హస్తకళాక్లేళి
బంకమన్ను (క్లే)తో పిల్లలు ఆడుకోవడం చూసే ఉంటారు. క్లేతో వారు రకరకాల బొమ్మలు చేస్తారు. తర్వాత క్లేని ముద్దలా చేసి దాచుకుంటారు. అయితే రేవతికి అలాంటి క్లే పనికిరాదు. ఒకసారి ఒక ఆకృతిలోకి మలిస్తే ఇక అదెప్పటికీ అదే ఆకృతిలో ఉండిపోవాలి. కానీ అలాంటి వండర్ క్లే మార్కెట్‌లో లేదే! రేవతి ఆలోచించారు. ప్రయోగాలు చేశారు. ఎంతో ముడిసరుకును వృథా చేశారు. చివరికి విజయం సాధించారు. వండర్ క్లే తయారైంది! దానికావిడ ‘ఆర్ట్ క్లే’అని పేరు పెట్టారు. అదిప్పుడు ‘రేవతి ఆర్ట్ క్లే’ గా కూడా వ్యవహారంలో ఉంది. ఇంతటి ఘనత సాధించిన రేవతి నేపథ్యం ఏమిటి? మహిళలకు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిది?
రేవతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అమ్మాయి. తండ్రి శ్రీపాద భగవన్నారాయణ స్వాతంత్య్ర సమరయోధులు. ఇంట్లో తనే చిన్న. ఇద్దరన్నయ్యలు, ఐదుగురు అక్కలు. రేవతికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం ఇష్టం. రేగడిమట్టితో బొమ్మలు చెయ్యడం, పేపర్‌పై స్కెచ్‌లు వేయడం.. ఇదే ఆమె లోకం. దాంతో పెద్దన్నయ్య ఆమెను గుంటూరులోని మహిళా కళాశాలలో బి.ఎ ఫైన్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సులో చేర్పించారు. బి.ఎ మొదటి సంవత్సరం పూర్తికాగానే పెళ్లయింది. భర్త ఎయిర్‌ఫోర్స్ అధికారి. చండీగఢ్‌లో ఉద్యోగం. దాంతో రేవతి ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేయలేకపోయారు.
టర్నింగ్ పాయింట్
రేవతికి ఇద్దరబ్బాయిలు. వాళ్లు పెద్దయి, పెళ్లిళ్లయిన తర్వాత ఆమెకు ఖాళీ దొరికింది. పద్దెనిమిదవ యేట అర్ధంతరంగా ఆపేసిన చదువుని కొనసాగించాలని ఎం.ఎ ఇంగ్లిష్‌లో చేరారు. కొంతకాలం పిల్లల దగ్గర గడుపుదామని అమెరికా వెళ్లారు. ఓరోజు వాళ్లబ్బాయి మార్కెట్‌లో కనిపించిన పేపర్ క్లే చూపించి ‘బొమ్మలు చేసుకోవడానికి బావుంటుంది’ అని తీసిచ్చాడు. ‘‘దాంతో బొమ్మలు చాలా అద్భుతంగా వస్తాయి. అలా మళ్లీ నాకిష్టమైన బొమ్మలు చేయడం మొదలుపెట్టాను. పద్దెనిమిదవ యేట మానేసిన ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సుని యాభై దాటిన తర్వాత సొంత ప్రయోగాలతో పట్టాలెక్కించాను’’ అని చెప్పారు రేవతి. ఆ ప్రయోగాలలో ఒకదాని ఫలితమే మూడేళ్ల క్రితం ఆమె కనిపెట్టిన ఎకో ఫ్రెండ్లీ ‘ఆర్ట్ క్లే’.
అన్నీ ఆహారపదార్థాలే!
ఆర్ట్ క్లే కోసం రేవతి వాడే ముడిసరుకు అంతా ఆహార పదార్థాల మిశ్రమం. రంగులు కూడా ఫుడ్ కలర్సే కావడంతో ఈ క్లేతో ఎంతసేపు పని చేసినా చేతులకు, చర్మానికి, కళ్లకు, శ్వాసకోశానికి ఎటువంటి హాని కలగదు. పైగా ఆమె కనిపెట్టిన క్లే, పేపర్ క్లే లాగానే మృదువైనది. క్లే ఆరిన తర్వాత కనిపించే కొద్దిపాటి పెళుసుదనం కూడా అందులో ఉండదు. ఒకసారి ఒక రూపం ఇచ్చి ఇరవైనాలుగ్గంటలపాటు కదల్చకుండా ఉంచితే ఇక అది అలాగే ఆరిపోయి ఆకారం శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ క్లేతో చేసిన పూలలో దుమ్ము చేరినా సబ్బు నీటిలో జాడించి శుభ్రం చేసుకోవచ్చు.
కుటీర పరిశ్రమగా...
హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘రేవతి ఆర్ట్ క్లే హ్యాండీక్రాఫ్ట్స్’ ఉంది. అందులో ఎందరో మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆసక్తితో మొదలు పెట్టి, ఇలా కుటీర పరిశ్రమగా ఓ యూనిట్‌ను వృద్ధి చేశారు రేవతి. ఇప్పుడది వ్యాపార పరిశ్రమగా కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. అందమైన ఆకృతికి రూపం ఇవ్వడంలో నైపుణ్యం ఉంది కానీ మార్కెట్ చేసే చాకచక్యం తనలో లేదంటారామె. ప్రభుత్వం నుంచి పేటెంట్ పరీక్ష ఎదుర్కొన్న తర్వాత తనలా ఆసక్తి ఉన్నవారితో కలిసి మార్కెట్‌లోకి రావాలన్నది ఆమె ఆలోచన. అరవై ఆరేళ్ల వయసులో కూడా రేవతి ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం... ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించడం, ఆలోచనకు ఒక రూపం ఇచ్చి మురిసిపోవడం, పదిమందికి నేర్పించి తృప్తి పొందడమే కావచ్చు.
ఫొటోలు: శివ మల్లాల
క్లే తయారీ కోసమే ఓ యంత్రం!
నా క్లే తో శిల్పాలు, సీనరీలు, పూలు చేయవచ్చు. ఒకసారి తయారైన క్లే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కూడా జిగురు తగ్గుతుంది తప్ప ఫంగస్ రాదు. మార్కెట్‌లో దొరికే మామూలు యంత్రానికి మరికొన్ని విడిభాగాలు చేర్చి ఈ క్లే తయారీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాను. రోజుకు వంద కిలోల క్లే తయారు చేయగలను.
- రేవతి, ఆర్ట్ క్లే రూపకర్త