
కలం.. గళం
రచయితలుగా రాణించే వారు, ఔత్సాహిక రచయితలు, ఇప్పుడిప్పుడే రచనలు ప్రారంభించేవారు, తమకూ హక్కులు కావాలంటూ థర్డ్ జెండర్ సమస్యల్ని ప్రపంచానికి చాటి చెప్పే వారు.. ఇలా ఎంతో మంది ఔత్సాహిక కవులు, రచయితలకు వేదికైంది సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్. శనివారం రైటర్స్ కార్నివాల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. రచయితగా ఎలా రాణించాలి?, చేసిన రచనలను పుస్తక రూపంలో ఎలా తేవాలి?, సొంతంగా ఎలా ప్రచురించుకోవాలి?, ఈ-పబ్లిషింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై కొందరు సీనియర్ రైటర్స్ ఔత్సాహికుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ వర్క్‌షాప్.. ఆదివారం కూడా కొనసాగుతుంది. ప్రముఖ రచయిత్రి రోచెల్లా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు.
-దార్ల వెంకటేశ్వరరావు
కొన్నిటికే పరిమితమా?
చాలామంది రచయితలు కొన్ని అంశాలకే పరిమితమవుతున్నారు. ఇప్పుడిప్పుడే ట్రాన్స్‌జెండర్స్ వంటి వాళ్ల కథలూ వెలుగు చూస్తున్నాయి. ఎవరూ టచ్ చేయని అంశాలు, వర్గాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై కొనసాగుతున్న వివక్ష వంటి వాటిని రచనల ద్వారా సమాజం దృష్టికి తేవచ్చు. హమారా కహాని, హమారా జీవన్ పేరుతో హిందీలో నేను రాసిన పుస్తకాన్ని తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’ పేరుతో వెలువరిస్తే చాలామంది విమర్శించారు. కొందరు మెచ్చుకున్నారు. మా కమ్యూనిటీ వాళ్లు కూడా అందులో రేప్ గురించి, పోలీసుల గురించి ఎందుకు రాశావని అన్నారు. మీడియా చాలా సపోర్ట్ చేసింది.
- రేవతి, ట్రాన్స్‌జెండర్స్ రచయిత్రి
స్టోరీ టెల్లింగ్‌పై అవగాహన
అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి కథలు వినడం అనేది ఒకప్పటి కథ. ఇప్పుడు చెప్పేవారు, వినేవారు లేరు. కథలు రాయడానికి ఎలాంటి క్రియేటివిటీ కావాలో కథలు చెప్పడానికీ అంతే అవసరం. పిల్లల మనసును హత్తుకునేలా కథలు చెప్పాలి. అదే అంశాల్ని ఇక్కడ యువ రచయితలకు చెప్పా.
- దీపా కిరణ్, స్టోరీ టెల్లర్
చాలా స్ఫూర్తినిచ్చింది
ఎంతో మంది రచయితలను కలిసే అరుదైన అవకాశమిది. రచయితలు చెప్పిన సలహా సూచనలు బాగున్నాయి. మూడు చిన్నచిన్న కథలు రాశాను. సొంత బ్లాగ్‌లో ఈ-పబ్లిష్ చేస్తున్నాను. ఈ సదస్సులో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కొంత మేరకు తెలుసుకున్నా.
- ఆర్‌ఎస్ ఆర్చా, ఇంటర్ విద్యార్థిని
గే లవ్ స్టోరీ రాశాను
యూత్ లవ్‌స్టోరీలతో ఎన్నో సినిమాలు, మరెన్నో కథలు వచ్చాయి. కానీ నేను ఇద్దరు మేల్స్ ప్రేమలో పడిన అంశాన్ని తీసుకుని గే లవ్ స్టోరీని రాశా. తెలుగులో ఇలాంటివి ఇంత వరకు రాలేదు. రచనలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఇది ఇదే సదస్సులో పుస్తక రూపంలో విడుదల కానుంది. రైటర్స్ కార్నివాల్ ఎన్నో కొత్త విషయాలను నేర్పింది.
- నవ్‌దీప్, ఎల్‌బీనగర్