థాయ్‌లాండ్ ప్రధాని
హాంకాంగ్ ఒషియన్ పార్క్‌లో పిల్లలతో పేటోంగ్ టార్న్
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...
థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్‌లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్‌లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.
‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్‌కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్‌ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్‌ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.
‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!
‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్‌లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment