Revathi
-
ఆమె కథ
సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. ఆరు నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే గాని, అందులో పెళ్ళి చేసుకునే అవకాశం రాదు. సుధీర్, రేవతిల పెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికీ మొదటిరాత్రికీ మధ్యలో ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావుడి మొదలైంది. ‘రేవతి! టైమ్ మర్చిపోకమ్మా! సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు’ అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరీ. ‘సాయంత్రం గదిలోకెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు’ వివరంగా చెప్పింది కవిత.‘రేవతీ! స్నానం చేశావా?’ అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ‘ఏంటీ, అప్పుడే అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు. మేం వినకూడదా?’ అంటూ రేవతి, కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి.‘అలాగేం లేదమ్మా! నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే!’ అంది కవిత. ‘టైమ్ చూసుకుని కలవమంటోంది అత్తయ్య!’ తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ.‘అది చాలా ముఖ్యం రేవతి! మా పిన్నమ్మ ఆ పంతులుతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైమ్ పాటించకపోతే మీ అత్తయ్య, మా పిన్ని కష్టం వృథా అయిపోతుంది’ అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది.‘మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్నీ అంత గట్టి నమ్మకం?’ ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ‘ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంటపట్టాయి’ చెప్పింది కవిత. ‘అలా వచ్చిందా! మీది పెద్ద చరిత్రే’ అంది దేవకి. ‘ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్ళకు జరిపించే అన్నప్రాశనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది’ అని చెప్పింది కవిత. ‘ఏంటమ్మా! పిన్ని, కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు. అక్కడ శోభనం గదిలో పనేంలేదా?’ అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా.‘నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది. ఇంక మాకా గదిలో పనేముంటుంది చెప్పు!’ అంది కవిత. ‘పిన్ని! మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు’ అని కబురు తెచ్చింది మీనా. ‘ఎందుకు తల్లీ! కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారేంటి?’ అంటూ వెళ్ళింది, కవిత. మీనా, దేవకి నవ్వుకున్నారు. ‘చాలా సరదాగా ఉంటుందే పిన్ని. మన రేవతి అదృష్టవంతురాలు. మంచి అత్త దొరికింది’ అంది మనస్పూర్తిగా మీనా. ‘హలో అక్కగారు! ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండోవైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే, పూజ గది, ఈవిడగారుండే గది పనిమనుషులు శుభ్రం చెయ్యరట! ఇంటి కోడళ్లే ఆ పని చెయ్యాలట! ఇప్పుడున్న ఇద్దరూ కోడళ్లూ అలాగే చేస్తున్నారట! బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళ మొహాలు చూశావా, ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయ్! ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట! చీపురు, చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట! ఏ రోజు ఏ రంగు చీరకట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట! ఇంట్లో పనివాళ్ళు ఆమెకు ఐదడుగుల దూరంలో నడవాలట! కాని, ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంకో గొప్ప సంగతి. ఇద్దరు కోడళ్ళకు సుఖప్రసవం జరుగుందని డాక్టర్లు చెబితే, ఈవిడ మాత్రం మంచి రోజు, మంచి ఘడియలని చెప్పి రెండు మూడు రోజులు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి, బిడ్డలను బయటకు తీయించిందట!’ అని చెప్పింది దేవకి. ‘అమ్మ బాబోయ్! ఈవిడకింతుందా?’ అని అమాయకంగా అడిగింది మీనా.‘ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. నీకు శాంపిల్‌గా కొన్నే చెప్పాను’ చెప్పింది దేవకి. ‘అవును చెల్లి! ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?’ అడిగింది మీనా. ‘మెల్లగా వాళ్ళ పనిమనిషి దగ్గర నుంచి రాబట్టాను’ చెప్పింది దేవకి. ‘ఈ లెక్కన చూస్తే, మన అత్తగారే నయమనిపిస్తుంది’ అంది మీనా. ‘అవును. ఆవిడ కంటే మన అత్తగారు వందరెట్లు మంచిది’ నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. ‘మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా?’ రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. ‘మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం! రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదు’ చెప్పింది దేవకి. ‘మేము మాత్రం ఊరుకుంటామా? తేడా వస్తే అడిగి, కడిగి పారేస్తాం!’ అంది మీనా. తోటికోడళ్ళ సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి, మీనా, దేవకిల అత్తగారు జానకి ‘నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు’ అని మనసులోనే అనుకుంది.రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. ‘రేవతి, నీదే లేటు. నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము‘ అంది మీనా.‘అక్కా! నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్ళి వంట పనులు చూసుకుంటాను’ అని బయటకు నడిచింది దేవకి. ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, ‘అమ్మా దేవకి! అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది. కాస్త నువ్వెళ్ళి చూసుకోమ్మా’ అంది జానకి. ‘అలాగే అత్తయ్యా! మీరు మన రేవతికి అన్నీ చెప్పండి, ఆ పిన్నిగారు టైమ్, టైమ్ అని తెగ ఆరాటపడుతోంది’ అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం ఏడు నలభై నిమిషాలవుతోంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తోంది. కవిత హాల్లో కోడళ్ళతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంటహౌస్లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళి కొడుకు సుధీర్‌ను తన ఇద్దరన్నలూ వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్‌తో ఇంకో పదిమంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం ఎనిమిది రెండు నిమిషాలైంది. కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి, ‘సుధీర్ రెడీ అయ్యాడా?’ అనడిగింది.‘హా! రెడీ!’ అని, ‘రేయ్ తమ్ముళ్లూ! మీరంతా కాస్త వాడికి దారిస్తే, పంజరంలోకి పంపుదాం!’ అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ‘ఆల్ ది బెస్ట్ రా సుధీర్!’ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కళ్ళారా చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. ‘పిన్నిగారు! అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం!’ అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ‘ఇప్పుడు ఆకలేస్తుంది. పద తిందాం!’ అని దేవకి వెనుకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబసభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు.సందడిగా ఉంది ఆ ప్రాంతం! సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలవుతోంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని, ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, ‘వదినా! నాకు డేట్ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ మీ!’ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి, దేవకి మొహంలో చిరునవ్వు మాయమై, కంగారు మొదలై చెమటలు పట్టాయి.‘వెంటనే నీ రూమ్‌కి రా!’ అని రిప్లై చేసి, మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి, ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుని, ‘అక్క! నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో!‘ అని మీనాకి చెప్పి, లోపలికి వెళ్ళింది.‘ఏంటి రేవతి! ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా! ఇప్పుడెలా? మా తమ్ముడికి చెప్పావా?’ అని అడిగింది దేవకి టెన్షన్‌గా. ‘చెప్పాను. వెళ్ళి రెస్టు తీసుకో’ అని చెప్పారు. ‘సరే,నువ్వు కంగారు పడకు. అయినా, ఇంకా టైముంది కదా?’ కంగారుగానే అడిగింది దేవకి. ‘రేపు కానీ, ఎల్లుండు కానీ రావాలి’ అమాయకంగా చెప్పింది రేవతి. ‘సరే సరే, ఈ రూమ్‌లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందాం!’ అని చెప్పి, ‘ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమౌతుందో, ఏంటో’ అంటూ టెన్షన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు, దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. ‘అసలు మీరు ఆడవాళ్లేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా టేబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీ కంటే లేబరోళ్ళే బెటర్ కదా!’ అని పిచ్చ కోపంగా తిట్టి, హాల్లో కొచ్చి, ‘నీరజా! శ్యామ్! అందరూ రండి ఇంటికి పోదాం!’ అంటూ గేటువైపు దారి తీసింది కవిత. ‘ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా!’ అన్నాడు సుధీర్ గట్టిగా. ‘ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరెంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?’ కోపంగానే అంది కవిత. ‘మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఎంతకాలమైంది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళైంది? రోగం లేని మనిషెవడైనా ఉన్నాడా?’ సూటిగా అడిగాడు సుధీర్. ‘దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్?’ అర్థం కానట్టు అడిగింది కవిత. ‘అమ్మా! సంబంధం ఉంది. మంచి ముహుర్తం కాబట్టి, నెలసరి రాకుండా టేబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా! అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంత కాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో! ఇకనైనా కళ్ళుతెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు, కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకుని మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తిలేనివే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము’ అని చెప్పడం ఆపి, ‘నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే, రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు’ అని తన గదివైపు వెళ్ళిపోయాడు. సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి, దేవకికి సారీ చెప్పింది కవిత. ‘భయపడకు. ఈ మూడు రోజులూ నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం!’ అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. -
Revathi Husband: నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు.
-
Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బన్నీ అరెస్ట్‌పై సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త స్పందించాడు. ఈ ఘటనకు అల్లు అర్జున్‌కు సంబంధం లేదు. ‘అల్లు అర్జున్ అరెస్టయిన విషయం టీవీల్లో చూసి తెలుసుకున్నాను. నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు. నాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సినిమా చూస్తానంటేనే నా భార్య, కొడుకును థియేటర్‌కి తీసుకెళ్లాను. అందులో అల్లు అర్జున్ తప్పేమి లేదు. అవసరం అయితే కేసును ఉపసంహరించుకుంటాను’ అని రేవతి భర్త అన్నారు.కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిఅసలేం జరిగిందిఅల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప 2 ఈ నెల 5న విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌కి ఒక్క రోజు ముందు డిసెంబర్ 4న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్లో సినిమా చూసేందుకు రేవతి అనే మహిళ తన కుమారుడితో కలిసి వెళ్లింది. అదే థియేటర్స్‌కి అల్లు అర్జున్ కూడా వెళ్లాడు. దీంతో బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఈ కేసు విషయంలోనే పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. -
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్
-
టీడీపీ నేతల వేధింపులతో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
శ్రీకాళహస్తి/సాక్షి నెట్వర్క్: అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు, ఉద్యోగినులపై కూటమి పక్షాల నేతల వేధింపులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరుపతి, కృష్ణాజిల్లాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ ఉద్యోగాలు తీయవద్దని వేడుకున్నా నేతలు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తీసేశారు.. నా ఉద్యోగం ఇప్పించమ్మా.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీలో సంఘమిత్ర రేవతిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ బాధను తట్టుకోలేక రేవతి పురుగుమందు తాగింది. అంతకుముందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో.. ‘అమ్మా! రిషితమ్మా.. నేను 16 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తున్నాను. దళితురాలైన నన్ను తొలగించారు. ఎలాగైనా నా జాబు నాకు వచ్చేట్లు చేయాలని అభ్యర్థిస్తున్నాను, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..’ అంటూ సెల్ఫీ వీడియోను ఆపేసి పురుగుమందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతిని సీఐటీయూ నాయకులు పరామర్శించారు.ఎస్టీ మహిళకు అన్యాయం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో టీడీపీ నేతలు ఎస్టీ మహిళను ఉద్యోగం నుంచి తీయించేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించావంటూ వెలుగు పథకంలో బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న గాయత్రిని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశారు. వారి సూచనతో వెలుగు అధికారులు శుక్రవారం గాయత్రిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గాయత్రి ప్రాణాలు తీసుకోవాలని నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఓటీటీ కోసం మరోసారి మెగాఫోన్ పట్టిన రేవతి
సౌత్ ఇండియా సీనియర్ నటి రేవతిలో మరో టాలెంట్ కూడా దాగి ఉంది. ఇండస్ట్రీలో ఆమె దర్శకురాలిగా, సింగర్‌గా కూడా మెప్పించారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటించి పేరు గడించారు. కాగా మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రం ద్వారా దర్శకురాలిగా మారిన రేవతి తొలి చిత్రానికే జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత ఫిర్ మిలేంగే ముంబాయ్ కట్టింగ్ అనే హిందీ చిత్రాలకు, కేరాళా కేఫ్ పేరుతో మలయాళంలోనూ చిత్రాలు చేశారు. అదేవిధంగా సలామ్ వెంకీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, చిన్న గ్యాప్ తరువాత మరోసారి మోగాఫోన్ పట్టారీమె. ఈసారి నటి రేవతి వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించడం విశేషం. దీని గురించి ఆమె సామాజిక మాద్యమాల్లో పేర్కొంటూ ఈనెల 5న తాను దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యిందని తెలిపారు. దీనికి సిద్ధార్ధ్ రామసామి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌ను డిస్నీ ప్లస్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుందని తెలిపారు. ఇందులో నటిస్తున్న నటీనటులు, పని చేస్తున్న సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు రేవతి పేర్కొన్నారు. -
షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి
ప్రముఖ నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేవతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించింది. కొద్దిరోజుల క్రితం కోజికోడ్‌కు చెందిన సజీర్ (33), దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సుమారు పదేళ్ల క్రితం తనపై దర్శకుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూనే, రేవతి పేరును కూడా బయటపెట్టాడు. తన వ్యక్తిగత ఫోటోలు రేవతికి రంజిత్ పంపాడని అతడు ఆరోపించాడు. దీంతో ఈ వార్త పెను సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!)అవి నిజం కాదు సజీర్ చేసిన ఆరోపణలపై నటి రేవతి ఇప్పుడు స్పందించింది. దర్శకుడు రంజిత్.. యువకుడి నగ్న చిత్రాలని తనకు పంపారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్‌లో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే?సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ రంజిత్ని సంప్రదిస్తే ఒక హోటల్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సజీర్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నటి రేవతి పేరును తీసుకొచ్చాడు. 'దర్శకుడు రంజిత్ గదిలోకి నేను వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫొటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను' అని సజీన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్) -
రేవతి అసలు పేరేంటో తెలుసా..? పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్..
రేవతి పిళ్లై.. ‘ద వైరల్ ఫీవర్ (టీవీఎఫ్)’ యూట్యూబ్ చానెల్ వీక్షకులకు సుపరిచితం. నటిని కావాలనుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు రేవతి. ఇష్టంలేకుండానే మొదలుపెట్టింది ఈ ప్రయాణాన్ని. అయినా మనసు పెట్టే కొనసాగిస్తోంది. అందుకే ఇక్కడ రేవతిని పరిచయం చేస్తున్నాం..మహారాష్ట్రలో స్థిరపడిన మలయాళీ కుటుంబం రేవతి వాళ్లది. ఆమె థానేలో పుట్టిపెరిగింది. షీజా పిళ్లై, మనోజ్ పిళ్లై.. రేవతి తల్లిదండ్రులు.ఊహ తెలిసినప్పటి నుంచి ఆటోమొబైల్ ఇంజినీర్ కావాలని కలలు కన్నది. కానీ రేవతిలోని ఇమిటేషన్ స్కిల్స్ చూసిన ఆమె కజిన్ తన చెల్లెలు యాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాడు అనుకోవడమే కాదు ఆడిషన్స్‌కీ తీసుకెళ్లేవాడు. ప్రతి ఆడిషన్‌కి రేవతి ఏడుస్తూనే వెళ్లేదట.రేవతికి మొదట మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. మోడల్‌గా రాణిస్తున్నప్పుడే టీవీఎఫ్ వాళ్ల ‘యే మేరీ ఫ్యామిలీ’ వెబ్ సిరీస్‌కి సెలెక్ట్ అయింది. అందులో ‘విద్య’గా నటించింది. అయిష్టంగానే నటనారంగంలోకి అడుగుపెట్టినా.. కెమెరా ముందుకు రాగానే తన మైండ్‌ని మేకప్ చేసింది.. అదే తన కెరీర్ అని.. కమిట్ కావాలని!ఆ కమిట్మెంట్ విత్ టాలెంట్‌ని టీవీఎఫ్ వదలుకోదల్చుకోలేదు. అందుకే తర్వాత సిరీస్ ‘కోట ఫ్యాక్టరీ’లోనూ చాన్స్‌నిచ్చింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చింది. తర్వాత ‘స్పెషల్ ఆప్స్ 1.5’లోనూ నటించింది.కంఫర్ట్ జోన్లో ఉండటం రేవతి ఇష్టం ఉండదు. కంఫర్ట్ మనలోని క్రియేటివిటీని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని చంపేస్తుందని ఆమె అభిప్రాయం. అందుకే సిరీస్ చేస్తూనే ‘కాపిటల్ ఏ, స్మాల్ ఏ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ‘తారే జమీన్ పర్’ ఫేమ్ దర్శిల్ సఫారీ సరసన.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రేవతికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఆమె లైఫ్‌స్టయిల్, నేచర్, ట్రావెల్ ఫొటోస్, వీడియోస్‌ని పోస్ట్ చేస్తూంటుంది.రేవతి నటించిన ‘దిల్ దోస్త్ డైలమా’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.‘అన్నిటికన్నా కూల్ రోల్ స్టూడెంట్ రోల్. అయితే ఆ పాత్రకే పరిమితం కాలేం కదా! యాక్టర్స్ అందరిలాగే నాకూ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ముఖ్యంగా సైకో కిల్లర్‌గా నటించాలనుంది!’ – రేవతి పిళ్లై -
పొలిటీషియన్ కాదు..పొలిటికల్ లీడరే ముఖ్యం
ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే.. పొలిటీషియన్లు కాదనేది \ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి అభిప్రాయం. మహిళా మానవ వనరుల వినియోగంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని అన్ని పార్టీలూ గుర్తించాలని ఆమె అంటున్నారు. రాష్ట్రావతరణ తర్వాత పల్లె జీవనంలో మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేసే సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవతి ఎన్నికల వేళ విధానపరమైన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే.... దృక్కోణంలో మార్పు కావాలి పొలిటీషియన్ ఆలోచన ఎప్పుడూ కూడా తాత్కాలిక అవసరాల వైపే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ధోరణిలో ఉంటుంది. ఆ దృక్కోణం దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వదు. ఎన్నికల్లో గెలవడమే గీటురాయిగా సాధ్యం కాని హామీలు ఇవ్వడం పొలిటీషియన్ లక్షణం. కానీ పొలిటికల్ లీడర్ అలా కాదు. ఓ విజన్ ఉంటుంది. భావి తరాలకు మేలు చేసే ఆలోచనావిధానం ఉంటుంది. రాజకీయాల్లో ఒక్కోసారి వీరు విజయం సాధించకపోవచ్చు. కానీ ఆలస్యంగానైనా వీరి దూరదృష్టే ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలకు హామీలిచ్చేప్పుడు నేతలు ఆలోచించాలి. కార్యాచరణలోకి తేగలమన్న విశ్వాసం ఉన్నప్పుడే హామీలివ్వాలి. అన్ని పార్టీలూ ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకోవాలి. యువశక్తిలో ఉద్వేగమెందుకు? రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగింది. విదేశీ పెట్టుబడులూ పెరిగాయి. పరిశ్రమలూ స్థాపించారు. కానీ ఉపాధి వేటలో యువశక్తిలో నైరాశ్యం కన్పిస్తోంది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక ఉద్యోగాలొస్తాయనేది కలే. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు రంగమే ఉపాధి మార్గం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కన్పిస్తున్నా, యువతలో ఉద్యోగాల్లేవన్న ఆందోళనకు కారణాలున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఉపాధి పొందుతున్న వారిలో మహిళలు 25 శాతమే ఉన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించే దిశగా పాలకులు ఆలోచించాలి. యూత్ ఉద్యోగాలు సాధించే నైపుణ్యం ఉంటేనే రాష్ట్ర సంపద కూడా పెరుగుతుంది. దీన్ని గుర్తించడంలో పాలకులు వెనకపడ్డారనే చెప్పాలి. అమెరికా వెళ్తున్న మన వారు పర్మనెంట్ ఉద్యోగమే చేస్తున్నారా? చేసే ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అయినా మూడు నెలల్లో మరో ఉద్యోగం చూసుకోవడం లేదా? ఇక్కడి యువతలోనూ ఆ స్థాయి నమ్మకం, నైపుణ్యం కల్పించే దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు పాలకులు దృష్టి పెట్టాలి. వలసలు తగ్గాయి.. జీవనం మారింది ఒకప్పుడు తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉండేవి. మహబూబ్‌నగర్ నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఉపాధి అవకాశాల హబ్‌గా మారింది. దీంతో అన్‌స్కిల్డ్ సెక్టార్ నుంచి వలసలు తగ్గాయి. రాష్ట్రంలో 86 శాతం సన్న,చిన్నకారు రైతులున్నారు. ఇప్పుడు వీరు వ్యవసాయం ఒక్కటే ఉపాధి అనుకోవ డం లేదు. కుటుంబంలో ఓ వ్యక్తి వ్యవ ాయం చేస్తే, ఇంకో వ్యక్తి ఇతర ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఉన్నత విద్యావంతులు మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు. ఐఐటీ చేస్తే వ్యవసాయం చెయ్యకూడదని ఉందా? ప్రపంచీకరణ మార్పులను ప్రజలకు అవగాహన కల్పించడంలో అన్ని పార్టీలూ కృషి చేయాలి. సిరిసిల్ల వంటి చేనేత కారి్మకులున్న ప్రాంతాల్లో తెలంగాణ వచ్చాక మార్పు కన్పిస్తోంది. పవర్‌లూమ్స్ ద్వారా ఆదాయం పెంచుకున్నారు. ఇలా అన్ని సెక్టార్‌లోనూ స్కిల్ అభివృద్ధి చేయాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య, యువతలో ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చు. నాణ్యమైన విద్య అందుతుందా? విద్యాబోధనలోనే తేడాలున్నాయి. ఇవి అసమానతలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా రంగాన్నే చూడండి. గురుకులాలు... మోడల్ స్కూల్స్... కేజీబీవీలు... ప్రభుత్వ స్కూళ్ళు... స్థానిక సంస్థల స్కూళ్ళు... ఒక్కో చోట ఒక్కో నాణ్యత ఉంటోంది. నాణ్యమైన విద్య అందరికీ అందించాలనే ధోరణి పాలకుల్లో ఉండాలి. ఈ దిశగా మేధోమథనం జరగాలి. విద్యా విధానాలపై శాశ్వత మార్పులను ఆశించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొల్పే విద్యను నిర్లక్ష్యం చేస్తే భావితరం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నూతన మార్పు తెచ్చేది రాజకీయ పార్టీలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. -వనం దుర్గాప్రసాద్ -
మేడమ్ చీఫ్ మినిస్టర్
డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్ చిత్రం కాదు.. పబ్లిక్ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్. -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్ సోదరి
మహానటి కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే యూత్‌లో మాంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. రీసెంట్గా నానితో దసరా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తిసురేష్ ఫ్యామిలీ నుంచి ఆమె సోదరి ఇండస్ట్రీకి పరిచయం కానుంది. కీర్తి అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్‌కి కాదు.. షార్ట్ ఫిల్మ్ కోసం కావడం విశేషం. కీర్తి తల్లి మేనక నటి కాగా, ఆమె నాన్న సురేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కీర్తి అక్క రేవతి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను స్వయంగా షేర్చేసింది. View this post on Instagram A post shared by Revathy Sureshkumar (@revathysureshofficial) -
ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు... కీలక పదవులు
వాషింగ్టన్: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
మేజర్ ట్రైలర్: ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను..
Mahesh Babu To Launch The Adivi Sesh Major Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్. తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేయగా, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు. 'ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను', 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
Itlu Amma: అమ్మకు ప్రేమకు అవార్డుల వెల్లువ!
‘అంకురం’సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన గొప్ప సందేశాత్మక చిత్రం ‘ఇట్లు అమ్మ’. సుప్రసిద్ధ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డా: బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల సోని ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రానికి భారీ స్పందన లభించింది. అంతేకాదు ఇప్పటి వరకు 47 అవార్డులను దక్కించుకొని రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మూవీ యూనిట్ కృతజ్ఞతలు చెప్పింది. చిత్ర నిర్మాత-బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా: బొమ్మకు మురళి మాట్లాడుతూ.. సోని లివ్ లో ప్రసారమవుతున్న "ఇట్లు అమ్మ" చిత్రాన్ని ఓటిటి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికి 47 అవార్డులు వరించాయి. మరిన్ని అవార్డులు వస్తాయనే నమ్మకముంది. ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా మా అంచనాలను మించి వస్తున్నాయి. ఈ చిత్ర నటీనటులు-సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు’అన్నారు. ‘ఇట్లు అమ్మ’ కథేంటంటే? అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి(రేవతి). ఏ పాపమూ ఎరుగని అసలు చీమకు కూడా హానీ తలపెట్టని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ ‘పిచ్చి తల్లి’ని నిద్ర పోనివ్వవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసు కోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు ఏంటి? ఆ తల్లి హంతకుడిని కనుక్కోగలిగిందా, తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలు తెలియాలంటే.. ‘ఇట్లు అమ్మ’మూవీ చూడాల్సిందే. -
ఇట్లు... రేవతి
శక్తి ఎక్కడో లేదు.. మనలోనే ఉంది.. తెలుసుకోవాలంతే... శాశ్వత ఆనందం.. అశాశ్వత ఆనందం... తేడా తెలుసుకోవాలంతే... ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?.. తెలుసుకోవాలంతే... పిల్లలను ఏ వయసు వరకూ గైడ్ చేయాలి.. ఆ విషయాన్ని తెలుసుకోవాలంతే... వెండితెరపై గుర్తుండిపోయే పాత్రల్లో అలరిస్తున్న రేవతి ‘ఇట్లు.. రేవతి’ అంటూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు. ఆమె టైటిల్ రోల్లో ‘అంకురం’ ఫేమ్ ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘ఇట్లు అమ్మ’ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రేవతితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► కథలు ఎంచుకునే విషయంలో మీరు మొదటి నుంచి సెలెక్టివ్‌గా ఉంటారు. ‘ఇట్లు అమ్మ’ అంగీకరించడానికి కారణమేంటి? రేవతి: నటిగా 30 ఏళ్లు దాటిన తర్వాత మంచి పాత్రలు రావడం చాలా తక్కువ అవుతుంది. నిజానికి నేను బాగా కనెక్ట్ అయ్యే పాత్రలు చాలా తక్కువ వస్తున్నాయి. ‘ఇట్లు అమ్మ’ స్క్రిప్ట్ వినగానే కనెక్ట్ అయ్యాను. అందుకే వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాను. సి.ఉమామహేశ్వరావు డైరెక్షన్లో నేను ‘అంకురం’ (1992) సినిమా చేశాను.. మంచి దర్శకుడు. ఆయన ‘ఇట్లు అమ్మ’ కథ’ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. ► ‘ఇట్లు అమ్మ’లో కొడుకుని వెతికే సింగిల్ మదర్ పాత్రలో కనిపించారు. సినిమాలో ‘సింగిల్ మదర్’ గెలుస్తుంది. కానీ జీవితంలో సింగిల్ మదర్ గెలిచే అవకాశం ప్రస్తుత సమాజం ఇస్తుందంటారా? సమాజమంటే మనమే కదా. ఓ మంచి సమాజాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఇదే విషయాన్ని ‘ఇట్లు అమ్మ’లో చెప్పాం. ‘ఇట్లు అమ్మ’ ఒక అమ్మ, ఒక స్త్రీ కథ మాత్రమే కాదు. నిజానికి మనం, మన ఇల్లు, మన కుటుంబం, స్నేహితులు, మనమందరం అని మాత్రమే ఆలోచిస్తాం. దీన్ని దాటి చూడం. ఏం జరుగుతున్నా పెద్దగా పట్టించుకోం. ఏదైనా జరిగితే మాట్లాడుకుని వదిలేస్తాం తప్పితే మన వంతుగా ఏం చేయాలో ఆలోచించం. ‘ఇట్లు అమ్మ’ లో నేను చేసిన రోల్ కూడా ఇదే. బాల సరస్వతి (‘ఇట్లు అమ్మ’లో రేవతి చేసిన పాత్ర) సాధారణ గృహిణి. నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటుందామె. కానీ తన జీవితంలో ఎదురయ్యే సందర్భాలు తనని, తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయి? తను ఎలా మారింది? అన్నది కథ. ఇంకా బాల సరస్వతి చాలా తెలివైనది. దైవభక్తి చాలా ఎక్కువ. నేనస్సలు కాదు. ► అంటే... మీరు దేవుణ్ణి నమ్మరా? నమ్మనని కాదు. బాల సరస్వతి నమ్మినంతగా నమ్మకం లేదు. అయితే ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతాను. నా వెనక ఓ శక్తి ఉందని నమ్ముతాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తాను. కానీ ప్రత్యేకంగా ఓ ప్రదేశానికి వెళ్లి పూజించడాన్ని నమ్మను. మా ఇంట్లో రోజువారి పనుల్లో దీపం వెలిగించడం కచ్చితంగా ఒకటి. దైవభక్తికి, ఆధ్యాత్మికతకు చాలా తేడా ఉంది. నేను ‘అహం బ్రహ్మాస్మి’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. శక్తంతా మనలోనే ఉందని గ్రహించాలి. మనం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి. ► మీ వెనక ఓ శక్తి ఉందన్నారు. ఆ శక్తి మీ జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తోందంటారా? మీకు సహాయపడిందంటారా? మన వెనక ఉండే శక్తి కేవలం గైడ్ మాత్రమే. అది మనకు మంచి జీవితం, మంచి కెరీర్ ఇవ్వదు. శక్తి ఉంది కదా అని సైలెంట్‌గా కూర్చోకూడదు. మన కష్టం, మన శ్రమ మాత్రమే ఇస్తాయి. వెనకాల ఉండే ఫోర్స్ గైడ్ చేస్తుంది. ఆ గైడెన్స్ ఉందని నా నమ్మకం. ఇంకా నా గైడింగ్ ఫోర్స్ అంటే నా కుటుంబమే. అమ్మ, నాన్న, సిస్టర్ నా వెనక ఉన్నారు... నన్ను నడిపించారు... నడిపిస్తుంటారు. అలానే నిర్ణయాల విషయంలో ఇది సరైనదా? కాదా, తప్పా? ఒప్పా అనేది మాత్రం నాకు తెలిసిపోతుంది. ► సమాజంలో మ్యారీడ్ ఉమన్ జీవితానికి ఉండే భరోసా సింగిల్ మదర్‌కి ఉంటుందంటారా? జీవితం ఎవ్వరికీ సాఫీగా ఉండదు. సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య... గొడవ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. ఎదుర్కొనే క్రమంలో మనం నేర్చకున్న విషయాలను పిల్లలకు చెప్పి, ఎలా ఎదుర్కొనేలా తయారు చేస్తాం అనేది ముఖ్యం. లైఫ్‌లో ఏదీ సులువు కాదు. ప్రతి దాని వెనక ఏదో ఒక కష్టం ఉంటుంది.. సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఓ యుద్ధం చేస్తూనే ఉంటారు. ► మీ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఆయన నేర్పిన ధైర్యమే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా.. మా అమ్మానాన్న నన్ను, నా సిస్టర్ని చాలా బాగా పెంచారు. అసలు లింగ వివక్ష అనేది ఉంటుందని నాకు 30 ఏళ్లు వచ్చాకే తెలిసింది. అప్పటివరకూ అమ్మాయిని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా చూస్తారనే విషయమే నాకు తెలియదు. ఆర్మీలో అందర్నీ ఒకేలా చూశారు. దాంతో మాకు అబ్బాయి వేరు... అమ్మాయి వేరు అనే ఫీలింగ్ కలగలేదు. ► కరోనా లాక్డౌన్.. ప్రపంచం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి.. ఒక అనిశ్చితి ఉందనేది చాలామంది ఫీలింగ్. మీరేం చెబుతారు? నిజమే. ప్రస్తుతం మనందరం ఓ అయోమయ స్థితిలో ఉన్నాం. ఎటు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఈ కోవిడ్, లాక్డౌన్ మనందరినీ ఏది ముఖ్యమో ఆలోచించేలా చేసింది. కేవలం మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్నవి కూడా మనం పట్టించుకోవాలి. అప్పుడే మన పిల్లలకు ఓ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలం. వాళ్లకు డబ్బు, ఇల్లు కాదు మంచి విద్య, మంచి సమాజాన్ని, సురక్షితమైన వాతావరణాన్నీ ఇవ్వాలి. మన పిల్లలకు మనమిచ్చే గొప్ప సంపద అదే. ► పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని, సమాజాన్ని ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మన సమాజం అమ్మాయిలకు సురక్షితంగా ఉందంటారా? చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీటికి కారణమేమంటారు? నాకు నిజంగా తెలియదు. కారణం ఇదీ అని విశ్లేషించగలిగి ఉంటే పరిష్కారం చెప్పేదాన్ని. ప్రస్తుతం అందరి అవసరాలు మారిపోయాయి. ఇప్పటివారి అవసరాలు మన ముందు తరాల వాళ్లకంటే మారిపోయాయి. మా అమ్మ వాళ్లు ఒకలా బతికారు. మేము ఒకలా. ఇప్పుడు మా పిల్లలు ఒకలా ఉన్నారు. ఆ అవసరాల కోసం మనం ఎంతలా తాపత్రయపడుతున్నాం? మనం ఎంత నైతిక భాధ్యతతో ఉంటున్నాం అనేది మారిపోయింది. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఫిలాసఫీ మారిపోయింది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కే ఇది బాగా మారిపోయింది. కాకపోతే ఒకప్పటి విధానాల్లో కొన్నింటిని తిరిగి తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలో నిజంగా తెలియదు. అయితే మన పిల్లలతో మనం మాట్లాడాలి. నిజమైన సంతోషమేంటి? శాశ్వత ఆనందమేంటి? అశాశ్వతం ఏంటి? అనే విషయాలను వాళ్లకు వివరించాలి. ► మాకు ‘ప్రైవసీ’ కావాలని ఇప్పటి తరం అంటోంది. ఎక్కువ స్వాతంత్య్రం ఇచ్చినా ఇబ్బందే అంటారా? అసలు పిల్లల్ని ఏ వయసు వచ్చేవరకూ తల్లిదండ్రులు గైడ్ చేయాలి? 18ఏళ్ల వయసొచ్చే వరకే పిల్లల్ని మనం గైడ్ చేయాలి. ఆ తర్వాత వాళ్లను వాళ్లే గైడ్ చేసుకోవాలి. అలా వాళ్లను వాళ్లు గైడ్ చేసుకునే ధైర్యం, తెగువ అన్నీ మనమే ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని గైడ్ చేయడం అనేది నాన్సెన్స్ అంటాను నేను. వాళ్లు చిన్న చిన్న తప్పులు చేయాలి.. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి. వాటిని సరిదిద్దుకోవడం తెలుసుకోవాలి. అలా చేయకూడదు అని ఆలోచించగలగాలి. అయితే 10–12 ఏళ్ల వయసులోనే ఈ ఫౌండేషన్ పడేలా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు చాలా ప్రేమ, భద్రత ఇవ్వాలి. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే వాళ్లు మనతో నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పడం నాన్సెన్స్. ► ఓకే... మీ మాటలను బట్టి మీ అమ్మాయి మహీకి అన్నీ వివరంగా చెబుతారనిపిస్తోంది.. అవును. ప్రతి తల్లికీ బిడ్డల మీద ప్రేమ ఉన్నట్లుగానే నాకూ తనంటే చాలా ప్రేమ. ప్రేమతో పాటు సెక్యూర్డ్ ఫీలింగ్‌ని కలగజేస్తాను. మహీ తనంతట తాను నిలబడటానికి గైడ్ చేస్తూ ఉంటాను. తను ఇండిపెండెంట్ అమ్మాయి. ► మహీ ఏం చదువుతోంది? థర్డ్ గ్రేడ్‌లో ఉంది. ► ఏ ఇండస్ట్రీలో అయినా స్త్రీలకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులను బయటకు చెబితే ‘తప్పు తనదేనేమో’ అనేవాళ్లు ఉంటారు. మరి.. మీరు మీకు ఎదురైన ఇబ్బందులు చెప్పుకోవడానికి భయపడిన సందర్భాలున్నాయా? అదృష్టవశాత్తు లేవు. మొదట్నుంచీ కూడా నాకు చాలా తక్కువ మాట్లాడటం అలవాటు. కానీ మాట్లాడే విషయాన్ని మాత్రం చాలా విజన్‌తో, అవగాహనతో మాట్లాడతాను. దాంతో అందరూ నా మాట వినేవారు. ఈ సందర్భంగా నేనొక విషయం చెబుతాను. ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అనే విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అది చాలా ముఖ్యం. ► మంచి విజన్‌తో, అవగాహనతో మాట్లాడితే అందరూ వింటారని అన్నారు. మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు మీ మాట వినే అవకాశం ఉంటుంది.. 1996 తర్వాత మళ్లీ మీరు రాజకీయాల్లోకి రాలేదేం? అలా ఆలోచించే 1996 ఎన్నికల్లో నిల్చున్నాను కూడా. కానీ ప్రస్తుతం ఆలోచించడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది 24/7 జాబ్. ప్రస్తుతం నాకు ఓ పాప ఉంది. తనని చక్కగా పెంచాలి. మంచి సిటిజన్‌గా మార్చాలి. ఈ బాధ్యత పూర్తయ్యాక రాజకీయాల గురించి ఆలోచిస్తానేమో ఇప్పుడే చెప్పలేను. ► మీరు హీరోయిన్గా చేసే సమయంలో కథలు చాలా బావుండేవి. ఇప్పుడు అలాంటి కథలు ఉన్నాయంటారా? కథలు ఉన్నాయి.. అయితే కథలు చెప్పే విధానంలో మార్పు వచ్చింది. కొన్ని మలయాళం, హిందీ సినిమాల్లో కథ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. మంచి సినిమాలను మనందరం సపోర్ట్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు తీస్తారు. ► ఫైనల్లీ.. కొంత గ్యాప్ తర్వాత ‘ది లాప్ట్ హుర్రా’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు... ఆ సినిమా గురించి? చాలా సంవత్సరాల క్రితం చదివిన కథ ఇది. ఆ కథను మంచి స్క్రిప్ట్‌గా తయారు చేశాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా నవ్వుతూ ఎదుర్కొనే ఓ తల్లి కథ ఇది. ఈ కథకు కాజోల్ సరిపోతారని ఆమెను తీసుకున్నాం. ►ప్రస్తుత సోషల్ మీడియా జనరేషన్లో మంచి విషయంలోనూ చెడు చూడటం కామన్ అయింది... ఈ విషయం గురించి ఏం చెబుతారు? తరాలు మారుతుంటాయి. ఆ మార్పుతో మనం ముందుకు వెళ్లాలి. మంచి, చెడు అని చెప్పలేం. సోషల్ మీడియాలో విమర్శలు అంటున్నారు. అసలు ఆ విమర్శలను ఎందుకు పట్టించుకుంటున్నారు? వాటికి ఎందుకు అంత టైమ్ కేటాయిస్తున్నారు? నేను సోషల్ మీడియాని నాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం వరకే ఉపయోగిస్తాను. ఏదైనా తెలుసుకోవడానికో, నేర్చుకోవడానికో, నాకు తెలిసింది పంచుకోవడానకో... అంతే. విమర్శలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా అవే తగ్గిపోతాయి. అది నా నమ్మకం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకుందాం. మన పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎదురింట్లో వాళ్లకి ఫ్రిజ్ ఉందా? పక్కింట్లో వాళ్లకు ఎలాంటి చీర ఉంది? అనేవి పట్టించుకొని ప్రతీది ఆలోచిస్తేనే ప్రాబ్లమ్. మన గురించి మనం చూసుకుని, మన చుట్టూ ఉండేవాళ్ల విషయాలను విమర్శించకుండా ఉంటే ఏ గొడవా ఉండదు. – డి.జి. భవాని -
ఒలింపిక్ స్ఫూర్తి..థ్యాంక్యూ అమ్మమ్మా!
అమ్మమ్మలు, నానమ్మలు ఏం చేస్తారు? ఇదిగో దేశానికి ఇలాంటి వరాల మూటను అందిస్తారు. తమిళనాడు నుంచి ఒలింపిక్స్‌కు పయనమైన 23 ఏళ్ల రేవతి వీరమణి 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలే పరుగులో భారత్‌కు మెడల్ అవకాశాలపై ఆశలు రేపుతోంది. ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన రేవతిని పనిలో పెట్టు అని అందరూ ఆమె అమ్మమ్మకు సూచిస్తే ‘నా మనవరాలు చదువుకోవాలి’ అని ఇటుక బట్టీల్లో తాను శ్రమించి రేవతిని క్రీడాకారిణిని చేసిందా అమ్మమ్మ. అందుకే ‘ఇదంతా మా అమ్మమ్మ’ ఘనతే అంటోంది రేవతి. విధి జీవితంతో ఆట ఆడొచ్చు. కాని విధిని గెలిచే ఆట మనం తప్పక ఆడాలి. 2016. కోయంబత్తూరులో 32వ జూనియర్ అథ్లెటిక్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. 100 మీటర్ల పరుగు ఫైనల్. ట్రాక్ మీద ఉన్న ఆ అమ్మాయిని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జమాజట్టీల్లాంటి జూనియర్ అథ్లెట్లు ట్రాక్ మీద ఉన్నారు. తుపాకీ మోగింది. ఆ అమ్మాయి చిరుతలా కదిలింది. రెప్పపాటు సమయంలో 100 మీటర్లను ముగించింది. 12.2 సెకన్ల కాలంలో 100 మీటర్లను ఫినిష్ చేసిన ఆ అమ్మాయి పేరేమిటా అని అందరూ ఆరా తీశారు. రేవతి వీరమణి. ఆ తర్వాత ఆ చాంపియన్‌షిప్‌లో రేవతి 200 మీటర్లను, 4 X 100 రిలేను గెలిచి తమిళనాడును పతకాల పంటలో రెండోస్థానంలో నిలిపింది. అప్పుడే అందరూ అనుకున్నారు ఈ అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళుతుందని. ఇవాళ అదే జరిగింది. జపాన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పాల్గొననుంది రేవతి. కచ్చితంగా మెడల్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. అమ్మమ్మ అరమ్మాళ్తో రేవతి వీరమణి ఉత్త కాళ్లతో పరిగెత్తి... రేవతిది మదురైకు ఆనుకుని ఉండే సక్కిమంగళం అనే చిన్న పల్లె. ఆమెకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఉదర సంబంధమైన వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత ఆరు నెలలకే తల్లి బ్రెయిన్ ఫీవర్‌తో ప్రాణాలు వదిలింది. రేవతి, రేవతి చెల్లెలు అనాథలయ్యారు. ఆ సమయంలో వారి వెనుక ఉక్కు గోడలా నిలిచి కాపాడుకుంది అమ్మమ్మ అరమ్మాళ్. ఇద్దరు మనవరాళ్లను ఆమె ప్రాణంగా పెంచుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె అతి పేదరాలు. పొలాల్లో, ఇసుక బట్టీల్లో పని చేస్తేనే పొట్ట నిండేది. ‘నువ్వు వాళ్లను ఏం పెంచుతావు. పనిలో పెట్టు’ అని బంధువులందరూ చెప్పినా ‘నా మనవరాళ్లను చదివించుకుంటాను’ అని ఆమె కష్టపడింది. రేవతిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఇంటర్వెల్లో ఉత్త కాళ్ల మీద వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మను చూసి వెళ్లేది. ‘తూనీగలాగా పరిగెడతా ఉంది’ అనుకున్న అమ్మమ్మ పరుగులో రేవతిని ప్రోత్సహించింది. షూస్ కొనుక్కునే స్తోమత కూడా లేని రేవతి ఉత్త కాళ్లతో పల్లె రోడ్ల మీద పరుగులు తీస్తూ ప్రాక్టీసు చేసేది. ఆ సమయంలోనే మదురైకి చెందిన కోచ్ కన్నన్ దృష్టిలో పడటంతో రేవతి జీవితం మారింది. అమ్మమ్మను ఒప్పించి ఇంటర్ వరకూ ప్రాక్టీసుకు ఒప్పుకున్న అరమ్మాళ్ డిగ్రీ మదురైలో ఉండి చదువుకుంటూ రన్నింగ్‌ను సాధన చేయాలని కోచ్ చెప్పేసరికి భయపడింది. కాని కాలేజీలో సీటు ఫ్రీ హాస్టల్ ఏర్పాటు చేశాక అంగీకరించింది. మదురై పల్లెల్లో పిల్లలు చాలా వేగంగా ఆటలు ఆడతారు. వారికి జల్లికట్టు, మంజు విరాట్టు వంటి ఆటలు వేగాన్ని ఇస్తాయి. రేవతికి కూడా అలాంటి వేగం వచ్చింది. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించి తమిళనాడు ప్రభుత్వ ప్రోత్సాహం అందుకుంది. అలాగే రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం పొందింది. ఆమె చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అయ్యింది. గాయపడినా... ఆసియా క్రీడల్లో రేవతి 4 X 400 రిలేలో 4వ స్థానంలో వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ షిప్లో కూడా పాల్గొంది. కాని ఆ తర్వాత ఆమెకు మోకాలి సమస్య వచ్చింది. ‘నేను చాలా కష్టపడాల్సి వచ్చింది దాని నుంచి బయటపడటానికి’ అని రేవతి అంది. రేవతి అమ్మమ్మ ఆ సమయంలో మనవరాలి ఆత్మస్థయిర్యం చెదరకుండా చూసుకుంది. ‘ఆమె నన్ను ఆపలేదు. వెళ్లు. పరిగెత్తు’ అంది. కోచ్‌ల సాయంతో మళ్లీ నేను మామూలు స్థితికి వచ్చాను’ అంది రేవతి. ఒలంపిక్స్ సన్నాహాల్లో భాగంగా పాటియాలాలో జరిగిన క్యాంప్‌లో 4 X 400 మిక్స్డ్ రిలేలో 54 సెకన్ల వ్యక్తిగత సమయాన్ని నమోదు చేసింది రేవతి. ∙∙ రేవతి జపాన్‌కు వెళ్లింది. ఆమె అమ్మమ్మ ఎప్పటిలాగే పొలంలో పని చేసుకుంటూ మనవరాలు తెచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తోంది. రేవతి మెడల్ తెస్తే అందులో సగం ఆమె అమ్మమ్మకే దక్కుతుంది. అమ్మమ్మ లేకపోతే ఇవాళ నేను లేను. కూతురి పెళ్లి చేసి బాధ్యతలు తీరాయి అనుకునే వయసులో నేను, నా చెల్లి ఆమె ఒడికి చేరాము. ఆమె తిరిగి మాకు అమ్మైంది. ఆమెకు చెప్పకుండా నేను ఏ పనీ చేయను. మేము కాకుండా ఆమెకు వేరే లోకం లేదు. – రేవతి -
నాన్నపై ప్రేమతో..
విశాఖ :ఈమె పేరు రేవతి. చదివింది డిగ్రీ. కుటుంబ భారాన్ని మోయడానికి మెకానిక్‌గా మారింది. విశాఖ సుజాతానగర్ ప్రాంతానికి చెందిన కె.రాముకు కొడుకు లేని లోటు తీరుస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. కరోనా కష్ట కాలంలో తండ్రి మెకానిక్ షాపులో బైక్‌లు రిపేర్ చేస్తూ కుటుంబానికి చేయూతనందిస్తోంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. -
నేడు నిఖిల్ నిశ్చితార్థం
సాక్షి, బెంగళూరు: నేడు (సోమవారం) నగరంలోని తాజ్ వెస్టెండ్ హోటల్లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతి నిశ్చితార్థం జరగనుంది. ఆదివారం కుమారస్వామి బెంగళూరులో తన నివాసంలో నిఖిల్ నిశ్చితార్థం గురించి మీడియాతో మాట్లాడారు. వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఇలా సుమారు నాలుగైదు వేల మంది పాల్గొనబోతున్నారు. నిఖిల్ పెళ్ళిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నా. ‘ఈ పెళ్లి పైన నేను అనేక ఆశలు పెట్టుకున్నా. నటునిగా, రాజకీయ నేతగా నా కుమారుడిని ఆశీర్వదించిన వారినందరినీ ఈ పెళ్ళికి ఆహ్వానిస్తా. రామనగర–చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ’ని తెలిపారు. జాగ్వార్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిఖిల్ గత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ చేతితో పరాజయం పాలయ్యారు. -
జాక్‌పాట్ రెడీ
జ్యోతిక ప్రధాన పాత్రలో కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాక్‌పాట్’. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హీరో, జ్యోతిక భర్త సూర్య శివకుమార్ నిర్మించిన ఈ సినిమాని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ ఈనెల 21న విడుదల చేస్తోంది. ‘‘పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. జ్యోతికకు తెలుగులో కూడా చాలా ఇమేజ్ ఉంది. పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ‘జాక్‌పాట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో జ్యోతిక, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీఖాన్, జగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజశేఖర్ కరూపసుందర పాండియన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద కుమార్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్ స్పెషల్
జ్యోతిక, రేవతి ముఖ్య తారాగణంగా నటించిన చిత్రం ‘జాక్‌పాట్’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుక చెన్నైలో జరిగింది. శనివారం తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఆగస్టులో చిత్రం విడుదలకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ – ‘‘జాక్‌పాట్’ నాకు, జ్యోతికకూ స్పెషల్ ఫిల్మ్. ముఖ్యంగా నాకు చాలా స్పెషల్. వేరే నిర్మాతలు ఎవరు తీసినా సరిగా రాదేమోనన్న భయంతో నా బ్యానర్‌పై నేనే నిర్మించాను. జ్యోతిక, రేవతిగారిని ఈ సినిమాలో చూస్తుంటే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఏదైనా మల్టీస్టారర్ మూవీ చేశారా? అనిపిస్తోంది. ఇద్దరూ అద్భుతంగా నటించారు. మా బ్యానర్‌కు మరో హిట్ రాబోతుందని నమ్ముతున్నాను. నా సినిమాలను ఆదరిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ ‘జాక్‌పాట్’ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత మా సొంత బ్యానర్లో సినిమా చేశాను. ఈ సినిమాలోని యాక్షన్ కోసం చాలా స్టంట్స్ చేయాల్సి వచ్చింది. ముందు కాస్త భయపడినా మా ఇంట్లోనే ఉన్న యాక్షన్ హీరో (హీరో, జ్యోతిక భర్త సూర్య) నన్ను ప్రోత్సహించారు. అందువల్ల ఫైట్స్ చేయగలిగాను. రేవతిగారితో కలిసి నటించడం హ్యాపీ’’ అన్నారు జ్యోతిక. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
పోలీసుల అదుపులో రేవతి
-
పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ
సాక్షి, బంజారాహిల్స్ : మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. రేవతి నివాసం వద్ద నుంచి స్టేషనుకు తరలించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లక్ అంటే జ్యోతికదే..
లక్కు అంటే నటి జ్యోతికదే. వివాహం అయ్యి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత కూడా హీరోయిన్గా రాణిస్తున్నారు. అదీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మంచి కథా బలం ఉన్న చిత్రాలే ఎంచుకుంటున్నారు. అలా ఆమె నటించిన 36 వయదినిలే, మగళీర్ మట్టుం, కాట్రిన్ మొళి చిత్రాలు సక్సెస్ సాధించాయి. తాజాగా జ్యోతిక నటిస్తున్న చిత్రానికి జాక్‌పాట్ అనే టైటిల్ నిర్ణయించారు. గులేభకావళి వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో నటి రేవతి ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ఒక పోస్టర్లో జ్యోతిక చాలా స్టైలిష్‌గా నిలబడి ఉండగా, మరో పోస్టర్లో జ్యోతిక, రేవతి పోలీస్ దుస్తుల్లో నిలబడి ఉన్న దృశ్యం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. మొత్తం మీద జాక్‌పాట్ చిత్రం కూడా పోలీస్ ఇతివృత్తంతో కూడినదిగా తెలుస్తోంది. నటుడు యోగిబాబు, మొట్ట రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, మన్సూర్‌అలీఖాన్, జగన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనందకుమార్ ఛాయాగ్రహణను, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ జాక్‌పాట్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం నటి జ్యోతిక తన మరిది కార్తీతో కలిసి జీతు జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. -
కామెడీ జాక్‌పాట్
టౌన్‌లోని క్రిమినల్స్‌ను రఫ్ ఆడించడానికి పోలీస్ ఆఫీసర్లు జ్యోతిక, రేవతి సిద్ధమయ్యారు. మరి ఈ విలన్లను పట్టించేసి ప్రమోషన్ జాక్‌పాట్ కొట్టేస్తారా? అది సినిమా చూసి తెలుసుకోవాలి. జ్యోతిక, రేవతి ముఖ్యపాత్రల్లో కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‌పాట్’. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సూర్య రిలీజ్ చేశారు. ‘‘అదిరిపోయే యాక్షన్ కామెడీ చిత్రం చూడ్డానికి రెడీగా ఉండండి. రేవతి, జ్యోతిక కలిసి నటించడం మనందరికీ జాక్‌పాట్’’ అని సూర్య పేర్కొన్నారు. -
లాఫింగ్ రైడ్
నెల రోజులకు పైగా సెట్లో ఫన్ రైడ్ చేశారు కథానాయికలు రేవతి అండ్ జ్యోతిక. ఆ నవ్వుల హంగామాను ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించారు. రేవతి, జ్యోతిక ముఖ్య తారలుగా ‘గులేబకావళి (2018)’ ఫేమ్ ఎస్. కల్యాణ్ దర్శకత్వంలో ఆ మధ్య ఓ సినిమా మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు టీమ్. ఇంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయడం అంటే టీమ్ అంతా ఎంత అంకితభావంతో వర్క్ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఈ సినిమా చివరి రోజు చిత్రీకరణకు హీరో సూర్య కూడా హాజరుకావడం విశేషం. ఈ చిత్రానికి సూర్య ఒక నిర్మాత. ఫుల్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ద్విచక్ర వాహనం కూడా నడిపారు జ్యోతిక అండ్ రేవతి. ఇంకా యోగి బాబు, మన్సూర్ అలీ, ఆనంద్‌రాజ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. -
గుమ్మడికాయ కొట్టారు
జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. పేరులోనే జ్యోతిని చేర్చుకున్న నటి జ్యోతిక కథానాయకిగానూ వెలిగిపోతున్నారు. ముఖ్యంగా వివాహానంతరం హీరోయిన్ సెంట్రిక్ పాత్రల్లో నటిస్తూ వసుస విజయాలను అందుకుంటున్నారు. అలా ఈమె నటించిన 36 వయదినిలే, మగళీర్ మట్టుమ్, నాచ్చియార్, కాట్రిన్ మొళి చిత్రాల్లో మహిళలకు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించి సక్సెస్ సాధించారు. ప్రస్తుతం జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రాన్ని ఆయన భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ‘గులేభకావళీ’వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రంలో జ్యోతికతో పాటు నటి రేవతి, యోగిబాబు, ఆనంద్‌రాజ్, మన్సూర్‌అలీఖాన్, మొట్టైరాజేంద్రన్, జగన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇదీ వినోదభరితంగా సాగే చిత్రమంటున్నాయి చిత్ర వర్గాలు. అంతే కాకుండా, నటుడు సూర్య నిర్మిస్తుండడంతో మంచి సందేశం కూడా ఉంటుందని భావించవచ్చు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇటీవల చెన్నైలోని బిన్ని మిల్లులో ఒక పాటను చిత్రీకరించారు. చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం సింగిల్ షెడ్యూల్లో 35 రోజుల్లో పూర్తి చేసినట్లు యూనిట్ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఆనందకుమార్ ఛాయాగ్రహణను, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయండి..
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో విజయ్ సేతుపతి అరెస్ట్ చేయలంటూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహత్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’సూపర్ డీలక్స్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విశ్లేషకులు, నెటిజన్లు ఈ చిత్రాన్ని విమర్శనలతో బంతాడుకుంటున్నారు. తాజాగా హిజ్రాలు... చిత్ర హీరో విజయ్ పేతుపతి, దర్శకుడు త్యాగరాజు కుమారరాజాలపై మండిపడుతున్నారు. హిజ్రాల సంఘం నిర్వాహకులు రేవతి, ప్రేమ, కల్కి సూపర్ డీలక్స్ చిత్రాన్ని తీవ్రంగా ఖండిస్తూ, విజయ్‌సేతుపతిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో విజయ్ సేతుపతి అంటే తమకు గౌరవం ఉందని, అయితే సూపర్ డీలక్స్ చిత్రంలో హిజ్రాగా నటించిన తరువాత ఆయనపై ఉన్న గౌరవం తగ్గిపోయిందన్నారు. హిజ్రాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు చిత్రంలో చూపించారని ఆరోపించారు. చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన శిల్పా పాత్రను ముంబైలో పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షం ఎత్తించేవారికి విక్రయించినట్లు చూపించారన్నారు. నిజానికి హిజ్రాలు పిల్లలపై ప్రేమ చూపుతారని, వారు ఎన్నటికీ పిల్లలను కిడ్నాప్ చేయరని అన్నారు. ఇక బెదిరింపులకు భయపడి హిజ్రాలు ఎలాంటి అత్యాచారాలకు పాల్పడడం లేదని తెలిపారు. అయితే అలాంటి సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇకపోతే హిజ్రాలకు పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నది విజ్ఞానపరమైన నిజం అన్నారు. అలాంటిది ఒక పిల్లాడికి తండ్రి అయిన విజయ్ సేతపతి హిజ్రాగా మారినట్లు చూపించారన్నారు. ఇలాంటి పలు అంశాలు చిత్రంలో తమను అవమానానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం అయిన చిత్ర దర్శకుడు, అందులో నటించిన నటుడు విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
గ్రహాంతరవాసులై ఉంటారు
‘‘మీటూ ఓ ఫ్యాషన్. ఇది ఎక్కువ కాలం నిలబడదు’’ అని ఇటీవలే మలయాళ నటుడు మోహన్‌లాల్ కామెంట్ చేశారు. మోహన్‌లాల్ పేరుని ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలకు స్పందించినట్లుగా నటి రేవతి చేసిన ఓ ట్వీట్ స్పష్టం చేస్తోంది. ‘‘మీటూ ఓ ఫ్యాషన్ అంటూ ఓ పాపులర్ యాక్టర్ సంబోధించారు. అలాంటి వాళ్లలో సున్నితత్వం ఎలా తీసుకురాగలం? దర్శకురాలు అంజలీ మీనన్ చెప్పినట్టు ‘వేధింపులకు గురి అవ్వడం ఎలా ఉం టుందో వాళ్లకేం తెలుసు? బహుశా వాళ్లంతా గ్రహాంతరవాసులు అయ్యుండొచ్చు. జరిగిన చేదు అనుభవాలు బయటకు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో వాళ్లకు తెలియదు. అది ఎలాంటి మార్పు తీసుకొస్తుందో కూడా వాళ్లకు తెలియదు కదా’’ అని ట్వీట్ చేశారు రేవతి. మలయాళ నటి భావనపై జరిగిన లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌ను మళ్లీ అమ్మ (అసోసియేషన్ ఫర్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)లో సభ్యుడిగా తీసుకున్నారని నటి రేవతి, పార్వతి, రీమా కళ్లింగల్ మరికొందరు ప్రశ్నించారు. ఆ తర్వాత వీళ్లంతా కలిసి డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్) ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో స్త్రీల సంరక్షణ, వివక్ష లేని వాతావరణం కోసం పోరాటం చేస్తున్నారు. -
నేలబావిలో జారిపడి డైట్ విద్యార్థిని మృతి
విజయనగరం ,మక్కువ: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎలాగైనా ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావాలని రాత్రీపగలూ కష్టపడి చదువుతోంది. తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకున్న ఆమె ఆశలు నేలబావి రూపంలో గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండబుచ్చమ్మపేటకు చెందిన తెర్లి రేవతి (22) డైట్ కోర్సు చేసి డీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. మంగళవారం సాయంత్రం దుస్తులు ఉతికేం దుకు గ్రామ సమీపంలోని నేలబావికి వెళ్లింది. దుస్తులు ఉతికేందుకు నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో రేవతి బావిలో పడిపోయిన విషయం తెలి యలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేవతి తల్లిదండ్రులు అప్పలనాయుడు, వరలక్ష్మి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద రేవతి కనిపించకపోవడంతో గ్రామంలో వెతికారు. అలా గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లగా రేవతి పాదరక్షలు, దుస్తులు కనిపించడంతో బావిలోకి టార్చిలైట్ వేసి చూడగా రేవతి మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కె. కృష్ణప్రసాద్ బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. కొండబుచ్చమ్మపేటలో విషాదఛాయలు.. అందరితో చనువుగా ఉండే రేవతి ఇక లేదనే తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు, తోటి విద్యార్థులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పలనాయుడు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. రేవతి రెండో సంతానం. చదువులో చురుకుగా ఉండే రేవతి తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉందని, ఈలోగా ఇలా జరిగిపోయిందని గ్రామస్తులు విషణ్ణవదనాలతో తెలిపారు. -
భవిష్యత్తు బాగుండాలనే...
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీ సమానత్వం కోసం, సురక్షితంగా పనిచేసే వాతావరణం ఏర్పాటు కోసం ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్ (డబ్లు్యసీసీ)’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో రేవతి, పార్వతి, రమ్య నింబసేన్, పద్మ ప్రియా ముఖ్య సభ్యులు. తాజాగా ఈ కమిటీ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)’ అధ్యక్షుడు మోహన్‌లాల్ వైఖరిని ఖండిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. లైంగిక వేధింపుల కేస్ ఉన్న దిలీప్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నటి భావనపై లైంగిక దాడి కేసులో దిలీప్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి ‘అమ్మ’ సభ్యత్వం తొలగించారు. మళ్లీ బెయిల్ మీద బయటకు రాగానే ఆ సభ్యత్వం పునరుద్ధరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బాధితులను సపోర్ట్ చేయకుండా అసోసియేషన్ నిందితులవైపు ఉండటమేంటి? అని ప్రశ్నించారు రేవతి. స్త్రీలను ఇండస్త్రీలో సమానంగా ట్రీట్ చేయాలని ఈ మీటింగ్‌లో కోరారు. ‘‘ఈ పోరాటమంతా భవిష్యత్తులో మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సురక్షితంగా పని చేసుకోవడం కోసం’’ అని పేర్కొన్నారామె. -
వెండితెరకు వైరస్
ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో నిఫా వైరస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని. అందర్నీ గడగడలాడించిన ఈ భయంకరమైన వైరస్‌ని బేస్ చేసుకొని మలయాళ దర్శకుడు ఆషిక్ అబు ఓ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. ‘వైరస్’ పేరుతో తెరకెక్కబోయే ఈ రియలిస్టిక్ డ్రామాలో భారీ తారాగణం కనిపించబోతున్నారు. రేవతి, రీమా కళ్లింగల్, పార్వతీ, టావినో థామస్, రమ్యా నంబీసన్, చెంబు వినోద్ వంటి నటీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో రియలిస్టిక్ సంఘటనలతో తెరకెక్కించిన ‘టేకాఫ్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. -
ఈ పెళ్లి వద్దంటూ పీజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, భువనగిరి అర్బన్ : తనకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ యువతి మనస్తాపానికి గురై రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన భువనగిరి మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వేపోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన అరె యాదయ్య కుమార్తె రేవతి(22) నల్లగొండ ఎన్జీ కళాశాలలో పీజీ చదువుతోంది. రేవతికి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రేవతి గురువారం కళాశాలకు వెళ్తున్నానని బయటికి వెళ్లింది. అనంతరం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో రైల్వేపోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్ఐ అచ్యుతం తెలిపారు. -
ఘట్టమనేని ఘటికురాలు
అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి పేదరికమే పెద్ద దిక్కయిన ఇంట్లో తానే ఓ శక్తిగా మారింది. చిన్న వయసులోనే కుటుంబ భారం తెలిసిన ఆమెకు పవర్ లిఫ్టింగ్‌లో బరువులు తేలికగానే అనిపించాయి. చెదరని ఆత్మబలానికి కఠోర దీక్షను జత చేసింది. అంతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 40కుపైగా స్వర్ణ, రజక పతకాలు ఆమెకు తలవంచాయి. కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు మెడలో మణిహారమయ్యాయి. మరోవైపు చదువుల్లో మేటిగా రాణించి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగమూ సాధించింది సాయి రేవతి. తెనాలిరూరల్: తెనాలి సమీపంలోని పెదరావూరు సాయి రేవతి నివాసం. చదువులు, బరువుల వేటలో అద్భుతంగా రాణిస్తున్న ఆమె జీవితం చాలా మందిలా వడ్డించిన విస్తరి కాదు. వీరి స్వస్థలం బుర్రిపాలెం. ఆరోతరగతిలో ఉండగా అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి పద్మావతి సాయిరేవతినీ, పెద్దమ్మాయి యామినీజ్యోతిని తీసుకుని పెదరావూరులోని పుట్టింటికి చేరింది. ‘అమ్మమ్మ శాఖమూరి సీతారావమ్మ పెద్దమనసుతో ఆదరించింది. వారికుంది ఎకరం పొలమే. ఆ ఆదాయంతోనే అందరం సర్దుకున్నాం’ అని చెప్పింది సాయిరేవతి. అతికష్టం మీద ఇంటర్ పూర్తి చేసి తెనాలిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తే, పోలీసు అధికారి కావాలన్న కోరిక నెరవేరుతుందన్న భావన కలిగింది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం, వ్యాయామ అధ్యాపకుల పర్యవేక్షణతో సాధన ఆరంభించింది. శరీర గాయాలతో, పౌష్టికాహారానికి తగిన డబ్బులు లేక బాధపడిన సందర్భాలెన్నో! అన్నిటినీ తట్టుకుంటూ చేసిన సాధనకు ఇప్పుడు ఫలితం లభించింది. కామన్వెల్త్లో మెరిసిన రేవతి.. సాధనతో ఎత్తే బరువులనే కాదు, మానసిక బలాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దక్షిణాఫ్రికాలో గతేడాది జరిగిన 7వ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2007లో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతకు కొద్ది రోజుల ముందే కేరళలోని అలెప్పీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. డెడ్‌లిఫ్ట్‌లో 2016లో జమ్ములో తాను నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్ ప్రతిభలోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. 2015లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో 350 కిలోల విభాగంలొ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓవరాల్‌లో తన ప్రతిభ 360 కిలోలకు పెరిగింది. 2016 డిసెంబరులో జార్ఖండ్‌లోని టాటానగర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ‘స్ట్రాంగ్ విమెన్’, ‘బెస్ట్ లిఫ్టర్’గా రెండు స్వర్ణ పతకాలను గెలిచింది. ఈ విజయాలతో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు గుంటూరు జిల్లా యువతుల్లో సాయిరేవతి ఒకరు. అంతర్జాతీయపోటీల్లో సత్తా 2014లో థాయ్‌లాండ్‌లోని నార్త్ఛాంగ్మయి యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొంది. 2009–10 నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆరేళ్లు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇందులో 4 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా 3 సార్లు స్ట్రాంగ్ విమెన్‌గా నిలిచింది. కాకినాడలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు అక్కడా ఐదేళ్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా, మరో రెండేళ్లు స్ట్రాంగ్ విమెన్‌గా, ఒకసారి బెస్ట్ అథ్లెట్‌గా బహుమతులు గెలుచుకొంది. మరో ఏడాది ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది యూనివర్శిటీ’ అవార్డును అందుకోవటం విశేషం. బీకాం, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచి, బీపీఈడీ చేసింది. అదే స్ఫూర్తితో ‘నాగార్జున’ పీజీ సెట్ (2015)లో టాపర్‌గా నిలిచింది. లక్ష్యంపైదృష్టి సారించాలి చిన్నతనంలో నాకు ఎదురైన కష్టాలే సవాళ్లను నేర్పించాయి. తండ్రిని కోల్పోయాక ఉద్యోగం సాధించాలని దృఢంగా అనుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్ రంగం ఎంచుకున్నాక బాగా శ్రమించాను. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడంతో విజయాలు వాటంతట అవే వచ్చాయి. నేటి యువత సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలపై పెట్టిన శ్రద్ధ కెరీర్‌పై ఉంచడం లేదు. ఈ ధోరణి మారాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకుని శ్రమించాలి. – సాయిరేవతి,కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ -
చెయ్యేసే బాస్‌కు బడితపూజ
ఆడవాళ్లకు మాత్రమే సీటులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆఫీసుకు టైమ్‌కు వస్తుంది టైమ్‌కు వెళుతోంది అని అనిపిస్తుంది. కాని ఒకామె భర్తకు ఉద్యోగం పోయింది. ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం పోయినందుకు చిన్నబుచ్చుకుంటూ ఇంట్లో ఉన్నందుకు భార్యకు సాయం చేస్తూ చిన్న పాప ఉంటే ఆ పాపను చూసుకుంటూ ఉన్నాడు. భర్త గురించి ఆమెకు టెన్షన్. కాని తయారయ్యి ఆఫీసులో సీటులో కూర్చుని ఉంటే ఆ టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక ఆమెకు మొగుడు తాగుబోతు. దేవుడి హుండీని కూడా లుంగీలో దాచుకెళ్లి చుక్కేసుకొని వచ్చి పెళ్లాంతో వాదులాటకు దిగుతుంటాడు. చిన్న గుడిసె. లేని బతుకు. జీవితం గడవాలంటే పని చేయాలి. తనొచ్చి ఆఫీసులో చీపురు పట్టి ఊడుస్తూ ఉంటే ఆమె టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక అమ్మాయికి పెళ్లి కాదు. వీళ్లు యాభై వరకు అనుకొని ఉంటారు. వచ్చినవాడు లక్ష అడుగుతుంటాడు. పైగా ఇరవై తులాల బంగారం పెట్టాలట. బండి ఇవ్వాలట. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలట. ఆ అమ్మాయికి కోపం. అలాగైతే తాళి నేను కడతాను కట్టించుకోమనండి అంటుంది. అలాంటి అమ్మాయి తన సీటులో తాను కూర్చుని ఉంటే ఆ సమస్య కనిపిస్తుందా? ఆఫీసు టైము టెన్ టు ఫైవ్. ఆ టైములో వీరు ముగ్గురు ఆఫీసులో అవైలబుల్గా ఉంటారు. సీట్లలో కూర్చుని ఉంటారు. వీళ్లకు బాస్ తను. అనగా వీళ్లపై సర్వాధికారి తను. వీళ్ల ఒంటి మీద చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది... ‘ఆడవాళ్లకు మాత్రమే’ కథ అవుతుంది. ∙∙ గార్మెంట్స్ ఫ్యాక్టరీ అది. అందరూ మహిళా ఉద్యోగులే. ఒంటి మీద బట్టలు కుట్టే వీళ్ల వొంటి మీది పవిట పట్టుకుని లాగాలనుకునే మేనేజర్ నాజర్. కింది ఉద్యోగులు ఏం చేయగలరు? ఏమైనా చేయాలనుకుంటే ఉద్యోగం తీసేయడూ? అదీ అతడి ధైర్యం. నాజర్‌ది గొప్ప పురుష హృదయం. అతడికి పీఏ, కంప్యూటర్ డిజైనర్, స్వీపర్ అనే తేడా లేదు. అందరూ కావాలి. తను పిలిస్తే అందరూ వస్తారని అభిప్రాయం. ఊర్వశి– అతడి పీఏ. ఆమెను పిలిచి తన కుర్చీ పక్కన నిలబడేలా చేసి వెనుక నుంచి తడిమేసే ప్రయత్నం చేస్తుంటాడు. రోహిణి– ఆ ఆఫీసు స్వీపర్. లోపలికి పిలిచి ‘నువ్వు బాగా చిమ్మాలి’... ‘నువ్వు బాగా పని చేయాలి’... ‘నువ్వు...’ ఈ ‘నువ్వు’ అనేటప్పుడంతా అతడు తన చూపుడు వేలిని ఆమె ఎద మీద గుచ్చుతుంటాడు. ఆమె చీపురు అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది. రేవతి– కంప్యూటర్ డిజైనర్. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కాబట్టి లంచ్‌కు పిలుస్తుంటాడు. ‘ఏదో జోక్‌లో చదివాను. ఇలాగే ఒక మేనేజర్, అతడి అసిస్టెంట్ అమ్మాయి కలిసి భోం చేస్తుంటే ‘నంచుకోవడానికి ఏమైనా ఉందా’ అని మేనేజర్ అడుగుతాడు. ‘నంచుకోవడానికి ఏమీ లేదు కాని ఉంచుకోవడానికి నేనున్నాను’ అని ఆ అమ్మాయి అంటుంది’ అని పెద్దగా నవ్వుతాడు. మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు చూస్తాడు. దారిన పోయే వెధవ ఒక మాట అనేసి పోతాడు. బస్సులో రాసుకుని వెళ్లే వెధవ బస్సు ఆగగానే దిగి వెళ్లిపోతాడు. ఇది అలా కాదు. ఈ బాస్ రోజూ ఉంటాడు. రోజూ వేధిస్తుంటాడు. తందామంటే తన్నలేరు. మాట విందామంటే వినలేరు. నరకం. ∙∙ ఆఫీసులో ఏదో పొరపాటు జరుగుతుంది. ముగ్గురి మీద పోలీసు కంప్లయింట్ పెడతాను అని బెదిరిస్తాడు నాజర్. అలా వద్దనుకుంటే నాతో మూడు రోజులు గెస్ట్‌హౌస్‌లో గడపాలి అని కోరతాడు. ముందు నుయ్యి. వెనుక గొయ్యి. సరే అని ఒప్పుకుని గెస్ట్‌హౌస్‌కు వెళతారు ముగ్గురు. కాని ఏమయితే అదవుతుందని అతణ్ణి చావబాది కట్టేస్తారు. ఆ తర్వాత పెద్ద ఇంజనీరింగ్ చేసి అతణ్ణి దూలానికి వేళ్లాడ గట్టి బాత్రూమ్కు వెళ్లగలిగేలా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసి బంధిస్తారు. మమ్మల్ని హింసించినందుకు ఇది నీకు శిక్ష అని చెబుతారు. అంతే కాదు అతడి చేత సంతకం పెట్టించి ఆఫీసు ఇన్‌చార్జ్‌షిప్ తీసుకుంటారు. అప్పటి దాకా మగవాడి దృష్టికోణం నుంచి ఆఫీసు నడుస్తుంది. ఇప్పుడు స్త్రీల దృష్టి కోణంలో. ఆఫీసును మంచి ఈస్తటిక్ సెన్స్‌తో డెకరెట్ చేస్తారు. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగిస్తారు. తల్లులైన ఉద్యోగుల కోసం ఆఫీసులోనే క్రష్ పెడతారు. ఆఫీసు ఎంతో బాగుపడుతుంది. కాని నాజర్ బుద్ధి మాత్రం మారదు. అతడు స్త్రీలను వేధించడానికే ప్రయత్నిస్తుంటాడు. చివరకు హెడ్డాఫీసు వారికి అతడి వ్యవహారం తెలుస్తుంది. అండమాన్ బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. సినిమా ముగుస్తుంది. ∙∙ పని చేసే ఆడవాళ్లు పని చేయడానికి మాత్రమే వస్తారు. వ్యక్తిగత జీవితంలో వారికి ఉండే వొత్తిళ్లు వారికి ఉంటాయి. వారి సంపాదన కుటుంబానికి ముఖ్యం కావచ్చు. అలాగే చేసే పనిలో కూడా వొత్తిళ్లు, సవాళ్లు ఉంటాయి. ఇన్ని ఉండగా వాళ్లు స్త్రీలైన పాపానికి హరాస్మెంట్కు దిగితే ఎంత అవస్థగా ఉంటుంది. కక్కలేక మింగలేక వాళ్లు పడే అవస్థ అవసరమా? ‘నవమాసాలు మోసి కనేది తల్లి. కాని ఇంటి పేరు మాత్రం తండ్రిది’ అనే డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. ‘పేరుకు లేడీస్ స్పెషల్ బస్సు. కాని నడిపేది మాత్రం మగవాడు. అందుకే ఆడవాళ్లను చూసినా ఆపడు’ అనే డైలాగ్ కూడా ఉంది. వేధింపులకు మూలమైన బేస్ వేల ఏళ్ల నుంచి మగాడు సిద్ధం చేసి ఉన్నాడు. కాని ఆడవాళ్లు తమకు తాముగా నిర్ణయాత్మక స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులను మార్చుకుంటారు అని ఈ సినిమా చెబుతుంది. మనసులో దురుద్దేశం పెట్టుకుని ‘సునందా... ఒకసారి కేబిన్‌లోకి రా’ అని పిలిచే బాసులారా.. జాగ్రత్త. మిమ్మల్ని తలకిందులు చేసే శక్తి వారికి ఉంది. బీ గుడ్. డూ గుడ్. మగళిర్ మట్టుమ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమలహాసన్ నిర్మాతగా 1994లో విడుదలైన సినిమా ‘మగళిర్ మట్టుమ్’. తెలుగులో మురళీమోహన్ డబ్ చేయగా ‘ఆడవాళ్లకు మాత్రమే’గా విడుదలైంది. వర్కింగ్ విమెన్ ఎదుర్కొనే సెక్సువల్ హరాస్మెంట్ మీద పూర్తి కమర్షియల్ ఫార్మెట్లో వచ్చిన తొలి సినిమా ఇదే కావచ్చు. దీనికి మూలం హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘9 టు 5’ (1980). 10 మిలియన్లతో తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే వంద మిలియన్లు సంపాదించింది. బహుశా అమెరికాలో ఆ సమయంలో పని చేసే ఆడవాళ్లు ఎక్కువ కావడం వర్క్‌ప్లేస్ హరాస్మెంట్ ఎక్కువ ఉండటం కారణం కావచ్చు. తమిళంలో మంచి విజయమే సాధించిన ఆడవాళ్లకు మాత్రమే తెలుగులో పూర్తిగా సఫలం కాలేదు. దానికి కారణం అప్పటికి నాజర్ ఇంకా పూర్తిగా తెలుగువారికి తెలియకపోవడమే. అయినా ఈ సినిమా సున్నితమైన హాస్యంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రేవతి, రోహిణి, ఊర్వశి గొప్ప నటనతో ఆకట్టుకుంటారు. డీగ్లామరస్‌గా కనిపించే రోహిణి అచ్చు ఒక పనిమనిషిలానే ఉంటుంది. ఇందులో ‘శవం’ పాత్ర నగేశ్ పోషించాడు. క్లయిమాక్స్‌లో కమలహాసన్ కాసేపు కనపడతాడు. హిందీలో ఈ సినిమాను రణధీర్ కపూర్‌తో తీశారు. కాని ఏ కారణం చేతనో సినిమా విడుదల కాలేదు. అయితే ‘మగళిర్ మట్టుమ్’ కంటే ఏడాది ముందు ‘9 టు 5’ స్ఫూర్తితోనే జంధ్యాల ‘లేడీస్ స్పెషల్’ తీశారు. కాని ఫ్లాప్ అయ్యింది. సింగీతం శ్రీనివాసరావు – కె -
రాజకీయాల్లో సినీ రచ్చ
తమిళసినిమా: రాజకీయాల్లో సినీ తారల వెలుగులే కాదు రచ్చలు చాలానే చూస్తున్నాం. ప్రముఖ పార్టీల నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీలను నెలకొలిపి చరిత్ర సృష్టించిన వారు. నేరుగా సినిమాల నుంచి రాజకీయరంగప్రవేశం చేసి విజయం సాధించిన వారు ఉన్నట్లే, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో కి దిగి చర్చకు దారి తీసి రచ్చ చేసిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా నటుడు విశాల్ ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై నామినేషన్ దాఖలు చేసి, అది తిరస్కరణకు గురై ఎలా కలకలం సృష్టిస్తుందో కల్లారా చూస్తున్నాం. ఇదే విధంగా ఇంతకు ముందు చాలా సార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని సంఘటనలను చూద్దాం. నటుడు ఎస్వీ.శేఖర్ ఎంజీఆర్ మరణానంతరం ఏడీఎంకే రెండుగా చీలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 1989లో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో నటుడు ఎస్వీ.శేఖర్ మైలాపూర్ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పో టీగి దిగారు.ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి గెలుపొందారు.ఎస్వీ.శేఖర్ కేవలం 650 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. టీ.రాజేందర్: నటుడు,దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఇలా పలు శాఖల్లో అనుభవం కలిగిన టి.రాజేందర్ 1980లో డీఎంకే పార్టీ ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత ఆయన మనస్పర్థల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తాయగ మరుమలర్చి కళగం అనే సంఘాన్ని ప్రారంభించారు. అలా టి.రాజేందర్ 1991లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే పార్టీ నేత జయలలిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిని పోటీకి నిలపకుండా టి.రాజేందర్‌కు మద్దతు పలికింది. అదే విధంగా 2006లోనూ టి.రాజేందర్ తన సొంత నియోజక వర్గం మైలాడుదురైలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నటి రేవతి కూడా.. సహజ నటిగా పేరు పొందిన నటి రేవతి కూడా రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షణ చెన్నై నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక సంచలన నటుడుగా పేరొందిన నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపునకు దూరమయ్యారు. ఇలా ప్రతిసారి రాష్ట్ర శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో సినీరంగానికి చెందిన తారలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తూ రచ్చ చేస్తూనే ఉన్నారన్నది గమనార్హం. -
మనసులో తాళిబింబం మౌనరాగం
పెళ్లయి అప్పటికి నాలుగంటే నాలుగు రోజులు కూడా కాలేదు. ఆమెను తీసుకుని అతడు బజారుకు వచ్చాడు. కొత్త భార్య. ఏదైనా కానుక ఇస్తే బాగుండని భావన. ‘ఏం కావాలి?’ అడిగాడు. ‘ఏం వద్దు’ అందామె. ‘మొదటిసారి తీసుకువచ్చాను. ఏం కావాలన్నా అడుగు’ అన్నాడు. ‘ఏం అడిగినా కొనిస్తారా?’ ఎదురు ప్రశ్నించింది. ‘నా శక్తికి మించనిదైతే కొనిస్తాను’ అన్నాడు. ‘అయితే నాకు విడాకులు కావాలి. కొనివ్వగలవా’ అందామె. అక్కడ నిశ్శబ్దం. చాలా విస్ఫోటనాలకు చప్పుడు ఉండదు. అతడి హృదయం నిశ్శబ్దంగా అతి సూక్ష్మ స్థాయిలో కూడా ముక్కచెక్కలై వేయి వక్కలయ్యింది. అతడు ఆమెకు పట్టీలు కొన్నాడు. మువ్వలు ఉన్న తెల్లగా మెరుస్తున్న వెండి పట్టీలు. భార్య పాదాలకు పట్టీలు తొడిగి ఒక ముద్దు పెట్టడం ఏ భర్తకైనా మురిపెం. ‘నీ కోసం తెచ్చాను. తీసుకో’ అని చేయి పట్టుకున్నాడు. ‘చేయి వదలండి’ అందామె. ‘ఏం నేను పట్టుకోకూడదా?’ అని అడిగాడు. ‘అలా అని కాదు. నాకు బాగనిపించడం లేదు’ ‘ఏం?’ ‘మీరు పట్టుకుంటే గొంగళిపురుగు పాకినట్టుగా ఉంది’ అతడు ఒకడుగు వెనక్కి వేశాడు. ఆమె కోసం అతడు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశాడు. ఇప్పుడు ఏ అడుగు వేయాలి? ముందుకా వెనక్కా? అది ఢిల్లీ. రేవతిని పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టాడు మోహన్. కాని కాపురం చేదుగా ఉంది. చక్కెర లేని టీలా ఉంది. కాదు పాలు లేని టీలా ఉంది. కాదు కాదు అసలక్కడ టీయే లేదు. ఉన్నది ఖాళీ కప్పే. ఆమె మనసులో అతడు లేడు. అతడు కట్టిన తాళి లేదు. ఆమె ఒక కట్టె ముక్కలా అతడికి తల వంచింది. పెద్దలు పంపితే రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. విడాకులిచ్చి పంపించేస్తే వెళ్లిపోతానని అంటుంది. ఇంకొకడైతే చెంప పగలగొట్టి ఉండేవాడేమో. అతడు మాత్రం ఎంతో ఓర్పుగా ‘ఎందుకు?’ అని అడుగుతాడు. ఆమెకు ఒక ప్రేమ కథ ఉంది. ఇంకా ఆమె మనసులో సజీవంగా ఉన్న ప్రేమ కథ. ఏనాడో అందులోని ప్రేమికుడు మరణించిన ప్రేమ కథ. ఆమె కాలేజీలో చదువుతుండగా కార్తీక్ పరిచయయ్యాడు. అతి చల్లటి నీళ్లు తల మీద కుమ్మరించినట్టుగా ఉక్కిరిబిక్కిరి చేసే పరిచయం అతడిది. అతడు చురుకైన కుర్రాడు. విలువలున్న కుర్రాడు. నవ్వుతూ ఉండే కుర్రాడు. నిజంగా విల్లులా ఉండే కుర్రాడు.ఆమెతో కాఫీ తాగడానికి వెళ్లి హోటల్లో పక్క టేబుల్ మీద తండ్రిని చూసి ఆమె భయపడుతుంటే ‘మిస్టర్ చంద్రమౌళి’ అంటూ ఆ తండ్రిని ధైర్యంగా పిలిచి ఆమెను దడిపించేంత అల్లరి కుర్రవాడు. లైబ్రరీలో ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్తే.. ‘వెళ్లి మైక్ పెట్టి ఊరంతా చెప్పుకోపో’ అని ఆమె చికాకు పడితే నిజంగానే మైక్ పెట్టి ఊరంతా చెప్పడానికి సిద్ధమైన దూకుడు కుర్రవాడు. భూతమైతే వీణ్ణి సీసాలో బంధించవచ్చు. కాని ఒళ్లంతా, హృదయమంతా నిండిపోయే ఉత్సవం అయితే ఎలా ఊడపెరకడం? తీసి పారేయడం. ఆమె అతణ్ణి ప్రేమించింది. ఆవేళ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని ఆ ఆఫీసు మెట్ల మీదే అతడు బుల్లెట్ దెబ్బకు కుప్పకూలాడు. ఆమె కళ్లముందే కన్నుమూశాడు. ఆ బింబం ఆమెలో అలాగే ఉండిపోయింది. ఫ్రీజ్ అయ్యింది. దాని మీద ఏ కొత్త బింబమూ రావడం లేదు. ఇప్పుడు వచ్చిన భర్త బింబం అసలే ముద్ర పడటం లేదు. అదీ ఆమె సమస్య. ఆ సమస్యను చెప్పుకుంది. అతడేం చేయాలి? అయిష్టంగా ఇచ్చిన అమృతం కూడా విషమే. మనసు లేని భార్యతో సంసారం శవంతో సంసారమే. అతడు ఆమెను గౌరవించదలుచుకున్నాడు. ఆమె కోరిన విడాకులు ఇవ్వదలిచాడు. కాని అందుకు సంవత్సరకాలం గడువు ఉంటుందని చట్టం చెప్పింది. ఈ సంవత్సర కాలం వాళ్లిద్దరూ ఒకే కప్పు కింద ఉండాలి. కాని భార్యాభర్తలుగా మాత్రం కాదు. అపరిచితుల్లాగానే. అతడు ఆ మేరకు సిద్ధమవుతాడు. ఆమె నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోతాడు. తన పనులు తాను. తన తిండి తాను. తన పక్క తాను. ఉన్నప్పుడు విలువ తెలియదు. కోల్పోతున్నప్పుడే తెలుస్తుంది. ఆమెకు మెల్లమెల్లగా ఆమె ఏం కోల్పోతున్నదో అర్థమవుతుంది. అతడు దూరమయ్యే కొద్దీ అతడి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఎంత చక్కనివాడు. సంస్కారవంతుడు. తన సంతోషం కోసం సహనం పాటించినవాడు. అంతకుమించి తనను ఎంతో అభిమానిస్తున్నవాడు. కాని అప్పటికే విషయం చేయి దాటిపోయింది. సంవత్సరం గడిచిపోయింది. విడాకులు చేతికి వచ్చేశాయి. అతడు దగ్గరుండి ట్రైన్ కూడా ఎక్కించేశాడు.ట్రైన్ బయలుదేరింది. కొందరికి ట్రైన్ తప్పితే జీవితం తప్పుతుంది. కాని ఆమెకు ఈ ట్రైన్ ముందుకెళితే జీవితం తప్పుతుంది.మనసులో పాత బింబం చెరిగిపోయింది. భర్త బింబం సంపూర్ణంగా స్థిరపడిపోయింది. ఆమెకు అతడు కావాలి.చైన్ లాగడం.. ట్రైన్ ఆగడం... గతం ఆ ఇనుప చక్రాల కింద నలిగిపోయి కొత్త జీవితానికి పచ్చ జెండా ఊపడం... ఒక మనోహరమైన జీవితం ఇప్పుడే మొదలైంది. మణిరత్నం తొలి సక్సెస్ 1986లో మణిరత్నం ఐదవ సినిమాగా వచ్చిన ‘మౌనరాగం’ అతడికి తొలి సక్సెస్ నమోదు చేసింది. ‘మౌనరాగం’తోనే మొదటిసారిగా మణిరత్నం పి.సి.శ్రీరాం జోడి ఖరారైంది. ఆ తర్వాత ఆ జంట ఎంత మేజిక్ చేసిందో తెలుసు. రేవతి స్థానంలో మొదట నదియాను, సుప్రియా పాఠక్‌ను అనుకున్నారు మణిరత్నం. కాని ఆ పాత్ర రేవతికి రాసి పెట్టి ఉంది. ‘పరిచయం లేని భార్యాభర్తలు ఎలా ఒకరికొకరు అడ్జస్ట్ అవుతారు’ అనే పాయింట్ తీసుకుని రాసుకున్న ఈ కథలో చివరి నిమిషంలో కార్తీక్ ఎపిసోడ్ జత పడింది. సినిమాలో నిజంగా మెరిసింది ఈ ఎపిసోడే. రేవతి పక్కింటి సిక్కుకి తప్పుల తెలుగు నేర్పించడం మంచి హాస్యం. ఇక ఇళయరాజా చేసిన ‘చిన్ని చిన్న కోయిలల్లే’, ‘మల్లెపూల చల్లగాలి’, ‘చెలి రావా’ పాటలు పెద్ద హిట్స్. – కె. -
తమన్నా వల్లే ఆగిపోయింది..!
బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. ఫైనల్‌గా తమన్నా హీరోయిన్గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది. క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్‌ను పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని తెలిపాడు. -
తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!
బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తమన్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అభినేత్రి సినిమాతో ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన క్వీన్ రీమేక్ లో నటించే అవకాశం రావటంతో తెగ సంబరపడిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ రేవతి దర్శకత్వంలో సుహాసిన మణిరత్నం రైటర్ గా క్వీన్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. అయితే తాజాగా క్వీన్ రీమేక్ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కారణలేంటో సరిగా తెలియకపోయినా.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని యూనిట్ సభ్యులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్వీన్ రీమేక్ తో నటిగానూ ప్రూవ్ చేసుకోవాలని భావించిన తమన్నాకు ఆ కోరిక తీరేలా కనిపించటం లేదు. -
నాలుగు భాషల్లో గోపిచంద్ బయోపిక్
బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న బయోపిక్‌ల ఫీవర్ ఇప్పుడు సౌత్‌లో కూడా కనిపిస్తోంది. ఇటీవల ఒలిపింక్ మెడల్‌తో సత్తా చాటిన పివి సింధూ కోచ్, గోపిచంద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినా.. వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా గోపిచంద్‌కు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన యంగ్ హీరో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి రేవతి గోపిచంద్ తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ప్లాన్ చేసిన ప్రస్తుతం గోపి క్రేజ్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోకి డబ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇలా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోపిచంద్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సుబ్బరావమ్మ... మదర్ ఆఫ్ గోపీచంద్!
హీరోయిన్గా గతంలో ఓ వెలుగు వెలిగిన కథానాయికలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవతి, రమ్యకృష్ణ, నదియా, మీనా, రాశి, ఐశ్వర్య తదితరులు ఈ కోవలో ఉన్నారు. అలనాటి అందాల తార రేవతి ఇటీవల ‘లోఫర్’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరో చిత్రంలో ఆ పాత్ర చేయనున్నారని సమాచారం. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్‌లో గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ ‘పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఆ పాత్రలోనే రేవతి కనిపించనున్నారని సమాచారం. గోపీచంద్ పాత్రలో హీరో సుధీర్‌బాబు నటించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రం నిర్మించనుంది. స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన సుధీర్... గోపీచంద్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నారు. -
‘హలో.. నేను బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా..’
బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని మీ ఏటీఎం బ్లాక్ అయింది. దాన్ని పునరుద్ధరించాలంటే పిన్ నెంబర్ చెప్పండి అని పిన్ తెలుసుకున్న ఓ అగంతకుడు యువతి అకౌంట్లో నుంచి రూ. 14 వేల నగదును కాజేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కాంతం రేవతికి ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తి మీ ఏటీఎమ్ బ్లాక్ అయిందని దాన్ని పునరుద్ధరించడానికని పిన్ నెంబర్ తెలుసుకొని అకౌంట్లోని రూ. 14 వేల నగదును కాజేశాడు. విషయం గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. -
పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట
కుటుంబసభ్యులనుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలివీ.. హమాలీబస్తీకి చెందిన రేవతి (20), ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాస్ (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పది రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా తిరుపతి వెళ్లి వెంకన్నస్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. రేవతిపై మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతు రేవతి, శ్రీనివాస్ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. సర్టిఫికెట్లు పరిశీలించి మేజర్లేనని ధ్రువీకరించుకున్న పోలీసులు రెండు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో పలువురు బస్తీ నాయకులు రేవతి, శ్రీనివాస్‌లకు అండగా నిలిచారు. దండలు మార్పించి కలిసిమెలసి జీవించాలని ఆశీర్వదించారు. -
అవార్డుల కోసం కాదు
తాను అవార్డుల కోసం చిత్రాలు నిర్మించడం లేదు అని అన్నారు ప్రముఖ నటుడు ధనుష్.ఈయన నటుడుగా ఉన్నత స్థాయిలో పయనిస్తూనే తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై చక్కని కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాక్కాముట్టై,విచారణై వంటి ప్రేక్షకుల ఆదరణతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలు వండర్‌బార్ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా అమ్మాకణక్కు అనే చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఇది హిందీలో మంచి విజయాన్ని సాధించిన నిల్ బట్టా సనాట్టా చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. హిందీ చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారినే ఈ అమ్మా కణక్కు చిత్రానికి దర్శకత్వం వహించారు. అమలాపాల్, రేవతి, బేబీ యువ, సముద్రకణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత బాణీలు అందించారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర వివరాలను వివరించడానికి చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ నిల్ బట్టా సనాట్టా చిత్ర ట్రైలర్ చూసి ఆ చిత్ర నిర్మాత ఆనంద్.ఎల్ రాయ్‌ని తమిళ రీమేక్ హక్కులు అడిగి పొందానన్నారు.ఆ చిత్ర ట్రైలరే తనను అంతగా ప్రభావితం చేసిందన్నారు. పూర్తి చిత్రం చూసిన తరువాత తాను ఫుల్ హ్యాపీ అన్నారు. ఈ చిత్రం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్య అవశ్యకతను ఆవిష్కరించే కథా చిత్రం అమ్మా కణక్కు అని తెలిపారు. అమ్మ పాత్రకు అమలాపాలే కరెక్ట్ ఇందులో అమ్మ పాత్రకు అమలాపాల్ చక్కగా నప్పుతారని భావించి ఆమెకు ఫోన్ చేసి అడిగానన్నారు. అమ్మ పాత్ర అనగానే అమలాపాల్ సంకోచించినా ఆ తరువాత నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఇందులో అమలాపాల్ ప్లస్‌టూ చదివే అమ్మాయికి అమ్మగా నటించారని, ఆ పాత్రకు తనే కరెక్ట్ అని, వేరొకరిని అందులో ఊహించలేమని అన్నారు. ఇందులో నటించిన అమలాపాల్‌కు, బేబీ యువకు జాతీయ అవార్డు వస్తుందని అన్నారు. జాతీయ అవార్డు కోసమే చిత్రాలు నిర్మిస్తున్నారా?అన్న విలేకరుల ప్రశ్నకు తాను అవార్డులు దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించనని, అయినా తన చిత్రాలకు అవార్డులు వస్తున్నాయని, ఇది దైవకృప అని బదులిచ్చారు.అమ్మాకణక్కు తనకు చాలా ప్రత్యేకమైన చిత్రం అని నటి అమలాపాల్ అన్నారు. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి, బేబీ యువ పాల్గొన్నారు. చివరగా చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. -
కొడుకును కడతేర్చిన తండ్రి
టీనగర్: అక్రమ సంతానంగా అనుమానించిన ఓ తండ్రి తన కొడకును హతమార్చి పాతిపెట్టాడు. బిడ్డ మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జేడర్‌పాళయం సమీపం జమీన్ ఇలంపల్లికి చెందిన పొన్నుసామి. ఇతని కుమారుడు తమిళ్ అలియాస్ తమిళ్‌సెల్వన్ (38). ఇతని భార్య రేవతి. వీరికి వివాహమై ఆరేళ్లు కావస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 21 డిసెంబర్, 2015లో రేవతి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. తిరుచెంగోడు ఆర్డీవో, జేడర్‌పాళయం పోలీసులు విచారణ జరిపారు. ఇందులో తమిళ్‌సెల్వన్ తన భార్య రేవతిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తెలిపి అతన్ని అరెస్టు చేశారు. ఇలావుండగా పిల్లలు ఇరువురూ పరమత్తిలోగల రేవతి సోదరుడు భాస్కరన్ ఇంటిలో నివశిస్తూ వచ్చారు. ఇలావుండగా బెయిలుపై విడుదలైన తమిళ్ సెల్వన్ తన 11 నెలల బిడ్డ ధరణీష్‌ను గత 18వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లాడు. రేవతి సోదరుడు భాస్కరన్ తమిళ్‌సెల్వన్ ఇంటికి వెళ్లి ధరణీష్‌ను చూడాలని కోరాడు. అందుకు తమిళ్‌సెల్వన్ ధరణీష్‌ను ఒక ఆలయంలో విడిచి వచ్చినట్లు పొంతన లేని సమాధానాలు తెలిపాడు. దీంతో అనుమానించిన భాస్కరన్ జేడర్‌పాళయం పోలీసు స్టేషన్లో తన చెల్లెలి కుమారుడిని ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమిళ్‌సెల్వన్‌ను అరెస్టు చేసి విచారణ జరిపారు. విచారణలో జమీన్ ఇలంపిళ్లైకు సమీపంలోగల మైలాడుంపారై తోటలో బిడ్డను హతమార్చి పాతిపెట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. -
'లోఫర్' మూవీ రివ్యూ
టైటిల్: లోఫర్ జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం: వరుణ్ తేజ్, దిశాపటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్ నిర్మాత: సివి రావు, శ్వేతాలానా, వరుణ్, తేజ సంగీతం: సునీల్ కశ్యప్ కంచె సినిమాతో ప్రయోగాత్మక చిత్రంతో కూడా మంచి సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్, తొలిసారిగా ఓ కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నంలో చేసిన సినిమా లోఫర్. టైటిల్ నుంచే అందరినీ ఆకర్షించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ తరువాత మరింత హైప్ క్రియేట్ చేసింది. టెంపర్ సినిమాతో ఈ ఏడాది మంచి సక్సెస్ సాధించిన పూరి జగన్నాథ్ ఆ తరువాత జ్యోతిలక్ష్మి సినిమాతో నిరాశపరిచాడు. ఈ లోఫర్‌తో తిరిగి ఫాంలోకి రావాలని తనకు బాగా కలిసొచ్చిన మాస్ హీరోయిజాన్ని నమ్ముకున్నాడు. మరి పూరి దర్శకత్వంలో లోఫర్గా మారిన వరుణ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడా..? తను అనుకున్నట్టుగా కమర్షియల్ హీరో టాగ్ సాధించాడా.. కథ : తాను ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోవటం కోసం కోట్ల ఆస్తిని కాదనుకొని వస్తుంది లక్ష్మి (రేవతి). కానీ తను నమ్మి వచ్చిన వ్యక్తి (పోసాని కృష్ణ మురళి) ఓ లోఫర్ అని తెలిసి అతనికి దూరమవ్వాలనుకుంటుంది. తనతో పాటు తన కొడుకును కూడా అతడికి దూరంగా పెంచాలనుకుంటుంది. ఈ లోగా అతను లక్ష్మి కొడుకు రాజా (వరుణ్ తేజ్) ను తీసుకొని జోధ్ పూర్ పారిపోతాడు. ఆ పిల్లాడిని కూడా తన లాగే లోఫర్లా పెంచుతాడు. తల్లి కామెర్లతో చనిపోయిందని చెప్పి కొడుకును నమ్మిస్తాడు. దొంగతనాలు, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలనకున్న కుటుంబసభ్యుల నుంచి పారిపోయిన పారిజాతం (దిశాపటాని) జోధ్‌పూర్‌లో ఉంటున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తుంది. జోధ్‌పూర్‌లో దిగగానే పోసాని కృష్ణమురళి ఆమె సెల్ ఫోన్ కొట్టేస్తాడు. తరువాత రాజా ఆమె బ్యాగ్ కొట్టేస్తాడు. అలా జోధ్‌పూర్‌లో రెండు మూడు సార్లు కలిసిన రాజా, పారిజాతం ప్రేమలో పడతారు. ఈ విషయాన్ని పారిజాతం తన మేనత్తకు చెబుతుంది. ఈ లోగా పారిజాతం ఉంటున్న ప్లేస్ కనిపెట్టిన ఆమె ఫ్యామిలీ జోధ్‌పూర్ వచ్చేస్తారు. వాళ్లు పారిజాతాన్ని తీసుకెళ్లే సమయంలో వరుణ్ ఆమె మేనత్తను చూసి షాక్ అవుతాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో రైల్లో వెళుతున్న పారిజాతాన్ని, ఆమె మేనత్తను పారిజాతం ఫ్యామిలీ పట్టుకుంటారు. తరువాత రాజా పారిజాతాన్ని కలిశాడా..? పారిజాతం మేనత్తకి రాజాకి సంబంధం ఏంటి..? చిన్నప్పటి నుంచి తల్లికి దూరంగా పెరిగిన రాజా తల్లిని ఎలా కలిశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నం చేసిన వరుణ్ పర్ఫామెన్స్లో మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్‌లో బాగా నటించాడు. యాక్షన్ సీక్వన్స్లతోనూ మాస్ ఆడియన్స్‌కు చేరువయ్యే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో కీలకమైన తల్లి పాత్రలో నటించిన రేవతి, ఆ క్యారెక్టర్‌కు తానే బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రతీ సీన్లోనూ తన సీనియారిటీని చూపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. రెగ్యులర్‌గా తను చేసే తరహా లోఫర్ క్యారెక్టర్లో కనిపించిన పోసాని పరవాలేదనిపించాడు. కొంత గ్యాప్ తరువాత ముఖేష్ రుషి ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్లో మెప్పించాడు. అలీ, బ్రహ్మనందం, సప్తగిరి, ధన్‌రాజ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తరువాత సెంటిమెంట్ జోలికి వెళ్లని పూరి జగన్నాథ్. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సెంటిమెంట్ సినిమా లోఫర్. దర్శకుడిగా రొటీన్ అనిపించిన పూరి, డైలాగ్ రైటర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్‌ని పక్కా కమర్షియల్ స్టార్‌గా ప్రజెంట్ చేయటంలో మంచి సక్సెస్ సాధించాడు. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదనిపించింది. సువ్వి సువ్వాలమ్మ పాట తప్ప గుర్తుండిపోయే పాటలు లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రొమాంటిక్ సాంగ్స్‌తో పాటు కోటలో తీసిన ఫైట్స్ సీక్వన్స్లో కెమరా వర్క్ చాలా బాగుంది. విశ్లేషణ: ఇప్పటివరకు ప్రయోగాత్మక చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, లోఫర్ సినిమాతో కమర్షియల్‌గా స్టార్ మారాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వరుణ్ కెరీర్ పరంగా లోఫర్ స్పెషల్ సినిమా అయినా.. పూరి పరంగా మాత్రం ఇది రొటీన్ సినిమానే.. రెగ్యులర్‌గా పూరి సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే ఫైట్ సీన్ పోకిరి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా చాలా సన్నివేశాల్లో పూరి గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఈసారి సెంటిమెంట్‌ను పండించటంలో కూడా పూరి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా తల్లి పాత్రకు రేవతి ఎంపిక చేసుకోవటంలోనే పూరి చాలావరకు విజయం సాధించేశాడు. భారీ అంచనాలతో మెగా అభిమానులుగా వెళ్లే ఆడియన్స్‌కు కాస్త నిరాశకలిగినా.. పూరి స్టైల్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా లోఫర్. ప్లస్ పాయింట్స్ : రేవతి వరుణ్ యాక్టింగ్ డైలాగ్స్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ ఫస్టాఫ్ కామెడీ ఓవరాల్‌గా లోఫర్ పూరికి రొటీన్ సినిమా, వరుణ్ తేజ్‌కి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ -
రేవతిలా యాక్ట్ చేయమనే వాళ్లు
ఎంత పెద్ద నటీనటులైనా తమకు నచ్చిన సినీ తారల నటనను ఇన్స్పిరేషన్గా తీసుకుని తెరపై ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కొంతమందిని అనుకరిస్తూ ఉంటారు కూడా. తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్‌గా వెలుగుతున్న సమంత తాను మంచి నటిగా కొనసాగడానికి కారణం రేవతి అన్నారు. ఇటీవల రేవతితో కలిసి సమంత ఓ యాడ్‌లో నటించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ -‘‘ ‘ఏ మాయ చేశావే’ సినిమాలో అవకాశం రాకముందు నేను కొన్ని ఆడిషన్స్‌లో పాల్గొన్నా. సెలెక్ట్ కాలేదు. చాలా బాధపడ్డాను. కొంతమంది దర్శకులు నన్ను రేవతిలా యాక్ట్ చేయమని అనేవాళ్లు. ఆవిడ నటించిన సినిమాలు చూపించేవాళ్లు. నాకు ఇష్టమైన నటి రేవతి. ఆమె సినిమాలంటే చాలా ఇష్టం. ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అద్దం ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. రేవతిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నా శైలిలో నటించడం మొదలుపెట్టాను’’ అని చెప్పుకొచ్చారు. -
పూరి సమర్పణలో రేవతి దర్శకత్వం!
టాలీవుడ్లో మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. ఒకప్పటి హీరోయిన్ రేవతి త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించనుంది. పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన రేవతి తెలుగులో కమర్షియల్ సినిమా చేయనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం రేవతి పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సమయంలోనే తన స్టోరి ఐడియా వినిపించిన పూరి రేవతిని ఆ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందిగా కోరాడట, అందుకు రేవతి కూడా అంగీకరించటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కా ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ చార్మీ సహనిర్మాతగా వ్యవహరించనుంది. గతంలో 'జ్యోతిలక్ష్మీ' సినిమాతో నిర్మాతగా మారిన ఈ బ్యూటి, మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మామ' లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవతి దర్శకురాలిగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
నేను కట్టిన తాళి తీసేయ్...
హైదరాబాద్: ‘ నేను కట్టిన తాళి తీసి మావాళ్లకు ఇచ్చేయ్... మరో పెళ్లి చేసుకున్నాక అక్కడైనా జాగ్రత్తగా ఉండు’ అంటూ భార్యను ఉద్దేశిస్తూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్ ఎస్ఐ ఎస్.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... గుంటూరు జిల్లాకు చెందిన యల్లారయ్య (28) నగరానికి వచ్చి బాలానగర్ గీతానగర్‌లో సీఎన్సీ కంపెనీ పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం యల్లారయ్య అదే జిల్లాకు చెందిన రేవతిని పెళ్లి చేసుకున్నాడు. తన కంపెనీ పైనే కాపురం పెట్టాడు. ఆషాఢ మాసం సందర్భంగా జూన్ నెలలో రేవతి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి యల్లారయ్య ఒక్కడే నగరంలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు యల్లారయ్య ఇంట్లో కంపెనీ భాగస్వామి వెంకీ, మరో ఇద్దరు భోజనం చేసి వెళ్లారు. నిన్న యల్లారయ్య కంపెనీకి రాలేదు. దీంతో కంపెనీలో పనిచేసే కార్మికుడు యల్లారయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా అతను చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న డైరీ, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డైరీలో సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో ‘అమ్మానాన్న, అక్కాచెల్లి, తమ్ముడు, బావలు నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా..., రేవతి మీ నాన్నను నోరు అదుపులో పెట్టుకోమను.. నిన్ను ఏనాడు కొట్టలేదు..తిట్టలేదు. మా మామగారు అనే మాటలు పడలేక సెలవు తీసుకుంటున్నా.. బై..బై అని ఉంది. మృతుడు యల్లారయ్య మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యల్లారయ్య మృతిపై కుటుంబసభ్యులుగాని అనుమానం వ్యక్తం చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
జూలై 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సౌరవ్ గంగూలీ (క్రికెటర్), రేవతి (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5 బుధగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఇది జీవితంలో సంతోషకరమైన సంవత్సరంగా గుర్తుండిపోతుంది. మంచి మార్పు, అనుకోని మంచి అవకాశాలు వచ్చి అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి, వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెంపొందుతాయి. శారీరక శ్రమతో కాకుండా బుద్ధిబలంతో, విజ్ఞతతో ఆలోచించి, నేర్పుగా పనులు సాధిస్తారు. ఉద్యోగులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకుంటారు. పోటీపరీక్షలు రాసేవారు విజయాన్ని సాధిస్తారు. అయితే మీ డేటాఫ్ బర్త్‌లో 8 ఉన్న కారణంగా అనుకోని విరోధాలు, అపార్థాలు, అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఓపిక పట్టడం మంచిది. మీరు జులై నెలలో పుట్టడం వల్ల సహజసిద్ధమైన మానసిక, ఆధ్యాత్మిక శక్తి ఉండటం వల్ల అన్నింటినీ అధిగమించి, శత్రువుల మన్ననలు కూడా పొందుతారు. కామర్స్, లా, మేనేజ్మెంట్, అకౌంట్స్ రంగాల వారికి ఇది చాలా మంచి సమయం. ప్రమోషన్లు, గౌరవమర్యాదలు పొందే అవకాశం. లక్కీ నంబర్స్: 1,3,5,8; లక్కీ కలర్స్: బ్లూ, గ్రీన్, క్రీమ్, ఎల్లో, పర్పుల్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని వారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివారాధన, అనాథలకు అన్నపానాదులతోపాటు ఆశ్రయం ఇవ్వడం, పేద విద్యార్థులకు చదువుకోవడానికి సాయం చేయడం మంచిది. - రెహమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నా చిట్టి తల్లికి ఏమయ్యింది..?
తిరుపతిక్రైం: ‘‘పరీక్షలు బాగా రాస్తున్నా ను.. నాన్నా.. అని ముందు రోజు ఫోన్ చేసింది. మరుసటి రోజు ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంతలో నా చిట్టి తల్లికి ఏమయ్యింది’’ ఓ ప్రైవేట్ కాలేజీ భ వంతి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న రేవతి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్ తెలిపిన వివరాల మేరకు పులిచర్ల మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎ.వెంకటరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె ఎ.రేవతి(17) రూరల్ మండలం తుమ్మలగుంట సమీపంలోని ఉప్పరపల్లెలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రేవతి స్థానిక పద్మావతి కళాశాలలో జరుగుతున్న పరీక్షలకు ప్రతిరోజూ హాజరవుతోంది. శుక్రవారం ఉదయం కూడా పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగిసిన తరువాత కళాశాలకు చేరుకుని భోజనం చేసి, గదిలోని తోటి విద్యార్థులతో కలసి కొంత సేపు ఆట విడుపుగా ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్టడీ అవర్స్ ఉండడంతో విద్యార్థులందరూ మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లారు. అయితే రేవతి మాత్రం బిల్డింగ్‌లోని మూడో అంతస్తుపైన పిట్టగోడ పైకి ఎక్కి కూర్చుని, అక్కడి నుంచి కిందకు దూకేసింది. దీన్ని గుర్తించిన కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. రేవతిని చికిత్సకోసం రుయా ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు చెప్పారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించా రు. సంఘటనా స్థలానికి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఆత్మహ త్య గురించి కూడా విచారించిగా రేవతి పరీక్షలు సరిగా రాయలేదని ఆందోళనలో ఉన్నట్లు సహచర విద్యార్థినులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత రేవతి(16) మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి, హుటాహుటిన రుయా ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కుమా ర్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు గా విలపించారు. గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘పరీక్షలు బాగా రాస్తున్నాను నాన్నా’ అని చెప్పిన తన కుమార్తెకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అంటూ తల్లి విలపించడం అక్కడి వారి ని కలచివేసింది. మృతురాలి తండ్రి మాట్లాడుతూ ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని ఆరోపించారు. పెద్దిరెడ్డి పరామర్శ మెడికల్ కళాశాల మార్చురీ వద్దకు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడి, ఈ సంఘటన పై ఆరా తీస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలేజీ సిబ్బందికి సూచించారు. విద్యార్థి సంఘాల ఆందోళన సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కళాశాల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు చో టు చేసుకుంటున్నాయన్నారు. కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డును డిమాండ్ చేశారు. విచారణ జరిపి నిందితులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు జాఫర్ ఉన్నారు. -
మేడపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
టీచర్ నిత్యం మందలిస్తుండడమే కారణం ? ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన విశాఖలో చికిత్స పొందుతున్న బాలిక గరుగుబిల్లి: టీచర్ నిత్యం మందలిస్తుండడాన్ని భరించలేక ఓ విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది . అయితే పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉం చింది. హోం వర్క్ చేయడంలేద ని, సక్రమంగా చదవడం లేదని నిత్యం టీచర్ మందలిస్తుండడం తో మనస్తాపానికి గురైన రవ్వ రేవతి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గరుగుబిల్లి మండల కేంద్రంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆమె గత నెల 28న పాఠశాల మేడపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. మేడపైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానికంగా చికిత్స చేసి, 29న ఉదయం తల్లిదండ్రులతో ఆ విద్యార్థినిని పంపించారు. ప్రస్తుతం విద్యార్థిని విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. విద్యార్థినులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడంవల్లే ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మాణిక్యం మాట్లాడుతూ రేవతికి బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధి ఉందని, పలుమార్లు ఉన్నట్లుండి పడిపోతుండేదని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియజేశామన్నారు. మెట్లు ఎక్కుతుండగా రేవతి పడిపోవడంతో గాయాలు పాలైనట్లు తెలిపారు. -
హస్తకళాక్లేళి
బంకమన్ను (క్లే)తో పిల్లలు ఆడుకోవడం చూసే ఉంటారు. క్లేతో వారు రకరకాల బొమ్మలు చేస్తారు. తర్వాత క్లేని ముద్దలా చేసి దాచుకుంటారు. అయితే రేవతికి అలాంటి క్లే పనికిరాదు. ఒకసారి ఒక ఆకృతిలోకి మలిస్తే ఇక అదెప్పటికీ అదే ఆకృతిలో ఉండిపోవాలి. కానీ అలాంటి వండర్ క్లే మార్కెట్లో లేదే! రేవతి ఆలోచించారు. ప్రయోగాలు చేశారు. ఎంతో ముడిసరుకును వృథా చేశారు. చివరికి విజయం సాధించారు. వండర్ క్లే తయారైంది! దానికావిడ ‘ఆర్ట్ క్లే’అని పేరు పెట్టారు. అదిప్పుడు ‘రేవతి ఆర్ట్ క్లే’ గా కూడా వ్యవహారంలో ఉంది. ఇంతటి ఘనత సాధించిన రేవతి నేపథ్యం ఏమిటి? మహిళలకు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిది? రేవతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అమ్మాయి. తండ్రి శ్రీపాద భగవన్నారాయణ స్వాతంత్య్ర సమరయోధులు. ఇంట్లో తనే చిన్న. ఇద్దరన్నయ్యలు, ఐదుగురు అక్కలు. రేవతికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం ఇష్టం. రేగడిమట్టితో బొమ్మలు చెయ్యడం, పేపర్‌పై స్కెచ్‌లు వేయడం.. ఇదే ఆమె లోకం. దాంతో పెద్దన్నయ్య ఆమెను గుంటూరులోని మహిళా కళాశాలలో బి.ఎ ఫైన్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సులో చేర్పించారు. బి.ఎ మొదటి సంవత్సరం పూర్తికాగానే పెళ్లయింది. భర్త ఎయిర్‌ఫోర్స్ అధికారి. చండీగఢ్‌లో ఉద్యోగం. దాంతో రేవతి ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేయలేకపోయారు. టర్నింగ్ పాయింట్ రేవతికి ఇద్దరబ్బాయిలు. వాళ్లు పెద్దయి, పెళ్లిళ్లయిన తర్వాత ఆమెకు ఖాళీ దొరికింది. పద్దెనిమిదవ యేట అర్ధంతరంగా ఆపేసిన చదువుని కొనసాగించాలని ఎం.ఎ ఇంగ్లిష్‌లో చేరారు. కొంతకాలం పిల్లల దగ్గర గడుపుదామని అమెరికా వెళ్లారు. ఓరోజు వాళ్లబ్బాయి మార్కెట్లో కనిపించిన పేపర్ క్లే చూపించి ‘బొమ్మలు చేసుకోవడానికి బావుంటుంది’ అని తీసిచ్చాడు. ‘‘దాంతో బొమ్మలు చాలా అద్భుతంగా వస్తాయి. అలా మళ్లీ నాకిష్టమైన బొమ్మలు చేయడం మొదలుపెట్టాను. పద్దెనిమిదవ యేట మానేసిన ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సుని యాభై దాటిన తర్వాత సొంత ప్రయోగాలతో పట్టాలెక్కించాను’’ అని చెప్పారు రేవతి. ఆ ప్రయోగాలలో ఒకదాని ఫలితమే మూడేళ్ల క్రితం ఆమె కనిపెట్టిన ఎకో ఫ్రెండ్లీ ‘ఆర్ట్ క్లే’. అన్నీ ఆహారపదార్థాలే! ఆర్ట్ క్లే కోసం రేవతి వాడే ముడిసరుకు అంతా ఆహార పదార్థాల మిశ్రమం. రంగులు కూడా ఫుడ్ కలర్సే కావడంతో ఈ క్లేతో ఎంతసేపు పని చేసినా చేతులకు, చర్మానికి, కళ్లకు, శ్వాసకోశానికి ఎటువంటి హాని కలగదు. పైగా ఆమె కనిపెట్టిన క్లే, పేపర్ క్లే లాగానే మృదువైనది. క్లే ఆరిన తర్వాత కనిపించే కొద్దిపాటి పెళుసుదనం కూడా అందులో ఉండదు. ఒకసారి ఒక రూపం ఇచ్చి ఇరవైనాలుగ్గంటలపాటు కదల్చకుండా ఉంచితే ఇక అది అలాగే ఆరిపోయి ఆకారం శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ క్లేతో చేసిన పూలలో దుమ్ము చేరినా సబ్బు నీటిలో జాడించి శుభ్రం చేసుకోవచ్చు. కుటీర పరిశ్రమగా... హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘రేవతి ఆర్ట్ క్లే హ్యాండీక్రాఫ్ట్స్’ ఉంది. అందులో ఎందరో మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆసక్తితో మొదలు పెట్టి, ఇలా కుటీర పరిశ్రమగా ఓ యూనిట్‌ను వృద్ధి చేశారు రేవతి. ఇప్పుడది వ్యాపార పరిశ్రమగా కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. అందమైన ఆకృతికి రూపం ఇవ్వడంలో నైపుణ్యం ఉంది కానీ మార్కెట్ చేసే చాకచక్యం తనలో లేదంటారామె. ప్రభుత్వం నుంచి పేటెంట్ పరీక్ష ఎదుర్కొన్న తర్వాత తనలా ఆసక్తి ఉన్నవారితో కలిసి మార్కెట్లోకి రావాలన్నది ఆమె ఆలోచన. అరవై ఆరేళ్ల వయసులో కూడా రేవతి ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం... ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించడం, ఆలోచనకు ఒక రూపం ఇచ్చి మురిసిపోవడం, పదిమందికి నేర్పించి తృప్తి పొందడమే కావచ్చు. ఫొటోలు: శివ మల్లాల క్లే తయారీ కోసమే ఓ యంత్రం! నా క్లే తో శిల్పాలు, సీనరీలు, పూలు చేయవచ్చు. ఒకసారి తయారైన క్లే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కూడా జిగురు తగ్గుతుంది తప్ప ఫంగస్ రాదు. మార్కెట్లో దొరికే మామూలు యంత్రానికి మరికొన్ని విడిభాగాలు చేర్చి ఈ క్లే తయారీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాను. రోజుకు వంద కిలోల క్లే తయారు చేయగలను. - రేవతి, ఆర్ట్ క్లే రూపకర్త -
కలం.. గళం
రచయితలుగా రాణించే వారు, ఔత్సాహిక రచయితలు, ఇప్పుడిప్పుడే రచనలు ప్రారంభించేవారు, తమకూ హక్కులు కావాలంటూ థర్డ్ జెండర్ సమస్యల్ని ప్రపంచానికి చాటి చెప్పే వారు.. ఇలా ఎంతో మంది ఔత్సాహిక కవులు, రచయితలకు వేదికైంది సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్. శనివారం రైటర్స్ కార్నివాల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. రచయితగా ఎలా రాణించాలి?, చేసిన రచనలను పుస్తక రూపంలో ఎలా తేవాలి?, సొంతంగా ఎలా ప్రచురించుకోవాలి?, ఈ-పబ్లిషింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై కొందరు సీనియర్ రైటర్స్ ఔత్సాహికుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ వర్క్‌షాప్.. ఆదివారం కూడా కొనసాగుతుంది. ప్రముఖ రచయిత్రి రోచెల్లా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు. -దార్ల వెంకటేశ్వరరావు కొన్నిటికే పరిమితమా? చాలామంది రచయితలు కొన్ని అంశాలకే పరిమితమవుతున్నారు. ఇప్పుడిప్పుడే ట్రాన్స్‌జెండర్స్ వంటి వాళ్ల కథలూ వెలుగు చూస్తున్నాయి. ఎవరూ టచ్ చేయని అంశాలు, వర్గాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై కొనసాగుతున్న వివక్ష వంటి వాటిని రచనల ద్వారా సమాజం దృష్టికి తేవచ్చు. హమారా కహాని, హమారా జీవన్ పేరుతో హిందీలో నేను రాసిన పుస్తకాన్ని తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’ పేరుతో వెలువరిస్తే చాలామంది విమర్శించారు. కొందరు మెచ్చుకున్నారు. మా కమ్యూనిటీ వాళ్లు కూడా అందులో రేప్ గురించి, పోలీసుల గురించి ఎందుకు రాశావని అన్నారు. మీడియా చాలా సపోర్ట్ చేసింది. - రేవతి, ట్రాన్స్‌జెండర్స్ రచయిత్రి స్టోరీ టెల్లింగ్పై అవగాహన అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి కథలు వినడం అనేది ఒకప్పటి కథ. ఇప్పుడు చెప్పేవారు, వినేవారు లేరు. కథలు రాయడానికి ఎలాంటి క్రియేటివిటీ కావాలో కథలు చెప్పడానికీ అంతే అవసరం. పిల్లల మనసును హత్తుకునేలా కథలు చెప్పాలి. అదే అంశాల్ని ఇక్కడ యువ రచయితలకు చెప్పా. - దీపా కిరణ్, స్టోరీ టెల్లర్ చాలా స్ఫూర్తినిచ్చింది ఎంతో మంది రచయితలను కలిసే అరుదైన అవకాశమిది. రచయితలు చెప్పిన సలహా సూచనలు బాగున్నాయి. మూడు చిన్నచిన్న కథలు రాశాను. సొంత బ్లాగ్‌లో ఈ-పబ్లిష్ చేస్తున్నాను. ఈ సదస్సులో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కొంత మేరకు తెలుసుకున్నా. - ఆర్ఎస్ ఆర్చా, ఇంటర్ విద్యార్థిని గే లవ్ స్టోరీ రాశాను యూత్ లవ్‌స్టోరీలతో ఎన్నో సినిమాలు, మరెన్నో కథలు వచ్చాయి. కానీ నేను ఇద్దరు మేల్స్ ప్రేమలో పడిన అంశాన్ని తీసుకుని గే లవ్ స్టోరీని రాశా. తెలుగులో ఇలాంటివి ఇంత వరకు రాలేదు. రచనలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఇది ఇదే సదస్సులో పుస్తక రూపంలో విడుదల కానుంది. రైటర్స్ కార్నివాల్ ఎన్నో కొత్త విషయాలను నేర్పింది. - నవ్‌దీప్, ఎల్బీనగర్ -
ఒక హిజ్రా ఆత్మకథ
"no matter gay, straight or bi.., lesbian, transgenderd life.. I'm on the right track. I was born to survive.... అంటూ తన జీవించే హక్కును చాటుకుంది రేవతి ‘నిజం చెప్తున్నా ఒక హిజ్రా ఆత్మకథ’ అనే పుస్తకాన్ని రచించి. ఇదివరకే తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్ల్లిష్ భాషల్లో విడుదలైంది. ఆలోచనలనూ రేకెత్తించింది. ఈ రోజు తెలుగులో విడుదల కానుంది. తెలుగు అనువాదం పి.సత్యవతి.. ప్రచురణ.. హైదరాబాద్ బుక్ ట్రస్ట్! ఈ సందర్భంగా నగరానికి వచ్చిన రేవతి మనసులోని మాటలు... ‘ఇది ఒక్క రేవతి కథే కాదు ట్రాన్స్‌జెండర్స్ అందరి కథ. ఇదో పుస్తకం కాదు... మా హక్కుల పోరాటానికి కావల్సిన ఆయుధం. సమాజంలో మాకూ గుర్తింపు, గౌరవం కావాలి. ఇంట్లోంచే మొదలవుతుంది మా పోరాటం. మగ శరీరంలో స్త్రీ మెదడుతో పుట్టడం మా తప్పు కాదుకదా! నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలా ఉండాలనిపించేది. యుక్తవయసు వచ్చినప్పుడు అబ్బాయిలను చూస్తే సిగ్గేసింది. నా ప్రవర్తనతో ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడేవాళ్లు. నాలో జరుగుతున్న సంఘర్షణ వాళ్లకు అర్థంకాక.. నేను బయటకు చెప్పుకునే అవకాశంలేక ఎన్ని దెబ్బలు తిన్నానో. బయటవాళ్ల వెక్కిరింతలు, వేళాకోళాలు, గేలిచేయడాలు సరేసరి. అందుకే పదిహేను- పదహారేళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఢిల్లీ, ముంబైలు తిరిగి ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్త్రీగా మారిపోయాను. నా మెదడులో కలిగే భావాలకు అనువైన రూపంలో ఒదిగానన్న సంతృప్తి ఉన్నా.. హిజ్రాగా సమాజంలో మాకున్న స్థానం కలిగించిన వేదనా తక్కువేం కాదు. హిజ్రాలను ఈ వ్యవస్థ రెండేరెండు పనులకు పరిమితం చేస్తోంది.. అడుక్కోవడం.. సెక్స్‌వర్కర్‌గా పనిచేయడం. ఈ పనులు ఎవరూ ఇష్టంగా చేయరు గత్యంతరంలేకే చేస్తారు. మాకూ ఉంటుంది మంచి ఉద్యోగాలు చేయాలని. అందుకు సిద్ధంగా కూడా ఉన్నాం. కానీ చదువేది? మాకు స్కూళ్లల్లో, కాలేజీల్లోనూ అవమానాలే. పోనీ వాటన్నిటినీ ఎదుర్కొని ఉద్యోగం దాకా వచ్చినా అక్కడా వివక్షే. అయినా కన్న తల్లిదండ్రులే మమ్మల్ని ఒప్పుకునే పరిస్థితిలేనప్పుడు బయటవాళ్లు ఎట్లా ఒప్పుకుంటారు? అందుకే ముందు ఇంట్లోంచే మార్పు మొదలవ్వాలి. వాళ్లే గనక మమ్మల్ని ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తే మేము ఇంట్లోంచి పారిపోవాల్సిన అవసరం ఎందుకుంటుంది?. ఈ పుస్తకం రాయడానికి వెనక.. నేను పడ్డ బాధలు..చేసిన పోరాటమే. హిజ్రాగా మారిన తర్వాత షాపులకు వెళ్లి అడుక్కున్నాను, సెక్స్‌వర్కర్‌గా పనిచేశాను. చివరకు బెంగళూరులోని ‘సంగమ’అనే స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తగా పనిచేశాను. అక్కడున్నప్పుడే నాలాంటి వాళ్లను ఓ యాభైమందిని కలిసి ఇంటర్వ్యూచేశాను. ఒక్కొక్కరిది ఒక్కోగాధ. అప్పుడే అనిపించింది మా ఆత్మను వినిపించే ఓ కథ రాయాలని. అట్లా ఈ పుస్తకం రాశాను. ఇది 2009 నాటి సంగతి. ఇప్పుడనిపిస్తోంది నా ఆత్మకథ రెండో భాగాన్నీ రాయాలని. ఏం కావాలి? సమాజంలో అందరికుండే గుర్తింపు మాకూకావాలి. మమ్మల్ని కొన్ని చోట్ల ఆశీర్వాదాలిచ్చే వాళ్లలా చూస్తారు. మేమేం భగవంతులం కాము. అందరిలాంటి సామాన్యమైన మనుష్యులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. వాటిని గౌరవించండి చాలు. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్‌కి దరఖాస్తు చేసుకునే పత్రాల్లో థర్డ్‌జెండర్ కాలమ్ ఉండాలని నాల్సాజడ్జిమెంట్ రావడం సంతోషమే. కానీ పర్సనల్‌గా థర్డ్‌జెండర్ అనేదే అక్కర్లేదంటాన్నేను. అప్లికేషన్స్‌లో కులం అనేకాలాన్ని ఎలా తొలగించాలనే డిమాండ్ ఉందో అలాగే ఈ జెండర్ అనే కాలం కూడా అనవసరం అంటాన్నేను. పేరు ఉంటే చాలుకదా. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కావాలి. ఎవరికిష్టమైన జెండర్‌లో వాళ్లుండే హక్కును కలిగించాలి. నిజానికి ఇది మన రాజ్యాంగంలో ఉంది కూడా. ఎస్ఆర్ఎస్ అంటారు దాన్ని. హిజ్రాల మీద కనీసం ఈ మాత్రం చర్చ అయినా జరుగుతోంది కానీ ఫిమేల్ నుంచి మేల్‌గా మారిన ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి మరీ దారుణం. నిశ్శబ్దాన్ని ఛేదించాలి. చర్చ జరగాలి. సమాజంలో ఉన్న ఇలాంటి సెన్సిటివిటీస్‌ని అందరూ అర్థంచేసుకోవాలి. హైదరాబాద్‌లో.. ఇక్కడ రెండు రకాల హిజ్రాలున్నారు. ఒకరు రోడ్లమీద అడుక్కుంటుంటే.. ఇంకొకరు హవేలీల్లో ఉండే బదాయి గ్రూప్‌వాళ్లు. ఈ రెండో రకం వాళ్లకు పెద్ద సమస్యలేవీ ఉండవు. చక్కటి మర్యాదా ఉంటుంది. సమస్యంతా రోడ్లమీద అడుక్కునేవాళ్లకే. సామాన్యుల నుంచి పోలీసుల దాకా అందరితో వేధింపులు, ఛీత్కారాలూ! - సరస్వతి రమ -
సినిమా రివ్యూ: అనుక్షణం
భారీ విజయాలు చేజిక్కకపోయినా...తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంటున్న రాంగోపాల్ వర్మ తాజాగా మంచు విష్ణుతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనుక్షణం’ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 13 తేది శనివారం విడుదలైన 'అనుక్షణం' విజయం, లాభాల్ని దక్కించుకునేలా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. సీతారాం(సూర్య) ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసు విభాగానికి సవాల్‌గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్‌ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ. సీతారాం పాత్రలో సీరియల్ కిల్లర్‌గా సూర్య నటించడం కంటే .. జీవించాడని చెప్పవచ్చు. సూర్య తన లుక్స్, బిహేవియర్‌తో గుబులు రేపాడు. కొత్త నటుడైనా... నటుడిగా మంచి పరిణతి ప్రదర్శించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వరుస హత్యల కేసు దర్యాప్తు, సీరియల్ కిల్లర్ హంతకుడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌గా మంచు విష్ణు నటించాడు. ఓ పోలీస్ ఆఫీసర్ కావాల్సిన ఎక్స్ప్రెషన్స్, లుక్స్, నడక, స్టైల్‌ను పండించడంలో మంచు విష్ణు తన మార్కును చూపించారు. ఓ డిఫెరెంట్ లుక్‌తో విష్ణు ఆకట్టుకున్నాడు. అమెరికాలో వరుస హత్యలపై అధ్యయనం చేసిన రీసెర్చర్‌గా రేవతి కనిపించారు. పోలీసు విభాగానికి సహాయం అందించే పాత్రలో రేవతి తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. టీవీ యాంకర్‌గా మధు శాలిని, గౌతమ్ భార్య తేజస్వినీలు, నవదీప్, సుజిత్‌లు ఓకే అనిపించారు. సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్రంలో ఫోటోగ్రఫి, రీరికార్డింగ్లది కీలక పాత్ర. ప్రేక్షకులను ఆక ట్టుకోవడంలో ఈ రెండు విభాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. టెంపో, మూడ్, ఆంబియెన్స్ రిఫ్లెక్ట్ చేయడానికి లైటింగ్‌ను చక్కగా వాడుకున్నారు. సాంకేతిక అంశాలను బాలెన్స్ చేస్తూ వర్మ చిత్రీకరించిన తీరు బాగుంది. ఇలాంటి అంశాలతో తెరకెక్కించి విధానంలో వర్మది అందె వేసిన చెయ్యి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడి పనితీరు: ఆనందం కోసమే వరుస హత్యలకు పాల్పడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సీరియల్ కిల్లర్ జీవితాలతో స్పూర్తి పొంది ‘అనుక్షణం చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్ధమవుతుంది. సీరియల్ కిల్లర్ బిహేవియర్‌ను చక్కగా చిత్రీకరించారు. హత్యల నేపథ్యంలో మీడియా తీరును తన స్టైల్ తెరపైనా చూపించారు. ఎప్పటిలాగే టెక్నికల్ అంశాలను తన కావాల్సిన స్టైల్లో వినియోగించుకున్నారు. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేడం.. కథ, కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. టెక్నికల్ అంశాలతో కవర్ చేశాడంలో వర్మ సఫలమయారు. అయితే గత కొద్ది కాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న వర్మ చిత్రాల కంటే ’అనుక్షణం’ బాగుంటడం ఆయన అభిమానులకు ఊరట. ఇంట్లో టెలివిజన్‌లో క్రైమ్ ఎపిసోడ్లతో ఆనందించే వీక్షకులకు క్రైమ్, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్‌కు గురిచేయడం ఖాయం. -- అనుముల రాజబాబు -
ఇష్టమూ ఉంది... కష్టమూ ఉంది!
రేవతి ఓ పల్లెటూరి అమ్మాయి. అయినా బాగా చదువుకుంటుంది. ఇంజినీరింగ్ పూర్తి చేస్తుంది. కానీ పట్నానికి వెళ్లడానికి మాత్రం ఇష్టపడదు. తన ఊరిని వదిలి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదామెకి. కానీ ఆమె నిర్ణయాన్ని తండ్రి సమర్థించలేకపోతాడు. ఆమె చదువు వృథా కాకూడదని, ఇంకా చదువుకుని జీవితంలో పెకైదగాలని కూతురి కోసం కలలు కంటాడు. ఎలాగో అతి కష్టమ్మీద రేవతిని పై చదువులకు వెళ్లేందుకు ఒప్పిస్తాడు. ఇది ఈమె కథ. ఇక హీరో... గౌతమ్‌కృష్ణ. భారతీయ కట్టుబాట్లు, సంప్రదాయాలను ఇష్టపడని వ్యక్తి. గ్రీన్‌కార్డ్ సంపాదించి అమెరికాలో సెటిలైపోవాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచనే ఉండదతడికి. ఈ ఇద్దరూ ఒకరికొకరు తారసపడితే ఎలా ఉంటుంది? పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వీళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన సీరియల్... కొంచెం ఇష్టం కొంచెం కష్టం. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండటంతో సీరియల్‌ని ఇష్టపడినా... అత్యంత పాత కథాంశం కావడంతో ఇష్టపడటానికి కాస్త కష్టపడాల్సి వస్తోంది. హీరోయిన్ చలాకీదనం ఆకట్టుకున్నా, హీరో ఎక్స్ప్రెషన్స్లోని లోపం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతోంది. కొద్దిపాటి మార్పులు చేస్తే కష్టం తగ్గి ఇష్టం పెరిగే అవకాశం లేకపోలేదు! -
విను నా మాట బంగారు బాట
చేపని ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పడమే మంచి పని. నిజమే... పది రూపాయలు ఇవ్వడం సులువు. పరుల కోసం పది నిమిషాలు కేటాయించడం మాత్రం చాలా కష్టమైన పని. కాని ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆ పని చేశాడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ... అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే డి.జి.రామమూర్తి తల్లిదండ్రులు ‘హమ్మయ్య...’ అనుకున్నారు. కాని మన కానిస్టేబుల్ నిశ్చింతగా అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలన్న తపన. చదువుకున్నన్నాళ్లు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ట్యూషన్లు చెప్పుకుంటూ ప్రతిక్షణం విద్యార్థుల మధ్యన గడిపిన జ్ఞాపకాలు ఉద్యోగంలో చేరినా అతన్ని వదల్లేదు. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే తనకున్న మిమిక్రీ కళతో సెలవు రోజులన్నీ పాఠశాలల్లో, కళాశాలల్లో గడపడం మొదలుపెట్టాడు. ఇలా ఇరవైఏళ్ల నుంచి రామమూర్తి విద్యార్థుల గదుల్లోకి, వారి మస్తిష్కాలలోకి వెళ్లి ఏం చేశాడు? ఏం సాధించాడు? అదే మాట అడిగితే... ‘‘ఏవో నాలుగు మంచి ముక్కలు చెబుతాం, వినండి అంటే ఎవరికి నచ్చుతుంది? ఏదో ఒక ఆకర్షణ లేకపోతే గంటల తరబడి నేను చెప్పే కబుర్లు ఎవరు వింటారు? అందుకే ‘మిమిక్రీ’తో అందర్నీ ఓ చోట కదలకుండా కూర్చోబెట్టగలిగాను. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి... ఇలా ఒక్కో అంశానికి హాస్యాన్ని జోడించి మిమిక్రీ చేసి చెప్పడంలో విజయం సాధించాను. నవ్వులతో మొదలైన నా పాఠాలు ఓ పదిమంది జీవితాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేవరకూ వెళ్లాయి’’ అని ఎంతో గర్వంగా చెప్తారు రామమూర్తి. కూతురు పేరుతో... చిత్తూరు వి.కోట పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామమూర్తి గత ఇరవైఏళ్లుగా మిమిక్రీ పేరుతో విద్యార్థులకు వ్యక్తిత్వవికాస తరగతులు చెబుతూ తనవంతు సేవ చేస్తున్నాడు. ఈ సమయంలో తన కూతురు రేవతికి క్యాన్సర్ వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న రేవతి ఆరు నెలలపాటు క్యాన్సర్‌తో పోరాడి మరణించింది. గత ఏడాది జనవరిలో రేవతి మరణం తర్వాత రామమూర్తి చేసిన మొదటిపని ‘రేవతి ఫౌండేషన్’ స్థాపించడం. ‘‘మా అమ్మాయి ఈడు పిల్లలకు భవిష్యత్తుపై ఎంత బెంగ ఉంటుందో తెలుసు నాకు. అందుకే యువతకు ఉపాధి మార్గాలు వెతికిపెట్టే పనిచేస్తే బాగుంటుంది అనుకున్నాను. దానికి ఆన్లైన్ సహకారం తీసుకున్నాను. ఇప్పటివరకూ మా డిపార్ట్మెంట్లో ఇప్పించిన ఉద్యోగాలతో కలిపి వందకు పైగా యువతకు ఉపాధి అవకాశాల్ని కల్పించగలిగాను’’ అంటున్నారు రామమూర్తి. అందరి సహకారం... రేవతి ఫౌండేషన్ స్థాపించాక జాతీయస్థాయిలో యువతకున్న ఉద్యోగ అవకాశాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు రామమూర్తి. ఆ సమయంలో ‘ఐ గెట్ యు’ అనే ప్రైవేటు సంస్థతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పనిచేస్తున్నారు. ‘‘ఓ వందమంది యువతకు శిక్షణ ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయించడంతో చాలామందికి మా డిపార్టుమెంటులోనే ఉద్యోగాలు వచ్చాయి. బ్యాంకు, ఇంజనీర్... వంటి డిపార్టుమెంట్లలో కూడా అప్లయ్ చేయించాను. నాకున్న కొద్దిపాటి పరిచయాలతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కష్టం. అలాంటి సమయంలో ‘ఐ గెట్ యు’ అని సంస్థ నా గురించి తెలుసుకుని నాకు సహకరిస్తానంది. వారి వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాల సమాచారం ఉంటుంది. ఆ లింక్ మా రేవతి ఫౌండేషన్ సైట్‌కి ఇమ్మని అడిగితే ఒప్పుకున్నారు. ఇక అప్పటినుంచి కొన్ని వేలమంది మా సైట్ ద్వారా ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుంటున్నారు. వివరాల కోసం సైట్లో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేస్తే మా సిబ్బంది వెంటనే వారికి గైడ్ చేస్తారు. నా ధ్యేయం... చదువుకున్న యువత ఒక్క నిమిషం కూడా సమయం వృథా చేయకూడదు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు. వారి భవిష్యత్తు కోసం నేను చెబుతున్న పాఠాలకు రేవతి ఫౌండేషన్ ద్వారా బలమైన పునాది పడాలి. వాటిపై వారు నిర్మించుకునే సౌధాలు సమాజానికి ఎంతోకొంత నీడనివ్వాలి’’ అని ముగించారు రామమూర్తి. - భువనేశ్వరి రేవతి ఫౌండేషన్ స్థాపించాక జాతీయ స్థాయిలో యువతకున్న ఉద్యోగ అవకాశాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు రామమూర్తి. ఆ సమయంలో ‘ఐ గెట్ యు’ అనే ప్రైవేటు సంస్థతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పనిచేస్తున్నారు. -
రెపరెపలాడిన ప్రాణదీపం..ఆరిపోయింది
పట్టుబట్టలు కట్టుకుని.. నుదుట పెళ్లిబొట్టుతో మూడుముళ్లు వేయించుకోవలసిన వేళ.. ఆ అభాగ్యురాలు మరణయాతన అనుభవించింది. నవవధువుగా అరుంధతీ నక్షత్రాన్ని చూడాల్సిన వేళ అనంతలోకాలకు పయనమైంది. కన్యాదానం చేయాల్సిన కన్నవారికి కడుపుకోతే మిగిలింది. అశ్రునయనాలతో అత్తవారింటికి అంపకం పెట్టాల్సిన నాడు.. వల్లకాటికి మోసుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రేమ పేరుతో క్రూరంగా కోరలు సాచిన మదోన్మత్తుడి కాటుకి గురైన అభాగ్యురాలు రేవతి కన్నుమూసింది. మూడొంతులకు పైగా దగ్ధమైన దేహంలో నాలుగున్నరరోజులు రెపరెపలాడిన ఆమె ప్రాణదీపం చివరికి ఆరిపోయింది. పిఠాపురం, న్యూస్‌లైన్ : పిఠాపురంలో ముక్కుడుపల్లి నవీన్‌కుమార్ అనే ప్రేమోన్మాది జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి.. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కీర్తి లక్ష్మీరేవతి (17) తుదిశ్వాస విడిచింది. పిఠాపురంలోని వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసించే కారు మెకానిక్ కీర్తి శంకరబాబు, నాగరత్నం దంపతుల రెండో కుమార్తె లక్ష్మీరేవతి స్థానిక బాదం మాధవరావు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పెయింటింగ్ పని చేసే నవీన్‌కుమార్ ఏడాదిగా ఆమె వెంటపడి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శంకరబాబు మందలించినా వాడిలో మార్పు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే గుట్టుగా బతుకుతున్న తమ కుటుంబం రచ్చకెక్కాల్సి వస్తుందన్న జంకుతో రేవతి తల్లిదండ్రులు ఆమెను బడి మానిపించేశారు. అంతే కాక అనపర్తికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 22న రాత్రి 10.58 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇది తెలిసిన నవీన్‌కుమార్ ఈనెల 18న సాయంత్రం రేవతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించడంతో వంటింట్లోని కిరోసిన్ తెచ్చి, ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆమె తండ్రి శంకరబాబు పట్టుకోబోగా నెట్టేసి పరారయ్యాడు. 75 శాతం పైగా శరీరం కాలిపోయిన రేవతిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమై సోమవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో తుది ఊపిరి విడిచింది. పోస్టుమార్టం అనంతరం ఆమె అంత్యక్రియలు సాయంత్రం పిఠాపురం పాదగయ సమీపంలోని శ్మశానవాటికలో జరిగాయి. పెళ్లై మెట్టినింటికి వెళ్లాల్సిన వేళ వల్లకాటికి.. రేవతి మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కంటికి కడివెడుగా రోదిస్తున్నారు. ప్రేమోన్మాది గనుక ఈ దారుణానికి ఒడిగట్టకపోయి ఉంటే.. ఆదివారం రాత్రి 10.58 గంటలకు రేవతి పెళ్లి జరిగి ఉండేది. నుదుట బాసికం, పెళ్లిబొట్టుతో, పట్టుబట్టలతో, నవవధువుగా పుట్టింటి నుంచి మెట్టింటికి పయనం కావలసిన వేళ.. ఆమె విగతజీవిగా వల్లకాటికి చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను బరువెక్కిన హృదయాలతో అత్తింటికి అంపకం పెట్టాల్సిన వేళ.. ఎన్నటికీ తరని శోకభారంతో ఈ లోకం నుంచే సాగనంపాల్సి రావడంతో గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం కష్టసాధ్యమైంది. కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన చేతులతో కూతురి నోట్లో తులసి తీర్థం పోయాల్సి వచ్చిన ఆ కన్నవారి విలాపం అందరినీ కలచివేసింది. అక్షతలు వేసి, కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లమని దీవించాల్సిన వేళ.. ఆమె మరణవేదనను చూడాల్సి వచ్చిందని రేవతి అక్క గొల్లుమంటోంది. పెళ్లిపీటలపై కూర్చోవలసిన రేవతిని చితిపై పడుకోబెట్టాల్సి వచ్చిందని, నవ వధువుగా కొత్త జీవితం మొదలు పెట్టాల్సిన వేళ ఆమె జీవితమే అంతమైపోయిందని బంధువులు ఆక్రోశిస్తున్నారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటాం : పెండెం దొరబాబు రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రేవతి తల్లిదండ్రులను ఓదార్చి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేదలైన రేవతి తల్లిదండ్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ తరఫున అన్ని విధాలా సహకరించాలని తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశించారని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. రేవతి అమర్ రహే.. ‘రేవతి అమర్ రహే’ అంటూ విద్యార్థులు గద్గదస్వరాలతో, శోకతప్త హృదయాలతో నినదించారు. రేవతి మృతికి సంతాపసూచకంగా పిఠాపురంలో 216 జాతీయరహదారిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. రేవతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా ఆమె చదువుతున్న బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమె మృతికి సంతాపసూచకంగా సోమవారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పిఠాపురం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్, జిల్లా కాంగ్రెస్ మహిళాధ్యక్షురాలు వర్ధినీడి సుజాత ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, పాదగయ ట్రస్టుబోర్డు చైర్మన్ కొత్తెం పశువులరావు, సూరవరపు కృష్ణార్జునరావు, సూరవరపు అయ్యన్న, బోను లచ్చారావు, మేడిది శ్రీను, చవ్వాకుల సుబ్బారాయుడు, బొజ్జా మాణిక్యాలరావు, కట్టు కృష్ణ తదితరులు రేవతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మృతికి సంతాప సూచకంగా పిఠాపురంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన రేవతి
ఈనెల 18న కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి కాకినాడ/పిఠాపురం, న్యూస్‌లైన్: ఓ ప్రేమోన్మాది దాడికి నాలుగున్నర రోజులు మృత్యువుతో పోరాడిన రేవతి చివరికి ఓడిపోయింది. సోమవారం తెల్లవారు జామున కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కన్నుమూసింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలోని కీర్తి శంకరబాబు, నాగలక్ష్మిల రెండో కుమార్తె లక్ష్మీ రేవతి పై అదే పట్టణంలోని కత్తులగూడెంకు చెందిన నవీన్‌కుమార్(22) ఈనెల 18న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించిన విషయం విదితమే. 75 శాతానికి పైగా శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చదువుకుని తమకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుందని ఆశించిన రేవతి ఇలా అన్యాయంగా బలైపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా నవీన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆస్పత్రికి వెళ్లి వారిని ఓదార్చారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చానని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాడుతామని ధైర్యం చెప్పారు. కాగా పోలీసులు నవీన్‌కుమార్‌ను ఈనెల 20న అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారు. -
అకృత్యాలకు అంతం లేదా?
నిన్న అరుణ.. నేడు రేవతి.. రేపు ఇంకెవరో! దేశంలో అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. రెండేళ్ల పాటు ప్రేమించి, కాలక్షేం చేసి.. చివరకు పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు కిరోసిన్ పోసి తగలబెట్టేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థిని అరుణ.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అసువులు బాసింది. ఇక మూడు నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇంకా కాళ్ల పారాణి పెట్టుకోక ముందే, పట్టుబట్టలు కట్టుకోకముందే కాటికి పంపేశాడో నీచుడు. ప్రేమిస్తున్నానని వేధించాడు. కాదు, నేను చదువుకుంటున్నానని ఆమె తిరస్కరించింది. పెద్దలు కూడా మందలించారు. ఈలోపు ఆమెకు పెళ్లి కుదిరింది. అంతే, అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈమె కూడా బీటెక్ విద్యార్థినే. ఈ ఇద్దరు అమ్మాయిల ఉదంతాలు ఒకే సమయంలో.. ఒకేలా చోటుచేసుకున్నాయి. రోడ్డుమీదకు అమ్మాయి వెళ్లిందంటే ఎలా తిరిగొస్తుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. కంటికి కాస్త నదురుగా కనపడితే చాలు.. ప్రేమిస్తున్నామంటూ వెంటపడుతున్నారు. కొంతమంది దాన్ని నిరాకరిస్తుంటే, మరికొందరు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. ఏం చేసినా చివరకు మాత్రం వారి కథలు విషాదాంతాలే అవుతున్నాయి. పాపం అరుణ, రేవతి ఆస్పత్రులలో నాలుగైదు రోజుల పాటు నరకయాతన అనుభవించారు. దాదాపు 60-70 శాతం వరకు శరీరంపై కాలిన గాయాలు అయినప్పుడు ఎంత నరకం అనుభవిస్తారో!! కాకినాడ ఆస్పత్రిలో రేవతి పెట్టిన కేకలు ఇప్పటికీ ఆ తల్లిదండ్రుల గుండెల్లోనే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అంతా అయిపోయిన తర్వాత నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామంటూ చెబుతున్నారు తప్ప.. వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకున్న పాపాన పోవట్లేదు. పెప్పర్ స్ప్రేలు, లేజర్ గన్నుల్లాంటివి వచ్చాయని చెబుతున్నా.. అవి ఎంతమందికి అందుబాటులో ఉంటున్నాయో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? చిన్నపిల్లలని కూడా చూడకుండా కామాంధులు కాటేస్తుంటే.. ఈ యంత్రాంగం మాత్రం కుంభకర్ణుడి వారసత్వం తీసుకుంటోంది. దేవుడా రక్షించు ఈ దేశాన్ని.. కామాంధుల నుంచి.. ప్రేమ ముసుగులోని కాళ రాక్షసుల నుంచి!! -
వివాహిత బలవన్మరణం
=భర్త, అత్తింటివారి వేధింపులు =మాయచేసి విడాకుల పత్రంపై సంతకం చేయించుకున్న భర్త =కోర్టులో కొనసాగుతున్న విచారణ =గండిగుంట శివారు మూర్తిరాజుగూడెంలో ఘటన ఉయ్యూరు, న్యూస్‌లైన్ : జీవితాంతం తోడుండాల్సిన భర్త నమ్మించి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల నుదిటి భాగంలో సుడి ఉంటే తమ ఇం టిలో పెద్దవాడి ప్రాణానికే ప్రమాదం ఉందనే నెపంతో తనకు తెలియకుండా విడాకుల నోటీసులపై సంతకం చేయించడాన్ని, విడిపోదామంటూ బెదిరించడాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయి రెండేళ్లయినా గడవకుండానే తమ కుమార్తె మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు స్థానికుల హృ దయాలను కలిచివేసింది. ఆధునిక సాంకేతిక, సమాచార సమాజంలో కూడా సుడులు, జాతకాల పేరిట అర్ధాంగి ఆయుష్షు తీసేందుకు కారణమైన ఈ ఘట న ఉయ్యూరు మండలం మూర్తిరాజుగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పామర్రుకు చెందిన మన్నెం కనకదుర్గాప్రసాద్తో ఉ య్యూరు మండలం గండిగుంట గ్రామ శివారు మూ ర్తిరాజుగూడేనికి చెందిన ఈడే వెంకటరామారావు కుమార్తె రేవతి(24)కి గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. దుర్గాప్రసాద్ టింకరింగ్ పని చేస్తుం టాడు. రేవతి కాపురానికి వచ్చినప్పటినుంచి వేధిం పులకు గురవుతోంది. ఆమె నుదుటి భాగాన సుడి ఉందని, ఇలా ఉన్న ఆడపిల్ల ఎవరి ఇంట కాలుపెట్టినా ఆ ఇంటి పెద్ద చనిపోతాడని దుర్గాప్రసాద్ కు టుంబ సభ్యులు ప్రచారం చేశారు. దుర్గాప్రసాద్ పెద్దన్నయ్య దీన్ని మరింతగా నమ్మించడంతో ఆమెను వదిలించుకునేందుకు మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కట్నంగా ఇచ్చిన 60 సెంట్ల పొలాన్ని అమ్ముకురావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. విషయాన్ని రేవతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టారు. కట్నం వేధింపులపై రేవతి పుట్టింటివారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దుర్గాప్రసాద్ అరెస్టయ్యాడు. తరువాత పెద్ద మనుషులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. మళ్లీ అత్తారింటికి వెళ్లిన రేవతిని ఏదో ఒక కారణంతో హింసించేవారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ భార్యతో ప్రేమగా ఉంటున్నట్లు నటిస్తూ విడాకుల పత్రాలపై తెలివిగా సంతకాలు చేయించుకున్నాడు. తరువాత పుట్టింటికి తీసుకువచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు గడిచాక రేవతి పుట్టిం టికి కోర్టు నుంచి విడాకుల నోటీసులు అందాయి. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. రేవతి భర్తకు ఫోన్ చేసి ఇదేమిటని ప్రశ్నిస్తే విడిపోదామంటూ సలహా ఇచ్చాడు. ఈ కేసు విచారణ గుడివాడ కోర్టులో జరుగుతోంది. ఈనెల రెండో తేదీన ఇద్దరూ వాయిదాకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు బయట రేవతిని దుర్గాప్రసాద్ దూషించి విడాకులకు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 31న ఇదే కేసుపై మళ్లీ న్యాయస్థానం ఎదుట వారు హాజరుకావాల్సి ఉంది. భర్త, అత్తింటివారి మోసాన్ని భరించలేక రేవతి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుంది. కుమార్తె ఆత్మహత్యపై వెంకట రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు.