![CM Revanth Reddy clarified in CLP meeting](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/revanth.jpg.webp?itok=pOGfPj0l)
సీఎల్పీ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఏదైనా ఉంటే వచ్చి కలవండి.. డిన్నర్ మీటింగ్‌లు వద్దు
సీఎల్పీ సమావేశంలో స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
జీ–23 సమావేశాలు పెడితే గులాం నబీ ఆజాద్‌నే క్షమించలేదు
ఏదైనా ఉంటే రాష్ట్ర నాయకత్వాన్ని కలవండి.. లేదనుకుంటే ఖర్గే దగ్గరికి వెళ్లండి
ఏడాదిలో ఎన్ని చేసినా ప్రజల్లోకి వెళ్లలేకపోయాం
ఇప్పటికైనా అందరం ఒక లైన్ మీద ఉండి పనిచేయాలి... కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సూర్యాపేట, మెదక్‌లలో భారీ బహిరంగ సభలు పెడతామని వెల్లడి
అందరూ సమన్వయంతో పనిచేయాలి: మున్షీ
ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నియోజక వర్గాల్లో పనులవుతాయన్న ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏ స్థాయి నాయకుడైనా పార్టీ లైన్‌లో ఉండాల్సిందే. గీత దాటితే కఠిన చర్యలు తప్పవు. డిన్నర్ మీటింగ్‌ల పేరుతో ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవద్దు. గతంలో గులాం నబీ ఆజాద్ వంటి 23 మంది కీలక నేతలు జీ–23 పేరుతో ప్రత్యేకంగా సమావేశమైతే పార్టీ క్షమించలేదన్న విషయాన్ని మర్చిపోవద్దు..’’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏదైనా ఉంటే తనను, పార్టీ సీనియర్ నేతలను కలవాలని.. అవసరమైతే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్లాలని, డిన్నర్ మీటింగ్‌ల వంటివాటికి కాదని పేర్కొన్నట్టు సమాచారం.
గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.
నేను ఫ్రెండ్లీ సీఎంను..!
పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘‘నేను ఫ్రెండ్లీ సీఎంను.. నా దగ్గరకు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా రావచ్చు. సాధ్యమైనంత వరకు చేసి పెడతా. సాధ్యం కాని పనులు చేయలేం. కొందరు మా దగ్గరకు వచ్చి పనులు కాకపోతే.. మళ్లీ మీతో కలసి వస్తున్నారు. అలాంటప్పుడు పనులు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు క్యారెక్టర్ కాపాడుకోవాలి. పైరవీలు చేసి ప్రజల్లో, అధికారుల్లో చులకన కావద్దు. తొలిసారి గెలిచినవారు రెండోసారి గెలవడం చాలా కష్టం. మన పనితీరే రెండోసారి గెలిపిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి..’’ అని పేర్కొన్నట్టు తెలిసింది.
డిన్నర్ మీటింగ్‌లు వద్దు..
ఎమ్మెల్యేలు మామూలుగానే భోజనం చేయాలని డిన్నర్‌కు కలిసి ఉండవచ్చని, కానీ ప్రత్యర్థులు ఈ విషయాన్ని చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నట్టు సమాచారం. ‘‘మన గురించి మాట్లాడుకునే ఆస్కారం ఎదుటివారికి ఇవ్వొద్దు. జీ–23 పేరుతో గులాం నబీ ఆజాద్ వంటి వారు మీటింగ్‌లు పెడితేనే పార్టీ సహించలేదు. ఇంకోసారి ఇలాంటి డిన్నర్ మీటింగులు పెట్టుకోకపోవడమే మంచిది. నేను పని చేయలేదని ఎవరైనా సీరియస్‌గా భావిస్తే నేరుగా ఏఐసీసీ దగ్గరికి వెళ్లొచ్చు, చెప్పొచ్చు. అవసరమైతే ఖర్గే అపాయింట్‌మెంట్ నేనే ఇప్పిస్తా..’’ అని సూచించినట్టు తెలిసింది.
ఎన్ని చేసినా ప్రజల్లోకి వెళ్లలేకపోయాం
మహిళలకు ఉచిత ప్రయాణం నుంచి ఉద్యోగాల భర్తీ వరకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని, కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామని.. అయినా ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లలేకపోయామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరం ఒక లైన్ మీద ఉండి పనిచేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికలకు పది, పదిహేను రోజుల్లోనే నోటిఫికేషన్ రావచ్చని, కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని.. అప్పటివరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయనిగానీ, షెడ్యూల్ గురించిగానీ ఎవరూ మాట్లాడవద్దని సూచించినట్టు తెలిసింది. అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, వీలైనంత వరకు ఏకగ్రీవాలకు ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేంతవరకు స్థానికంగానే ఉండాలని సీఎం సూచించినట్టు తెలిసింది.
పథకాల విషయంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు!
సీఎల్పీ భేటీలో మాట్లాడిన ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించారు. రైతు భరోసాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించినట్టు సమాచారం. రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదని, క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా ఉందని.. రుణమాఫీ కారణంగా మిగతా పథకాలను వంద శాతం అమలు చేయలేకపోతున్నామని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇక పథకాలను హడావుడిగా ప్రారంభిస్తున్నామని.. ఏదీ వంద శాతం రీచ్ కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండటంతో గందరగోళం నెలకొంటోందని, ఇకపై గాం«దీభవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు మెటీరియల్ వచ్చేలా చూడాలని కోరినట్టు తెలిసింది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ అనుచరులు అమీన్‌పూర్‌లో భూములు ఆక్రమించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది.
వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం తాను ఏ మంత్రి వద్దకూ వెళ్లలేదని ఆయన కుటుంబసభ్యుల మీద ఒట్టుపెట్టినట్టు సమాచారం. చివరగా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయినా నిధులు రాకపోతే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఎలాగని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. త్వరలో విడుదల చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు తెలిసింది.
హాజరుకాని ఫిరాయింపు ఎమ్మెల్యేలు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ సమావేశానికి వెళితే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావించే దూరంగా ఉన్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనవారు కూడా గురువారం సమావేశానికి రాలేదు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా పలు కారణాలతో గైర్హాజరైనట్టు తెలిసింది. టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి
ఇదే సమయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే.. త్వరలోనే ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సూర్యాపేట, మెదక్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాందీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం.
హెచ్చరికలు, సూచనల మధ్య..!
సీఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తూనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు పరోక్ష హెచ్చరికలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య.. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కొరవడిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే.. ఈ సమావేశంలో ప్రసంగించిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పలు అంశాలపై ఘాటుగానే స్పందించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment