‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.
ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.
నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్‌కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్‌లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.
గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్ ట్రోల్స్, ఇన్‌స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే.
ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లార్జర్ దాన్ లైఫ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.
2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం.
కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం.
– ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు
Comments
Please login to add a commentAdd a comment