కాంగ్రెస్‌ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్‌.. రేవంత్‌పై కేటీఆర్‌ సీరియస్‌ | KTR Serious Comments On Revanth Reddy Over Revathi Arrest | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్‌.. రేవంత్‌పై కేటీఆర్‌ సీరియస్‌

Published Wed, Mar 12 2025 9:30 AM | Last Updated on Wed, Mar 12 2025 10:43 AM

KTR Serious Comments On Revanth Reddy Over Revathi Arrest

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సీనియర్‌ జర్నలిస్ట్‌ రేవతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె అరెస్ట్‌ నేపథ్యంలో ప్రభుత్వం తీరును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ తెలంగాణను నియంతల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు.

సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 12 మంది పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వెళ్లి రేవతిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. ఇదే సమయంలో రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అయితే, రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక, జర్నలిస్ట్‌ రేవతి అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌..‘రేవతి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. తెల్లవారుజామునే రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాం.రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణం.

ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండు. చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా?. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలి. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట. అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి’ అని ఘాటు విమర్శలు చేశారు. 

 

మరోవైపు.. జర్నలిస్ట్‌ రేవతి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. ఈ సందర్బంగా కవిత​ ట్విట్టర్‌ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement