టైటిల్ : పైసా వసూల్
జానర్ : మాస్ యాక్షన్ డ్రామా
తారాగణం : బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్ సేథి, కైరా దత్, విక్రమ్ జీత్, కబీర్ బేడీ
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్
తన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, తన 101 చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నానంటూ ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. కొద్ది రోజులుగా సక్సెస్ కు దూరమై ఇబ్బందుల్లో ఉన్న పూరి బాలయ్యతో అయినా సక్సెస్ సాధించాడా..? పూరి స్టైల్ హీరోయిజంలో బాలకృష్ణ సూట్ అయ్యాడా..? పైసా వసూల్... పైసలు వసూల్ చేసే సినిమా అనిపించుకుంటుందా..?
కథ :
పోర్చుగల్ లో ఉండే అంతర్జాతీయ డాన్ బాబ్ మార్లే (విక్రమ్ జీత్) ఇండియాలో తన నెట్ వర్క్ ద్వారా ఎన్నో క్రైమ్స్ చేస్తుంటాడు. గవర్నమెంట్ లోని కొందరు వ్యక్తులు బాబ్ మార్లేకు సపోర్ట్ చేస్తుండటంతో పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. దీంతో రా ఆఫీసర్ (కబీర్ బేడీ) బాబ్ మార్లేను అంతం చేయడానికి ఓ ప్రవేట్ వ్యక్తిని నియమించాలనుకుంటాడు. అదే సమయంలో తీహార్ జైలు నుంచి రిలీజ్ అయి వచ్చిర తేడాసింగ్ (నందమూరి బాలకృష్ణ) ఏసీపీ కిరణ్మయి(కైరా దత్) కి కనబడతాడు. తేడా సింగ్ క్రిమినల్ రికార్డ్ విని, అతడి యాటిట్యూడ్ చూసిన ఏసీపీ తమ ఆపరేషన్ కు ఇతడే కరెక్ట్ అని ఫిక్స్ అవుతుంది. రా ఆఫీసర్స్ డీల్ నచ్చిన తేడా సింగ్ బాబ్ మార్లేను చంపేందుకు ఒప్పుకుంటాడు. పోర్చుగల్ లో ఉంటున్న బాబ్ మార్లేను తేడా సింగ్ ఎలా అంతం చేశాడు..? అసలు తేడా సింగ్ ఎవరు..? ఓ అంతర్జాతీయ డాన్ ను అంతం చేసే డీల్ ఎందుకు అంగీకరించాడు.? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
మొదటి నుంచి చిత్రయూనిట్ చెపుతున్నట్టుగా ఇది పూర్తిగా బాలయ్య వన్ మేన్ షో. ఇన్నాళ్లు మాస్, సీరియస్ పాత్రలో చూసిన బాలయ్య, పైసా వసూల్ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. కామెడీ, యాక్షన్ లో అభిమానులతో విజిల్స్ వేయించాడు. పూరి మార్క్ హీరోయిజంలో ఒదిగిపోయిన బాలకృష్ణ, తన స్టైల్ మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. పేరుకు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా.. ఎక్కువగా శ్రియ పాత్రే గుర్తుండిపోతుంది. శ్రియ నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ముస్కాన్, కైరా దత్ లకు పెద్దగా నటనకు అవకాశం లేదు. విలన్ రోల్ లో విక్రమ్ జీత్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రా ఆఫీసర్ గా కబీర్ బేడి చిన్న పాత్రలో కనిపించినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. తొలి భాగంలో 30 ఇయర్స్ పృధ్వీ, సెకండ్ హాఫ్ లో ఆలీ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సాంకేతిక నిపుణులు :
బాలయ్య అభిమానుల కోసం పైసా వసూల్ అంటూ ముందే ప్రకటించిన పూరి జగన్నాథ్, అభిమానులను దృష్టిలో పెట్టుకొని కథా కథనాలు రెడీ చేశాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించే డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్, లుక్ లో పూరి గత చిత్రాల హీరోల ఛాయలు కనిపించినా.. డైలాగ్స్ లో మాత్రం చాలా కొత్త దనం చూపించాడు. అయితే కథ పాతదే కావటం కాస్త నిరాశపరిచినా పూరి టేకింగ్, రిచ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు మరో ప్రధాన ఎసెట్ ముఖేష్ జి సినిమాటోగ్రఫి బాలయ్యను చాలా స్టైలిష్ గా చూపించిన సినిమాటోగ్రాఫర్, యాక్షన్స్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. పోర్చుగల్ లో తీసిన చేజ్ సీన్స్ సూపర్బ్ అనిపిస్తాయి. అనూప్ రుబెన్స్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ నటన
డైలాగ్స్
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
మెయిన్ స్టోరి
పూరి గత చిత్రాల ఛాయలు కనిపించటం
పైసా వసూల్.. తేడాసింగ్ అభిమానులను అలరిస్తాడు..
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
'పైసా వసూల్' మూవీ రివ్యూ
Published Fri, Sep 1 2017 12:17 PM | Last Updated on Fri, Sep 22 2017 10:48 AM
Advertisement