ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే.. పొలిటీషియన్లు కాదనేది \ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి అభిప్రాయం. మహిళా మానవ వనరుల వినియోగంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని అన్ని పార్టీలూ గుర్తించాలని ఆమె అంటున్నారు. రాష్ట్రావతరణ తర్వాత పల్లె జీవనంలో మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేసే సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవతి ఎన్నికల వేళ విధానపరమైన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే....
దృక్కోణంలో మార్పు కావాలి
పొలిటీషియన్ ఆలోచన ఎప్పుడూ కూడా తాత్కాలిక అవసరాల వైపే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ధోరణిలో ఉంటుంది. ఆ దృక్కోణం దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వదు. ఎన్నికల్లో గెలవడమే గీటురాయిగా సాధ్యం కాని హామీలు ఇవ్వడం పొలిటీషియన్ లక్షణం. కానీ పొలిటికల్ లీడర్ అలా కాదు. ఓ విజన్ ఉంటుంది. భావి తరాలకు మేలు చేసే ఆలోచనావిధానం ఉంటుంది.
రాజకీయాల్లో ఒక్కోసారి వీరు విజయం సాధించకపోవచ్చు. కానీ ఆలస్యంగానైనా వీరి దూరదృష్టే ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలకు హామీలిచ్చేప్పుడు నేతలు ఆలోచించాలి. కార్యాచరణలోకి తేగలమన్న విశ్వాసం ఉన్నప్పుడే హామీలివ్వాలి. అన్ని పార్టీలూ ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకోవాలి.
యువశక్తిలో ఉద్వేగమెందుకు?
రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగింది. విదేశీ పెట్టుబడులూ పెరిగాయి. పరిశ్రమలూ స్థాపించారు. కానీ ఉపాధి వేటలో యువశక్తిలో నైరాశ్యం కన్పిస్తోంది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక ఉద్యోగాలొస్తాయనేది కలే. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు రంగమే ఉపాధి మార్గం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కన్పిస్తున్నా, యువతలో ఉద్యోగాల్లేవన్న ఆందోళనకు కారణాలున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణం.
నిజానికి ఉపాధి పొందుతున్న వారిలో మహిళలు 25 శాతమే ఉన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించే దిశగా పాలకులు ఆలోచించాలి. యూత్ ఉద్యోగాలు సాధించే నైపుణ్యం ఉంటేనే రాష్ట్ర సంపద కూడా పెరుగుతుంది. దీన్ని గుర్తించడంలో పాలకులు వెనకపడ్డారనే చెప్పాలి. అమెరికా వెళ్తున్న మన వారు పర్మనెంట్ ఉద్యోగమే చేస్తున్నారా? చేసే ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అయినా మూడు నెలల్లో మరో ఉద్యోగం చూసుకోవడం లేదా? ఇక్కడి యువతలోనూ ఆ స్థాయి నమ్మకం, నైపుణ్యం కల్పించే దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు పాలకులు దృష్టి పెట్టాలి.
వలసలు తగ్గాయి.. జీవనం మారింది
ఒకప్పుడు తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉండేవి. మహబూబ్‌నగర్ నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఉపాధి అవకాశాల హబ్‌గా మారింది. దీంతో అన్‌స్కిల్డ్ సెక్టార్ నుంచి వలసలు తగ్గాయి. రాష్ట్రంలో 86 శాతం సన్న,చిన్నకారు రైతులున్నారు. ఇప్పుడు వీరు వ్యవసాయం ఒక్కటే ఉపాధి అనుకోవ డం లేదు. కుటుంబంలో ఓ వ్యక్తి వ్యవ ాయం చేస్తే, ఇంకో వ్యక్తి ఇతర ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నాడు.
ఉన్నత విద్యావంతులు మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు. ఐఐటీ చేస్తే వ్యవసాయం చెయ్యకూడదని ఉందా? ప్రపంచీకరణ మార్పులను ప్రజలకు అవగాహన కల్పించడంలో అన్ని పార్టీలూ కృషి చేయాలి. సిరిసిల్ల వంటి చేనేత కారి్మకులున్న ప్రాంతాల్లో తెలంగాణ వచ్చాక మార్పు కన్పిస్తోంది. పవర్‌లూమ్స్ ద్వారా ఆదాయం పెంచుకున్నారు. ఇలా అన్ని సెక్టార్‌లోనూ స్కిల్ అభివృద్ధి చేయాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య, యువతలో ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చు.
నాణ్యమైన విద్య అందుతుందా?
విద్యాబోధనలోనే తేడాలున్నాయి. ఇవి అసమానతలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా రంగాన్నే చూడండి. గురుకులాలు... మోడల్ స్కూల్స్... కేజీబీవీలు... ప్రభుత్వ స్కూళ్ళు... స్థానిక సంస్థల స్కూళ్ళు... ఒక్కో చోట ఒక్కో నాణ్యత ఉంటోంది. నాణ్యమైన విద్య అందరికీ అందించాలనే ధోరణి పాలకుల్లో ఉండాలి. ఈ దిశగా మేధోమథనం జరగాలి. విద్యా విధానాలపై శాశ్వత మార్పులను ఆశించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొల్పే విద్యను నిర్లక్ష్యం చేస్తే భావితరం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నూతన మార్పు తెచ్చేది రాజకీయ పార్టీలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే.
-వనం దుర్గాప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment