'లోఫర్' మూవీ రివ్యూ | LOFAR Movie Review | Sakshi
Sakshi News home page

'లోఫర్' మూవీ రివ్యూ

Published Thu, Dec 17 2015 12:46 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

'లోఫర్' మూవీ రివ్యూ - Sakshi

'లోఫర్' మూవీ రివ్యూ

టైటిల్: లోఫర్
జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా
తారాగణం: వరుణ్ తేజ్, దిశాపటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్
నిర్మాత: సివి రావు, శ్వేతాలానా, వరుణ్, తేజ
సంగీతం: సునీల్ కశ్యప్

కంచె సినిమాతో ప్రయోగాత్మక చిత్రంతో కూడా మంచి సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్, తొలిసారిగా ఓ కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నంలో చేసిన సినిమా లోఫర్. టైటిల్ నుంచే అందరినీ ఆకర్షించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ తరువాత మరింత హైప్ క్రియేట్ చేసింది. టెంపర్ సినిమాతో ఈ ఏడాది మంచి సక్సెస్ సాధించిన పూరి జగన్నాథ్ ఆ తరువాత జ్యోతిలక్ష్మి సినిమాతో నిరాశపరిచాడు. ఈ లోఫర్తో తిరిగి ఫాంలోకి రావాలని తనకు బాగా కలిసొచ్చిన మాస్ హీరోయిజాన్ని నమ్ముకున్నాడు. మరి పూరి దర్శకత్వంలో లోఫర్గా మారిన వరుణ్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాడా..? తను అనుకున్నట్టుగా కమర్షియల్ హీరో టాగ్ సాధించాడా..

కథ :
తాను ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోవటం కోసం కోట్ల ఆస్తిని కాదనుకొని వస్తుంది లక్ష్మి (రేవతి). కానీ తను నమ్మి వచ్చిన వ్యక్తి (పోసాని కృష్ణ మురళి) ఓ లోఫర్ అని తెలిసి అతనికి దూరమవ్వాలనుకుంటుంది. తనతో పాటు తన కొడుకును కూడా అతడికి దూరంగా పెంచాలనుకుంటుంది. ఈ లోగా అతను లక్ష్మి కొడుకు రాజా (వరుణ్ తేజ్) ను తీసుకొని జోధ్ పూర్ పారిపోతాడు. ఆ పిల్లాడిని కూడా తన లాగే లోఫర్లా పెంచుతాడు. తల్లి కామెర్లతో చనిపోయిందని చెప్పి కొడుకును నమ్మిస్తాడు. దొంగతనాలు, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు.

తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలనకున్న కుటుంబసభ్యుల నుంచి పారిపోయిన పారిజాతం (దిశాపటాని) జోధ్‌పూర్‌లో ఉంటున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తుంది. జోధ్‌పూర్‌లో దిగగానే పోసాని కృష్ణమురళి ఆమె సెల్ ఫోన్ కొట్టేస్తాడు. తరువాత రాజా ఆమె బ్యాగ్ కొట్టేస్తాడు. అలా జోధ్‌పూర్లో రెండు మూడు సార్లు కలిసిన రాజా, పారిజాతం ప్రేమలో పడతారు. ఈ విషయాన్ని పారిజాతం తన మేనత్తకు చెబుతుంది. ఈ లోగా పారిజాతం ఉంటున్న ప్లేస్ కనిపెట్టిన ఆమె ఫ్యామిలీ జోధ్‌పూర్ వచ్చేస్తారు. వాళ్లు పారిజాతాన్ని తీసుకెళ్లే సమయంలో వరుణ్ ఆమె మేనత్తను చూసి షాక్ అవుతాడు.

అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో రైల్లో వెళుతున్న పారిజాతాన్ని, ఆమె మేనత్తను పారిజాతం ఫ్యామిలీ పట్టుకుంటారు. తరువాత రాజా పారిజాతాన్ని కలిశాడా..? పారిజాతం మేనత్తకి రాజాకి సంబంధం ఏంటి..? చిన్నప్పటి నుంచి తల్లికి దూరంగా పెరిగిన రాజా తల్లిని ఎలా కలిశాడు..?  అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొలిసారిగా కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నం చేసిన వరుణ్ పర్ఫామెన్స్లో మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్లో బాగా నటించాడు. యాక్షన్ సీక్వన్స్లతోనూ మాస్ ఆడియన్స్కు చేరువయ్యే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో కీలకమైన తల్లి పాత్రలో నటించిన రేవతి, ఆ క్యారెక్టర్కు తానే బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రతీ సీన్లోనూ తన సీనియారిటీని చూపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. రెగ్యులర్గా తను చేసే తరహా లోఫర్ క్యారెక్టర్లో కనిపించిన పోసాని పరవాలేదనిపించాడు. కొంత గ్యాప్ తరువాత ముఖేష్ రుషి ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్లో మెప్పించాడు. అలీ, బ్రహ్మనందం, సప్తగిరి, ధన్రాజ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తరువాత సెంటిమెంట్ జోలికి వెళ్లని పూరి జగన్నాథ్. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సెంటిమెంట్ సినిమా లోఫర్. దర్శకుడిగా రొటీన్ అనిపించిన పూరి, డైలాగ్ రైటర్గా మాత్రం ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ని పక్కా కమర్షియల్ స్టార్గా ప్రజెంట్ చేయటంలో మంచి సక్సెస్ సాధించాడు. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదనిపించింది. సువ్వి సువ్వాలమ్మ పాట తప్ప గుర్తుండిపోయే పాటలు లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రొమాంటిక్ సాంగ్స్తో  పాటు కోటలో తీసిన ఫైట్స్ సీక్వన్స్లో కెమరా వర్క్ చాలా బాగుంది.

విశ్లేషణ:
ఇప్పటివరకు ప్రయోగాత్మక చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, లోఫర్ సినిమాతో కమర్షియల్గా స్టార్ మారాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వరుణ్ కెరీర్ పరంగా లోఫర్ స్పెషల్ సినిమా అయినా.. పూరి పరంగా మాత్రం ఇది రొటీన్ సినిమానే.. రెగ్యులర్గా పూరి సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్కు ముందు వచ్చే ఫైట్ సీన్ పోకిరి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా చాలా సన్నివేశాల్లో పూరి గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఈసారి సెంటిమెంట్ను పండించటంలో కూడా పూరి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా తల్లి పాత్రకు రేవతి ఎంపిక చేసుకోవటంలోనే పూరి చాలావరకు విజయం సాధించేశాడు. భారీ అంచనాలతో మెగా అభిమానులుగా వెళ్లే ఆడియన్స్కు కాస్త నిరాశకలిగినా.. పూరి స్టైల్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా లోఫర్.

ప్లస్ పాయింట్స్ :
రేవతి
వరుణ్ యాక్టింగ్
డైలాగ్స్
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్ :
రొటీన్ టేకింగ్
ఫస్టాఫ్
కామెడీ

ఓవరాల్గా లోఫర్ పూరికి రొటీన్ సినిమా, వరుణ్ తేజ్కి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement