మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని..
ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు.
ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం.
కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.
కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి.
ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు.
సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది.
చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు.
తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు.
వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి
Comments
Please login to add a commentAdd a comment