ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌ | Telangana CM Revanth Reddy Warning To MLAs In CLP Key Meeting, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌

Published Tue, Apr 15 2025 2:46 PM | Last Updated on Tue, Apr 15 2025 4:23 PM

Cm Revanth Reddy Warning To Mlas

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం..  శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్‌ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.

సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.

‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం

..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క  ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు.

మంత్రి పదవి కావాలంటే..  ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్

..బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి  అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది.

..కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement