అవార్డుల కోసం కాదు
తాను అవార్డుల కోసం చిత్రాలు నిర్మించడం లేదు అని అన్నారు ప్రముఖ నటుడు ధనుష్.ఈయన నటుడుగా ఉన్నత స్థాయిలో పయనిస్తూనే తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై చక్కని కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాక్కాముట్టై,విచారణై వంటి ప్రేక్షకుల ఆదరణతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలు వండర్‌బార్ సంస్థ నుంచి వచ్చినవే.
తాజాగా అమ్మాకణక్కు అనే చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఇది హిందీలో మంచి విజయాన్ని సాధించిన నిల్ బట్టా సనాట్టా చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. హిందీ చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారినే ఈ అమ్మా కణక్కు చిత్రానికి దర్శకత్వం వహించారు. అమలాపాల్, రేవతి, బేబీ యువ, సముద్రకణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత బాణీలు అందించారు.
త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర వివరాలను వివరించడానికి చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ నిల్ బట్టా సనాట్టా చిత్ర ట్రైలర్ చూసి ఆ చిత్ర నిర్మాత ఆనంద్.ఎల్ రాయ్‌ని తమిళ రీమేక్ హక్కులు అడిగి పొందానన్నారు.ఆ చిత్ర ట్రైలరే తనను అంతగా ప్రభావితం చేసిందన్నారు. పూర్తి చిత్రం చూసిన తరువాత తాను ఫుల్ హ్యాపీ అన్నారు. ఈ చిత్రం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్య అవశ్యకతను ఆవిష్కరించే కథా చిత్రం అమ్మా కణక్కు అని తెలిపారు.
అమ్మ పాత్రకు అమలాపాలే కరెక్ట్
ఇందులో అమ్మ పాత్రకు అమలాపాల్ చక్కగా నప్పుతారని భావించి ఆమెకు ఫోన్ చేసి అడిగానన్నారు. అమ్మ పాత్ర అనగానే అమలాపాల్ సంకోచించినా ఆ తరువాత నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఇందులో అమలాపాల్ ప్లస్‌టూ చదివే అమ్మాయికి అమ్మగా నటించారని, ఆ పాత్రకు తనే కరెక్ట్ అని, వేరొకరిని అందులో ఊహించలేమని అన్నారు. ఇందులో నటించిన అమలాపాల్‌కు, బేబీ యువకు జాతీయ అవార్డు వస్తుందని అన్నారు.
జాతీయ అవార్డు కోసమే చిత్రాలు నిర్మిస్తున్నారా?అన్న విలేకరుల ప్రశ్నకు తాను అవార్డులు దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించనని, అయినా తన చిత్రాలకు అవార్డులు వస్తున్నాయని, ఇది దైవకృప అని బదులిచ్చారు.అమ్మాకణక్కు తనకు చాలా ప్రత్యేకమైన చిత్రం అని నటి అమలాపాల్ అన్నారు. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి, బేబీ యువ పాల్గొన్నారు. చివరగా చిత్ర ఆడియోను ఆవిష్కరించారు.