ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! భగవంతునికే పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి?! మానవ భావోద్వేగాలైన కోపం, అసూయ, ఆనందం, దుఃఖం, సంతృప్తి.. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపుల వడబోతలో వుండే షేడ్స్ ఎన్ని?! ఇలా ఎన్నో సందేహాలకు సమాధానాలు వెతుకుతూ ‘కౌసల్య’ను మన ముందుకు తెచ్చింది విభా సంగీత కృష్ణకుమార్. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయాలజీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేస్తున్న విభా సంగీత ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ పుస్తకాన్ని రచించింది. రామాయణంలో కొడుకు జీవితంలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యత గురించి రాసిన ‘కౌసల్య’ పుస్తకం విభాకు మంచి పేరు తెచ్చింది. శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యురాలైన విభా సంగీతను కలిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు.
‘‘నేను పుట్టి పెరిగింది చెన్నై. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయాలజీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాను. మా అమ్మానాన్నలు సీత, కృష్ణకుమార్ ఇద్దరూ ఉద్యోగస్తులే. రామాయణాన్ని రకరకాల కథనాల ద్వారా వింటూ పెరిగాను. అవన్నీ చాలా ఆసక్తిగా అనిపించేవి. ఈ క్రమంలోనే రామాయణంలోని స్త్రీల పాత్రల గురించి, వారి మనస్తత్వాల గురించి బాగా ఆలోచించేదాన్ని. అందులో కౌసల్య ప్రస్తావన గురించి వచ్చినప్పుడు చాలా ధర్మబద్ధమైన మహిళలలో ఒకరిగా, క్లుప్తంగా ఆమె పాత్ర ఉంది. భగవంతునికి పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం దక్కిందా అనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టుకువచ్చిందే ‘కౌసల్య’. ఈ పుస్తకాన్ని పూర్తిగా కౌసల్య దృష్టి కోణం నుండే తీసుకున్నాను.
మొదటి పుస్తకం..
పుస్తకం రాయడం పూర్తయ్యేవరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ‘రామాయణం స్ఫూర్తితో ఎన్నో పుస్తకాలు, సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. వాటికి భిన్నంగా ఏం రాసుంటుంది ఈ అమ్మాయి’ అని అనుకుంటారు. నా పుస్తకంలో నా పాత్రలన్నీ మనుషులే. వారిని అతిగా ΄÷గడలేదు. అలాగని, వారిప్రాధాన్యతలను తగ్గించలేదు. మానవ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపు మాత్రమే కాదు వివిధ రకాల షేడ్స్ కూడా ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు రాశాను. కానీ, అవి ప్రచురించలేదు. ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ నా మొదటి పుస్తకం. ఆంగ్లభాషా పత్రిక ‘శృతి’ మ్యాగజీన్‌కు కరస్పాండెంట్‌గా ఉన్నాను. ఈ మ్యాగజీన్‌లో నా వ్యాసాలు, సమీక్షలు ప్రచురించారు. ఆ విధంగా నా గురించి చాలామందికి తెలిసింది.
మార్పులు చేసుకుంటూ..
ఈ పుస్తకాన్ని రెండేళ్ల క్రితం జూలై 2022లోప్రారంభించాను. అలాగని నిరంతరాయంగా రాయలేదు. దీంతో పాటు అకడమిక్ బాధ్యతలు కూడా ఉన్నాయి. కిందటేడాది 84,000 పదాలతో పూర్తి చేసి అనేక మార్పులు చేశాను. ఈ నవల ప్రస్తుత వెర్షన్‌లో 65,000 పదాలు ఉంటాయి. జేకె పేపర్స్ ఆథర్స్ అవార్డ్ రావడం, ఢిల్లీకి చెందిన పబ్లిషర్, ఎడిటర్ రీడొమానియ నాకు ఎంతో ్రపోత్సాహాన్ని ఇచ్చారు. నేను చదువుకుంటున్నది సైన్స్‌కు సంబంధించినది. కథలు రాయడాన్ని ఇష్టపడతాను. శాస్త్రీయ సంగీతం నాకున్న మరో అభిరుచి.
సామాన్యులకు సైన్స్..
‘సమాజ శ్రేయస్సుకు పాటుపడటమే నా ముందున్న లక్ష్యం. రకరకాల వ్యాధుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నా చదువును కొనసాగిస్తూనే వాటికి సంబంధించిన అధ్యయనం కూడా చేయాలనుకుంటున్నాను. కర్ణాటక సంగీతంలో చూపించిన ప్రతిభకు గానూ వందకు పైగా బహుమతులు అందుకున్నాను. భారత ప్రభుత్వం నుండి సిసిఆర్‌టి స్కాలర్‌షిప్ పొందాను. నా రచనకు వచ్చిన మొదటి అవార్డును మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను’ అంటుంది విభా సంగీత. – పరియాద రామ్మోహన్, సాక్షి, హైదరాబాద్
ఇవి చదవండి: శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్‌గా..
Comments
Please login to add a commentAdd a comment