Thailand Prime Minister
-
Paetongtarn Shinawatra: నా నవ్వులు పిల్లలవి!
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్‌లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్‌లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది. -
థాయిలాండ్ ప్రధానికి ఉద్వాసన
బ్యాంకాక్: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం. ‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది. తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్బన్ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. -
థాయ్ ప్రధాని తొలగింపు
అధికార దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా(46)ను, ఆమె కేబినెట్లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు బుధవారం పదవుల నుంచి తొలగించింది. షినవత్రా శక్తిమంతమైన తన కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు ఓ అధికారి బదిలీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన థావిల్ ప్లీన్శ్రీని 2011లో అక్రమంగా బదిలీ చేశారని, ఇందులో షినవత్రా, 9 మంది మంత్రుల ప్రమేయముందని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే కేబినెట్.. ఉప ప్రధాని నివత్తుమ్రొంగ్ బూన్సంగ్పైసన్ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించింది. థావిల్ బదిలీని అసాధారణ రీతితో కేవలం నాలుగు రోజుల్లోనే హడావుడిగా పూర్తి చేశారని, సంబంధిత పత్రాల్లోని తేదీల్లో తేడాలున్నాయని కోర్టు ఆక్షేపించింది. కాగా, బదిలీతో తనకు సంబంధం లేదని, ఆ వ్యవహారాన్ని ఉప ప్రధానికి అప్పగించానని షినవత్రా విచారణలో చెప్పారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేయగా, అది తమను గద్దె దింపేందుకు చేసిన కుట్ర అని అధికార పార్టీ ఫ్యూ థాయ్ విమర్శించింది. కోర్టు తీర్పుతో థాయ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం మరికొంత కాలం కొనసాగనుంది. -
కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర(46) కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆమె మంగళవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. పార్లమెంటును రద్దు చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ‘మనమంతా థాయ్ వాసులం. ఎందుకు ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటున్నాం? ఇప్పటికే నేను చాలా రాజీ పడ్డాను. ఇంకెంత దూరం నన్ను వెనక్కు వెళ్లమంటారు? థాయ్ నేలపై నేను అడుగుకూడా పెట్టకూడదని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆందోళనకారులను ఉద్ధేశించి పేర్కొంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.