ఆకాంక్ష కుమారి
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.
ఝార్ఖండ్‌లోని మైనింగ్‌ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...
‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్‌లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.
‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్‌వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.
‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్‌మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.
2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.
ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత?
Comments
Please login to add a commentAdd a comment