‘తొలిప్రేమ’ సినిమాలో వరుణ్ తేజ్
టైటిల్ : తొలిప్రేమ
జానర్ : రొమాంటిక్ ఎంటర్‌టైనర్
తారాగణం : వరుణ్ తేజ్, రాశీఖన్నా, సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది
సంగీతం : తమన్.ఎస్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బీవీయస్‌ఎన్ ప్రసాద్
ఫిదా సినిమాతో ఘనవిజయం సాధించిన మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్‌రోల్‌లో తెరకెక్కిన మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరి తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ హీరోగా చరిత్ర సృష్టించిన తొలిప్రేమ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో వరుణ్ మరోసారి అదేఫీట్ రిపీట్ చేయాలని ప్రయత్నించాడు. వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బీవీయస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. వరుణ్‌కు మరో బిగ్ హిట్ అందించిందా..? తొలి ప్రయత్నంలో వెంకీ అట్లూరి సక్సెస్ సాధించాడా..?
కథ :
ఆదిత్య (వరుణ్ తేజ్) తను అనుకున్నది ముక్కుసూటిగా చేసే మనస్థత్వం ఉన్న వ్యక్తి. ఎవరైన ఇది నీవల్ల కాదు అంటే ఎలాగైన ఆ పని చేసి చూపించటం ఆదికి అలవాటు. కోపం కూడా ఎక్కువే. అలాంటి ఆది ఓ రైలు ప్రయాణంలో పరిచయం అయిన వర్ష (రాశీఖన్నా) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వర్షకు కూడా ఆదిత్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ రైలు దిగేసరికి వర్ష కనిపించదు ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికినా దొరకదు. (సాక్షి రివ్యూస్) మూడు నెలల తరువాత ఆది జాయిన్ అయిన కాలేజ్ లోనే ఇంజనీరింగ్ చదవటానికి జాయిన్ అవుతుంది వర్ష. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కాలేజ్ లో జరిగి ఓ గొడవ మూలంగా ఆది, వర్షకు దూరంగా వెళ్లిపోతాడు. తరువాత ఆరేళ్లకి మరోసారి ఆదిత్య జీవితంలోకి వర్ష వస్తుంది. లండన్ లో ఆదిత్య పనిచేసే కంపెనీలో సైట్ మేనేజర్‌గా వర్ష జాయిన్ అవుతుంది. అప్పటికీ వర్షను ద్వేషిస్తునే ఉంటాడు ఆది. ఆదికి వర్షమీద కోపం ఎలా తగ్గింది..? తిరిగి ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
వరుణ్ తేజ్.. ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. ఫిదా సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ ఈ సినిమాలో ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేశాడు. స్టైలిష్ గా కనిపించాడు. అయితే కొన్ని సీన్స్‌లో వరుణ్ కాస్త బొద్దుగా కనిపించి ఇబ్బంది పెట్టాడు. గత సినిమాలతో పోలిస్తే నటన పరంగానే కాదు డ్యాన్స్‌లపరంగా కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ చూపించాడు వరుణ్. (సాక్షి రివ్యూస్)వర్ష పాత్రకు రాశీఖన్నా పూర్తి న్యాయం చేసింది. పరిస్థితులను బట్టి సర్దుకుపోయే అమ్మాయిగా అద్భుతంగా నటించింది. రాశీ కెరీర్ లోనే వర్ష బెస్ట్ క్యారెక్టర్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. రాశీ కూడా అదే స్థాయి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రాశీఖన్నా నటనకు యూత్ ఆడియన్స్ ఫిదా అవుతారు. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శి ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కామెడీ కాస్త తగ్గినా. మంచి నటన కనబరిచాడు. బెట్టింగ్ రాజు గారు పాత్రలో హైపర్ ఆది తన మార్క్ పంచ్ డైలాగ్‌లతో అలరించే ప్రయత్నం చేశాడు. సీనియర్ నటులు నరేష్, సుహాసినిలవి దాదాపు అతిథి పాత్రలే అయినా ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ :
దర్శకుడు వెంకీ అట్లూరి తొలి ప్రయత్నంగా పెద్దగా ప్రయోగాలు చేయకుండా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌నే ఎంచుకున్నాడు. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం తరువాత విడిపోవటం తిరిగి కలుసుకోవటం అన్నది గతంలో చాలా సినిమాల్లో చూసిన కథే అయినా.. తనదైన కథనంతో తొలిప‍్రేమను ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. తొలి భాగాన్ని యూత్ మెచ్చే ఎంటర్‌టైనింగ్ అంశాలతో తెరకెక్కించాడు వెంకీ. సెకండ్ హాఫ్‌ను ఎమోషనల్ డ్రామాగా చూపించే ప్రయత్నంలో కాస్త సాగదీశాడు.(సాక్షి రివ్యూస్) సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి. కాలేజ్ సీన్స్, సాంగ్స్‌తో పాటు లండన్ లో జరిగే ఎపిసోడ్స్‌ను చాలా అందంగా తెరకెక్కించాడు. తమన్ అందించిన ఆల్బమ్‌లో మూడు పాటలు గుర్తుండిపోయేవిగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్
డైలాగ్స్
సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment