Mehbooba Telugu Movie Review | మెహబూబా మూవీ రివ్యూ | Mehbooba Review in Telugu - Sakshi
Sakshi News home page

Published Fri, May 11 2018 12:42 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

Mehbooba Telugu Movie Review - Sakshi

టైటిల్ : మెహబూబా
జానర్ : లవ్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే
సంగీతం : సందీప్‌ చౌతా
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌
నిర్మాత : పూరి కనెక్ట్స్‌

చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్‌ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌, తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్‌ చేస్తూ తెరకెక్కించిన సినిమా మెహబూబా. ముందు నుంచి ఇది పూరికి కూడా రీలాంచ్‌ లాంటి సినిమా అంటూ ప్రచారం చేశారు చిత్రయూనిట్. పూరి తన రెగ్యులర్‌ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్‌ జానర్‌లో డిఫరెంట్‌ టేకింగ్‌తో చేసిన మెహబూబా పూరికి సక్సెస్‌ అందించిందా..? ఆకాష్‌ హీరోగా కమర్షియల్‌ హిట్ అందుకున్నాడా..?

కథ ;
రోషన్‌ (ఆకాష్‌ పూరి)ను చిన్న తనం నుంచి ఓ కల వెంటాడుతుంటుంది. తాను ఓ సైనికుడినని ఎవరో తనను చంపేశారని అనిపిస్తుంటుంది. అదే సమయంలో హిమాలయాల్లో తాను ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చానని.. ఒకే కల పదే పదే వస్తుంటుంది. అదే సమయంలో లాహోర్‌ లో ఉన్న అఫ్రీన్‌ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేసారని భయపడుతుంటుంది అఫ్రీన్‌. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్‌, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది.(సాక్షి రివ్యూస్‌) ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా.. అఫ్రీన్‌ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియాకు వస్తుంది.

అలా హైదరాబాద్‌ చేరిన అఫ్రీన్‌ను.. రోషన్‌ ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆ సమయంలో రోషన్‌ ముఖం చూడని అఫ్రీన్‌.. ఎలాగైన తనకు సాయం చేసిన వ్యక్తిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. అఫ్రీన్‌ ఇండియాకు రావటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్‌ (విషు రెడ్డి)కు నచ్చదు. అందుకే ఇంట్లో గొడవ చేసి తనను తిరిగి పాకిస్తాన్‌కు పిలిపిస్తాడు.

పాకిస్తాన్‌ వెళ్లేందుకు బయలుదేరిన అఫ్రీన్‌కు.. అదే ట్రైన్‌లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తున్న రోషన్‌ను కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన‍్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి.(సాక్షి రివ్యూస్‌) గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా మళ్లీ పట్టుందని తెలుసుకుంటాడు రోషన్‌. అసలు రోషన్‌కు తన గతం ఎలా తెలిసింది..? పాకిస్తాన్‌ వెళ్లిపోయిన అఫ్రీన్‌ను రోషన్‌ ఎలా కలవగలిగాడు..? చివరకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌.. చాలా రోజులు తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్‌ హీరోగా రీలాంచ్‌ అయ్యాడు. అయితే రెగ్యులర్‌ ఫార్మాట్‌ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ను ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్‌ పరంగా మెప్పించిన ఆకాష్‌, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్‌) యాక్షన్‌ సీన్స్‌తో ఆకట్టుకున్నా.. డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ చూపించే ఛాన్స్‌ మాత్రం దక్కలేదు. హీరోయిన్‌గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

విశ్లేషణ ;
ఆకాష్‌కే కాదు మెహబూబా పూరి జగన్నాథ్‌కు కూడా రీలాంచ్‌ లాంటిందే. అందుకే తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, డిఫరెంట్‌ టేకింగ్‌తో సినిమా చేశాడు పూరి.  పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని జోడించాడు. తన స్టైల్‌ మార్చి కొత్త టేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి తన మార్క్‌ టేకింగ్‌ను ఇష్టపడేవారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. (సాక్షి రివ్యూస్‌) అభిమానులు పూరి సినిమాలో ఆశించిచే పూరి మార్క్‌ హీరోయిజం, డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ లేకపోవటమే ఇందుకు కారణం. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్‌ చౌతా డిఫరెంట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి. యాక్షన్‌ సీన్స్‌ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
సినిమాటోగ్రఫి
ఫస్ట్‌ హాప్‌లో కొన్ని డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్క్రీన్‌ప్లే
లాజిక్‌ లేని సీన్స్‌
పూరి మార్క్‌ కనిపించకపోవటం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement