టైటిల్: డబుల్ ఇస్మార్ట్
నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులు
నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్‌నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్
దర్శకత్వం:పూరీ జగన్నాథ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలి
విడుదల తేది: ఆగస్ట్ 15, 2024
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ ఏంటంటే..
ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.
దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్‌గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్‌లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందా? ఏమైనా సీరియస్‌గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్‌లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎలా అయితే బ్రెయిన్‌లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్‌గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్‌గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment