పచ్చని అడవులు సుడిగాలి బీభత్సానికి అతలాకుతలం అయ్యాయి. మహావృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి, నేలకొరిగాయి. ఇదివరకు ఎన్నడూ కనివిని ఎరుగని ఈ బీభత్సం ములుగు జిల్లా తాడ్వాయి– మేడారం అభయారణ్యంలో జరిగింది. దాదాపు టోర్నడోను తలపించే ఈ ఉత్పాతం ఎందుకు జరిగిందనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ బీభత్సానికి కారణాలు కనుగొనేందుకు అధ్యయనం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఆగస్టు 31న సాయంత్రం సుమారు 4.30 నుంచి 7 గంటల సమయంలో మేడారం అటవీ ప్రాంతం ఈ ఆకస్మిక ఉపద్రవానికి గురైంది. హఠాత్తుగా సుడిగాలులు పెనువేగంతో చుట్టుముట్టాయి. సుడిగాలుల తాకిడికి దాదాపు 78 వేలకు పైగా భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకూలాయి. తాడ్వాయి–మేడారం అభయారణ్యంలోని 204.30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విధ్వంసం జరిగింది. నేలకొరిగిన వృక్షాల్లో మద్ది, పెద్దేగి, జిట్రేగి, నల్లమద్ది, ఎజిత, నారవేప, రావి, గుంపెన, పచ్చగంధం వంటి భారీ వృక్షాలు ఉన్నాయి. మరెన్నో ఔషధ వృక్షాలు ఉన్నాయి. ఇదివరకు ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిసినా, ఇలాంటి సుడిగాలి బీభత్సం మాత్రం ఎన్నడూ సంభవించలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఈ అడవి చరిత్రలోనే కనివిని ఎరుగని బీభత్సమని వారంటున్నారు.
కారణాలపై అన్వేషణ
ఆకస్మిక సుడిగాలి బీభత్సానికి గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు జాతీయ స్థాయి సంస్థలైన ఐఎండీ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెట్రియలాజికల్ డేటా వచ్చిన తర్వాత మరింత అధ్యయనం చేసేందుకు వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రకృతి విలయం ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త. ఇదివరకు 1996లో మధ్యప్రదేశ్‌లోని నౌరదేవి అభయారణ్యంలో చెలరేగిన గాలిదుమారానికి చెట్లు నేలకూలాయి. అయితే, తాడ్వాయి–మేడారం అభయారణ్యంలో జరిగినంత తీవ్రనష్టం ఇప్పటి వరకు ఇంకెక్కడా చోటు చేసుకోలేదని పర్యావరణవేత్త పురుషోత్తం చెబుతున్నారు.
టోర్నడో తరహా బీభత్సం
ఒకేసారి వేలాది మహావృక్షాలను నేలకూల్చేసిన సుడిగాలిని టోర్నడో తరహా బీభత్సంగా అటవీ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుడిగాలి బీభత్సాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షానికి తోడు దట్టమైన మేఘాలు, గాలి దగ్గరగా రావడంతో సుడిగాలి చెలరేగి ఇంతటి విధ్వంసానికి దారితీసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే, భారతదేశంలో టోర్నడోలు చెలరేగే అవకాశమే లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలోని హిమాలయాలు సహా పర్వతాలు, కొండలు సుడిగాలులు చెలరేగకుండా అడ్డుకుంటున్నాయని, అందువల్ల టోర్నడోలు రావని చెబుతున్నారు. పైగా, మన దేశంలోని వేడి, ఉక్కపోత వాతావరణంలో టోర్నడోలకు అవకాశమే ఉండదని అంటున్నారు. విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాల్లో టోర్నడోలు చెలరేగుతుంటాయి. ఉత్తర అమెరికా, అగ్నేయ–దక్షిణ అమెరికా, యూరోప్‌లోని పలు దేశాలు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో టోర్నడోలు అప్పుడప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి.
గడ్డం రాజిరెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్
అడవి పునరుజ్జీవానికి మరో పదేళ్లు
భారీ విధ్వంసానికి గురైన ఈ అడవి పునరుజ్జీవనానికి కనీసం మరో పదేళ్లు పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎలాంటి మొక్కలు నాటవద్దని, దానంతట అదే పునరుజ్జీవనం పొందుతుందని అంటున్నారు. కూలిన చెట్ల కొమ్మలను నరికివేసేందుకు, నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, అలాంటి చర్యలను నివారించాలని చెబుతున్నారు. ఏటూరునాగారం లేదా ములుగు ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఒక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేంద్రమేదీ లేకపోవడం వల్లనే జరిగిన విధ్వంసాన్ని అటవీశాఖ ముందుగా తెలుసుకునేందుకు వీలు లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.
అధ్యయనం తప్పనిసరి
ప్రకృతి కన్నెర్రచేస్తే దేవుడు కూడా కాపాడలేడనడానికి నిదర్శనం ఈ బీభత్సమని వరంగల్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ కె.వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆకస్మిక ప్రకృతి బీభత్సాలపై తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెరిపిలేని వర్షం, ఈదురు గాలుల వల్ల టోర్నడో స్థాయి విధ్వంసం ఇక్కడి అడవిలో జరిగిందని, దేశంలో ఎక్కడా ఇదివరకు ఇలాంటి విధ్వంసం జరగలేదని అన్నారు. దాదాపు 78 వేల మహావృక్షాలు నేలకూలిపోయాయంటే, ఆ ప్రభావం పర్యావరణంపై చాలానే ఉంటుందని, ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.
∙కె.వెంకట్‌రెడ్డి,ప్రొఫెసర్, ఎన్‌ఐటీ, వరంగల్
ఇది టోర్నడో కాదు
ములుగు జిల్లా అటవీప్రాంతంలో వచ్చినది టోర్నడో కాదని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కె.పురుషోత్తం అంటున్నారు. ఇక్కడ ఒకేసారి దట్టమైన మేఘాలు కమ్ముకుని, ఒకేసారి వర్షించడంతో కొమ్మలు బాగా తడిసిపోయి, విరిగిపోయాయని, గురుత్వాకర్షణ మూలంగా ఒకేచోట గాలి అంతా కేంద్రీకృతం కావడంతో ఈ అటవీ ప్రాంతం భారీ విధ్వంసాన్ని ఎదుర్కొందని ఆయన వివరించారు. దీనిని టోర్నడోగా కాదు, డౌన్‌బరస్ట్‌గా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సుడిగాలి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించి ఉంటే, భారీ స్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించి ఉండేదని అన్నారు. ఈ బీభత్సాన్ని వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన ప్రకృతి ప్రకోపంగానే భావించాల్సి ఉంటుందని పురుషోత్తం అన్నారు. దట్టమైన అడవి కారణంగానే ఈ సుడిగాలి బీభత్సం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా ఉందని, విధ్వంసం తాకిడి మొత్తాన్ని అడవి భరించిందని తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలోనిది ఇసుక నేల కావడంతో భారీవృక్షాల వేళ్లు కూడా ఎక్కువ లోతుకు వెళ్లలేదని, అందుకే అవి కూలిపోయాయని వివరించారు.
∙కె.పురుషోత్తం, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక
Comments
Please login to add a commentAdd a comment