈ మనుషులు ఆడంబరం కోసం మీ అందరి కన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని, తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని, తర్వాత బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారుచేశారని మనం గుర్తుంచుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి, మీ విలువను మీరు తగ్గించుకుని బాధపడకండి’ అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందంగా సేదతీరాయి. అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిని బాధపెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పిల్లల కథ: ఎలుగుబంటి పిసినారితనం
చింతలవనంలో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురముండేది. కూతురుని ఆమడ దూరంలో ఉన్న నేరేడుకోనలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లూ, పుట్టలూ వెదికి తేనెని సేకరించేది. దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలిసిందే. అయితే ఆడ ఎలుగు పరమ లోభి. పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త, పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు. ఒకరోజు ఆడ ఎలుగు ‘నేరేడుకోనకీ పోయి కూతురిని చూసివద్దాం’ అని అడిగింది. ‘నాకు పనుంది. పిల్లాడిని తీసుకుని నువ్వెళ్లు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను. పట్టుకెళ్ళు’ అంది మగ ఎలుగు. ‘ఎందుకూ దండగా?ఎలాగూ అల్లుడు తెస్తాడుగా ’ అంటూ తిరస్కరించింది ఆడఎలుగు. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి ఐదు కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకుని ప్రయాణమైంది ఆడఎలుగు కొడుకు బంటితో. కొంతదూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది. ‘అమ్మా! దాహమేస్తోంది. మంచినీళ్ళు కావాలి’ అన్నాడు. ఆడ ఎలుగు నీళ్ళతిత్తిని వెదకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచి పోయింది. దెయ్యాలగుట్ట దాటితేగాని, నీటికుంట దొరకదు. ఇప్పుడెలా? అనుకుని ‘కాస్త ఓర్చుకో నాయనా! మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తలూపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. ‘వచ్చేశాం! మరొక్క మలుపు’ అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేక పోయాడు. సమీపంలో మరే నీటి తావూ లేదు. ‘పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా!’ దీనంగా అడిగాడు. వాడలా అడగడంతో వాడి దాహం.. కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినపుడే నీరు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ‘ఇంకాసేపట్లో గమ్యం చేరతాం. అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే వీపు బద్దలవుతుంది’ అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేక పోయింది. నాలుగడుగులు వేశాక ‘దబ్బు’ మని కూలి,కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆసరికి బిడ్డది నటన కాదు. నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి. వెంటనే సంచీలోంచి నాలుగు కొబ్బరి కాయలు తీసి వెంట వెంటనే కొట్టి, నీళ్ళు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బంటిగాడి నేల కూలాడు. బిడ్డను చూస్తూ ‘సకాలంలో కొబ్బరినీళ్ళు పట్టించుంటే, నువ్వు దక్కి ఉండేవాడివిరా! నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను’ అంటూ భోరున ఏడ్వసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు, జంతువులూ వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండి పోయాయి. అంతలో చింతలవనానికే చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది హస్తవాసిగల వైద్యుడిగా పేరు గాంచింది. ఆడ ఎలుగుని గుర్తు పట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడి నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది. కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని, చావలేదని గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుతో ‘ఏడ్వకు. నీ బిడ్డను బతికిస్తాను’ అంది. దాంతో కోతి కాళ్ళు పట్టుకుంది ఆడ ఎలుగు.. ‘నా దగ్గరున్న సమస్త తేనెని నీకు ధార పోస్తాను. నా బిడ్డని దక్కించు’ అంటూ. తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి కొన్ని ఆకులు తీసి, నలిపి, బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి. తక్షణమే బంటిగాడు ‘హాఛ్’ అంటూ మూడుసార్లు తుమ్మి, పైకి లేచాడు. సంచీలోని చివరి కాయని కొట్టి, తాగించమని ఆడ ఎలుగుకు సూచించింది కోతి. ఆడఎలుగు కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి ‘మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని ‘పొదుపు’ అంటారు. కడుపు మాడ్చుకుని కూడబెడితే అది‘పిసినారితనం’ అవుతుంది. నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు. ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డపేరు మూటగట్టుకున్నావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు. ‘నా ’ అనే వాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం’ అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది. ‘ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను’ అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పరాయి వస్తువులపై మోజు.. ఇన్ని ఇబ్బందులా!
వజ్రపురం అనే గ్రామంలో నివసించే రాజయ్య, రత్నమ్మ దంపతులకు లేకలేక పాప పుట్టింది. ఆ పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచసాగారు. అపురూప మూడో యేట అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు నాడు అపురూపకి పట్టులంగా, పట్టు జాకెట్టు కుట్టించారు. అలాగే పాపాయి బుల్లి బుల్లి చేతులకు బంగారు గాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రపులోలకులు, వజ్రాలహారం వేశారు. ఆరుబయట పందిరిలో సింహాసనంపై అపురూపను కూర్చోబెట్టి అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒక తల్లికోతి, పిల్లకోతి ఆ వేడుకకు దగ్గరలో ఉండే చెట్టు మీదకు చేరి ఆ వేడుకనంతా చూశాయి. పిల్లకోతికి అపురూప వేసుకున్న పట్టులంగా, పట్టు జాకెట్టు, గాజులు, అరవంకీలు, వజ్రాల హారం ఎంతగానో నచ్చాయి. తనకు అవన్నీ తెచ్చిపెట్టమంటూ తల్లికోతితో పేచీ పెట్టుకుంది. ‘వద్దమ్మా, పరులసొమ్ము పాము వంటిది’ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆఖరుకు పిల్లకోతి బాధ చూడలేక ‘సరేనని’ ఒప్పుకుంది తల్లికోతి. వేడుకంతా పూర్తయి అంతా సర్దుకునేసరికి చీకటి పడింది. అపురూప వేసుకున్న పట్టు జాకెట్టు, పట్టు లంగా ఒక సంచిలో పెట్టారు. బంగారుగాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రాలహారాన్ని ఒక పెట్టెలో పెట్టి.. అదే సంచిలో సర్దారు. ఆ సంచిని బీరువాలో పెడదామనుకుని అలసిపోయి ఉండటంతో ఆదమరచి నిద్రపోయారంతా. ఇదే అదనుగా భావించి తల్లి కోతి ఆ సంచిని దొంగిలించి చెట్టు పైకి తీసుకెళ్ళింది. తను అడిగినవన్నీ సంచిలో ఉండటంతో పిల్లకోతి సంతోషానికి హద్దే లేకుండాపోయింది. అప్పటికప్పుడు వాటన్నింటిని తనకు వేయమని గొడవపెట్టింది. ఆ పిల్లకోతికి లంగా, జాకెట్టు వేసింది తల్లి కోతి. చేతులకు గాజులు, అరవంకీలు తొడిగింది. మెడలో వజ్రాల హారాన్నీ వేసింది. వాటిని చూసుకుని పిల్లకోతి ఎంతగానో మురిసిపోయింది. తెల్లవారుతుండగా మెల్లగా చెట్టు దిగి.. వయ్యారంగా ఊరిలోకి నడవసాగింది. రాజయ్య,రత్నమ్మలు ఉదయాన్నే లేచి చూసే సరికి తమ అమ్మాయి నగలు, పట్టు బట్టలు ఉన్న సంచి కనిపించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. వాళ్ళకు పట్టులంగా, జాకెట్టు, నగలతో పిల్లకోతి ఎదురైంది. వెంటనే కోతులు పట్టుకునే అతన్ని పిలిపించి పిల్లకోతిని పట్టించారు. దాని ఒంటి మీది బట్టలు, నగలు తీసుకుని, అతనికి మంచి బహుమతినిచ్చి పంపించారు ఆ దంపతులు. ఈ లోపు తన పిల్ల కనిపించక ఆదుర్దాగా వెతకటం ప్రారంభించింది తల్లికోతి. ఎట్టకేలకు కోతులు పట్టే అతని చేతిలో ఒంటి మీద బట్టలు, నగలు ఏమీ లేకుండా కనిపించింది. అప్పటికే పిల్లకోతి తల్లి పై బెంగ పెట్టుకుంది. తల్లి కోతిని చూసే సరికి ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది. కోతులు పట్టే అతనికి కనిపించకుండా ‘కంగారుపడకు, నిన్ను కాపాడుకుంటాను’ అంటూ పిల్లకోతికి సైగచేసింది తల్లికోతి. కోతులు పట్టే అతను ఆ పిల్లకోతిని తీసుకెళ్ళి సర్కస్ కంపెనీ వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు పిల్లకోతిని నానా హింసలు పెట్టి అది సర్కస్‌లో నాట్యం చేసేలా, గంతులేసాలా దానికి శిక్షణ ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పిల్లకోతి నరకయాతన పడింది. తన తల్లి చెబుతున్నా వినకుండా పరాయి వస్తువుల కోసం ఆశపడటంతో ఇన్ని ఇబ్బందులు, బాధలు పడవలసి వచ్చిందని తెలుసుకుంది. (క్లిక్: ప్రతిభకు పట్టం.. అందుకే ఇలా మారువేషంలో..) ఒక రోజు సర్కస్ ముగించుకుని అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లి కోతి.. పిల్లకోతి దగ్గరకు వెళ్ళి దానికి కట్టిన తాడుని అతి కష్టం మీద నోటితో కొరికి తెంపింది. గుట్టుచప్పడు కాకుండా తన పిల్లతో బయట పడింది. తల్లిని పట్టుకుని పిల్లకోతి వెక్కివెక్కి ఏడుస్తూ ‘అమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. పరులసొమ్ము ఇంకెప్పుడూ ఆశించను’ అంటూ తల్లిఒడిలో తలదాచుకుంది. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
పిల్లల కథ: ప్రతిభకు పట్టం
దేవరకొండ రాజ్యానికి రాజు శివవర్మ. తన తెలివితేటలతో, శక్తితో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల సుఖశాంతుల కోసం పాలనలో ఎన్నో సంస్కరణలు చేశాడు. తను వృద్ధుడు అవుతున్నాడు. తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు అనే ఆలోచన ఆయన్ని ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. రాజు కొడుకుని రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయటం అనే సంప్రదాయానికి శివవర్మ పూర్తిగా వ్యతిరేకం. సమర్థుడు, తెలివైనవాడు, ప్రజల మనసు తెలిసినవాడు దేవరకొండ రాజ్యానికి రాజు కావాలనేది శివవర్మ కోరిక. తన తర్వాత రాజ్యానికి రాజును ఎంపిక చేసేందుకు తను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నానని, ఆ పరీక్షలో తన ఇద్దరు కుమారులతో పాటు రాజ్యంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాడు శివవర్మ. ఆ పరీక్షకు రాజు పెద్దకొడుకుతో పాటు అనేక మంది హాజరయ్యారు. రాజు చిన్నకొడుకు హాజరుకాలేదు. అత్యంత క్లిష్టమైన రాత పరీక్ష, శరీర సామర్థ్య పరీక్షలలో రాజు పెద్దకొడుకు విఫలమయ్యాడు. పరీక్షలలో విజయం సాధించింది కేవలం ముగ్గురు. వారు అనంతుడు, వీరాచారి, కేశవుడు. ఆ ముగ్గురిని శివవర్మ తన మందిరానికి పిలిపించాడు. ‘నా తర్వాత రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చి, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైన మీ ముగ్గురికీ ముందుగా నా శుభాకాంక్షలు. చివరిగా నేను పెట్టబోయే పరీక్ష చాలా చిన్నది. కేవలం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే నాకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ’ అంటూ ముగ్గురికీ స్వాగతం పలికాడు శివవర్మ. ‘ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకి గొప్పవాడు ఎవరు?’ అడిగాడు రాజు. ‘అందరి కంటే గొప్పవాడు దేవుడు.. ప్రభూ’ చెప్పాడు అనంతుడు. ‘మనుషుల్లో గొప్పవారు ఎవరు అనేది నా ప్రశ్న’ తెలియజేశాడు రాజు. ‘ప్రభూ... మీ మాట ఎవరూ కాదనరు. మీ కంటే గొప్పవారు ఇంకెవరుంటారు’ చెప్పాడు వీరాచారి. ‘రాజు కంటే గొప్పవాడు ఎవరు?’ మళ్లీ అడిగాడు రాజు. ‘గొప్పవాడు ఉన్నాడు మహారాజా.. అయితే నేను మీకు అతన్ని నేరుగా చూపిస్తాను’ అన్నాడు కేశవుడు. అనంతుడు, రంగాచారి, కేశవుడు, రాజుగారు మారువేషాల్లో నగరంలోకి ప్రవేశించారు. ఊరి బయట రహదారి పక్కన కొన్ని విత్తులు నాటుతూ, కొన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు ఒక వృద్ధుడు. తర్వాత మరో ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి శుభాశుభ కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పోగుచేసి నిరుపేదలకు పంచుతున్నాడు. ఇంకొక ఊరిలో ఒక వ్యక్తి అనాథ శవాలు, జంతు కళేబరాలకు అంతిమ సంస్కారం చేస్తున్నాడు. ‘ప్రభూ, తను పెంచుతున్న ఆ మొక్కలు వృక్షాలై ఫలాలను ఇచ్చేదాకా ఆ వృద్ధుడు జీవించి ఉండలేడు. అలాగే ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరుపేదలకు పంచే.., అనాథ శవాలు, మృత కళేబరాలకు అంతిమ సంస్కారం చేసే వ్యక్తులు కూడా. ఈ ముగ్గురూ తమ కోసం కాక ఇతరుల కోసం పడే ప్రయాసను చూడండి. ఇతరులకు సేవ చేయడం కోసం జీవించేవాడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ప్రభూ? ’ అన్నాడు కేశవుడు. కేశవుడి సమాధానంతో రాజు శివవర్మ సంతృప్తి చెందాడు. సంతోషంతో కేశవుని ఆలింగనం చేసుకున్నాడు. కేశవుడిని తన తరువాత రాజుగా ప్రకటించాడు. వెంటనే కేశవుడు తననెవరూ గుర్తించలేని విధంగా ఉన్న తన మారువేషాన్ని తొలగించి అసలు రూపంతో కనిపించాడు. అతన్ని చూసిన రాజు, అనంతుడు, వీరాచారి ఆశ్చర్యపోయారు. అతను రాజు రెండవ కొడుకు కేశవవర్మ. ‘నువ్వు పోటీలో మారువేషంలో పాల్గొనడానికి కారణం ఏమిటి?’ అని కొడుకును ప్రశ్నించాడు శివశర్మ. (పిల్లల కథ: ఆనందమాత) ‘ప్రభూ.. రాజుగారి కొడుకు హోదాలో ఈ పోటీలో పాల్గొనటం నాకు ఇష్టంలేదు. రాజుగారి కొడుకుగా పోటీలో పాల్గొంటే నాతో పాటు పాల్గొనే సాధారణ పౌరులు నన్ను చూసి భయపడటం లేదా వెనకడుగు వేయటం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా మారువేషంలో పాల్గొన్నాను. క్షమించండి ప్రభూ’ చెప్పాడు కేశవవర్మ. ‘కుమారా.. నీ ఆలోచనా విధానం బాగుంది. నువ్వు ప్రజల మన్ననలను పొందే పాలకుడివి కాగలవు’ అంటూ కొడుకును ఆశీర్వదించాడు రాజు శివవర్మ. వీరాచారి, అనంతులకు తన ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
పిల్లల కథ: ఆనందమాత
శంకర్ మంచి బొమ్మలు చేసే కళాకారుడు. ఎన్ని బొమ్మలు చేసినా అతని ఆదాయం అంతంత మాత్రమే! అతను చెక్కతో, మట్టితో, లోహంతో బొమ్మలు చేయగలడు. ఒకరోజు ఇంటి ఖర్చుల కోసం డబ్బు అప్పు అడగటానికి తన స్నేహితుడు మహీపతి దగ్గరకు వెళ్లాడు. ‘ఎందుకు అలా డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నావు? నీ చేతిలో కళ ఉంది. తెలివిగా ఉపయోగిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది కదా’ అన్నాడు మహీపతి. ‘కళ అయితే ఉంది అయినా దానిని ఆదరించే వారెవరు? నా బొమ్మలు ఎవరూ కొనడంలేదు’ దిగులుగా చెప్పాడు శంకర్. ‘ప్రస్తుతానికి నీ అవసరానికి డబ్బు ఇస్తానులే. అయితే ఓ రోజు మాపిల్య చెట్టు కొమ్మతో నువ్వు ఓ బొమ్మను తయారు చేయడం చూశాను. మాపిల్య చెట్టు కొంత అరుదైన చెట్టే. శ్రద్ధ తీసుకుని పెంచితే మన భూముల్లోనూ చక్కగా పెరుగుతుంది. నీ బాగు కోరే వాడిగా నేను నా ఎకరం పొలంలో మాపిల్య చెట్లు పెడతాను. అవి రెండేళ్ళలోనే పూర్తిగా పెరుగుతాయి. ఈలోపల అడవిలో దొరికే మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు తయారు చెయ్యి. ఎలాంటి బొమ్మలు చేయాలో, ఆ బొమ్మల్ని ఎలా అమ్ముకోవాలో నేను చెబుతాను’ అని సలహా ఇచ్చాడు మహీపతి. ‘ఏమిటో మహీపతి నువ్వు చెప్పేదంతా నాకు విచిత్రంగా కనబడుతోంది. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను’ చిరునవ్వుతో చెప్పాడు శంకర్. రెండురోజుల తరువాత మహీపతి.. మాపిల్య చెట్టు కొమ్మతో తన సృజనాత్మకతను ఉపయోగించి ఓ కొత్త దేవత బొమ్మను తయారు చేయమని శంకర్‌కు చెప్పాడు. మహీపతి చెప్పినట్టుగానే తన సృజనను ఉపయోగించి చక్కని కొత్త దేవత ప్రతిమను చెక్కాడు. చూసి అబ్బురపడ్డాడు మహీపతి. ఆ బొమ్మకు ‘ఆనంద మాత’ అని పేరు పెట్టాడు. శంకర్ ఆశ్చర్య పోయి ‘ఈ బొమ్మను ఏంచేస్తావు?’ అని అడిగాడు. ‘అచ్చం ఇటువంటివే పది బొమ్మలు మాపిల్య చెట్టు కొమ్మతో తయారు చేయి. ఏం చేయాలో చెబుతా’ అన్నాడు. మహీపతి చెప్పినట్టే అటువంటి పది బొమ్మలను తయారు చేశాడు శంకర్. ఆ బొమ్మలను మహీపతి తీసుకెళ్ళి తన అంగట్లో, తనకు తెలిసిన వాళ్ళ అంగళ్ళలో పెట్టి ‘ఈ దేవత ఆనంద దేవత.. ఈ బొమ్మ ఎవరు పెట్టుకుంటే వారికి అన్నీ కలసి వస్తాయి’ అని చెప్పసాగాడు. అంతే ఆ విషయం ఊరంతా పాకింది. ప్రతి వ్యాపారస్తుడు, కొందరు గృహస్తులు ఆ బొమ్మలను కొనాలని ఎక్కడ దొరుకుతాయో అడగసాగారు. ఆవిధంగా శంకర్‌కు చేతినిండా పని, తద్వారా డబ్బూ లభించసాగాయి. కేవలం శంకర్ బాగుపడటమే కాక, చాలామంది రైతులూ లాభపడ్డం మొదలెట్టారు.. పొలం గట్ల మీద మాపిల్య చెట్లు పెంచి వాటి కొమ్మలను అమ్ముతూ. మహీపతి తెలివైన ఆలోచన స్నేహితుడు శంకర్‌ను బాగుపరచడమే కాకుండా రైతులకూ మేలు చేసింది! మరి కొంతమంది మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు చేయడం నేర్చుకోడానికి శంకర్ వద్ద శిష్యులుగా చేరారు. నిజానికి ఆ బొమ్మతో ఏ మేలు జరగక పోయినా ఆ బొమ్మ పెట్టుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం పెరిగి సమర్థవంతంగా వారి వ్యాపారాలు, పనులు నిర్వహించుకోసాగారు. (క్లిక్: మాష్టారి పాఠం.. పదును పెట్టకపోతే వృథా పోవలసిందే) -
పిల్లల కథ: మాష్టారి పాఠం
రామసాగరమనే ఊరిలో పిల్లలు చాలా ఆకతాయిలు. ఆ ఊరు సముద్రపు ఒడ్డున ఉండడం వలన అక్కడ ఎక్కువ జాలరుల కుటుంబాలే నివసించేవి. అక్కడి పిల్లలకు ఆ సముద్రమే ప్రపంచం. రోజంతా ఆ సాగర తీరంలో ఆటలాడుతూ, ఈతలు కొడుతూ గడిపేసేవారు. ఆ పిల్లల తల్లితండ్రులకేమో ఆ పిల్లలకు బాగా చదువు చెప్పించి గొప్పవాళ్లను చేయాలని ఉండేది. పిల్లలు తెలివిగల వారే గాని చదువు మీద శ్రద్ధ చూపేవారు కాదు. దాంతో బడికి పంపినా పెద్దగా ఉపయోగం లేకపోయేది. ఆ ఊరి పాఠశాలకు గణపతి మాష్టారు కొత్తగా వచ్చారు. ఎప్పటిలాగే పిల్లలు బడికి వచ్చి కాసేపు ఉండి ఆటలకు వెళ్లిపోయారు. ఒక వారం పాటు గణపతి మాష్టారు అక్కడి పిల్లలను గమనించారు. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించి దారిలోకి తీసుకురావాలని ఆయనకు అర్థమయింది. బడిలో పిల్లలందరినీ చేరదీసి ఆటల రూపంలోనే ఆ రోజు పాఠం చెప్పేవారు. ఆటల మీద మక్కువతో పిల్లలు నెమ్మదిగా బడిలో ఉండటం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ల తరువాత తరగతిగదిలో కూర్చోబెట్టి కథల రూపంలో పాఠాలు చెప్పేవారు. మాష్టారి కథలకు పిల్లలు చెవులప్పగించేవారు. నెల తిరిగేసరికి పిల్లలంతా ఉదయం నుండి సాయంకాలం వరకు బడిలో గడపడానికి అలవాటుపడ్డారు. ఒక రోజు మాష్టారు పాఠం చెప్తుండగా ఒక గడుగ్గాయి నిలబడి ‘మాష్టారూ! మొన్న మీరు చెప్పిన పాఠంలో.. ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బిపోయి అనారోగ్యం పాలవుతామని చెప్పారు కదా! మరి ఇంత ఎక్కువ చదువుతూ ఉంటే మెదడు కూడా ఉబ్బిపోయే ప్రమాదం ఉండదా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాష్టారు కూడా నవ్వుతూ ‘అవునవును.. సరైన ప్రశ్నే అడిగావు. మన కడుపుకి తగినంత తింటాం అలాగే మెదడులో స్థలం ఉన్నంతే నేర్చుకోవాలి. మనకి పొట్టలో ఎంత ఖాళీ ఉందో తెలుస్తుంది కనుక పట్టినంత తింటాం. మరి మెదడులో ఖాళీ ఎంతుందో తెలిస్తేనే కదా అంత చదువు చదువుకోగలం! తెలుసుకుందామా మరి!’ అని అడిగారు. పిల్లలంతా ‘తెలుసుకుందాం’ అన్నారు ముక్తకంఠంతో. ‘రేపటి నుండి రోజూ బడి తరువాత మీకు ఇష్టమైన సముద్రం వద్దకు వెళ్ళి సముద్రం నిండే వరకు నీళ్లు తీసుకెళ్లి పోయండి. ఎన్ని నీళ్లు పోస్తే అది నిండిందో నాకు చెప్పండి’ అన్నారు మాష్టారు. మరుసటి రోజు నుండి పిల్లలందరూ ఒకొక్కరు ఒకొక్క బిందెతో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోయసాగారు. వాళ్ళు పోసిన నీళ్లతో సముద్రం కొంచెం కూడా నిండినట్టు కనపడలేదు. ఒక రోజులో నిండటం సాధ్యం కాదులే అనుకుని ఒక వారం దాటాక చూద్దాం అనుకున్నారు. వారం దాటినా అదే పరిస్థితి కనిపించింది. వారు పొసే నీరు తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని గ్రహించి అందరి ఇళ్లల్లోని కుళాయిల నుండి నేరుగా గొట్టాల ద్వారా నీరు సముద్రంలోనికి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం నుండి మర్నాటి ఉదయం తాము నిద్ర లేచేసరికల్లా సముద్రం నిండిపోతుందని ఊహించి ఆ రాత్రి పడుకున్నారు. మర్నాడు ఉదయమే లేచి సాగరతీరానికి చేరుకున్నారు. ఎప్పటిలాగే ఉన్న సముద్రాన్ని చూసేసరికి తమది వృథా ప్రయత్నమని వారికి అర్థమయ్యింది. పిల్లలంతా కలిసి మాష్టారు వద్దకు వెళ్లి సముద్రాన్ని నింపడం తమ వల్ల కావడంలేదని చెప్పారు. ‘సముద్రంలాగే మానవ మేధ కూడా అనంతమైనది. మీరు ఎంత నేర్చుకున్నా గ్రహించుకోగల శక్తి మీ మెదడుకి ఉంటుంది. అలాగే విద్య కూడా అనంతమైనది. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసినది ఎంతో ఉంటుంది. సముద్రంలోని ఉప్పునీరు తాగటానికి పనికిరాదు. అలాగే విద్య లేని మేధస్సు కూడా వృథాయే! ఎంత గొప్పవారైనా నిరంతర విద్యార్థిగా ఉంటూ మేధకు పదును పెట్టకపోతే ఉప్పునీటిలా వృథా పోవలసిందే’ అని చెప్పారు మాష్టారు. ‘ఇక పై బాగా చదువుకుందాం’ అని పిల్లలు వారిలో వారు గుసగుసలాడుకోవడం విని సంతోషపడ్డారు మాష్టారు. (క్లిక్: తన వంతు సాయం.. గుప్తదానమే మహాదానం) -
పిల్లల కథ: తన వంతు సాయం
గుర్ల అనే గ్రామంలో నివసించే శశిధరుడికి బాగా డబ్బుంది. పండే పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఐతే ఎవరైనా అవసరం పడి చేయి చాస్తే మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చేవాడు కాదు. ఈ ప్రవర్తన భార్య సుగుణకి నచ్చేది కాదు. ‘మీ మిత్రుడు చరితాత్ముడిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన గుణం ఎంత మంచిది! ఎందరికో ఉత్తి పుణ్యాన దానాలు చేస్తూంటాడు. తను చేసిన దానాలను కూడా ఎవరికీ చాటద్దంటాడు. తన వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ దానాలకే ఖర్చు పెడతారు. గుప్త దానమే గొప్పదంటాడు’ అని భార్య చెప్పాక శశిధరుడిలో ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చింది. వెంటనే చరితాత్ముడిని కలవడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో పొరుగూరి రైతులు తమకు పంట నష్టం వచ్చిందని చెప్పి ఆదుకోమంటున్నారు చరితాత్ముడిని. ‘నేను మిమ్మల్ని ఆదుకున్న సంగతి బైటకు పొక్కనీయవద్దు. ఆ షరతు మీదే మీకు సాయపడగలను’ అని చెప్పాడు చరితాత్ముడు రైతులతో. దానికి వాళ్లు అంగీకరించి చరితాత్ముడి దగ్గర ధన సహాయం తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు శశిధరుడి రాకను గమనించి ‘మిత్రమా! చాలాకాలం తరువాత ఇలా దర్శనమిచ్చావేంటి?’ అంటూ మిత్రుడిని ఆహ్వానించాడు చరితాత్ముడు. ‘నేనొక విషయం విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. ఎన్ని దానాలు చేసినప్పటికీ పైకి చెప్పవద్దని అంటావెందుకో? నీకు పేరు రావాలని ఉండదా? ’ సందేహం వెలిబుచ్చాడు శశిధరుడు. ‘నా దృష్టిలో గుప్తదానమే మహాదానం. అది అవతలి వారిని అవసరంలో ఆదుకోవడానికే తప్ప మన గొప్ప చెప్పుకోడానికి కాదని నా ఉద్దేశం’ నిరాడంబరంగా చెప్పాడు చరితాత్ముడు. ‘నీ గుణం గొప్పదే కావచ్చు కాని ఇన్ని దానాలు చేస్తున్నప్పటికీ ఎవరికీ ఆ విలువ తెలియకపోవడం చూసి చింతిస్తున్నాను. అందువలన నువ్వు నాకొక సాయం చేయాలి’ అడిగాడు శశిధరుడు. ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు చరితాత్ముడు. ‘ నువ్వు చేస్తున్న దానాలకు నీ పేరెలాగూ వద్దంటున్నావు. నీకు అభ్యంతరం లేకుంటే.. ఇకనుండీ నువ్వు ఏ దానం చేసినా అది నాదిగా చెప్పుకుంటాను. వాళ్లంతా నేనే దానం చేస్తున్నట్లుగా చెప్పుకుని నన్ను కీర్తిస్తారు. నా గురించి అందరూ గొప్పగా అనుకోవడం నాకు ఎంతో ఇష్టం’ అంటూ తన మనసులో కోరికను బైటపెట్టాడు శశిధరుడు. దానికి చరితాత్ముడు ‘నాకు కీర్తి కాంక్ష లేనప్పుడు అది నీకు దక్కితే నాకేమీ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేస్తున్నది నువ్వేగాని నేనన్నది బైటపడకూడదు. దానికి కూడా నువ్వు ఒప్పుకోవాలి’ అని స్పష్టం చేశాడు. అంగీకరించాడు శశిధరుడు. ఆరోజు మొదలు చరితాత్ముడు తన దగ్గరకొచ్చిన వారికి ఏ దానమిచ్చినా సరే అది శశిధరుడిదనే చెప్పేవాడు. అలాగే వాళ్ళు కూడా బైట చెప్పడం మొదలెట్టారు. ఈ విషయం ఊరూవాడా పాకింది. ఇంతకాలం ఏనాడూ ఎవరికీ దానాలు చేయడం చూడని శశిధరుడిలో మార్పు రావడం వింత విషయంగా తోచింది అందరికీ. ఇలా ఉండగా కొంతకాలానికి చరితాత్ముడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ పరిస్థితిలో దానం కోసం ఎవరైనా వచ్చినప్పటికీ అడగడానికి సంకోచించేవారు. ఐతే చరితాత్ముడి భార్య సుమతి ‘మావారి పరిస్థితి బాగులేదన్నది మీకు తెలుసు. శశిధరుడు దానాలు చేస్తున్న సంగతి మా వారు ఇటీవల చెప్పడం నాకు తెలుసు. అందువలన ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళండి. తప్పకుండా సహాయపడతాడు’ అని పంపించడం మొదలెట్టింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్లంతా తిన్నగా శశిధరుడి దగ్గరకు పోయి ‘ఇంతదాకా మీరు చేస్తున్న దానాల గురించి వింటూనే ఉన్నాం. మీరు తప్పకుండా సాయం చేయాలి’ అంటూ చేయిచాచసాగారు. గతుక్కుమన్నాడు శశిధరుడు. ఇంతవరకూ తను చేసిన దానధర్మాలు చరితాత్ముడివేనని చెప్పలేక, తను సహాయపడతానని మాటివ్వలేక గిలగిలలాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఊళ్ళోకి వరదలొచ్చి కొందరి ఇళ్ళు కొట్టుకుపోయాయి. అప్పుడు కొందరు ఊరిపెద్దలు శశిధరుడి దగ్గరకొచ్చి ‘ఇళ్ళు కోల్పోయిన కొందరికి ఇళ్లను కట్టించడానికి అందరినీ సాయమడుగుతున్నాం. మీరెలాగూ దానకర్ణులుగా పేరుబడ్డారు. మీ వాటా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంతకాలం అయాచితంగా తనకు పేరొచ్చింది. ఇప్పుడు తన ఆస్తిలోంచి తీసివ్వడానికి మనసొప్పటంలేదు శశిధరుడికి. భర్త వాలకం కనిపెట్టిన సుగుణ ‘ఒకరి డబ్బుతో చేసిన దానాలను మీవిగా చెప్పుకుని మురిసిపోయారు. తీరా ఇప్పుడు నిజంగా మీరు చేయాల్సి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం మానవత్వమని పించుకుంటుంది. దయచేసి మీలో మార్పు తెచ్చుకోండి’ అని సున్నితంగా మందలించింది. ఇంతదాకా వచ్చి ఇప్పుడు కుదరదు అంటే అయాచితంగా తనకు వచ్చిన మంచిపేరు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవడమే ధర్మమనిపించింది. మరో ఆలోచనకి తావివ్వకుండా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోడానికి తన వంతు సాయంగా భారీగానే ముట్టచెప్పాడు శశిధరుడు. భర్తలో మార్పు చూసిన భార్య సుగుణ ఎంతగానో సంతోషించింది. (క్లిక్: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!) -
పిల్లల కథ: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!
Moral Stories for Kids: సాయంత్రం కుందేలు ద్వారా కోతిబావను పిలిపించి ‘కోతిగారు మీరు రేపు పండుగ సందర్బంగా కోయగూడెంలో జాతర జరగుతోంది. గుడి వద్ద నిప్పులపై భక్తులు నడచి మొక్కులు తీర్చుకుంటారు. తమరు కొబ్బరి చిప్పలు, అరటి పళ్ళు, వంకర వంకర జిలేబీల కొరకు గుడి పక్కకు వెళ్ళవద్దు. వెళ్ళి అనవసర సమస్యలు తెచ్చుకోవద్దు’ అని జాగ్రత్తలు చెప్పాడు సింహారాజు. వినయంగా చేతులు కట్టుకున్న కోతిబావ ‘చిత్తం మహారాజా అలాగే’ అన్నాడు. తెల్లవారక మునుపే తప్పెట్ల మోతలు జోరుగా వినిపించసాగాయి అడవికి చేరువలో ఉన్న కోయగూడెం నుండి. ‘ఆహా.. గూడెంలోని గుడిలో పండుగ పూజ అంటే తనకూ పండుగే! కొబ్బరి చిప్పలకు, అరటి పళ్ళకు,జిలేబి, మిఠయీలకు కొదవే ఉండదు అనుకుంటూ కోయగుడేనికి బయలుదేరాడు కోతిబావ. వెళ్ళే దారిలో కుక్కలు తరమసాగాయి. ఎక్కడా చెట్టు కనిపించకపోవడంతో, చెరువు గట్టున ఉన్న చాకిరేవు బానలోని నీళ్ళు, బట్టల మధ్య దాగాడు కోతి బావ. ఎత్తుగా ఉన్న చాకిరేవు బానపైకి ఎక్కలేని కుక్కలు అక్కడే తిష్టవేశాయి. ఉతికిన బట్టలు ఆరవేసి వచ్చిన రంగయ్య.. మసక వెలుతురులో బానలో చేయిపెట్టి జత బట్టలు బయటకు తీశాడు. బట్టలతోపాటు కోతిబావ తోకను కూడా కలిపి పట్టుకుని బట్టలు ఉతేకే బండపై రెండు బాదులు బాదాడు. ఆ దెబ్బలకు బాధతో కోతిబావ కిచకిచలాడాడు. రంగయ్య దాని తోక వదలడంతో పంచవర్ణాలూ కదిలాయి కోతిబావ కళ్ల ముందు. కుక్కలకు భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపు అక్కడే ఉన్న కుక్కలు గుడి వైపు వెళ్ళిపోయాయి. గుడి వద్దకు చేరిన కోతిబావ కడుపు నిండుగా ప్రసాదం, అరటిపళ్ళు తిని చెట్టుపై హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం తప్పెట మోతకు మెలకువ వచ్చింది. మొక్కున్న భక్తులు నడవడానికి గుడి ముందు నిప్పుల గుండం సిద్ధమై ఉంది. అదేంటో చూద్దామని .. కొబ్బరి చిప్ప తింటూన్న కోతిబావ చెట్టు దిగి నిప్పుల గుండం చేరువగా ఉన్న ఎత్తన కర్రపైకి వెళ్ళి కూర్చుని చూడసాగాడు. అక్కడ కిందున్న చెక్కబల్ల మీద కిరోసిన్ డబ్బాలో తన తోక మూడు వంతులు మునిగి ఉండటం కోతిబావ గమనించలేదు. చిన్నపిల్ల తింటున్న మిఠాయి కోసం కిందికి దిగిన కోతిబావను కుక్కలు తరమసాగాయి. ఎటు పోదామన్నా జనం గుంపులు గుంపులుగా అడ్డురావడంతో వేరే దారి లేక నిప్పులగుండంపై నుండి పరుగుతీశాడు. కిరోసిన్‌లో తడిసి ఉన్న తోకకు మంట అంటుకుంది. భయంతో పదుగురు మగవాళ్ళ పంచలకు మండుతున్న తన తోక అంటించి చావుబతుకులతో పరుగుతీసి అడవికి చేరువలో ఉన్న చెరువులో దూకి మండుతున్న తనతోకను ఆర్పుకున్నాడు. ఆ తర్వాత ముక్కుతూ,మూలుగుతూ అడవిలోకి నడిచాడు. అది చూసిన కుందేలు.. ‘నీ క్షేమం కోరి సింహరాజుగారు చెప్పిన జాగ్రత్తలను పెడచెవిన పెడ్తివి. ఆపదలకు ఎదురు వెళ్తివి. పెద్దల మాట చద్ది మూట అన్న విషయం తెలుసుకో. పెద్దలు ఎప్పడూ మన క్షేమమే కోరి హితవు చెపుతారు. ఇదిగో నువ్వు ఇలాంటి పనేదో చేసి వస్తావని ఊహించే ఆకు పసరు సిద్ధం చేశాను గాయాలకు రాసుకో’అన్నది కుందేలు. బుద్ధిగా తలఊపి చేతులు జోడించాడు కోతిబావ. -డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది? -
పిల్లల కథ: గర్వభంగం
దండకారణ్యపు లోతట్టు ప్రాంతంలో ఒక మంచినీటి కోనేరు ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లోని జీవులకు అదే నీటి వనరు. రాజైన సింహం కూడా అక్కడే దాహం తీర్చుకునేది. మడుగు సమీపంలోనే ఒక పుట్టలో ముసలి ఆడ తాచు, తన బిడ్డతో జీవిస్తుండేది. యువ పాము దుందుడుకు స్వభావం కలది. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆట పట్టించేది. ఎవరైనా మందలిస్తే కాటు వేస్తానని బెదిరించేది. ఒకసారి మృగరాజు దప్పిక తీర్చుకోవటానికి కోనేటికి వచ్చింది. అయితే చుట్ట చుట్టుకుని దారికి అడ్డంగా పడుకుని గురకలు పెట్టసాగింది యువ పాము. ‘పక్కకి తొలుగు!’ అని సింహం ఆజ్ఞాపించింది. నిద్రమత్తులో ఉన్న ఆ పాముకి వినబడలేదు. ‘రాత్రి తిన్న ఎలుకో, కప్పో అరగలేదనుకుంటా. నిద్రకు ఆటంకం కలిగించటమెందుకు? పోన్లే పాపమ’ని సింహం పెద్ద మనసు చేసుకుని పక్కనుండి పోయి, నీళ్ళు తాగి తిరిగి ఎడంగా వెళ్ళిపోయింది. కాసేపటికి నిద్ర లేచిన యువ పాముని బాట పక్కనున్న చెట్టు మీది తీతువు పిట్ట పలకరించి జరిగిన సంఘటనని చోద్యంగా చెప్పింది. అది విన్న పాము సంతోషంతో పడగ విప్పి, అంతెత్తున ఉప్పొంగింది. రాజైన సింహమే తనను గౌరవించిందనే అహంకారం దాని తలకెక్కింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తీతువు మాటలు దాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళాయి. ‘మీది సామాన్యమైన జాతి కాదు మిత్రమా! పురాణ పురుషుడైన కాళీయుడి వారసులు మీరు. అందుకే మీ తలలపై శ్రీకృష్ణుడి పాద ముద్రలు ఉంటాయి. కాబట్టే మృగరాజు నీ పట్ల సహనం చూపించాడు. మీ సర్పాల్లో ఎన్నో శాఖలున్నా పడగ విప్పగల సామర్థ్యం కేవలం మీ తాచు పాములకే ఉంది’ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆ మాటలకు యువనాగు మరింత పెడసరంగా ప్రవర్తించసాగింది. తల్లి ఎన్నిమార్లు హితబోధ చేసినా దాని వైఖరి మారలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లి పాము ఆందోళన చెందేది. (చదవండి👉 ఎవరు ఎక్కువ ప్రమాదం?) ఒకనాడు దాని ఆగడాలకు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది, ఆ దారిన ఒక ముంగిస రావటం తటస్థించింది. మార్గమధ్యంలో తిష్టవేసిన పాముని చూడగానే దానికి కోపం వచ్చింది. ‘దారిలోంచి తప్పుకో. నేను మంచినీరు తాగటానికి పోవాలి’ అంది అసహనంగా. యువసర్పం ఓసారి కళ్ళు విప్పి ముంగిసని చూసి, నాలుకలు చప్పరించి మళ్ళీ పడుకుంది. ఆ నిర్లక్ష్యానికి ముంగిస కోపం నెత్తికెక్కింది. ‘చెపితే వినపడటం లేదా? మర్యాదగా మార్గంలోంచి లే!’ అంటూ హుంకరించింది. యువపాము దానినసలు పట్టించుకోలేదు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన తీతువు పిట్ట పాము దగ్గరకి వచ్చి, ‘పక్కకి జరుగు. లేకపోతే కొంపలంటుకుంటాయి’ అంది. యువపాము గీరగా చూస్తూ ‘చుంచెలుకకి నేను భయపడాలా? నా సంగతి దానికి తెలీదనుకుంటా. కాస్త మన ఘనతని వర్ణించి చెప్పు’ అంది తీతువుతో. ‘ఏంటీ? నేను ఎలుకనా? అసలు నేనెవరో తెలిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి నీకు’ అంది ముంగిస ఆగ్రహంగా. ‘మరీ అంతగా గప్పాలు కొట్టుకోకు. నువ్వు ఎలుకవే కదా? మామూలు ఎలుకలైతే మూడు తింటాను. నువ్వు కాస్త పెద్దగా ఉన్నావు కాబట్టి నిన్నొక్కదాన్ని తింటే చాలు. మళ్ళీ వారం వరకూ వేట ప్రయాస ఉండదు’ అంటూ ఆవులించి మళ్ళీ పడుకోబోయింది. ముంగిసకి అహం దెబ్బతింది. ఈ పొగరుబోతు పాము పిల్లకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. (చదవండి👉 జానకమ్మ తెలివి) ‘ఇదిగో ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. పక్కకి తప్పుకుని, దారి ఇస్తావా? లేక నా తడాఖా చూపించమంటావా?’ అంది. దాంతో యువనాగుకీ తిక్కరేగింది. సర్రున పైకి లేచి పడగ విప్పి, బుస కొట్టి ‘నాకు భుక్తాయాసంగా ఉండటం వల్ల ఇంతసేపు మాట్లాడనిచ్చాను. ఆకలితో ఉంటే ఈపాటికి నిన్ను గుటుక్కున మింగేసేదాన్ని’ అంటూ బలంగా కాటు వేసింది. ముంగిస లాఘవంగా తప్పించుకుని ‘ఓహో నీకు ఎలుకలా కనిపిస్తున్నానా? అయితే నేనెవరో నీకు తప్పక తెలియాల్సిందే, తగిన బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ పోరాటానికి దిగింది. ముంగిసకీ, మూషికానికీ తేడా తెలియక యువపాము పీకలమీదకి తెచ్చుకుంటున్నదని తీతువు పిట్ట ఆవేదన చెందింది. దుడుకుతనంతో పాము పిల్ల వేస్తున్న కాట్ల నుండి తప్పించుకుంటూ, దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బాగా కవ్వించింది ముంగిస. దాని వ్యూహంలో చిక్కుకున్న యువపాము పదే పదే కాటు వేయటంతో దాని దగ్గరున్న విషం నిల్వ అయిపోయింది. తిరిగి ఉత్పత్తి కావటానికి కొంత సమయం పడుతుంది. అత్యుత్సాహంతో పోరాడటం వల్ల తొందరగా అలసి పోయింది. దాడి చేస్తే లొంగిపోయి, ప్రాణ రక్షణకై ఆర్తనాదం చేసే ఎలుకకీ, కాటు వేస్తున్నా తప్పించుకుని, ఎదురు దాడి చేస్తున్న ముంగిసకీ మధ్య భేదం మొదటిసారిగా అవగతమై యువపాము కళ్ళు తెరుచుకున్నాయి. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. ఒళ్లంతా గాయలతో నెత్తురోడుతోంది. బలహీన పడిన యువపాముపై ముంగిస అమాంతం దూకి మెడ పట్టుకుని కొరకబోయింది. ఈలోపు తీతువు పిట్ట హుటాహుటిన పోయి, దాని తల్లిని తీసుకు వచ్చింది. బిడ్డ చావబోతుండటం చూసి, తల్లడిల్లిన తల్లిపాము ముంగిసని శరణు కోరింది. ముసలి పాముని చూసి జాలి పడిన ముంగిస యువ పాముని వదిలేసి మరెప్పుడూ పొగరుగా ప్రవర్తించ వద్దని హెచ్చరించింది. ఆ పాఠం తర్వాత యువపాము బుద్ధిగా మసలుకోసాగింది. -
పిల్లల కథ: ఎవరు ఎక్కువ ప్రమాదం?
ఒక అడవిలో జింకపిల్ల ఒకటి వుండేది. చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ ‘నీలాంటి తెలివిగలవారు రాజుగారి కొలువులో వుంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీగాక నీ తెలివికి గుర్తింపూ దొరుకుతుంది’ అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింకపిల్ల.. సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లేముందు జింకపిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది ‘మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త’ అంటూ. సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివి తేటలకు అబ్బరపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహా దారుగా ఉద్యోగమిచ్చింది. మంత్రి నక్క.. జింకకు అభినందనలు తెలిపింది ‘నీలాంటి తెలివైనవారు వుండటం వల్ల నాకూ పని భారం తగ్గుతుంది’ అంటూ. ‘ ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటీ అలా హెచ్చరింది?’ అనుకుంది జింక. నిజానికి జింకపిల్ల కొలువులోకి రావడం నక్కకి యిష్టంలేదు తన ప్రాబల్యం తగ్గితుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. (పిల్లల కథ: జానకమ్మ తెలివి) ఒకరోజు సింహం.. జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ‘ఏంటో నాకైతే ఆ జింకపిల్ల అది పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో సాక్ష్యాలతో రుజువు చేస్తా’ అన్నది. ఒకరోజు ఎలుగు, తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు ‘ప్రభూ! జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో వుంటే బావుంటుందని మేమే దాన్ని మీ దగ్గరకు పంపాం. అది గూఢచారి కాదు’ అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి, తోడేలు నిజం చేప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది. తల్లిని కలవడానికి జింకపిల్ల ఇల్లు చేరింది. జరిగింది చెప్పి ‘అమ్మా.. క్రూరజంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్క లాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు?’ అని అడిగింది. ‘చెడ్డవారని ముందుగానే తెలిస్తే జాగ్రత్తగా వుంటాం కానీ మంచివారుగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూరజంతువు అని తెలుసు గనక జాగ్రత్తగా వుంటాం. కానీ నక్కలాంటివారు మంచిగా నటిస్తూ కీడు చేయ చూస్తారు. అందుకే అలాంటివారితో జాగ్రత్తా అని చెప్పాను. నీకూ అదే ఎదురైంది గనక ముందు ముందు అలాంటివారితో మరింత జాగ్రత్తగా వుండు’ అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది. -
పిల్లల కథ: జానకమ్మ తెలివి
రామాపురం అనే గ్రామంలో రామదాసు అనే పిసినారి ఉండేవాడు. అతనికి ఒక పాత పెంకుటిల్లు ఉండేది. ఆ గ్రామంలో అతను మిక్కిలి ధనవంతుడైనా పిసినారితనంతో ఇల్లు కట్టలేదు. అతని భార్య జానకమ్మ ఉత్తమ ఇల్లాలు. ఆ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా దొంగ మాత్రం దొరకలేదు. రామదాసుకు అత్యవసరంగా దూరంగా ఉన్న పట్టణానికి పోవలసి వచ్చింది. అతడు తన భార్యతో ‘మన ఇంటికి దొంగరాడు. మన ఇల్లే పాడుబడిన కొంప. దీన్ని చూసిన ఏ దొంగ కూడా మన ఇంట్లో దొంగతనం చేయడానికి ముందుకు రాడు. అయినా నీ జాగ్రత్తలో నీవు ఉండు’ అని చెప్పి పట్టణానికి వెళ్ళాడు. అతని ఊహకు భిన్నంగా మరునాడే ఆ దొంగ రామదాసు ఇంటిలోనికి ప్రవేశించాడు. జానకమ్మ చాలా ధైర్యం గలది.. ఉపాయశాలి కూడా. అందువల్ల ఆమె ఆ దొంగకు వణికి భయపడినట్లు నటిస్తూ ‘బాబ్బాబూ! నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళు. అంతే కానీ నన్ను మాత్రం ఏమీ చేయకు. నీకు పుణ్యం ఉంటుంది’ అని బతిమిలాడింది. దొంగ ఏమీ మాట్లాడకుండా చీరలు, నగలు సర్దుకోసాగాడు. అప్పుడు జానకమ్మ ‘దొంగన్నా! మా వారు చాలా పిసినారి. నీవు ఈ ఊర్లో ఎవరినైనా అడిగి ఆయన గురించి తెలుసుకో! ఆయన నాకు చేయించి ఇచ్చినవి ఈ రెండే రెండు బంగారు చిన్ని నగలు, ఈ కొద్ది చీరలు. అవి కూడా నీవు తీసుకొని వెళ్లితే ఆయన నాకు మళ్ళీ నగలు చేయించడు. చీరలను కొనివ్వడు. నీ సోదరిగా భావించి ఈ నగలు, చీరలను వదిలిపెట్టు’ అని అంది. అప్పుడు దొంగ ‘అలాగా! అవి వదలిపెడతాను సరే! కానీ మీ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో చెప్పు’ అని గద్దించాడు. ‘మేము చాలా పేదవారం నాయనా! మా పేదరికం గురించి మా ఇల్లే నీకు చెబుతుంది. నీవు అడిగావు కనుక చెబుతున్నాను. మావారి బీరువాలో కొంత నగదు ఉంది. నీవు తీసుకొని వెళ్ళు’ అని అంది. ఆ మాటలకు దొంగ సంతోషించి ఆ నగదును తీసుకొని ఆ నగలు, చీరలు అక్కడే వదిలిపెట్టి పరుగుతీశాడు. ఆ తర్వాత ఇరుగు పొరుగువారు వచ్చి రామదాసు ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకొని అతడు ఊళ్లో లేనందుకు విచారం వ్యక్తం చేశారు. మరునాడు పట్టణం నుండి వచ్చిన రామదాసు భార్యతో ‘మన ఇంట్లో దొంగలు పడ్డారని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా! నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా!’ అన్నాడు. జానకమ్మ ఏమీ మాట్లాడలేదు. రామదాసు కంగారుగా ‘ఏం మాట్లాడవ్? ఏమేమి పోయాయో చెప్పు’ అంటూ గొంతు పెంచాడు. ‘నా నగలు, చీరలు పోలేదండి. నా మాటలకు కరిగిపోయిన దొంగ వాటిని ఇక్కడే వదిలి పెట్టి వెళ్ళాడు’ అని అంది జానకమ్మ సంతోషంతో. రామదాసు వెంటనే ‘నీ చీరలు, నగలు కూడా నా బీరువాలోనే ఉన్నాయి కదా! అందులోని నా నగదు పోయిందా ఏమిటి? నా ఖర్మ!’ అంటూ కంగారు పడ్డాడు రామదాసు. అప్పుడు ఆమె ‘పోయిందండి’ అంది విచారంగా. ‘అయ్యో! పది లక్షల నగదు.. ఎంత పనైపోయింది! వాటిని కాపాడితే నీకు రెండు బంగారు గొలుసులు చేయిద్దామనుకున్నాను. కానీ నీవు చాలా దురదృష్టవంతురాలివి. నీకు ఆ యోగం లేదు’ అంటూ బాధపడ్డాడు. అప్పుడు ఆమె‘ మీరేనా ఈ మాటలంటున్నది. అలాగైతే నాకు నగలు, చీరలు మీరు బాకీ ఉన్నట్లే’ అని అంది. ‘తమాషా చెయ్యకు. నగదు సంచీ పోయి నేను ఏడుస్తుంటే’ అన్నాడు రామదాసు. ‘అవునండీ.. మీ సంచి దొంగ ఎత్తుకొని పోయాడు’ అంది జానకమ్మ. ‘నా సంచీ ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నగదు ఎక్కడ ఉంటుంది? నీ చీరలు, నగల కోసం నాకు అబద్ధం చెబుతావా’ అంటూ కసురుకున్నాడు. ‘అబద్ధాలు చెప్పడం లేదండీ! మీ సంచీని ఆ దొంగనే ఎత్తుకుపోయాడు. అందులో అన్నీ పదిరూపాయల నోట్లే ఉన్నాయి.అంతా కలిసి ఒక వెయ్యి రూపాయల కన్నా మించవు. ముందుగానే జాగ్రత్తగా మీ సంచీలో నుండి యాభై, వంద, ఐదు వందలు, రెండువేల నోట్లను తీసి నా సంచీలో పెట్టి నా దిండు కింద దాచిపెట్టానండీ. ఒకవేళ మనింటికి ఆ దొంగోడు వచ్చినా కేవలం పది రూపాయల నోట్లు మాత్రమే ఎత్తుకొని పోతాడు అని. నా ఊహే నిజమైంది. మీ లక్షల నగదు భద్రంగా ఉంది. వాడికి మీ సంచీని చూపించాను. పిచ్చివాడు.. ఆ పది రూపాయల నోట్లే గొప్ప నగదు అనుకొని, నా చీరలు, నగలు వదిలేసి వెళ్లాడు’ అని చెప్పింది. ఆపద సమయంలో భార్య ప్రదర్శించిన ధైర్యం, తెలివికి అబ్బురపడ్డాడు రామదాసు. అప్పటి నుండి తన పిసినారి తనాన్ని వీడి.. భార్య చెప్పినట్టు వింటూ పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాడు. -
కథ చెబుతా... ఊ కొడతారా!
వేసవి కాలం అనగానే పల్లె గుర్తుకు రావడానికి కారణం మన బాల్యంలో పెరిగిన ఊరు. అక్కడి వాతావరణం. ఆడుకున్న ఆటలు, అమ్మమ్మ–తాతయ్య కథలు చెబుతుంటే ‘ఊ..’ కొడుతూ విన్నాం. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోయాయి. అమ్మ, నాన్న పిల్లలవరకే అవి పరిమితం అయ్యాయి. అమ్మానాన్న పిల్లలకు కథలు చెప్పడమే తగ్గిపోయింది. దీంతో పిల్లల్లో సామాజిక విలువలు, జీవన నైపుణ్యాలు తగ్గిపోతున్నాయనేది నమ్మలేని నిజం. ఈ కాన్సెప్ట్‌ను దృష్టిలో పెట్టుకొని చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్లా ఈ లాక్డౌన్ కాలాన్ని కథల వర్క్‌షాప్‌కి కేటాయించారు. ‘బాలమిత్ర’ పేరుతో ఆన్లైన్ ద్వారా రోజుకో కథ చెబుతున్నారు. ఆ కథ చివరలో పిల్లలకు రకరకాల టాస్క్‌లు ఇచ్చి ఆ రోజంతా వారిని బిజీ బిజీగా ఉంచుతున్నారు. ‘బాలమిత్ర’ కథలు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే కథలు ఎన్నో మన భారతీయ జ్ఞాన సంపదలో మెండుగా ఉన్నాయి. అయితే వీటిని వినియోగించుకోవడంలో ఇటీవల కాలంలో బాగా వెనకబడ్డాం అంటారు డాక్టర్ గీత. రోజూ 500 మంది పిల్లలకు మధ్యాహ్నం 12 గంటలకు ఆంగ్లంలో, 12:30 కు తెలుగు లో కథ చెబుతారు గీత. హైదరాబాద్‌లో ఉంటున్న గీతాచల్లా పిల్లల మానసిక సమస్యలకు, వారి పరిణితికి ‘మనోజాగృతి’ పేరుతో కౌన్సెలింగ్స్ ఇస్తున్నారు. ‘ఈ లాక్డౌన్ కాలంలో రోజంతా పిల్లలను ఇంట్లోనే ఉండేలా చూడటం తల్లులకు పెద్ద టాస్క్. పిల్లల పెంపకానికి సంబంధించిన అంశాల్లో తల్లులూ టాస్క్‌ల్లో పాలు పంచుకుంటున్నారు. పిల్లలతో ఆ టాస్క్‌లను చేయిస్తూ వారి ఫొటోలు, వీడియోలు మాకు షేర్ చేస్తుంటారు. గ్రూప్‌లో అందరికన్నా తమ పిల్లలు ముందుండాలని కూడా తపన పడుతుంటారు. పిల్లలకు వచ్చే ప్రశంసలు చూసి పేరెంట్స్ చాలా ఆనందపడుతుంటారు. ఈ విషయాలు వాళ్లు మాతో పంచుకున్నప్పుడు ఈ పని చేస్తున్నందుకు చాలా ఆనందిస్తుంటాను’ అని తెలిపారు ఈ డాక్టర్. రోజుకో కొత్త టాస్క్ ఇంట్లో ఉన్న వనరులతోనే టాస్క్‌లను పూరించమంటారు గీత. ఒక రోజు నచ్చిన పాటకు డ్యాన్స్, మరో రోజు ఏదైనా రంగును పోలిన వస్తువులన్నీ సెట్ చేయడం, ఇంకోరోజు మంట అవసరం లేని వంట, రోజూ వాడే దినుసులు, ఒక రోజు పెయింటింగ్.. ఇలా రోజుకో టాస్క్ ఇస్తూ పిల్లల్లో యాక్టివిటీని పెంచుతున్నారు. మధ్యాహ్నం ఇచ్చిన టాస్క్ సాయంకాలం 7 గంటల లోపు పోస్ట్ చేయాలి, ఇలాంటి అంశాలతో డాక్టర్ గీత ఇళ్లలో ఉన్న పిల్లలను గడప దాటనివ్వకుండా అట్రాక్ట్ చేస్తున్నారు. – నిర్మలారెడ్డి లైవ్ సెషన్స్.. రోజూ రెండు గంటలు తెలుగు, ఇంగ్లిషులో ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాను. దీంట్లో పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకూ పాజిటివ్ పేరెంటింగ్ గురించి సూచనలు, కౌన్సెలింగ్ పద్ధతులూ ఉంటాయి. ఈ లాక్డౌన్ టైమ్‌లో పిల్లలు క్వాలిటీ టైమ్‌ను బద్ధకంగా గడపడం, లేదంటే పేరెంట్స్‌ను విసిగించడం వంటివి చేస్తున్నారనే కంప్లైంట్స్ ఎక్కువగా వినడం వల్ల వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. చైల్డ్ సైకాలజిస్ట్‌గా పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ ఆన్లైన్ వర్క్‌షాప్‌లో 500 మందికి పైగా పిల్లలు, తల్లిదండ్రులు చేరడం చాలా ఆనందంగా ఉంది. – గీతా చల్లా, చైల్డ్ సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ హైదరాబాద్ -
కోతుల ఆహారశాల
కొత్తరేమల్లె గ్రామస్తులు పొలం పనులతోపాటు, కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఆ గ్రామం చుట్టూ మామిడి తోటలుండేవి. ఆ మామిడి చెట్ల మీద ఆటలాడుకుంటూ, పండ్లు తింటూ కోతులు జీవనం సాగించేవి. గ్రామానికి దూరంగా తిరిగే కోతులు ఈమధ్య కాలంలో ఇళ్ళల్లోకి ప్రవేశించడం మొదలెట్టాయి. కోతుల ఆగడాలు తట్టుకోలేక ఊరి పెద్దలు పంచాయితీ ప్రెసిడెంట్‌ను కలిశారు. ‘‘అయ్యా..! ఊళ్ళో కోతుల బెడద తట్టుకోలేకపోతున్నాం. అవి ఇంటి దగ్గరుండే చెట్లపైనే మకాం వేసి ఇళ్ళల్లో వండుకునే అన్నం, కూరల్ని లాగేస్తున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు బయట స్వేచ్ఛగా తిరగడానికి భయపడుతున్నారయ్యా. నాలా కూలి పనులకెళ్ళే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందయ్యా. చేతి సంచిలో అన్నం బాక్సులు పెట్టుకుని పొలం పనులకు వెళ్ళేటప్పుడు వారి వెనకే కోతులు వస్తూ ఆ సంచుల్ని లాక్కుంటున్నాయి. అన్నం నేలపాలైపోతుందయ్యా! వాటినుంచి మమ్మల్ని రక్షించండయ్యా’’ అంటూ మొరపెట్టుకున్నారు. కొత్తరేమల్లె గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల నాలుగు గ్రామాల నుండీ ఇవే ఫిర్యాదులు అందడంతో వాటి నుంచి గ్రామస్తులకు ఉపశమనం కలిగించాలని పై అధికారులతో మాట్లాడి కోతులను పట్టే వాళ్ళను, వాటిని అడవులలో వదలడానికి తీసుకెళ్ళే ఒక పెద్ద వాహనాన్ని గ్రామానికి పిలిపించారు అధికారులు. వారం రోజులపాటు ఆపసోపాలు పడి, కోతుల్ని పట్టుకుని అడవిలో వదిలి వచ్చారు. జనాలందరూ జై కొట్టారు. కొన్నాళ్ళు ఎప్పటిలానే స్వేచ్ఛగా తిరిగారు. ఒక నెల రోజులు కూడా గడవకుండానే మళ్ళీ కోతులు గ్రామంలోకి ప్రవేశించాయి. మళ్ళీ తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టారు. మరలా నెల రోజుల తర్వాత అవి తిరిగొచ్చేశాయి. ఎన్నిసార్లు పంపిస్తున్నా కోతులు మరలా తిరిగొచ్చేయ్యడంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కొత్తరేమల్లె గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించి, కలెక్టర్ ఆ గ్రామానికి విచ్చేశారు. గ్రామస్తులతో చర్చించి, రెండు గంటలు ఊరంతా కారులో తిరిగి చూశాక ఒక విషయం ఆయనకు అర్థమైంది. అడవుల విస్తీరం తగ్గిపోవడంతో కోతులు తల దాచుకోవడానికి చోటు దొరక్క, ఆహారం కరువై ఇలా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని, పంటలను నాశనం చేస్తున్నాయని నిర్ధారణ కొచ్చారు కలెక్టర్‌గారు. రచ్చబండ దగ్గరకొచ్చి ప్రజలను ఉద్దేశించి ‘‘ఒకప్పుడు మీ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి. గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ రెండు ఫ్యాక్టరీల కారణంగా కలుషితమయ్యింది. చెరువునే ఆధారం చేసుకుని పండే భూములు పండట్లేదు. దాంతో కొంతమంది పంటలు వేయడం లేదు. వర్షాలు సరిగ్గా కురవడం లేదని వర్షాధార పంటలు వేయడం మానేశారు. ఇక మిగిలిన ఒకే ఒక అవకాశం ఫ్యాక్టరీలలో పని చేయడం. మున్ముందు ఇక్కడ మరిన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయని తెలిసి, వారికి ఈ భూములు అమ్ముకోవచ్చని మామిడి తోటలను కూడా నరికేశారు. ఇక కోతులు ఉండడానికి చోటెక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే అవి ఇలా ఇళ్ళల్లోకి చొరబడుతున్నాయి. ఆహారాన్ని దొంగిలిస్తున్నాయి. మీరెన్నిసార్లు తీసుకెళ్ళి అడవిలో వదిలేసొచ్చినా ఆహారం కోసం అవి మరలా మరలా తిరిగొస్తూనే ఉంటాయ్’’ అంటూ కలెక్టర్ చెబుతున్నారు. అంతలో గ్రామపెద్ద కల్పించుకుని ‘‘అలాగయితే ఎలాగయ్యా! మీరే ఏదన్నా చేయాలి’’ అంటూ రెండు చేతులు పైకెత్తాడు. వెంటనే ఇంకొంతమంది గ్రామ ప్రజలూ అతనికి తోడయ్యారు. కలెక్టర్ గారు వాళ్ళందరినీ చూస్తూ ‘‘దీనికి మీ అందరి సహకారం ఉంటే నేనో ఉపాయం చెప్తాను’’ అన్నారు. ‘‘మళ్ళా మళ్ళా అవి రాకుండా ఉంటాయంటే మీరేం చెప్తే అది చేస్తాం సార్’’ ముక్తకంఠంతో పలికారు ప్రజలు. ‘‘కోతులకు ఆహారశాల ఏర్పాటు చేద్దాం’’ అన్నారు కలెక్టర్. జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘‘కోతుల ఆహారశాల అంటే వాటికి మనం వండి పెట్టడం కాదు. ఇంగ్లీష్‌ల్లో దీన్ని మంకీ ఫుడ్ కోర్ట్స్ అంటారు. ఖాళీగా ఉన్న స్థలాలలో పండ్ల మొక్కలైన జామ, సీతాఫలం, ఉసిరి, నేరేడు మొదలైనవి నాటాలి. మీరందరూ కలిసి మీ వంతుగా వాటికి నీళ్ళు పోసి పెంచాలి. ఇలా చేయడం వలన చెట్ల సంఖ్య పెరుగుతుంది. మొక్కలు పెరిగి వాటికి కాసిన కాయల్ని కోతులు తింటూ ఇక్కడే ఉండిపోతాయ్. వాటికి ఈ ఆహారశాలలో ఆహారం దొరుకుతున్నప్పుడు ఇళ్ళల్లోకి రావు. ఏమంటారు.?’’ అంటూ అందరి అంగీకారాన్ని కోరారు. అడవులశాతం తగ్గిపోవడం కారణంగా ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన గ్రామస్తులు వెంటనే అంగీకారం తెలిపారు. తాను రూపకల్పన చేసిన ఈ వినూత్న కార్యక్రామాన్ని జనాల్లో స్థిరంగా నిలబడిపోవాలని పనులను వెంటనే ప్రారంభించమని అధికారులను ఆదేశించారు కలెక్టర్. గ్రామస్తుల సహకారంతో కొన్నాళ్ళలోనే మొక్కలు చెట్లుగా మారి ఫలాలను అందించాయి. కోతుల బెడద పూర్తిగా తగ్గిపోయింది. కోతులకు ఆహారశాల ఏర్పాటు చేసి గ్రామ సమస్యను తీర్చినందుకు కలెక్టర్‌ను అభినందించారు గ్రామస్తులు. - దొండపాటి కృష్ణ -
కుందేలును కాపాడిని కోతి
చంద్రగిరి అడవుల్లో క్రూర మృగాలు ఉండేవి కావు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కుందేళ్ళు, ఉడుతలు... మొదలైన సాధుజంతువులు నివసించేవి. జంతువులన్నీ ఎంతో స్నేహంగా, సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలో నివసించడానికి కార్వేటినగరం అడవులనుండి ఒక కోతి వచ్చింది. కొత్తగా వచ్చిన కోతిని చూసి, పరుగున వెళ్ళి వనరాజైన గజరాజుకు కోతి సంగతి చెప్పింది జింక. గజరాజు వెంటనే అడవిలోని జంతువులన్నింటినీ కాలువ గట్టుపై సమావేశపరిచాడు. సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోతికి ఉడుత ద్వారా సమాచారాన్ని పంపించాడు. గజరాజు ముందు చేతులు కట్టుకొని నిల్చుంది కోతి. తక్కిన జంతువులన్నీ కోతిని చాలా కోపంగా చూస్తున్నాయి. ‘‘మా అడవిలో కోతులకు ప్రవేశం లేదు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్లిపో !’’ కోతిని ఆజ్ఞాపించాడు గజరాజు. ‘‘గజరాజా! నేను అడవిలో ఉండడం మీకు ఇష్టం లేకపోతే, అడవి నుండి తక్షణం వెళ్ళిపోతాను. కానీ నాదొక సందేహం! తీర్చగలరా?’’ అంటూ వినయంగా అడిగింది కోతి. ‘‘ఏమిటి నీ సందేహం?’’ గంభీరంగా అడిగాడు గజరాజు. ‘‘ఈ అడవిలో కోతులకు ప్రవేశం లేకపోవడానికిగల కారణం తెలుసుకోవచ్చా?’’ అడిగింది కోతి. ‘‘కోతులు తుంటరి స్వభావంగలవి. అడవిలో చెట్ల కొమ్మలపై ఆడుతూ, కొమ్మలను విరిచేస్తాయి.’’ ఆవేశంగా చెప్పింది జింక. ‘‘అవసరం లేకున్నా ఆకులు, పళ్ళు తుంచిపడేస్తాయి.’’ ఆక్రోశించింది ఉడుత. ‘‘కోతి చేష్టల గురించి కొత్తగా చెప్పేదేముంది? కోతి చేష్టలు రోత చేష్టలు అని ఊరికే అన్నారా?’’ దెప్పిపొడిచింది గుర్రం. ‘‘తాను చెడ్డ కోతి, వనమంతా చెడిపింది అనే సామెత ఎప్పటినుండో ఉన్నదే కదా!’’ నొసలు చిట్లిస్తూ నిష్టూరమాడింది కుందేలు. కోతి ఏనుగు వైపు చూస్తూ.... ‘‘గజరాజా! అన్ని జీవుల్లోనూ మంచి వారూ ఉంటారు. చెడ్డవారూ ఉంటారు. మా కోతి జాతిలో కూడా అంతే. కొన్ని కోతులు చెడుగా ప్రవర్తించి ఉండవచ్చు. అడవికి, అడవి జంతువులకూ హాని చేసి ఉండొచ్చు. అలాగని మా కోతి జాతి మొత్తాన్నీ తప్పుబడితే ఎలా? నేను ఎప్పటికీ అలా నడుచుకోను. అడవి నియమాలకు అనుగుణంగానే నడుచుకొంటాను. దయచేసి నాకు ఈ అడవిలో మీతోపాటు నివసించడానికి అనుమతినివ్వండి.’’ బతిమాలింది కోతి. వాదనలు పూర్తయ్యాయి. గజరాజు తీర్పు కోసం కోతితో సహా జంతువులన్నీ ఎదురుచూస్తున్నాయి. గజరాజు ఆలోచనలో పడ్డాడు. కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతోంది. కానీ అడవి జంతువులన్నీ ఏకగ్రీవంగా కోతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇంతలో కాలువగట్టుపై ఆడుకొంటూ ఉన్న ఒక కుందేలుపిల్ల కాలుజారి కాలువలో పడిపోయింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితోపాటు కొట్టుకుపోతోంది. జంతువులన్నీ హాహాకారాలు చేస్తున్నాయి తప్ప, ప్రవహిస్తున్న కాలువలోకి దిగి కుందేలుపిల్లను కాపాడే సాహసం చేయలేక పోయాయి. కోతి వెంటనే కాలువకు ఇరువైపులా ఉన్న చెట్లపై వేగంగా గెంతుతూ ముందుకు వెళ్ళి, కాలువలోకి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మను ఆసరాగా తీసుకొని కాలువలో కొట్టుపోతున్న కుందేలు చెవులను ఒడిసి పట్టుకొని దాన్ని కాపాడింది. కాలువగట్టుపై దాన్ని పడుకోబెట్టి, తన చేతులతో దాని పొట్టను నొక్కి, అది మింగిన నీటిని కక్కించింది. చెకుముకి రాళ్ళతో ఎండుటాకులకు నిప్పుపెట్టి , దాని శరీరానికి వెచ్చదనాన్ని అందించింది. కుందేలు పిల్ల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కుందేలుపిల్ల ప్రాణాలు కాపాడినందుకు జంతువులన్నీ కోతిని చుట్టుముట్టి కృతజ్ఞతలు తెలిపాయి. పరిస్థితి సద్దుమణిగాక గజరాజు తీర్పుచెప్పడం ప్రారంభించాడు. ‘‘కోతి చెప్పినట్టే అన్ని రకాల జీవుల్లోనూ మంచివారూ ఉంటారు. చెడ్డవారూ ఉంటారు. నాకు ఈ కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతోంది. పైగా ఈ కోతి మన కుందేలుపిల్లను ప్రాణాపాయం నుండి కాపాడింది కూడా. అందువల్ల అడవిలో మనతోపాటు నివసించడానికి ఈ కోతికి అనుమతినిస్తున్నాను.’’ అని ప్రకటించింది. గజరాజు నిర్ణయంతో జంతువులన్నీ సంతోషించాయి. అకారణంగా నిందలు వేసినందుకు తమను క్షమించాల్సిందిగా కోతిని మనస్ఫూర్తిగా వేడుకొన్నాయి తక్కిన జంతువులు. - పేట యుగంధర్