రెపరెపలాడిన ప్రాణదీపం..ఆరిపోయింది
Published Tue, Dec 24 2013 4:26 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
పట్టుబట్టలు కట్టుకుని.. నుదుట పెళ్లిబొట్టుతో మూడుముళ్లు వేయించుకోవలసిన వేళ.. ఆ అభాగ్యురాలు మరణయాతన అనుభవించింది. నవవధువుగా అరుంధతీ నక్షత్రాన్ని చూడాల్సిన వేళ అనంతలోకాలకు పయనమైంది. కన్యాదానం చేయాల్సిన కన్నవారికి కడుపుకోతే మిగిలింది. అశ్రునయనాలతో అత్తవారింటికి అంపకం పెట్టాల్సిన నాడు.. వల్లకాటికి మోసుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రేమ పేరుతో క్రూరంగా కోరలు సాచిన మదోన్మత్తుడి కాటుకి గురైన అభాగ్యురాలు రేవతి కన్నుమూసింది. మూడొంతులకు పైగా దగ్ధమైన దేహంలో నాలుగున్నరరోజులు రెపరెపలాడిన ఆమె ప్రాణదీపం చివరికి ఆరిపోయింది.
పిఠాపురం, న్యూస్‌లైన్ : పిఠాపురంలో ముక్కుడుపల్లి నవీన్‌కుమార్ అనే ప్రేమోన్మాది జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి.. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కీర్తి లక్ష్మీరేవతి (17) తుదిశ్వాస విడిచింది. పిఠాపురంలోని వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసించే కారు మెకానిక్ కీర్తి శంకరబాబు, నాగరత్నం దంపతుల రెండో కుమార్తె లక్ష్మీరేవతి స్థానిక బాదం మాధవరావు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పెయింటింగ్ పని చేసే నవీన్‌కుమార్ ఏడాదిగా ఆమె వెంటపడి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శంకరబాబు మందలించినా వాడిలో మార్పు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే గుట్టుగా బతుకుతున్న తమ కుటుంబం రచ్చకెక్కాల్సి వస్తుందన్న జంకుతో రేవతి తల్లిదండ్రులు ఆమెను బడి మానిపించేశారు. అంతే కాక అనపర్తికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 22న రాత్రి 10.58 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు.
ఇది తెలిసిన నవీన్‌కుమార్ ఈనెల 18న సాయంత్రం రేవతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించడంతో వంటింట్లోని కిరోసిన్ తెచ్చి, ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆమె తండ్రి శంకరబాబు పట్టుకోబోగా నెట్టేసి పరారయ్యాడు. 75 శాతం పైగా శరీరం కాలిపోయిన రేవతిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమై సోమవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో తుది ఊపిరి విడిచింది. పోస్టుమార్టం అనంతరం ఆమె అంత్యక్రియలు సాయంత్రం పిఠాపురం పాదగయ సమీపంలోని శ్మశానవాటికలో జరిగాయి.
పెళ్లై మెట్టినింటికి వెళ్లాల్సిన వేళ వల్లకాటికి..
రేవతి మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కంటికి కడివెడుగా రోదిస్తున్నారు. ప్రేమోన్మాది గనుక ఈ దారుణానికి ఒడిగట్టకపోయి ఉంటే.. ఆదివారం రాత్రి 10.58 గంటలకు రేవతి పెళ్లి జరిగి ఉండేది. నుదుట బాసికం, పెళ్లిబొట్టుతో, పట్టుబట్టలతో, నవవధువుగా పుట్టింటి నుంచి మెట్టింటికి పయనం కావలసిన వేళ.. ఆమె విగతజీవిగా వల్లకాటికి చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను బరువెక్కిన హృదయాలతో అత్తింటికి అంపకం పెట్టాల్సిన వేళ.. ఎన్నటికీ తరని శోకభారంతో ఈ లోకం నుంచే సాగనంపాల్సి రావడంతో గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం కష్టసాధ్యమైంది. కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన చేతులతో కూతురి నోట్లో తులసి తీర్థం పోయాల్సి వచ్చిన ఆ కన్నవారి విలాపం అందరినీ కలచివేసింది. అక్షతలు వేసి, కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లమని దీవించాల్సిన వేళ.. ఆమె మరణవేదనను చూడాల్సి వచ్చిందని రేవతి అక్క గొల్లుమంటోంది. పెళ్లిపీటలపై కూర్చోవలసిన రేవతిని చితిపై పడుకోబెట్టాల్సి వచ్చిందని, నవ వధువుగా కొత్త జీవితం మొదలు పెట్టాల్సిన వేళ ఆమె జీవితమే అంతమైపోయిందని బంధువులు ఆక్రోశిస్తున్నారు.
రేవతి కుటుంబానికి అండగా ఉంటాం : పెండెం దొరబాబు
రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రేవతి తల్లిదండ్రులను ఓదార్చి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేదలైన రేవతి తల్లిదండ్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ తరఫున అన్ని విధాలా సహకరించాలని తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశించారని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
రేవతి అమర్ రహే..
‘రేవతి అమర్ రహే’ అంటూ విద్యార్థులు గద్గదస్వరాలతో, శోకతప్త హృదయాలతో నినదించారు. రేవతి మృతికి సంతాపసూచకంగా పిఠాపురంలో 216 జాతీయరహదారిపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. రేవతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా ఆమె చదువుతున్న బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమె మృతికి సంతాపసూచకంగా సోమవారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పిఠాపురం మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్, జిల్లా కాంగ్రెస్ మహిళాధ్యక్షురాలు వర్ధినీడి సుజాత ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, పాదగయ ట్రస్టుబోర్డు చైర్మన్ కొత్తెం పశువులరావు, సూరవరపు కృష్ణార్జునరావు, సూరవరపు అయ్యన్న, బోను లచ్చారావు, మేడిది శ్రీను, చవ్వాకుల సుబ్బారాయుడు, బొజ్జా మాణిక్యాలరావు, కట్టు కృష్ణ తదితరులు రేవతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మృతికి సంతాప సూచకంగా పిఠాపురంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
Advertisement
Advertisement