
సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. ఆరు నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే గాని, అందులో పెళ్ళి చేసుకునే అవకాశం రాదు. సుధీర్, రేవతిల పెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికీ మొదటిరాత్రికీ మధ్యలో ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావుడి మొదలైంది. ‘రేవతి! టైమ్ మర్చిపోకమ్మా! సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు’ అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరీ. ‘సాయంత్రం గదిలోకెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు’ వివరంగా చెప్పింది కవిత.
‘రేవతీ! స్నానం చేశావా?’ అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ‘ఏంటీ, అప్పుడే అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు. మేం వినకూడదా?’ అంటూ రేవతి, కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి.
‘అలాగేం లేదమ్మా! నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే!’ అంది కవిత.
‘టైమ్ చూసుకుని కలవమంటోంది అత్తయ్య!’ తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ.
‘అది చాలా ముఖ్యం రేవతి! మా పిన్నమ్మ ఆ పంతులుతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైమ్ పాటించకపోతే మీ అత్తయ్య, మా పిన్ని కష్టం వృథా అయిపోతుంది’ అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది.
‘మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్నీ అంత గట్టి నమ్మకం?’ ఆసక్తిగా కవితను అడిగింది దేవకి.
‘ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంటపట్టాయి’ చెప్పింది కవిత.
‘అలా వచ్చిందా! మీది పెద్ద చరిత్రే’ అంది దేవకి.
‘ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్ళకు జరిపించే అన్నప్రాశనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది’ అని చెప్పింది కవిత.
‘ఏంటమ్మా! పిన్ని, కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు. అక్కడ శోభనం గదిలో పనేంలేదా?’ అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా.
‘నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది. ఇంక మాకా గదిలో పనేముంటుంది చెప్పు!’ అంది కవిత. ‘పిన్ని! మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు’ అని కబురు తెచ్చింది మీనా.
‘ఎందుకు తల్లీ! కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారేంటి?’ అంటూ వెళ్ళింది, కవిత.
మీనా, దేవకి నవ్వుకున్నారు.
‘చాలా సరదాగా ఉంటుందే పిన్ని. మన రేవతి అదృష్టవంతురాలు. మంచి అత్త దొరికింది’ అంది మనస్పూర్తిగా మీనా.
‘హలో అక్కగారు! ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండోవైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే, పూజ గది, ఈవిడగారుండే గది పనిమనుషులు శుభ్రం చెయ్యరట! ఇంటి కోడళ్లే ఆ పని చెయ్యాలట! ఇప్పుడున్న ఇద్దరూ కోడళ్లూ అలాగే చేస్తున్నారట! బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళ మొహాలు చూశావా, ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయ్!
ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట! చీపురు, చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట! ఏ రోజు ఏ రంగు చీరకట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట! ఇంట్లో పనివాళ్ళు ఆమెకు ఐదడుగుల దూరంలో నడవాలట! కాని, ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంకో గొప్ప సంగతి. ఇద్దరు కోడళ్ళకు సుఖప్రసవం జరుగుందని డాక్టర్లు చెబితే, ఈవిడ మాత్రం మంచి రోజు, మంచి ఘడియలని చెప్పి రెండు మూడు రోజులు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి, బిడ్డలను బయటకు తీయించిందట!’ అని చెప్పింది దేవకి.
‘అమ్మ బాబోయ్! ఈవిడకింతుందా?’ అని అమాయకంగా అడిగింది మీనా.
‘ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. నీకు శాంపిల్‌గా కొన్నే చెప్పాను’ చెప్పింది దేవకి. ‘అవును చెల్లి! ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?’ అడిగింది మీనా.
‘మెల్లగా వాళ్ళ పనిమనిషి దగ్గర నుంచి రాబట్టాను’ చెప్పింది దేవకి.
‘ఈ లెక్కన చూస్తే, మన అత్తగారే నయమనిపిస్తుంది’ అంది మీనా.
‘అవును. ఆవిడ కంటే మన అత్తగారు వందరెట్లు మంచిది’ నిజాయితీగా ఒప్పుకుంది దేవకి.
‘మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా?’ రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా.
‘మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం! రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదు’ చెప్పింది దేవకి.
‘మేము మాత్రం ఊరుకుంటామా? తేడా వస్తే అడిగి, కడిగి పారేస్తాం!’ అంది మీనా.
తోటికోడళ్ళ సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి, మీనా, దేవకిల అత్తగారు జానకి ‘నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు’ అని మనసులోనే అనుకుంది.
రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. ‘రేవతి, నీదే లేటు. నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము‘ అంది మీనా.
‘అక్కా! నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్ళి వంట పనులు చూసుకుంటాను’ అని బయటకు నడిచింది దేవకి.
ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, ‘అమ్మా దేవకి! అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది. కాస్త నువ్వెళ్ళి చూసుకోమ్మా’ అంది జానకి.
‘అలాగే అత్తయ్యా! మీరు మన రేవతికి అన్నీ చెప్పండి, ఆ పిన్నిగారు టైమ్, టైమ్ అని తెగ ఆరాటపడుతోంది’ అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది.
సమయం ఏడు నలభై నిమిషాలవుతోంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తోంది. కవిత హాల్లో కోడళ్ళతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంటహౌస్‌లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళి కొడుకు సుధీర్‌ను తన ఇద్దరన్నలూ వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్‌తో ఇంకో పదిమంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం ఎనిమిది రెండు నిమిషాలైంది.
కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి, ‘సుధీర్ రెడీ అయ్యాడా?’ అనడిగింది.‘హా! రెడీ!’ అని, ‘రేయ్ తమ్ముళ్లూ! మీరంతా కాస్త వాడికి దారిస్తే, పంజరంలోకి పంపుదాం!’ అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ‘ఆల్ ది బెస్ట్ రా సుధీర్!’ అని గట్టిగా అరిచారు.
సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కళ్ళారా చూస్తూ చాలా రిలాక్స్‌డ్‌గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. ‘పిన్నిగారు! అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం!’ అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ‘ఇప్పుడు ఆకలేస్తుంది. పద తిందాం!’ అని దేవకి వెనుకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబసభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు.
సందడిగా ఉంది ఆ ప్రాంతం! సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలవుతోంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని, ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, ‘వదినా! నాకు డేట్ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ మీ!’ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి, దేవకి మొహంలో చిరునవ్వు మాయమై, కంగారు మొదలై చెమటలు పట్టాయి.
‘వెంటనే నీ రూమ్‌కి రా!’ అని రిప్లై చేసి, మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి, ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుని, ‘అక్క! నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో!‘ అని మీనాకి చెప్పి, లోపలికి వెళ్ళింది.
‘ఏంటి రేవతి! ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా! ఇప్పుడెలా? మా తమ్ముడికి చెప్పావా?’ అని అడిగింది దేవకి టెన్షన్‌గా.
‘చెప్పాను. వెళ్ళి రెస్టు తీసుకో’ అని చెప్పారు. ‘సరే,నువ్వు కంగారు పడకు. అయినా, ఇంకా టైముంది కదా?’ కంగారుగానే అడిగింది దేవకి. ‘రేపు కానీ, ఎల్లుండు కానీ రావాలి’ అమాయకంగా చెప్పింది రేవతి.
‘సరే సరే, ఈ రూమ్‌లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందాం!’ అని చెప్పి, ‘ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమౌతుందో, ఏంటో’ అంటూ టెన్షన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు, దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది.
‘అసలు మీరు ఆడవాళ్లేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా టేబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీ కంటే లేబరోళ్ళే బెటర్ కదా!’ అని పిచ్చ కోపంగా తిట్టి, హాల్లో కొచ్చి, ‘నీరజా! శ్యామ్! అందరూ రండి ఇంటికి పోదాం!’ అంటూ గేటువైపు దారి తీసింది కవిత.
‘ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా!’ అన్నాడు సుధీర్ గట్టిగా.
‘ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరెంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?’ కోపంగానే అంది కవిత.
‘మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఎంతకాలమైంది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళైంది? రోగం లేని మనిషెవడైనా ఉన్నాడా?’ సూటిగా అడిగాడు సుధీర్.
‘దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్?’ అర్థం కానట్టు అడిగింది కవిత.
‘అమ్మా! సంబంధం ఉంది. మంచి ముహుర్తం కాబట్టి, నెలసరి రాకుండా టేబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా! అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంత కాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో! ఇకనైనా కళ్ళుతెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు, కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకుని మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తిలేనివే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము’ అని చెప్పడం ఆపి, ‘నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే, రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు’ అని తన గదివైపు వెళ్ళిపోయాడు.
సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి, దేవకికి సారీ చెప్పింది కవిత. ‘భయపడకు. ఈ మూడు రోజులూ నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం!’ అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment