రేవతి పిళ్లై.. ‘ద వైరల్ ఫీవర్ (టీవీఎఫ్)’ యూట్యూబ్ చానెల్ వీక్షకులకు సుపరిచితం. నటిని కావాలనుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు రేవతి. ఇష్టంలేకుండానే మొదలుపెట్టింది ఈ ప్రయాణాన్ని. అయినా మనసు పెట్టే కొనసాగిస్తోంది. అందుకే ఇక్కడ రేవతిని పరిచయం చేస్తున్నాం..
మహారాష్ట్రలో స్థిరపడిన మలయాళీ కుటుంబం రేవతి వాళ్లది. ఆమె థానేలో పుట్టిపెరిగింది. షీజా పిళ్లై, మనోజ్ పిళ్లై.. రేవతి తల్లిదండ్రులు.
ఊహ తెలిసినప్పటి నుంచి ఆటోమొబైల్ ఇంజినీర్ కావాలని కలలు కన్నది. కానీ రేవతిలోని ఇమిటేషన్ స్కిల్స్ చూసిన ఆమె కజిన్ తన చెల్లెలు యాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాడు అనుకోవడమే కాదు ఆడిషన్స్‌కీ తీసుకెళ్లేవాడు. ప్రతి ఆడిషన్‌కి రేవతి ఏడుస్తూనే వెళ్లేదట.
రేవతికి మొదట మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. మోడల్‌గా రాణిస్తున్నప్పుడే టీవీఎఫ్ వాళ్ల ‘యే మేరీ ఫ్యామిలీ’ వెబ్ సిరీస్‌కి సెలెక్ట్ అయింది. అందులో ‘విద్య’గా నటించింది. అయిష్టంగానే నటనారంగంలోకి అడుగుపెట్టినా.. కెమెరా ముందుకు రాగానే తన మైండ్‌ని మేకప్ చేసింది.. అదే తన కెరీర్ అని.. కమిట్ కావాలని!
ఆ కమిట్‌మెంట్ విత్ టాలెంట్‌ని టీవీఎఫ్ వదలుకోదల్చుకోలేదు. అందుకే తర్వాత సిరీస్ ‘కోట ఫ్యాక్టరీ’లోనూ చాన్స్‌నిచ్చింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చింది. తర్వాత ‘స్పెషల్ ఆప్స్ 1.5’లోనూ నటించింది.
కంఫర్ట్ జోన్‌లో ఉండటం రేవతి ఇష్టం ఉండదు. కంఫర్ట్ మనలోని క్రియేటివిటీని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని చంపేస్తుందని ఆమె అభిప్రాయం. అందుకే సిరీస్ చేస్తూనే ‘కాపిటల్ ఏ, స్మాల్ ఏ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ‘తారే జమీన్ పర్’ ఫేమ్ దర్శిల్ సఫారీ సరసన.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రేవతికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఆమె లైఫ్‌స్టయిల్, నేచర్, ట్రావెల్ ఫొటోస్, వీడియోస్‌ని పోస్ట్ చేస్తూంటుంది.
రేవతి నటించిన ‘దిల్ దోస్త్ డైలమా’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
‘అన్నిటికన్నా కూల్ రోల్ స్టూడెంట్ రోల్. అయితే ఆ పాత్రకే పరిమితం కాలేం కదా! యాక్టర్స్ అందరిలాగే నాకూ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ముఖ్యంగా సైకో కిల్లర్‌గా నటించాలనుంది!’ – రేవతి పిళ్లై
Comments
Please login to add a commentAdd a comment