నైతిక ఉల్లంఘన అభియోగాలపై తొలగించిన కోర్టు
బ్యాంకాక్: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్‌ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం.
‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది.
తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్‌లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్‌బన్‌ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment