మృత్యువుతో పోరాడి ఓడిన రేవతి
ఈనెల 18న కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
కాకినాడ/పిఠాపురం, న్యూస్‌లైన్: ఓ ప్రేమోన్మాది దాడికి నాలుగున్నర రోజులు మృత్యువుతో పోరాడిన రేవతి చివరికి ఓడిపోయింది. సోమవారం తెల్లవారు జామున కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కన్నుమూసింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలోని కీర్తి శంకరబాబు, నాగలక్ష్మిల రెండో కుమార్తె లక్ష్మీ రేవతి పై అదే పట్టణంలోని కత్తులగూడెంకు చెందిన నవీన్‌కుమార్(22) ఈనెల 18న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించిన విషయం విదితమే. 75 శాతానికి పైగా శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
చదువుకుని తమకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుందని ఆశించిన రేవతి ఇలా అన్యాయంగా బలైపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా నవీన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆస్పత్రికి వెళ్లి వారిని ఓదార్చారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చానని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాడుతామని ధైర్యం చెప్పారు. కాగా పోలీసులు నవీన్‌కుమార్‌ను ఈనెల 20న అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారు.