థాయ్ ప్రధాని తొలగింపు
అధికార దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా(46)ను, ఆమె కేబినెట్‌లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు బుధవారం పదవుల నుంచి తొలగించింది. షినవత్రా శక్తిమంతమైన తన కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు ఓ అధికారి బదిలీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన థావిల్ ప్లీన్‌శ్రీని 2011లో అక్రమంగా బదిలీ చేశారని, ఇందులో షినవత్రా, 9 మంది మంత్రుల ప్రమేయముందని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే కేబినెట్.. ఉప ప్రధాని నివత్తుమ్‌రొంగ్ బూన్సంగ్‌పైసన్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించింది. థావిల్ బదిలీని అసాధారణ రీతితో కేవలం నాలుగు రోజుల్లోనే హడావుడిగా పూర్తి చేశారని, సంబంధిత పత్రాల్లోని తేదీల్లో తేడాలున్నాయని కోర్టు ఆక్షేపించింది. కాగా, బదిలీతో తనకు సంబంధం లేదని, ఆ వ్యవహారాన్ని ఉప ప్రధానికి అప్పగించానని షినవత్రా విచారణలో చెప్పారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేయగా, అది తమను గద్దె దింపేందుకు చేసిన కుట్ర అని అధికార పార్టీ ఫ్యూ థాయ్ విమర్శించింది. కోర్టు తీర్పుతో థాయ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం మరికొంత కాలం కొనసాగనుంది.