థార్‌లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....
రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్‌సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్‌లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్‌బన్‌ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్‌లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.
ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్‌సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.
బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్‌లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.
భూమాత మాట్లాడుతోంది విందామా!
ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్‌ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.
– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.
– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.
– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.
ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
Comments
Please login to add a commentAdd a comment