బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న మాజాలీ ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి. ఆ అడవిలోని జంతువులన్నిటికీ కృపి అంటే ఎంతో గౌరవం. ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే. ‘నా తరువాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటీ?’ అంటూ దిగులుచెందుతూ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేది. ఒకరోజు.. ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి ‘మృగరాజా.. ఆహార వేట కోసం నేను వెళ్లే పల్లెల్లో.. పిల్లలు లేనివాళ్ళు మరొకరి పిల్లలను తెచ్చి పెంచుకుంటుంటారు. దాన్ని దత్తత అంటారట.
అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది’ అంది. అక్కడే ఉన్న ఎలుగుబంటి ‘ఓ కరటం.. నీకు మతి పోయిందా? పక్కవాళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ మనం వేరు వేరు జంతువులం. పిల్లి పిల్లను తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా ?’ అంది. ‘మరైతే ఎలా ఈ సమస్య తీరేది?’ అంటూ కలతచెందింది కరటం.
అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద ‘మహారాజా.. దిగులుపడకండి. నేను అనేక అడవులు తిరుగుతాను. ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను. అప్పడు దత్తత గురించి ఆలోచించవచ్చు’ అంది. ‘ఈ ఆలోచన బాగుంది. అయితే ఈ రోజు నుండే వెతకడం మొదలుపెట్టు’ అంది ఎలుగుబంటి. అలా వెళ్ళిన గద్ద పక్కనున్న అడవులన్నిటినీ గాలించడం మొదలుపెట్టింది. నదీ తీరంలో దానికి ఓ పావురం కలసింది.
‘నిన్నటి నుండి చూస్తున్నా .. ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టున్నావ్?’ అని అడిగింది. ‘అవును’ అంటూ తన రాజు గురించి, ఆయన బాధ గురించి చెప్పింది గద్ద. ‘ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా వెదికినట్టుంది. మన పక్కనున్న కంజీరా అడవి రాణికి రెండు మగ పిల్లలు పుట్టాయి. జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు’ అంది పావురం. వెంటనే గద్ద కంజీరా అడవి వైపు ఎగిరి అక్కడి రాణి బిడ్డలను చూసింది.
ముద్దుగా ఉన్నాయి. దయతలచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లేడనే లోటుండదు అనుకుంది. ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్లి రాజు సహా అక్కడి జంతువులన్నిటికీ తను చూసిన విషయాన్ని చెప్పింది. ‘మహారాజా .. ఒక తల్లి నుండి పిల్లను తేవడం చిన్న విషయం కాదు. చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి’ అంది కరటం. ‘అవును.. మహారాజా! నానొక ఆవకాశం ఇవ్వండి. యువరాజును తీసుకొస్తా!’ అంది ప్రవాళం అనే కుందేలు. ‘అది నీవల్ల అయ్యే పనికాదు’ అని కుందేలును విదిలించి ‘మహారాజా.. ఆ అవకాశం నాకు ఇవ్వండి.
నేను తీసుకొస్తా’ అంది త్రిశిర అనే నక్క. ‘అవును.. మహారాజా! త్రిశిర తెలివైనది. అవసరమైతే తన దొంగ తెలివితేటలనూ ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా!’ అంది ఎలుగుబంటి. అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిశిర. కొంత దూరంలో దానికి ఓ తోడేలు జత కూడింది. రెండూ కలసి కంజీరా అడవికి చేరుకున్నాయి. రెంటికీ ఆకలి దంచేయసాగింది. ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి.
కొద్దిదూరంలోనే బాగా బలిసిన అడవి కోడి కనిపించింది. పొట్టికాళ్ళు.. మెలితిరిగిన పంచరంగుల తోక.. నెత్తిమీద ఎర్రని జుట్టు.. దాన్ని చూడగానే నోట్లో నీళ్లూరాయి తోడేలుకు. ‘రాజు సంగతి తరువాత.. ముందు దీన్నో పట్టుపడదాం’ అంది త్రిశిరతో. ‘తొందరపడకు. ఇది మన అడవి కాదు. పైగా మనం ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం’ హెచ్చరించింది త్రిశిర. ‘నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి. నీరసంతో పని చేయలేం కదా! అయినా కోడిని కొడితే ఎవరూ పట్టించుకోరు!’ అంది తోడేలు.
ఆ కోడి మీదకు దూకుదాం అని ఆ రెండూ అనుకునేలోపు చాలా జంతువులు నక్కను, తోడేలును చుట్టుముట్టాయి. ‘మా మృగరాజును నిద్రలేపే కోడి పుంజునే చంపుదామని వచ్చారంటే.. మీ కెంత ధైర్యం?’ అని బెదిరించాయ్. భయపడిపోయిన త్రిశిర ‘అమ్మబాబోయ్’ అంటూ పరుగు తీసింది. తోడేలూ దాన్ని అనుసరించింది. అలా బెదిరిపోయి వచ్చిన త్రిశిరను చడామడా తిట్టాయి జంతువులన్నీ! ‘మహారాజా.. ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం’ అని మళ్లీ అడిగింది ప్రవాళం.
‘ఏ పుట్టలో ఏ పాముందో.. సరే’ అంటూ అనుమతిచ్చింది మృగరాజు. వెంటనే ప్రవాళం.. వైద్యుడు కోతి బావను కలసి సువాసన తైలం తీసుకుంది. దాన్ని ఆనప బుర్రలో పోసుకుని.. భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాళం. కంజీరా రాజును కలసింది. చాలా వినయంగా ‘రాజా .. మీరు చాలా మంచివారని.. జంతువుల పట్ల స్నేహభావంతో మెలగుతారని తెలిసింది.
మా మంజీరా మహారాజు మీ కోసం ఈ సువాసన తైలం పంపారు. దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు’ అంటూ మాటల్లో పెట్టింది. ‘భలే మాట్లాడుతున్నావే’ అంది కంజీరా మృగరాజు. కొంత స్థిమితపడ్డాక మెల్లగా ‘రాజా.. మీకిద్దరు బిడ్డలని తెలిసింది. ఒకరు ఈ అడవికి రాజయితే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు’ అన్నది ప్రవాళం. ‘పక్క అడవికి రాజా? అదెలా?’ అని ఆశ్చర్యపోయింది మృగరాజు.
అప్పుడు ప్రవాళం తమ మృగరాజుకు పిల్లల్లేని విషయం చెప్పి, దత్తత గురించీ చెవిన వేసింది. అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు. ‘ఈ కుందేలు చెప్పింది బావుంది. పక్క అడవినీ నా బిడ్డే ఏలుతాడంటే అంతకంటే ఇంకేం కావాలి! ఇక్కడుంటే రెండిటిలో ఒకటే రాజవుతుంది. రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే. ఈ భేదం వల్ల భవిష్యత్తులో రెండిటి మధ్య విరోధమూ తలెత్తొచ్చు.
కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి. పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది. కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి’ అనుకుంది. ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది. రాణీ సరే అంది. ఆ రెండూ కలసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనంపాయి. అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘన స్వాగతం పలికాయి. తెలివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. -కూచిమంచి నాగేంద్ర
Comments
Please login to add a commentAdd a comment