authors
-
International Daughters Day 2024: మన కంటిపాపకు కలలే కాదు... రెక్కలిద్దాం
మన దేశంలో కొత్తగా పెళ్లయిన దంపతులను ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కురచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురూ ఒక వరంలా వర్థిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా, కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభి్రపాయాలు.మీ కూతుళ్లకేం ఇస్తున్నారు?‘మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉన్నట్లయితే అమ్మాయినే చదివించండి‘ అంటారు పెరియార్. ఆడపిల్లల చదువుప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబన కలిగివుండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కుకున్నాం. ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వాళ్ల చివరి రోజుల్లో వారి ఆలనా పాలనా నేను చూసుకోగలిగాను. ఇప్పుడు అమ్మాయిలకి కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. ఇంట్లో నేను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు ఎనిమిది వందల మంది కూతుళ్లు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు, ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి తల్లిదండ్రులు సమాజం చేయగలిగినదంతా చేయాలి. నేటితరం కూతుళ్లందరికీ నా శుభాకాంక్షలు. – ఎం. ప్రగతి, రచయిత్రి, అనంతపురంకూతురి ప్రపంచంలోకి వెళతానుఏలూరు దగ్గర, కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న పెద్దరైతు కుటుంబంలో పుట్టాను. నలుగురాడపిల్లల్లో కడసారిదాన్ని. కూతురుగా ఎట్లా ఉన్నానో, ఉంటున్నానో తరచి చూసుకుంటుంటే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందుకు అమ్మానాన్నల మీద అరిచేదాన్నని అమ్మ చెపుతూ ఉంటుంది. కాని బుద్ధి పెరిగాక ఎపుడూ విసిగించింది లేదు. ‘మగపిల్లలు లేరు, అంతా ఆడమంద’ అని లోకం వెక్కిరించే రోజుల నుంచి ‘మా బిడ్డలు రత్నాలు’ అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకూ కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు. కులాన్ని వదిలి నా పెళ్లి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినపుడూ వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీని ప్రేమమూర్తుల కూతురిని. స్త్రీలకి అన్నిరంగాలలో స్వేచ్చ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు. నేను నమ్మే వాటికి, పెంపకానికి మధ్య కొన్ని విషయాలలో పేచీలు వచ్చేవి, దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. ‘స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా’ అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏ మాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిపుడు. తనతో గడపడం కోసం నేను ఎదురు చూడడం కాదు, ‘అమ్మా... ముచ్చట్లు చెప్పుకుందామా?’ అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. ‘నా విలువలకి అనుగుణంగా పెళ్లి చేసుకోకపోతే నేను రాను’ అని బెదిరించబోయానా! ‘నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు’ అని గట్టిగానే చెప్పింది. కూతురుగా, కూతురి తల్లిగా నా బొమ్మ వారికి సూపర్ హిట్.– కె.ఎన్. మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నంఏ దేశ కరెన్సీ సరిపోదుఫలానా అమ్మాయికి మేము తల్లితండ్రులం అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి ‘అమ్మా! నీలాగా నా జీవితం ఇంటికి, పెళ్లి, పిల్లలకు అంకితం అవ్వకూడదు’ అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీటిని దాచిపెట్టేది. అపుడు అర్థం అయ్యేది కాదు... నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనానికి అర్థం నిస్సహాయత కాదు అది అంతర్మథనం అని నాకు తెలియలేదు. మా అమ్మ ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. ఇద్దరూ పిన్నులు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్నా ఇంటికే పరిమితం ఐపోయింది. కానీ ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ ఐనా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్తున్నా ఇలా కారణం ఏదైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిన్నులు జీతం సంపాదించే వారు కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేక పోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు..‘ ఇది నాకు కూతురు కాదు... మా అమ్మ అక్కలను కలిపి మళ్లీ పుట్టించాడు దేవుడు’ అని.. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటే ఉద్యోగాలే చెయ్యక్కర్లేదు.. అందరినీ నా వారు అనుకుంటూ కలుపుకుని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించొచ్చు. ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి, చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది ఇది మా అమ్మ కథ కాదు. కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటిపట్టున మిగిలిపోయాము అని బాధపడే ఆడపిల్లల, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయాము అని బాధ పడుతూ వుంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మ నాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి పంచుతున్నారు, కుటుంబాలను, కలలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెల కట్టి డబ్బు ఇవ్వాలని ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే నా 17 నెలల కూతురు ‘అమ్మ జూచు జూచు’ అనుకుంటూ ఒక గ్లాస్ ను వంకర టింకరగా పట్టుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది. – ప్రవల్లిక, రచయిత్రి, సికింద్రాబాద్కూతుళ్లు మేజిక్ చేస్తారుఇంటికి ఆడపిల్ల వుండటం గొప్ప వైభవం. నేను ఒక కూతుర్ని, ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతుర్ని కాదు. బహుశా ఇంకొంచం బాగా వుండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో/కుటుంబంతో అనేక విషయాల్లో విభేదిస్తూ, గొడవ పడుతూ, అప్పుడప్పుడూ సర్దుకుపోతూ, నా స్వాతంత్ర కాంక్షను, అభి్రపాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండిమనిషి కాబట్టి చిన్నతనంలో అలవికాని నా అల్లరిని, ఇప్పటికీ నా స్వభావంలో వుండే లోపాల్ని భరిస్తోంది. సున్నితమైన అమ్మైతే చాలా కష్టం అయేది. కూతురిగా నాకై నేనైతే జస్ట్ పాస్ మార్క్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరకొస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాలకన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్లు, తల్లులకన్నా, తండ్రులకు సన్నిహితంగా వుంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా వుంటుంది. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా, మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఇవాళ మా అమ్మ దగ్గరకువెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని, తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుర్లు అంతే. మురిపిస్తారు. మాజిక్ చేస్తారు. – ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, రచయిత్రి, విజయవాడ -
కృత్రిమ సంక్షిప్తం
పుస్తకం మొత్తం చదవనక్కరలేకుండా కేవలం అట్టల వెనుక ఉన్నది చదివి కూడా ‘సమీక్ష’ రాయొచ్చునని... సాహిత్య ప్రపంచంలో ఒక జోక్. చదవడానికి బద్దకించడం అనేది సర్వ మానవ సమస్య. మన సినిమా రూపొందుతున్నది దీని ఆధారంగానే కాబట్టి దీన్నొకసారి చదవమని ‘ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ’లో సినిమా నటుడి పాత్రధారికి దర్శకుడి పాత్రధారి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ నూరు పేజీల భారీ పుస్తకాన్ని చదవలేక, అందులోని సారాంశం ఏమిటో తన భార్యను చెప్పమంటాడు నటుడు. అలాంటివాళ్ల కోసమే కాబోలు, పుస్తకాలు సంక్షిప్తంగా రావడం మొదలైంది.కాలం తెచ్చిన మార్పుల్లో వేగం ఒకటి. దేనిమీదా ఎక్కువసేపు ఎవరూ నిలబడటం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. ప్రయాణ సాధనాలు పెరిగి జీవితం వేగవంతం కావడానికీ, పాఠకులు చదవడం తగ్గిపోవడానికీ సంబంధం ఉంది. ఆ పెరిగిన వేగానికి తగినట్టుగా పాఠకులను శ్రోతలుగా మార్చడానికి ఆడియో బుక్స్ మార్కెట్ ప్రయత్నించింది. గంటల తరబడి ఉండే నవలలు యథాతథంగా రికార్డు చేస్తే ఖర్చుతో పాటు అసలుకే మోసం రావొచ్చు. అలా పుట్టినవే అబ్రిడ్జ్డ్ ఆడియో బుక్స్. హెలెన్ కెల్లెర్, ఎడ్గార్ అలెన్ పో, డైలాన్ థామస్ లాంటివారి రచనలు అమెరికాలో తొలుదొలుత ఆడియో బుక్స్‌గా వచ్చాయి. అలాగే అచ్చు పుస్తకాలు ఎన్నో కుదించుకుని అందుబాటులోకి వచ్చాయి. అలా కుదించడం వల్ల కొత్త పాఠకులు సాహిత్యంలో అందుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఇలా వచ్చిన ‘ఏడు తరాలు’, ‘గాన్ విత్ ద విండ్’ లాంటి నవలల అనువాదాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి. ఎన్నో మేలిమి రచనలను ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రత్యేకించి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించింది. సచిత్ర బొమ్మల భారతం, సచిత్ర బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు మనకు తెలియనివి కాదు. పిల్లల కోసం, పిల్లలంత ఓపిక మాత్రమే ఉన్న పెద్దల కోసం ఎన్నో పుస్తకాలు ఇలా పొట్టిరూపాల్లో వచ్చాయి.పుస్తకాలను సంక్షిప్తం చేయడం దానికదే ఒక ఎడిటింగ్ స్కిల్. సారం చెడకుండా, టోన్ మారకుండా, ‘అనవసర’ వివరాలు లేకుండా కుదించడం చిన్న విషయమేమీ కాదు. రచయిత ఒక పదం వాడటానికి ఎంతగా ఆలోచిస్తాడో, దాన్ని తొలగించడానికి సంక్షిప్తకుడు అంతే గింజుకుంటాడు. అలాంటి రంగంలోకి కృత్రిమ మేధ జొరబడటమే ఇప్పుడు సాహిత్య లోకంలో సంచలనమైంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం జూలై నుంచి కొత్త ఏఐ యాప్ ‘మాజిబుక్’ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల క్లాసిక్ రచనలను కుదించడం ఈ యాప్ ప్రత్యేకత. మాబీ డిక్, ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో, క్రైమ్ అండ్ పనిష్మెంట్, డ్రాకులా, రాబిన్సన్ క్రూసో, ద త్రీ మస్కటీర్స్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద గ్రేట్ గాట్స్బీ లాంటి రచనలు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికం తెలుగులోకి అనువాదమైనవే. ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ ప్రారంభ వాక్యాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. ‘ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ద వరస్ట్ ఆఫ్ టైమ్స్.’ (‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’; రెండు మహానగరాలు– తెన్నేటి సూరి అనువాదం.) వీటిని, ‘ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ థింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాడ్’ (‘అదొక చాలా మంచి చాలా చెడ్డల కాలం’) అని ఏఐ కుదించిందని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు. సంక్లిష్టమైన వాక్య సంచయనానికి లోనుకావడం బౌద్ధిక వృద్ధికి కీలకం అంటారు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ కసాండ్రా జాకబ్స్. రచయితలు తమ పదాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటారనీ, ఏఐ సరళీకృతం చేయడంలో అవి నష్టపోతామనీ ఆమె చెబుతారు. కథకు సంబంధించిన అసలైన అంతరార్థం పోయి, అది తప్పుడు భావనకు దారితీయవచ్చని హెచ్చరిస్తారు. మరో రకమైన విమర్శ భాషకు సంబంధించినది. పొలిటికల్ కరెక్ట్‌నెస్, తటస్థ మాటల వాడుక పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే శిక్షణ పొందివుండే ఏఐ ‘సహజంగానే’ రచనలోని అసలు మాటల స్థానంలో బోలు మాటలు చేర్చవచ్చు. కొన్నింటిని వివాదాస్పదమైన అంశాలుగా అది చూడవచ్చు. దాంతో రచనలోని భావోద్వేగ తీవ్రతకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అయితే, ‘పుస్తకాలను, వాటి ఆలోచనలను ప్రజాస్వామీకరించడమే’ తమ మిషన్ అని మాజిబుక్ సమర్థించుకుంటోంది. ఆంగ్లం నేర్చుకుంటున్నవారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా డిస్లెక్సియా, తీవ్ర ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఇవి ఉపకరిస్తాయని చెబుతోంది.‘రోబో’ సినిమాలో ‘చిట్టి రోబో’ వందల పుస్తకాలను ఇట్టే స్కాన్ చేయగలుగుతాడు. పుస్తకాలు చదవాలి అనుకుంటూనే చదవలేకపోయే అందరి కల అది. తలగడగా పెట్టుకుంటే వాటికవే అక్షరాలు తలలోకి వెళ్లిపోతే బాగుంటుందని చిన్నతనంలో అనుకోనివాళ్లెవరు? అదంతా ‘కృత్రిమ’ ప్రపంచం. సహజ ప్రపంచంలో మనమే చదువుకోవాలి. సహజంగా చదవలేనప్పుడే కృత్రిమ సాయం అవసరం అవుతుంది. అయితే, రామాయణాన్ని ఆసాంతం చదవనూవచ్చు. కట్టె కొట్టె తెచ్చె అనేలా విషయమేమిటో తెలుసుకోనూవచ్చు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవడంలో అసలు విషయం మొత్తం రాదనేది రసజ్ఞులందరికీ తెలుసు. విందు భోజనం విందు భోజనమే, రుచి చూడటం రుచి చూడటమే! ఏది కావాలి అనేది మన మేధో కడుపును బట్టి నిర్ణయించుకోవడమే. కానీ ఓసారంటూ రుచి చూడటం కూడా విందు భోజనానికి ఉపక్రమించేలా చేస్తుందేమో! కాకపోతే ఆ రుచి ఆ విందుకు దీటుగా ఉండాలి. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్‌ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్‌ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్‌ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్‌తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్‌లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్‌లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
బతుకు పండుగ
లోకంలో దుఃఖం మాత్రమే ఉందా? లేదు, సంతోషం కూడా ఉంది. శత్రుత్వపు చేదు మాత్రమే ఉందా? లేదు, ఆపదలో ఆదుకునే స్నేహమాధుర్యమూ ఉంది. సమరమే కాదు, శాంతీ; సంఘర్షణే కాదు, సామరస్యమూ; భయబీభత్సాలే కాదు; కరుణారౌద్రాలూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రళయ తాండవంతో భయపెట్టే ప్రకృతిలోనే, సేదదీర్చే అందాలూ, ఆహ్లాదాలూ ఉన్నాయి. కానీ ఎంత సేపూ పెద్ద పెద్ద కష్టాలనే ఊహించుకుంటూ చిన్న చిన్న సంతోషాలను విస్మరిస్తాం. జీవితాన్ని ముళ్ళకంపగా భావించుకుంటూ పక్కనే ఉన్న మల్లెపొదల గుబాళింపును గమనించలేకపోతాం. జీవించడం కోసం చేసే ప్రయత్నంలో మనసారా జీవించడాన్ని మరచిపోతాం. మన పక్కనే ఉన్న మంచినీ, మానవత్వాన్నీ గుర్తించడంలో ఎలా విఫలమవుతామో ఒక చక్కని కథలో రావిశాస్త్రి చిత్రిస్తాడు. ఆ కథలో ఇద్దరు మిత్రులుంటారు. ఒకతను ఎప్పుడూ ఏదో కష్టంలో చిక్కుకుని కుంగిపోతూ ఉంటాడు; నిరాశానిస్పృహలకు ప్రతిరూపంగా మారి జీవితంపై విరక్తుడ వుతుంటాడు. రెండో వ్యక్తి ప్రతిసారీ అతనికి చేయందించి సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. అలా అతను తేరుకున్న ఓ రోజున తన ఖర్చుతో సినిమాకు తీసుకెడతాడు. ఆ సినిమాలోని ప్రతి నాయకుడు నాయికానాయకులను పెడుతున్న ముప్పుతిప్పలు చూసి, లోకంలో ఎక్కడా మంచి తనం, మానవత్వమే లేవంటూ అతను భారంగా నిట్టూర్చుతాడు. పక్కనే ఉన్న మిత్రుడు అతని వైపు ఒకసారి వింతగా చూసి మనసులోనే నవ్వుకుంటాడు. ఇప్పుడు కొంత మారి ఉండచ్చు కానీ, నిన్నమొన్నటివరకు పెళ్లి అనగానే కట్నాలు, కయ్యాలు, అలకలు, మాటపట్టింపులు, మనస్పర్థలే గుర్తుకొచ్చేవి. గుండె బరువెక్కించే ఇలాంటి అలవాటు పడిన చిత్రణకు భిన్నంగా అడుగడుగునా ఆహ్లాదం నింపేలా ఎవరైనా పెళ్లి కథను నడిపిస్తే అది మండువేసవిలో హఠాత్తుగా వీచిన మలయానిలంలా అలరిస్తుంది. ‘వసుంధర’ రాసిన ‘పెళ్ళిచేసి చూడు’ అనే నవల అలాంటి ఓ అరుదైన ఆశ్చర్యం. అందులో ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు ఆడబడచు పెళ్లిని తలకెత్తుకుంటారు. అన్ని విషయాలూ కలసి చర్చించుకుంటారు, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సమానంగా బరువు బాధ్యతలు పంచుకుంటారు, సంఘ టితంగా అడుగులు వేస్తారు. మగపెళ్ళివారి నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలే వస్తాయి. జయప్రదంగా పెళ్లి చేయడం ఒక్కటే లక్ష్యంగా వాటిని తెలివిగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ ఆందోళనకు లోనుకారు; ఒకరిపై ఒకరు లోక్తులు విసురుకుంటూ, ఒకరి నొకరు ఆటపట్టించుకుంటూ పరిసరాలను సంతోషభరితం చేసుకుంటారు. కల్యాణాన్నే కాదు, కల్యాణం చేయించిన తీరునూ కమనీయం చేస్తారు. ఈ ‘పెళ్ళిచేసిచూడు’ నమూనా పెళ్లికే కాదు; తమలో తమకున్న అన్ని విభేదాలనూ పక్కన పెట్టి పదిమందీ ఉమ్మడిగా నిర్వర్తించాల్సిన ఏ బాధ్యతకైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమన్న ఉమ్మడి లక్ష్యం దిశగా విజయవంతంగా నడిపించడంలో అధికారపక్షానికీ, ప్రతిపక్షాలకూ కూడా చక్కని ఒరవడి అవుతుంది. గొప్ప తాత్విక గాంభీర్యమూ, బహిరంతర్ఘర్షణా, జీవితం గురించిన చిక్కు ప్రశ్నలూ, ఒడుదొ డుకులూ ఉన్న రచనల్లోనూ, బరువైన పాత్రల సరసనే, వాతావరణాన్ని తేలిక చేసి ఉల్లాసపరిచే పాత్రలూ కనిపిస్తూ ఉంటాయి. అవి జీవితం తాలూకు అన్ని పార్శ్వాలనూ స్పృశించే రచయిత దృష్టివైశాల్యాన్ని పట్టి చూపుతాయి. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలలోని జగన్నాథం అలాంటి పాత్ర. సమస్యలకు అతీతంగా, దేనిమీదా ఎలాంటి ఫిర్యాదూ లేకుండా, సరదాగా, స్నేహంగా, హాస్యంగా ప్రవర్తించే జగన్నాథం చిన్నపాత్రే అయినా నాయకుడు దయానిధితో సమా నంగా గుర్తుండిపోతాడు. గమనించే చూపే ఉండాలి కానీ, అలాంటి వ్యక్తులు మన నిజజీవితంలోనూ మన చుట్టుపక్కల తారసపడుతూనే ఉంటారు. తను రచయితా, గొప్ప చదువరీ కాక పోయినా ప్రతి సాహిత్యసమావేశంలోనూ, రచయితల గోష్ఠుల్లోనూ విలక్షణమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని ప్రముఖంగా చాటుకునే సంకు పాపారావు అనే రావిశాస్త్రి మిత్రుని గురించి వైజాగ్ లోనూ, బయటా కూడా సాహితీ ప్రముఖులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. తమ ఉజ్జ్వల వ్యక్తిత్వంతో శత్రుమిత్రుల తేడా లేకుండా అందరి మధ్యా సమానంగా తళుకులీనే పాత్రలూ ఆ యా విశిష్ట రచనల్లో కనిపిస్తాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంగా మార్గరెట్ మిచెల్ రచించిన ‘గాన్ విత్ ద విండ్’ నవలలోని మెలనీ పాత్ర అలాంటిది. చాలా అర్భకంగా, అమాయకంగా ఉండే మెలనీ, ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని తన ఉదాత్త వ్యక్తిత్వంతో ఆ నవలలోని ఇతర ప్రధాన స్త్రీ, పురుషపాత్రలను మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది. అభద్రత, అల్లకల్లోలం, ఉద్రిక్తత, స్థానభ్రంశం, లేమి నిండిన ఆ యుద్ధ వాతావరణం వజ్రం లాంటి ఆమె వ్యక్తిత్వానికి మరింత సానపట్టి కొత్త కాంతుల్ని ఆవిష్కరింపజేస్తుంది. యుద్ధం వరకే శత్రుత్వమని చెప్పి స్వపక్షంతో ఒంటరి పోరాటం చేసి, శత్రు సైనికుల సమాధుల వద్ద కూడా మెలనీ పుష్ప గుచ్ఛాలు ఉంచి వస్తుంది. ఇలాంటి పాత్రలూ, వ్యక్తులూ ప్రపంచాన్ని మరింత ఆశావహంగానూ, వాసయోగ్యం గానూ రూపిస్తారు. బతుక్కి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని సంతరిస్తారు. ప్రేమనూ, స్నేహాన్నీ ఇచ్చి పుచ్చుకుని జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోడానికి స్ఫూర్తినిస్తారు. మిట్టపల్లాల చీకటిదారిలో దీపస్తంభాలవుతారు. -
రూప..కంప్యూటర్ ఇంజనీర్ కానీ, పిల్లల కోసం పుస్తకాలు రాస్తుంది
పిల్లల పుస్తకప్రపంచంలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది రూపా పాయ్. ఫాంటసీ–అడ్వెంచర్ పుస్తకాలతో పాటు ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’లాంటి భిన్నమైన పుస్తకాన్ని రాసి ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకం ‘క్రాస్‌వర్డ్ అవార్డ్’ గెలుచుకుంది. మరో భిన్నమైన పుస్తకం ‘ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’తో పిల్లలను పలకరించింది బెంగళూరుకు చెందిన రూప... పిల్లల పత్రిక ‘టార్గెట్’తో పాటు లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ట్రావెల్ ట్రెండ్స్’ మ్యాగజైన్ కోసం ఎన్నో రచనలు చేసింది రూప. అయితే తనకు పిల్లల కోసం రచనలు చేయడం అంటేనే బాగా ఇష్టం. ‘నేను రచయిత్రి కాకపోయి ఉంటే టీచర్ని అయ్యేదాన్ని’ అంటుంది కంప్యూటర్–ఇంజనీరింగ్ చదువుకున్న రూప. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. బెంగళూరులోని లైబ్రరీలన్నీ ఆమెకు సుపరిచితమే. చదవగా, చదవగా తనలో కాల్పనిక ప్రపంచం ఒకటి అస్పష్టంగా ఆవిష్కారమయ్యేది. కళ్ల ముందు ఏవేవో పాత్రలు, దృశ్యాలు కదలాడుతుండేవి. కాగితం, కలం పట్టిన తరువాత వాటికి ఒక రూపం ఇచ్చింది. రకరకాల జానర్స్‌లో రచనలు చేయడం గురించి రూప ఇలా అంటోంది...‘కథ మంచిదైతే, ఆకట్టుకునేలా ఉంటే అది ఏ జానర్ అనేది పిల్లలు పట్టించుకోరు. వారికి కచ్చితంగా హాస్యం ఉండాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది వారికి నచ్చాలి’.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం రూపకు ఎంతో పేరు తెచ్చింది.‘మన పురాణాలకు సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రాస్తున్నారు కదా....మరి భగవద్గీత గురించి ఎందుకు రాయకూడదు’ అని ఒకరోజు అడిగింది ఎడిటర్ వత్సల. అయితే అందుకుముందెన్నడూ భగవద్గీతను రూప చదవలేదు. అలా అని ‘నేను రాయలేను’ అనలేదు. ‘ఓకే’ అంటూ రంగంలోకి దిగింది. ‘గీత’ను ఎన్నోసార్లు చదివింది. అనేకసార్లు చదివిన తరువాత ‘గీత గురించి పిల్లలకు చెప్పాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అనుకుంది.నిజానికి అదొక సవాలు. కానీ ఆ సవాలును ఇష్టంగా స్వీకరించింది రూప. ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. ‘మంచి ప్రయత్నం’ అని ప్రశంసించారు.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం విజయవంతం అయిన తరువాత ‘ఇదే కోవలో మరో పుస్తకం రాస్తే బాగుంటుంది’ అని చాలామంది అడిగారు. అయితే అలా రాస్తే రొడ్డకొట్టుడుగా ఉంటుందని రూపకు ఆనిపించింది. ‘ఇప్పుడు కావాల్సింది మరో విభిన్నమైన పుస్తకం’ అని అనుకుంది. అలా వచ్చిందే...‘సో యూ వాంట్ టు నో ఎబౌట్ ఎకనామిక్స్’ పుస్తకం. ఈ పుస్తకం రావడానికి మరో కారణం ‘గీతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాను’ అనే ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం తరువాత వచ్చిన ‘రెడీ 99’కి కూడా మంచి స్పందన వచ్చింది. పుస్తకం రాయడానికి రూప అనుసరించే పద్ధతి ఏమిటి? పుస్తకం రాయడానికి ముందు మనసు అనే కాగితంపైనే ఎన్నో వాక్యాలు రాసుకుంటుంది. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటుంది. తాను ఎంచుకున్న అంశంపై ఎన్నో పుస్తకాలు చదువుతుంది. ఆ అంశంపై పట్టు ఉన్న వాళ్లతో మాట్లాడుతుంది. విషయ అవగాహన తరువాత పిల్లలను ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఎలా రాయాలో అనేదానిపై కసరత్తు చేస్తుంది.‘పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పిల్లల మాసపత్రికను చూస్తూ...పెద్దయ్యాక ఈ పత్రికకు కథలు రాయాలనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఏముంటాయి!’ అంటుంది రూపా పాయ్. పిల్లలకు యోగా సూత్రాలు భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని, ఆర్థిక సూత్రాల మర్మాన్ని పుస్తకాల ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన రూపా పాయ్ తాజా పుస్తకం ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’. చిన్నప్పుడు మనసులో పడిన ఒక బీజం మొక్క అవుతుంది. ఆ తరువాత బలమైన చెట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. ‘మనలో కలిగే రకరకాల భావాలకి మనమే యజమాని’ ‘నేను శరీరాన్ని కాదు. కాని ఈ శరీరమనే అద్భుతమైన నిర్మాణంతో ఈ అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను’ ‘నేను మనసుని కాదు. కానీ మనసు అనే మహా నిర్మాణంలో ఎన్నో అద్భుతాలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను’... ఇలా ఆకట్టుకునే మాటలు ఎన్నో ఉన్న ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’ ఆబాలగోపాలానికి ప్రియమైన పుస్తకం అవుతుంది అనడంలో సందేహం లేదు. -
అక్షర లక్షలు
దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్ ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్ పేషెంట్’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. అక్టోబర్ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్ ప్రై జ్ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్ ప్రైజ్ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు! బుకర్ ప్రైజ్ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్ ఫుడ్ హోల్‌సేల్ ఆపరేటర్ అయిన ‘బుకర్ గ్రూప్ లిమిటెడ్’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మ్యాన్ గ్రూప్’ ఇచ్చినందున మ్యాన్ బుకర్ ప్రైజ్ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‡్ష శ్రీమంతుడు మైకేల్ మోరిట్జ్ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్’ పోటీకి 50 లక్షల ధీరమ్స్ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ మెమోరియల్ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ విజేతకు ఒక కోటి స్వీడిష్ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్తో పాటు గెలుచుకున్నది ఇదే. ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? -
కూతురి ఒడిలో అమ్మ
ఏమయింది ఆ తల్లికి! మొండిగా, నిక్కచ్చిగా పెరిగింది. తల్లిదండ్రులపై కోపం. భర్తపై అసంతృప్తి. బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. బిడ్డనూ పట్టించుకోలేదు. బిడ్డే తల్లిని ఒడిలోకి తీసుకుంది! ‘బుకర్’ పోటీలో ఓ నవల ఇది. బహుమతికి వడపోత మొదలైంది. పదమూడు మందిలో... తొమ్మిది మంది రచయిత్రులే! ఒకరిని మించిన థీమ్ ఒకరిది. జడ్జిలకు పెద్ద పరీక్షే పెట్టారు. చిన్నప్పుడు తార మొండిగా ఉండేది. పెద్దయ్యాక, పెళ్లయ్యాక కూడా! అయితే కారణం ఉండేది ఆ మొండితనానికి. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని అతyì నుంచి విడిపోయింది. ఒడిలో చిన్న బిడ్డ. అంత బిడ్డ ఉన్న తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఉండదు. సంపన్నులైన తన తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడానికి ఆశ్రమ జీవితం గడుపుతూ, పనిగట్టుకుని యాచకురాలిగా కొన్నాళ్లు గడుపుతుంది. తైల సంస్కారం ఉండదు, మంచి బట్టలు వేసుకోదు. కూతురు పెద్దదవుతుంటుంది. తారకూ వయసు మీద పడి అన్నీ మర్చిపోతుంటుంది. కూతురే ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన స్థితికి వస్తుంది. తల్లి.. కూతురి ఒడిలో బిడ్డవుతుంది! తల్లి తనకేదైతే ‘కేరింగ్’ను ఇవ్వలేదో, అదే కేరింగ్‌ను కూతురు తన తల్లికి ఇవ్వవలసి వస్తుంది. ఆ తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ద్వేషాలే.. ‘బరన్ట్ షుగర్’ నవల. పోటీలో గెలిస్తే 50 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చే ‘బుకర్ ప్రైజ్’ రేస్‌లో ఉంది ‘బరన్ట్ షుగర్’! దుబాయ్‌లో ఉంటున్న అవనీ దోషీ ఈ పుస్తక రచయిత్రి. అవని కనుక ఈ ఏడాది విజేత అయితే.. అరుంధతీరాయ్, కిరణ్ దేశాయ్‌ల తర్వాత బుకర్ ప్రైజ్ పొందిన మూడో భారతీయురాలు అవుతారు. లండన్‌లోని ‘బుకర్ ప్రైజ్’ కమిటీ మంగళవారం విడుదల చేసిన తొలి వడపోత (లాంగ్ లిస్ట్) ఆంగ్ల భాషా నవలా రచయితల జాబితాలో (పుస్తకాల జాబితా అనాలి) 165 మందికి 13 మంది మిగిలారు. వారిలో ఒకరు అవనీ దోషీ. ఈ పదమూడు మందిలోంచి ఆరుగురిని రెండో విడతగా (షార్ట్ లిస్ట్) వడకడతారు. నవంబరులో అంతిమ విజేతను ప్రకటిస్తారు. అవని తొలి నవల ‘గర్ల్ ఇన్ ది వైట్ కాటన్’. గత ఏడాది ఆగస్టులో ఇండియాలో పబ్లిష్ అయింది. అందుకనే పోటీకి పంపించలేక పోయింది. యు.కె., ఐర్లండ్‌లలో ప్రచురణ అయిన నవలలను మాత్రమే బుకర్ కమిటీ పోటీకి స్వీకరిస్తుంది. ‘బరన్ట్ షుగర్’ అవని రెండో నవల. లండన్‌లోని పెంగ్విన్ బుక్స్ సంస్థ ఈ రోజు (జూలై 30) ఆ పుస్తకాన్ని విడుదల చేస్తోంది. ముందరి ఏడాది అక్టోబర్ 1 నుంచి.. అవార్డు ప్రకటించే ఏడాది సెప్టెంబర్ 30 లోపు వచ్చిన పుస్తకాలను బుకర్ కమిటీ పోటీకి పరిగణనలోకి తీసుకుంటుంది కనుక ‘బరన్ట్ షుగర్’ పోటీలో చోటు చేసుకుంది. ఏడాది బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్‌లో ఒక విశేషం ఉంది. పోటీకి నిలిచిన పదమూడు మందిలో తొమ్మిది మంది మహిళా రచయితలే. అవనితో పాటు.. డయేన్ కుక్ (ది న్యూ వైల్డర్నెస్), ట్సిట్సీ డాన్గరేంబ్గా (దిస్ మార్నబుల్ బాడీ), హిలరీ మాంటెల్ (ది మిర్రర్ అండ్ ది లైట్), మాజా మాంగిస్ట్ (ది షాడో కింగ్), కైలీ రీడ్ (సచ్ ఎ ఫన్ ఏజ్) యాన్ టైలర్ (రెడ్‌హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్), సోఫీ వార్డ్ (లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్), పామ్ జాంగ్ (హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్).. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ తొమ్మిది పుస్తకాలలో ‘ది మిర్రర్ అండ్ ది లైట్’కి కనుక ప్రైజ్ వస్తే.. పుస్తక రచయిత్రి హిలరీ మాంటెల్కి ఇది మూడో ‘బుకర్’ అవుతుంది. 2009లో, 2012లో ప్రైజ్ గెలుచుకున్న ‘ఉల్ఫ్ హాల్’, ‘బ్రింగ్ అప్ ద బాడీస్’ ఆమె రాసిన నవలలే. ఏమైనా ఈ ఏడాది పోటీ ‘టఫ్’గా ఉండబోతోంది. ఈ ‘నవ’లామణులు ఒకరిని మించిన థీమ్‌తో ఒకరు న్యాయ నిర్ణేతలకు గట్టి పరీక్షే పెట్టబోతున్నారు. నవలల సారాంశం ‘ది న్యూ వైల్టర్నెస్’ వాతావరణ మార్పులకు నివాసయోగ్యం కాని ప్రపంచం నుంచి కూతుర్ని కాపాడుకునే తల్లి కథ. ‘దిస్ మార్నబుల్ బాడీ’ జీవితానికి ఆశల రెక్కలు తొడుగుతుంది. ‘ది మిర్రర్ అండ్ ది లైట్’ ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి ముఖ్య సలహాదారు థామస్ క్రాంవెల్ చరమాంకం. ‘ది షాడో కింగ్’ ఒక సైనికాధికారి ఇంట్లోకి పనమ్మాయిగా వచ్చిన అనాథ.. నియమ నిబంధనలతో కూడిన తన కొత్త జీవితానికి అలవాటు పడలేకపోవడం. ‘సచ్ ఎ ఫన్ ఏజ్’.. తగని చోట తగిన విధంగా ఉంటే ఏం జరుగుతుందన్నది! ‘రెడ్‌హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్’ అసంఖ్యాకంగా అక్కచెల్లెళ్లు, అత్తమామల కుటుంబ సభ్యులతో విసురుగా మెసిలే ఒక మొరటు మనిషి హృదయ నైర్మల్యం. ‘లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్’ పిల్లలు పుట్టడం ఎదురు కోసం చూస్తూ, భవిష్యత్తును అల్లుకుంటున్న ఓ జంట జీవితంలోని హటాత్పరిణామం. ‘హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్’ గూడు కోసం, అదృష్టం కోసం వెదకులాడే ఒక వలస కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన అనూహ్య ఘర్షణ. -
అదే ప్రశంసాపత్రం
షణ్ముఖరావు అనువాద కథలు ‘కథాప్రపంచం’ ద్వారా ప్రచురితమైనాయి. ‘ఆర్థిక వ్యత్యాసాల నేపథ్యం నచ్చినవీ, కథలో అనూహ్యమైన మలుపులు మెచ్చినవీ, కథనంలో సంక్లిష్టతనూ, సంక్షిప్తతనూ యిష్టపడినవీ, మానవత్వం మెరిసినవీ, కల్లోలిత ప్రాంతాల ప్రజాజీవనాన్ని ప్రతిబింబించినవీ’ ఇలా 23 కథల్ని ఆయన ఎన్నుకున్నారు. అనువాదంలో ఉండే సవాళ్లు ఏమిటో ఇలా చెబుతున్నారు: అనువాదకుడికి అవరోధాలూ సవాళ్లూ ఎక్కువ. స్వతంత్రత తక్కువ. మూలభాషలోని సాంఘిక సాంస్కృతిక జీవన చిత్రణ గుండెకు హత్తుకోవాలి. వేదన గానీ వినోదం గానీ మనస్సును కదిలించాలి. కొన్ని సందర్భాలలో పచ్చిగా వుండే భావాలుంటాయి. వాటికి కాస్త చక్కెర పూస్తూగానీ మన భాషీయులు హర్షించరు. ఒక సమాజానికి పట్టింపే లేని అంశం మరో సమాజానికి తీవ్రమైన నేరంగా ఉండొచ్చు. ఉదా: ఆఫ్రికాలో వివాహేతర దాంపత్యం. ఇటువంటి వాటి గూర్చి మెలుకువతో మాటలు పేర్చాలి. కొన్ని భాషల కథలు యింకా ప్రాథమిక దశలోనే వున్నట్లుంటాయి. నిజానికి వాటిని ఆయా భౌగోళిక ప్రాంతం, ఆ రచనాకాలం పరిగణించి తూకం వేసుకోవాలి. అనువాదంలో వాక్య నిర్మాణం సరళంగానూ సూటిగానూ వుండాలి. ఆయా భాషల సామెతలకూ, నుడికారాలకూ, పారిభాషిక పదాలకూ అన్వయం చెడకుండా చూడాలి. యించిమించూ మూల రచయితలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. పాత్రల పేర్లూ స్థలకాలాలూ మారినా తన భాషా కథనే చదువుతున్నట్లు పాఠకుడు అనుభూతి చెందితే, అనువాదానికి అదే ప్రశంసాపత్రం. ఏది ఏమైనా అనువాదం మూలానికి సర్వ సమానం కాదు. టి.షణ్ముఖ రావు అనువాద కథలు; పేజీలు: 154; వెల: 200; ప్రచురణ: కథాప్రపంచం, కె.టి.రోడ్, తిరుపతి. ఫోన్: 9553518568 -
‘ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదు’
-
సాంస్కృతిక సమ్మేళనం.. ప్రగతికి కీలకం
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం తెలంగాణ ప్రగతికి కీలకమని, అభ్యుదయ రాష్ట్రంలో సాహితీ వేడుకలు ఓ భాగంగా మారాయని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు, రచయితలు. మేధావులు హైదరాబాద్ వేదికగా అనేక అంశాలపైన మాట్లాడుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చర్చలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయన్నారు. హైదరాబాద్ సాహిత్యుత్సవం తొమ్మిదో ఎడిషన్ వేడుకలు శుక్రవారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది సాహితీప్రియులు, కవులు, రచయితలు, చిత్రకారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో ఇలాంటి వేడుకలు ఒక భాగమన్నారు. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. ఐదు లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకొనేవిధంగా భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు. పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, వివిధ భాషల సాహిత్యంపైన ఇలాంటి సదస్సులు నిర్వహించడం సంతోషకరమన్నారు. తాను నేర్చుకుంటున్న చైనీష్లోనూ, గుజరాతీ భాషలో కొద్దిసేపు మాట్లాడి ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, అజయ్‌గాంధీ, కిన్నెరమూర్తి, తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపైన సదస్సులు జరిగాయి. భారత్, చైనా బంధం బలోపేతమవ్వాలి భారత్, చైనా మధ్య సాంస్కృతిక, సాహిత్య సంబంధాలు కొనసాగాలని చైనా రచయిత ఎ.లాయ్ అన్నారు. ‘సమకాలీన చైనీస్ సాహిత్య ధోరణులు’ అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం హిమాలయ పర్వతాలు మాత్రమే విడదీసే రెండు గొప్ప పొరుగు దేశాల మధ్య ఉండాల్సినంత సాహిత్య బంధం లేదనీ, రామాయణం, కొన్ని టాగూర్ పద్యాలు, భారతీయ నవలలు, పాత సినిమాల జ్ఞానంతో తాను ఇక్కడికి వచ్చాననీ తెలిపారు. సంస్కృతం నుంచి అనువాదమైన ఎన్నో బౌద్ధ రచనలు చదివిన జ్ఞానం భారతీయ స్నేహితులతో సంభాషించడానికి సరిపోతుందని చమత్కరించారు. చైనా ప్రభుత్వం రచయితలను నియంత్రించడం లేదనీ, స్వేచ్ఛగా రాయగలుగుతున్నామనీ చెప్పారు. నాజూకుదనం గురించి జరుగుతున్న విపరీత ప్రచారం, చైనా స్త్రీల జీవితంలో తెస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు నవలా రచయిత్రి జి షుయిపింగ్ చైనా రచయితలు గ్వాన్ రెన్షామ్, రంగ్ రంగ్, బెయ్ తా పాల్గొన్నారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ముద్ర గుజరాతీ సాహిత్యం మహాత్మా గాంధీజీపైన ఎంతో ప్రభావం చూపిందని, అలానే ఆయన ప్రభావంతో అది మరింత సుసంపన్నమైందని ప్రముఖ గుజరాతీ రచయిత సితాన్షుయశస్చంద్ర అన్నారు. ‘గాంధీకి ముందు, గాంధీతోపాటు, గాంధీ తరువాత గుజరాతీ సాహిత్యం’అన్న అంశంపైన ఆయన మాట్లాడారు. గుజరాతీ సాహిత్యంలో నర్సిమెహతాను ప్రాచీన కవిగా పరిగణిస్తారని, అప్పటి సమాజాన్ని ఉన్నదున్నట్లుగా మాత్రమే ఆయన తన సాహిత్యంలో ప్రస్తావించారని చెప్పారు. భారతీయ సాహిత్యాన్ని దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పరిచయం చేసిన ఘనత గాంధీకే దక్కుతుందన్నారు. అనంతరం ‘గాంధీ సమకాలీనత’అనే అంశంపై జరిగిన మరో చర్చలో డాక్టర్ శంభూప్రసాద్, సుధీర్‌చంద్ర తదితరులు మాట్లాడారు. జాతీయోద్యమ నిర్మాణంలో, గ్రామస్వరాజ్యంలో ఆయన ప్రతిపాదించిన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికైనా ఆచరణయోగ్యమైనవేనన్నారు. నోట్ల రద్దు ఒక న్యూక్లియర్ బాంబ్ అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత లక్ష్యంగా రాత్రికి రాత్రి ఒక న్యూక్లియర్ బాం బులా పేల్చిన పెద్ద నోట్ల రద్దు ఆ లక్ష్యాన్ని ఏ మాత్రం నెరవేర్చలేదని ప్రజలు అనేక రకాల బాధలను, ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చిందని ప్రముఖ ఆర్థికవేత్త రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. ఆర్బీఐ సైతం నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పిందన్నారు. నగదు వల్ల అవినీతి ఉండదని, కేవలం హవాలా వల్లనే అవినీతి జరుగుతుందన్నారు. విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీల ఉదంతాలే అం దుకు నిదర్శనమన్నారు. మరోవైపు ‘మీ టూ’ పైన జరిగిన చర్చలో చిన్మయి, సంధ్యామీనన్, సుతాపపాల్లు మాట్లాడారు. వైరి ముత్తు వేధింపుల అంశాన్ని బయటపెట్టిన తరువాత తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరిగిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. మగవారిపై వచ్చే ఫిర్యాదులను సమాజం వెం టనే మరిచిపోతుందని, చాలా విషయాల్లో మహిళలనే ఎత్తుచూపడం వ్యవస్థీకృతమైన లోపమని సంధ్యామీనన్ అన్నారు. వేడుకలలో ఏర్పాటు చేసిన చైనా, గుజరాతీ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరలేదు మిషన్ కాకతీయ చేపట్టినప్పుడు తెలంగాణ నీరున్న రాష్ట్రంగా మారుతుందని ఆశించానని, కానీ ఈ పథకం కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లడం వల్ల అవినీతిమయమైందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్ కాంట్రాక్టర్ల చేతికి వెళ్లకముందు దేశంలోకెల్లా అద్భుతమైన ప్రాజెక్టుగా భావించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికయినా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కమ్యూనిటీకి ఆ పనులు అప్పగిస్తే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. -
క్రియేటివ్ ఇమాజినేషన్ మీలో ఉందా?
సెల్ఫ్ చెక్ రచయితలు, పెయింటర్స్, శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్, గాయకులు, నృత్య కళాకారులు, సినిమా దర్శకుల వృత్తిలో కొత్త పంథా ఏర్పాడాలంటే దానిలో ఊహ భాగమై ఉంటుంది. మనిషిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఊహ. శక్తివంతమైన ఊహ ద్వారానే మనిషి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మీలో ఎంత ఊహాశక్తి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 1. ప్రపంచంలో అనేక ఆసక్తికర అంశాలున్నాయని మీకు తెలుసు. వాటిని తెలుసుకుంటూ మీలో సృజనను పెంచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 2. సమస్యను పరిష్కరించటానికి ఒకే పద్ధతిని ఫాలో అవ్వరు. వివిధరకాల మార్గాలను అన్వేషిస్తారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. ఎ. అవును బి. కాదు 3. సృజనాత్మకంగా ఉండే వ్యక్తులతో ఎక్కుసేపు గడుపుతారు. వినూత్నంగా ఆలోచించేవారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. కొత్తకొత్త వస్తువులు తయారు చేస్తుంటారు. పాడైన వస్తువులను రిపేర్ చేయటం అంటే మీకిష్టం. ఎ. అవును బి. కాదు 5. కళలతో మీకు టచ్ ఉంటే వాటిలో వైవిధ్యం చూపించటానికి ప్రయత్నిస్తారు. భిన్నత్వం చూపటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎ. అవును బి. కాదు 6. మీ అభిరుచులు, నైపుణ్యాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 7. మీకు కావలసిన దాని గురించి పూర్తిస్థాయిలో జ్ఞానాన్ని సంపాదిస్తారు. అసంపూర్తిగా వదిలేయరు. ఎ. అవును బి. కాదు 8. మీ ఆలోచనలకే పరిమితం కాకుండా ఇతరుల ఆలోచనలను ఆచరణలో పెట్టటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు నాలుగు వస్తే మీలో ఊహాశక్తి ఉంటుంది. కాని అది పూర్తిస్థాయిలో ఉండదు. ప్రాక్టీస్ మేక్స్ మేన్ పెర్ఫెక్ట్ అన్నారు. సాధించలేని పనిని పదేపదే రకరకాలుగా చేయటానికి ట్రై చేయండి. ‘ఎ’ లు ఆరు దాటితే మీలో ఊహాశక్తి అధికం. దీనివల్ల జీవితంలో వైవిధ్యతకి, ప్రత్యేకతకి తెరతీస్తారు. క్రియేటివ్‌గా ఉంటారు. -
11, 12 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరులోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో దీనికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రగతిశీల రచయితలందరూ ఈ పాఠశాలలో పాల్గొననున్నట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతీయ ఆకాంక్షలు, నోట్ల రద్దు – రాజకీయ ఆర్థిక మూలాలు, ముíస్లింలు, దళితులపై పెరుగుతున్న దాడులు, సామాజిక రంగాల్లో కృషి చేస్తున్న ఆలోచనపరుల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. సాహిత్యంలో వ్యక్తమవుతున్న వివిధ ధోరణులను వస్తుగతంగా, శిల్పపరంగా సమీక్షించనున్నట్లు చెప్పారు. రెండు రోజుల కార్యక్రమంలో కథలు, కవిత్వం, అనువాద సాహిత్యం, చరిత్ర, వర్తమాన సామాజిక వ్యాసాలు వంటి 20 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు వివరించారు. సాహితీ ప్రియులు, విద్యార్థులు, రచయితలు, ప్రజలు, ప్రజా సంఘాల వారు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రచయితలు కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, జింకా సుబ్రమణ్యం, కాశీవరపు వెంకటసుబ్బయ్య, మహమూద్, కొండ్రాయుడు పాల్గొన్నారు. -
అక్షరం.. ప్రజల దిక్కు!
కవులు, రచయితలు జనం పక్షం రాష్ట్ర ఏర్పాటులో ‘అక్షరా’నికీ భాగస్వామ్యం సీరియస్ రచయితలను సర్కారే గుర్తించాలి ‘సాక్షి’తో ఆచార్య జయధీర్ తిరుమలరావు హన్మకొండ కల్చరల్ : వృత్తి కళాకారుల పక్షాన ఆయన ‘జానపద’మై నిలిచారు. కనుమరుగైపోతోన్న అమూల్య గ్రంథాలు, తాళపత్రాలకు పెద్దదిక్కయ్యారు. యాభై ఏళ్లుగా అక్షరాల సేద్యం.. నిరంతరాయంగా సాహిత్యం, సాంస్కృతికోద్యమం.. ఇదే ఆచార్య జయధీర్ తిరుమలరావు జీవనపథం. తెలంగాణకు ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక అస్తిత్వం ఉందని బలంగా చెప్పే ఆచార్య తిరుమలరావు ఓరుగల్లులో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, ప్రచురణల శా ఖ డెరైక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ప్రాచ్యలిఖిత భాండాగారం డెరైక్టర్‌గా ఉన్న సమయంలో అమూల్య గ్రం థాలు, తాళపత్రాలను సేకరించి భద్రపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన జానపద కళాకారుల, కళల పరిరక్షణ కోసం ‘జానపద’ను స్థాపించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఆయన.. రాష్ర్ట ఆవిర్భావం తరువాత కవులు, రచయితలపై బాధ్యత పెరి గిందని అంటారు. రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే.. ప్రభుత్వమే గుర్తించాలి.. కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. కానీ, రాసే కవికి మాత్రం న్యాయం జరగలేదు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనడం అన్యాయం. సీరియస్, సిన్సియర్ రచయితలను ప్రభుత్వమే గుర్తించాలి. రచయితకు లభించే గుర్తింపు, సహాయం రచయిత వ్యక్తిత్వాన్ని పెంచేదిగా ఉండాలి. అలాగే, రచయితలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని చాలా కాలంగా అడుగుతున్నాం. రెండేళ్లు గడిచిన సందర్భంలో మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రజలకు జవాబుదారీ.. ‘తెరవే’ తెలంగాణ రచయితల వేదిక(తెరవే) పదహారేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ లక్ష్యంగానే ఇది ఆవిర్భవించింది. రాష్ట్ర సాధనలో రచయితల పాత్ర అమోఘం. అరసం, విరసంతో పాటు రాజకీయ ఎజెండాతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ప్రాంతీయ స్పృహతో రాష్ట్ర సాధన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ తెరవే మాత్రమే. ప్రస్తుతం కొన్ని సంస్థలు రాజకీయ ప్రాపకం, ప్రాబల్యం కోసం ‘పాటుపడు’తున్నా.. మేం మాత్రం ప్రజలకు జవాబుదారీగానే ఉంటాం. రచయిత సామూహిక ఆలోచనల ప్రతినిధి.. ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ అవసరాల రీత్యా మాట్లాడుతాడు. వాటిలో ఎలిగేషన్స్ ఉంటాయి. కానీ, రచయిత చేసే పనిలో, రాసే రాతల్లో అవేవీ ఉండవు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను ఒక లాజిక్‌తో వివరించి చెబుతాడు. ఒక నినాదంగా కవి, రచయిత ప్రభుత్వాన్ని నేరగ్రస్తంగా చిత్రించాలని అనుకోరు. అది ఉద్దేశమై కూడా ఉండదు. రచయిత సామూహిక ఆలోచనలకు ప్రతినిధి. దానిని పది మంది తరఫున ప్రతిఫలిస్తాడు. అందులో నిజాయితీ ఉంటుంది. రాజకీయం మాత్రం ఉండదని గుర్తించాలి. ప్రజల మన్ననలే ముఖ్యం.. సాహిత్యం, రచయిత పాత్ర విస్తరించాలి. పాత నమూనాలు పనికిరావు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతో మమేకమై రాయాలి. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు, రచయితలను గుర్తించి అవార్డులివ్వాలి. కానీ, ప్రభుత్వంతో సన్మానాలు, పురస్కారాలు పొందడం మాకంత ముఖ్యం కాదు. రచయితలు ప్రజల అవసరాలు తీర్చేలా అక్షరాలు రాసి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే పాత్ర పోసిస్తూ ప్రజల మన్నన పొందడమే ముఖ్యం. ప్రభుత్వం, ప్రభుత్వ అవార్డులు ఆశించే వారు.. ఇద్దరూ కూడా రచయితల గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించవద్దు. వారిని కాపాడుకోవడం పౌరధర్మం పేద రచయితలు అనారోగ్యానికి గురైనప్పుడు సమాజమే వారి ని రక్షించుకోవాలి. వారిని కాపాడుకోవడం పౌరధర్మంగా భావిం చాలి. సుద్దాల హనుమంతుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి, దవాఖానాకు తీసుకువెళ్తామని మేం అంటే- ‘ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్నది తిని బతికాం. దవాఖానకు వెళ్తే ఇంట్లో ఉన్న సామాను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడకు రాను’ అన్నాడు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా నేటికీ పేద రచయితలు, కవుల గురించి ఎలాంటి విధాన నిర్ణయమూ జరగలేదు. సాహిత్యంలోనూ డబ్బున్న వాళ్లే రాణించే పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పెంచాలి.. అవార్డుల కోసం పైరవీలు చేసేవారు ఒకవైపు.. అవార్డులు కాదు.. ప్రజల పక్షానే ఉంటామనే వారు మరోవైపు.. ఇందులో ప్రయోజనాలదే పెద్దపీట. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పోయే పరిస్థితి ఏర్పడకూడదు. రచయితలకు ప్రభుత్వం సహకరించాలి. పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. పది జిల్లాల్లో గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయాలి. రచయితల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రచయితలకు గౌరవం ఎక్కువ అనే మాట వినపడాలి. స్వేచ్ఛను హరించొద్దు.. సభలు, సమావేశాలకు ఇతర కారణాలను చూసి అనుమతులు ఇవ్వకపోవడం, ఆంక్షలు విధించడం సరి కాదు. వరంగల్ సభ విషయంలో న్యాయస్థానం కూడా సరైన పాత్ర నిర్వహించలేదు. ఎవరు ఏ రూపంలోనైనా సరే.. స్వేచ్ఛను హరించడాన్ని మేం నిరాకరిస్తాం. రచయితలుగా, కవులుగా మేం సంస్కారవంతమైన భాషలోనే మాట్లాడతాం. మా లక్ష్యం.. సామాజిక క్రాంత దర్శనం సీమాంధ్ర పాలనలో పెడ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లం. ప్రస్తుతానికి ప్రభుత్వానికి హితవు చెప్పడం, వాస్తవాలు వివరించడం వంటివి మాత్రమే చేస్తున్నాం. రచయితలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుని నిలబడుతున్నారు. వారు సామాజిక వాస్తవాన్ని తమ ఆత్మవ్యక్తీకరణను అక్షరాలుగా పెట్టి సూచనలుగా అందిస్తున్నారు. సామాజిక క్రాంత దర్శనం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే అక్షరం కర్తవ్యం. రాష్ట్ర సాధనలో ‘అక్షర’ భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయంలో అక్షరాలకు నిండైన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు రకరకాల పండుగలు చేస్తున్నారు. రచయితలను సమాజానికి దూరం చేయాలని కొందరు చూస్తున్నారు. అక్షర రంగం దానిని ప్రతిఘటిస్తుంది. ఈ ప్రభుత్వం మాది. -
ఒంగోలులో రచయితల స్వర్ణోత్సవాలు ప్రారంభం
ఒంగోలు కల్చరల్ : ఒంగోలులోని టీటీడీ కల్యాణమండపంలో తెలుగు రచయితల స్వర్ణోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శాసనమండలి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ తెలుగు లోగిలి’ అనే 11 వందల పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన 6 ఆరుగురు భాషావేత్తలను నిర్వాహకులు సత్కరించారు. వీరిలో వరంగల్(తెలంగాణ), అనంతపురం(ఆంధ్రప్రదేశ్), బరంపురం(ఒడిశా), చెన్నై(తమిళనాడు), బెంగళూరు(కర్ణాటక), ముంబై(మహారాష్ట్ర)లకు చెందినవారున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రొఫెసర్ కొలకనూరి ఇనాక్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, సంఘం అధ్యక్షుడు బి.హనుమారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
నా దగ్గర జాతీయ అవార్డు లేదు: షారుక్
అసహనంపై షారుక్ వ్యాఖ్య ముంబై: సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్‌ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు. -
పునరావిష్కరించుకోండి
♦ సాహిత్య అకాడమీకి రచయితల వినతి ♦ బీజేపీ తమ వారిని అదుపులో పెట్టుకోవాలని సూచన న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ.. ఇటీవల జరిగిన అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా.. సాహిత్య అకాడమీని పునరావిష్కరించుకోవాలని రచయితలతోపాటు.. అవార్డులను వెనక్కిన వారంతా కోరారు. అకాడమీ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ.. రచయిత్రి నయనతార సెహెగల్ సహా 41 మంది రచయితలు, కళాకారులు అకాడమీకి లేఖ రాశారు. రచయితల నిర్ణయానికి మద్దతుగా అక్టోబర్ 23న అకాడమీ ప్రకటన చేయడం తెలిసిందే. అయితే అకాడమీ నిర్ణయం ఆలస్యంగా వచ్చిందన్న విమర్శలు వచ్చినప్పటికీ.. ఇకనైనా దేశంలోని రచయితల మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉందా అనే విషయంపై అకాడమీ పునరాలోచన చేయాలని కోరారు. ‘భారత్‌లో పరిస్థితులు చేజారుతున్నాయనే పరిస్థితి కలగొద్దనేదే మా అభిప్రాయం. దేశంలో ఎవరి హక్కులకు భంగం వాటిల్లకూడదు. రోజురోజుకూ దేశంలో కుల వ్యవస్థ మరింత లోతుగా చొచ్చుకు పోతోంది. దీని వల్లే సమస్యలు వస్తున్నాయి. తాజా పరిస్థితులతో.. దీనిపై చర్చించి పరిష్కరించే అవకాశమే ఉండటం లేదు’ అని ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తన మందీ మార్బలాన్ని అదుపులో పెట్టకుండా.. ఈ ఘటనలను ‘కృత్రిమంగా సృష్టిస్తున్న వివాదం’గా పేర్కొనటం సరికాదని విమర్శించారు. కాగా, రచయితలు, మేధావులు అసహనంపై చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తేవడానికి కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ వారంఆయనను కలవనున్నారు. -
దాడులు తిప్పికొట్టాలి
రచయితల పిలుపు హైదరాబాద్: కవులు, రచయితలపై జరుగుతున్న దాడులు, హత్యలను ముక్తకంఠంతో ఖండించాలని, అందుకు ఐక్యంగా పోరాడాలని పలువురు రచయితలు పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ‘వర్తమాన సామాజిక సంఘర్షణలు, రచయితల బాధ్యత’ అంశంపై సమావేశం జరిగింది. ఇందులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి కాత్యాయని విద్మహే, ప్రముఖ రచయితలు నందిని సిధారెడ్డి, కె.శివా రెడ్డి, తెలకపల్లి రవి, వరవరరావు, యాకుబ్, పసునూరి రవీందర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ప్రసంగించారు. కాత్యాయని మాట్లాడుతూ.. సమాజంలో రచయితలు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రెండేళ్లుగా స్త్రీలు, రచయితలపై దాడులు పెరిగాయన్నారు. మతం పేరుతో కొనసాగుతున్న దాడులను రచయితలు తిప్పికొట్టాలన్నారు. కలచివేస్తున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి రచయితలు సంఘటితం కావాలని నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు. లౌకికవాద అభిప్రాయాలున్న వారంతా ఒక్కటై ఇలాంటి సంఘటనలు తిప్పికొట్టాలని కె.శివారెడ్డి అన్నారు. భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలు, భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని తెలకపల్లి రవి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే కొందరు తుపాకులు పడుతున్నారని వరవరరావు చెప్పారు. హిందుత్వ, బ్రాహ్మణీయ శక్తులు చేస్తున్న దాడులను రచయితలు ఖండించాలని రవీందర్ అభిప్రాయపడ్డారు. దాడులకు నిరసనగా రచయితలు తమ అవార్డులను వెనక్కు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని, రచయితలకు అండగా సమాజం ఉందని తెలియజేయాలని హరగోపాల్ అన్నారు. వేదిక జాతీయ కన్వీనర్ కె.మల్లీశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు శాంతిప్రభావతి, పి.రాజ్యలక్ష్మీ, బండారు విజయ, ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, విమలక్క, వాసురెడ్డి నవీన్, శిలాలోలిత, వినోదిని, కొండవీటి సత్యవతి, సామాజిక వేత్త దేవి తదితరులు పాల్గొన్నారు. -
‘భారత్ హిందువులది కాదు.. హిందుస్తానీలది!’
న్యూఢిల్లీ: దాద్రి ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించాలని సాహిత్య అకాడెమీ అవార్డులను వెనక్కిచ్చిన రచయితలు బుధవారం డిమాండ్ చేశారు. ‘ఇక్కడ నివసించే హిందుస్తానీలందరిదీ ఈ దేశం. ఇది కేవలం హిందువుల దేశం కాదు. హిందుస్తానీలందరికీ రక్షణ కల్పించాలి. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని నయనతార సెహగల్ పేర్కొన్నారు. దాద్రి ఘటనపై ప్రధాని స్పందన చాలా పేలవంగా, బలహీనంగా ఉందని కన్నడ రచయిత శశి దేశ్‌పాండే వ్యాఖ్యానించారు. సాహిత్య అకాడెమీ అవార్డ్‌ను తిరిగిచ్చేస్తున్నట్లు బుధవారం కవి కేకే దారువాలా ప్రకటించారు. రాజకీయ కారణాలతోనే రచయితలు తమ పురస్కారాలను వెనక్కు ఇస్తున్నారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విమర్శించారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఏడాదిన్నర కిందట యూపీలోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు రచయితలు నిరసనగళం ఎందుకు వినిపించలేదని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. -
ఇకపై మన భాష.. మన సంస్కృతి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలువురికి సాహితీ పురస్కారాల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో : ఇంతకాలం అణచివేతకు గురైన తమ భాష, సంస్కృతిని పరిరక్షించుకునే దిశగా తెలంగాణ రచయితలు, కవులు రచనలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ కళామందిరంలో 2012 సంవత్సర సాహితీ పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా ప్రమాణాలు అడుగంటుతున్నాయని, ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మనది ఒకటీ లేకపోవడం బాధాకరమన్నారు. తెలుగు వర్సిటీ నుంచి రచయితలు తమ గ్రంథాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించే నిమిత్తం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. తెలంగాణ రచయితలకు మునుపటికంటే ఎక్కువ సహాయం అందించాలన్నారు. ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిందన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. వచన కవితా ప్రక్రియలో ‘దండెడ’ గ్రంథానికి పొన్నాల బాలయ్య, బాలసాహిత్యం ప్రక్రియలో ‘శృతిలయలు’ గ్రంథానికి ఆలపర్తి వెంకట సుబ్బారావు, కథా ప్రక్రియలో ‘గదిలోపలి గోడ’ రచయిత పలమనేరు బాలాజి, సాహిత్య విమర్శలో ‘సాహిత్యాకాశంలో సగం’ గ్రంథకర్త ఆచార్య కాత్యాయని విద్మహే, అనువాద ప్రక్రియలో ‘అనంతాకాశం’ గ్రంథానికి గోవిందరాజు రామకృష్ణారావు, నవలా ప్రక్రియలో ‘జిగిరి’ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, నాటక ప్రక్రియలో ‘లవంగి’ నాటకానికి కేవీఎల్ఎన్ శర్మ, వచన రచనలో ‘ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం’ గ్రంథానికి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, రచయిత్రి ఉత్తమ గ్రంథంలో ‘తెలుగు నృత్యకళా సంస్కృతి’ రచయిత ఆచార్య కె. కుసుమారెడ్డి పురస్కారాలు అందుకున్నారు. పద్య కవితా ప్రక్రియలో ‘సప్తగిరిథామ కలియుగ సార్వభౌమ’ గ్రంథానికి దివంగత రాళ్లబండి కవితాప్రసాద్ తరపున ఆయన సతీమణి నాగినీదేవి పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ తోమాసయ్య, డాక్టర్ జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేటి కథ
పర్యటన ఫిబ్రవరి 14, 15 తేదీల్లో కథారచయితల కొల్లేటి పర్యాటన రచనా జగత్తులోని అంతర్లోకాల కంటే బాహ్యంగా జరుగుతున్న విధ్వంసాన్నే ఎక్కువ దర్శింప చేసింది. ‘అసలే పదమూడో తేదీ... ఆపై ఎస్13... ఏదో భయంగా ఉంది మిత్రమా’... అన్న్టాడొక కవిమిత్రుడు నవ్వుతూ ఒక సృజనకారుడికి మాత్రమే ఉండే అతి ఊహా భయ అపోహతో. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎస్13లో అందరం ప్రయాణం. కొల్లేరుకి. తేదీ అదే అయ్యింది. బోగీ అదే అయ్యింది. అందుకే ఈ భయం. పదమూడు సంఖ్య కొందరి దృష్టిలో దుశ్శకునం కావచ్చు. కాని అంతకంటే పెద్ద దుశ్శకునాన్ని చూడబోతున్నామని మాకు తెలీదు. పర్యావరణానికి దుశ్శకునం. ప్రకృతికి దుశ్శకునం. ప్రపంచంలో అరుదైన చిత్తడి నేలలకు దుశ్శకునం. కొల్లేరు దురాక్రమణ! ప్రోగ్రామ్ ఏమిటంటే ఉదయాన్నే లాంచీ ఎక్కి సాయంత్రం వరకు కొల్లేరులో తిరగాలని. పక్షులను చూడాలని. రక్కసి పొదల చాటున అందంగా ఉండే లంక గ్రామాల సౌందర్యాన్ని తిలకించాలని. ఏం... జాలరి వలలూ... తాటి దోనెలూ... పట్టిన తర్వాత రేకు డ్రమ్ముల్లో చిక్కి ఎగిరి నీళ్లల్లోకి దూకాలని పెనుగులాడుతున్న కొర్రమీనులూ గొరకలూ... వేలెడంత ఉండి తప్పించుకోవడానికి వీలు లేక నాలుగు గుర్రపు డెక్కల్ని మూతగా కూరితే లోన ఉక్కిరిబిక్కిరిగా సందడి చేస్తున్న చేదిబరిగెలూ... కొల్లేరుకు ఆనుకుని నిడమర్రు సమీపాన ‘పెదనిండ్రకొలను’ గ్రామంలో ఉంటున్న రచయిత కుమార్ కూనపరాజు కూడా ఇలాగే అనుకున్నారు. చాలాకాలం న్యూయార్క్, హైదరాబాద్‌లలో ఉండి ఇటీవల సొంతూళ్లో స్థిరపడిన కుమార్ కొల్లేరును చూసి చాలా రోజులవుతోంది. బాగానే ఉంటుంది కదా అనుకున్నారట. ఆ మొత్తం కార్యక్రమానికి హోస్ట్ ఆయనే. భీమవరంలో బేస్ క్యాంప్. అక్కడి నుంచి ఆకివీడుకి. కాస్త లోనకు దారి చేసుకుంటే కొల్లేరు ఒడ్డు. పది ఇరవై అడుగుల ఎత్తున మొలచిన దుబ్బును ఒరుసుకుంటూ మూడు నాలుగు చిన్నపడవలూ... ఒక లాంచీ... ఎన్నాళ్ల కోరికో చూడాలని. ఎక్కాం. ఎ... కాకు దీర్ఘం.. వత్తు... సున్నా... పదం పూర్తయ్యే లోపలే దిగాం. అంతే కొల్లేరు. ఇక్కడి నుంచి అక్కడికి. ఒక మురుగు కాల్వ అంత. రెండు మూరలు. పోనీ నాలుగు బారలు. అంతే. ఛిద్రదేహం. ముక్కలుగా చీరిన దేహం. పూడిన దేహం. ఎండిన దేహం. కొనఊపిరితో తీసుకుతీసుకు పడి ఉన్న దేహం. కొల్లేరు. కుమార్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. అది తను చిన్నప్పుడు చూసిన కొల్లేరు కాదు. గంభీరంగా మౌనంగా ఉండిపోయి హైదరాబాద్ చేరుకుని ఫోన్ చేస్తే అన్నారు- ‘ఆక్రమణ పూర్తయ్యింది. ఇంకేం మిగల్లేదు’. అదీ కొల్లేరు. పది కాంటూర్లు.. అంటే 2.24 లక్షల ఎకరాలు. పోనీ ఐదు కాంటూర్లు... లక్ష ఎకరాలు... సరే మూడు కాంటూర్లు... ఏం లెక్క ఇది. సరస్సు సరస్సులా ఉండాలి. ప్రాణం ప్రాణంలా ఉండాలి. నీరు నీరులా ఉండాలి. చేప చేపలా ఈదాలి. ఏం చూశాం ఇక్కడ? పచ్చటి నేలలన్నీ చేపల చెరువులుగా రొయ్యల దొరువులుగా... జీవితాలు బాగుపడ్డాయి... సంపద పోగయ్యిందట... కాని అందరూ దాదాపుగా బాటిల్డ్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. గ్రౌండ్ వాటర్ కలుషితం అయ్యింది. ఆక్వా మందులు నేల అడుగున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీవవాిహనీ... అంతర్వాహినీ... రసాయనిక విషవాహినీ... రెండు వాదనలు వినిపించాయి. మొదటి వాదన- మహమ్మారి కొల్లేరు... వరద వస్తే లంకలను ముంచే దుఃఖదాయిని కొల్లేరు... జలగం వెంగళరావు పుణ్యమా అంటూ చేపల చెరువులు కల్పతరువులా మారి బతుకు బాగు చేసింది. గుడ్. రెండో వాదన- కానీ ఈ ప్రయత్నమే కొల్లేరు ముక్కు మూసేసింది. గుడ్లు పీకేసింది. ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి రాచపుండులా నమిలి మింగేస్తోంది. పక్షులు అరాకొరా మిగిలాయి. చేపలు బిక్కుబిక్కుమంటున్నాయి. శాక రొయ్యలు.. బుంగ రొయ్యలు.. గాజు రొయ్యలు... ఏడ్చినట్టుంది. నీళ్లా అవి? పురుగుల మందు. కొల్లేటి కాపురం... సినిమా. కొల్లేటి బతుకు... వాడుక. కొల్లేటి జాడలు... ఇంతకాలానికైనా తెలుగులో వచ్చిన అక్కినేని కుటుంబరావు నవల. కొల్లేటి కథ? చాలా రాయాల్సి ఉంది. కొల్లేటి తాజా బతుకు మీద చాలా చేయాల్సి ఉంది. దానిని ఆక్రమించో ఆధారం చేసుకునో పొట్టపోసుకుంటున్న మామూలు మనుషులకు న్యాయం జరగాలి. కొల్లేరుకు జీవం రావాలి. ఈ రెండూ సాధించడం చాలా పెద్దపని. కొల్లేటి ప్రక్షాళన అంటే చాలా మంది వణుకుతున్నారు. భుక్తి పోతుందని. కాని ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు... తెలుగువారి సరస్సు... సైబీరియా పక్షుల మెట్టినిల్లు.... అటు చూస్తే తెలంగాణలో మిషన్ కాకతీయ... హుసేన్ సాగర్ పునరుజ్జీవనం... ఆంధ్రప్రదేశ్‌లో? బెంగ. ఈలోపు కేశవరెడ్డి మరణవార్త మరో దిగులు. ఫిబ్రవరి 14న- దిగిన వెంటనే- పెదనిండ్రకొలనులో- కథాచర్చల కంటే ముందు కేశవరెడ్డి సంస్మరణ సభ- బహుశా రాష్ట్రంలోనే మొదటి సభ- ఏర్పాటు. రచయితలందరం కలిసి కేశవరెడ్డిని తలుచుకోవడం. ‘కేశవరెడ్డి గురించి తెలుగు ప్రాంతం కనీసం రెండు దశాబ్దాలు మౌనం పాటించింది. మునెమ్మ నవల మీద కాంట్రవర్సీ జరగకపోయి ఉంటే ఆ మౌనం ఇంకా కొనసాగేదేమో’ అని ఎవరో అన్నారు. ‘ఒక అగ్రకుల రచయిత అయి ఉండి జీవితాంతం శూద్రుల జీవితాలను రాసే పనికి పూనుకోవడం మామూలు విషయం కాదు’.. మరొకరు. ఇంకా ఎన్నో మాటలు... జ్ఞాపకాలు. తెలుగులో నవలను శ్రద్ధగా సాధన చేసిన ఒక శక్తిమంతమైన రచయితకి వీడ్కోలు. తెలుగు నవల తాత్కాలికంగా మూగదైంది. ఆ పిల్లనగ్రోవి మరి వినిపించదు. ఆ మధ్యాహ్నం- సోషల్ మీడియాలో రాస్తున్న కొత్త రచయితల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రింట్ మీడియా సంకెలల నుంచి, ‘ఎడిటర్లు అచ్చుకు స్వీకరించే’ అడ్డంకి నుంచి రచయితలను సోషల్ మీడియా విముక్తం చేయడాన్ని అందరూ మంచి పరిణామంగా చూశారు. అయితే ఒకటి రెండు కథలు రాయగా, నాలుగైదు లైకులు కనిపించగా, మరి మనంతవారు లేరని భావించే కొత్త రచయితలకు జాగ్రత్త చెప్పి కాపాడుకోవాలని కొందరు సూచించారు. అక్కర్లేదనీ తెలుసుకునేవారు తెలుసుకుంటారనీ లేకుంటే వాళ్ల పాపాన వాళ్లే పోతారని మరెవరో అనుభవం మీద తేల్చారు. అయితే విస్తృతి నుంచి ‘ఉన్మాద’స్థాయికి చేరుకున్న ఈ సోషల్ మీడియాలో క్షణమాత్రం సేపు కనిపించకపోతే బెంబేలు పడిపోయే కొత్త జబ్బు ‘ఫోమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) మీద మరో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ థీమ్‌ను తీసుకొని ఆరు కథలను ఆరుగురు రచయితలతో రాయించి ఆరు షార్ట్‌ఫిల్మ్స్ తీయాలన్న ప్రయత్నానికి తలో చేయి వేసే అంగీకారమూ కుదిరింది. మహా రచయితలను తెలుసుకోవడం ముఖ్యం. ఒక రచయిత రచనా కృషిని తెలుసుకుంటే మన రచనాకృషిని బేరీజు వేసుకునే వీలవుతుంది. మహా రచయిత మార్క్వెజ్ రచనా ధోరణినీ ముఖ్యంగా పదాలతో దృశ్యం కట్టే అతడి ప్రతిభనీ విశదం చేస్తూ చాలా మంచి సెషన్ జరిగింది. ఒకే వాక్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల ప్రస్తావన వచ్చేలా మార్క్వెజ్ రాసేశైలి గురించి తెలుగువారు దృష్టి పెట్టారా? ప్రశ్న. ఈ చర్చ ఇలా జరుగుతుండగా నడక ఇబ్బంది వల్ల లాంచీలోనే ఉండిపోయిన సీనియర్ రచయితొకరు- ఐదారుమంది సిబ్బందిని కేకలేస్తూ పాసింజర్లను బుజ్జగిస్తూ పోటీదార్ల మీద కయ్యానికి దిగుతూ లాంచీని అలవోకగా నిర్వహిస్తున్న మహిళను పలకరించి మంచి కథకు సరిపడా సమాచారాన్ని సేకరించడం మిగిలినవాళ్లకు పెద్ద మిస్సింగు. ‘నేనెందుకు రాస్తున్నాను’ అనే అంశం మీద ఆ సాయంత్రం భీమవరం పాఠకుల మధ్య రచయితలు పంచుకున్న అనుభవాలు వారికే కాదు ఇతర రచయితలకు కూడా పాఠాలు. వీటన్నింటి నడుమ ప.గో.జిల్లా పల్లెల్ని చూడటం, గూడపెంకుల ఇళ్లను చూడటం, వాకిలి గోడలపై ముదురెరుపు మందారాలను చూడటం, కాలువల్లో మునకలు వేస్తున్న పిల్లలు, లారీలకు ఎక్కుతున్న తాజా చేపల తళుకులు, మిగిలి ఉన్న వరిచేల గ్రీన్ కార్పెట్, అమృతపాణి అరటిపండ్ల ఇన్స్టాంట్ శక్తి, భోజనంలో శీలవతి చేపల పులుసు అలవిగాని రుచి... ములక్కాడల్ని ఉడకబెట్టిన గుడ్లతో వండిన తియ్యగూర లొట్టలు... ఆ రాత్రి గుక్కెడు మదిరా... ఆ పైన కవుల కంఠాన పద్యమూ... కొన్ని గ్రూప్ఫొటోలూ మరికొన్ని చేబదులు సెల్స్నాప్లూ... అన్నింటి కంటే మించి అందరం కలిశాం కదా అని అభినయం లేని నిజమైన సంతోషం... రెండు రోజుల పర్యటనే... కాని రెండు సంవత్సరాలకు సరిపడా రాగిమాల్ట్. టైటానిక్ సురేష్ -7702806000, అక్కిరాజు భట్టిప్రోలు, కుప్పిలి పద్మల ఆధ్వర్యంలో కుమార్ కూనపరాజు -9989999599 పూనిక మీద జరిగిన ఈ కార్యక్రమంలో పాతా కొత్తా మిత్రులు చాలామంది. అల్లం రాజయ్య, దేవులపల్లి కృష్ణమూర్తి, హనీఫ్, భగవంతం, కోడూరి విజయకుమార్, పూడూరి రాజిరెడ్డి, పద్మజా రమణ, దాట్ల దేవదానం రాజు, పెన్మత్స శ్రీకాంత్ రాజు. కలిదిండి వర్మ, నామాడి శ్రీధర్, బి.వి.వి.ప్రసాద్, డానీ, కుప్పిలి పద్మ, బా రహమతుల్లా, అనిల్ బత్తుల, జి.ఎస్.రామ్మోహన్, విజయలక్ష్మి, అజయ్ ప్రసాద్, అక్కిరాజు భట్టిప్రోలు, పద్మావతి, తెనాలి ఉమా, నాగేశ్వరరావు, ప్రసాదమూర్తి, శిఖామణి, లెనిన్ ధనిశెట్టి, కస్తూరి మురళీకృష్ణ, అనంత్... వీళ్లతో పాటు తల్లావఝల పతంజలి శాస్త్రి, మధురాంతకం నరేంద్ర కూడా రావాల్సింది. శాస్త్రిగారు కారణం చెప్పారు. నరేంద్ర ఏ పనుల్లో చిక్కుబడ్డారో ఏమో. ఒక రచనకు విధ్వంసానికి మించిన ధాతువు లేదు. ఆ విధ్వంసాన్ని చూపిన పర్యటన ఇది. జల ప్రళయం అంటే వేరేమిటో కాదు. నీటి ఆధారిత వ్యాపారంతో జరుగుతున్న భూ విధ్వంసం, సరస్సుల విధ్వంసం, స్వచ్ఛమైన జల వనరుల విధ్వంసం. రచయితలు చూడాల్సింది వీటినే. కలవాలి మనుషుల్ని. ఈ మూల ఈసారి. ఆ మూల మరోసారి. తదుపరి పర్యటన జూన్లోనట. కాసింత బస చూపి నాలుగు పూటలు భోజనం పెట్టేవారున్నారా? రచయితలు మీ ఊరు రావడానికి సిద్ధంగా ఉన్నారూ. - ఒక కథకుడు కొల్లేటి కాపురం... సినిమా. కొల్లేటి బతుకు... వాడుక. కొల్లేటి జాడలు... ఇంతకాలానికైనా తెలుగులో వచ్చిన అక్కినేని కుటుంబరావు నవల. కొల్లేటి కథ? -
కలం.. గళం
రచయితలుగా రాణించే వారు, ఔత్సాహిక రచయితలు, ఇప్పుడిప్పుడే రచనలు ప్రారంభించేవారు, తమకూ హక్కులు కావాలంటూ థర్డ్ జెండర్ సమస్యల్ని ప్రపంచానికి చాటి చెప్పే వారు.. ఇలా ఎంతో మంది ఔత్సాహిక కవులు, రచయితలకు వేదికైంది సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్. శనివారం రైటర్స్ కార్నివాల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. రచయితగా ఎలా రాణించాలి?, చేసిన రచనలను పుస్తక రూపంలో ఎలా తేవాలి?, సొంతంగా ఎలా ప్రచురించుకోవాలి?, ఈ-పబ్లిషింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై కొందరు సీనియర్ రైటర్స్ ఔత్సాహికుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ వర్క్‌షాప్.. ఆదివారం కూడా కొనసాగుతుంది. ప్రముఖ రచయిత్రి రోచెల్లా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు. -దార్ల వెంకటేశ్వరరావు కొన్నిటికే పరిమితమా? చాలామంది రచయితలు కొన్ని అంశాలకే పరిమితమవుతున్నారు. ఇప్పుడిప్పుడే ట్రాన్స్‌జెండర్స్ వంటి వాళ్ల కథలూ వెలుగు చూస్తున్నాయి. ఎవరూ టచ్ చేయని అంశాలు, వర్గాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై కొనసాగుతున్న వివక్ష వంటి వాటిని రచనల ద్వారా సమాజం దృష్టికి తేవచ్చు. హమారా కహాని, హమారా జీవన్ పేరుతో హిందీలో నేను రాసిన పుస్తకాన్ని తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’ పేరుతో వెలువరిస్తే చాలామంది విమర్శించారు. కొందరు మెచ్చుకున్నారు. మా కమ్యూనిటీ వాళ్లు కూడా అందులో రేప్ గురించి, పోలీసుల గురించి ఎందుకు రాశావని అన్నారు. మీడియా చాలా సపోర్ట్ చేసింది. - రేవతి, ట్రాన్స్‌జెండర్స్ రచయిత్రి స్టోరీ టెల్లింగ్పై అవగాహన అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి కథలు వినడం అనేది ఒకప్పటి కథ. ఇప్పుడు చెప్పేవారు, వినేవారు లేరు. కథలు రాయడానికి ఎలాంటి క్రియేటివిటీ కావాలో కథలు చెప్పడానికీ అంతే అవసరం. పిల్లల మనసును హత్తుకునేలా కథలు చెప్పాలి. అదే అంశాల్ని ఇక్కడ యువ రచయితలకు చెప్పా. - దీపా కిరణ్, స్టోరీ టెల్లర్ చాలా స్ఫూర్తినిచ్చింది ఎంతో మంది రచయితలను కలిసే అరుదైన అవకాశమిది. రచయితలు చెప్పిన సలహా సూచనలు బాగున్నాయి. మూడు చిన్నచిన్న కథలు రాశాను. సొంత బ్లాగ్‌లో ఈ-పబ్లిష్ చేస్తున్నాను. ఈ సదస్సులో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కొంత మేరకు తెలుసుకున్నా. - ఆర్ఎస్ ఆర్చా, ఇంటర్ విద్యార్థిని గే లవ్ స్టోరీ రాశాను యూత్ లవ్‌స్టోరీలతో ఎన్నో సినిమాలు, మరెన్నో కథలు వచ్చాయి. కానీ నేను ఇద్దరు మేల్స్ ప్రేమలో పడిన అంశాన్ని తీసుకుని గే లవ్ స్టోరీని రాశా. తెలుగులో ఇలాంటివి ఇంత వరకు రాలేదు. రచనలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఇది ఇదే సదస్సులో పుస్తక రూపంలో విడుదల కానుంది. రైటర్స్ కార్నివాల్ ఎన్నో కొత్త విషయాలను నేర్పింది. - నవ్‌దీప్, ఎల్బీనగర్ -
మన కథల వారణాసి
కథలెందుకు రాస్తారు? వాళ్లూ వీళ్లూ సరే. మన దగ్గర ఎవరున్నారు? ప్రపంచస్థాయి రచయితలు ఎవరున్నారు? ప్రేమ్‌చంద్! అవును. మన పుణ్యక్షేత్రం. మన పాఠ్యగ్రంథం. కథల వారణాసి. సిసలైన అర్థంలో నిజమైన భారతీయ కథకుడు. ప్రేమ్‌చంద్ అన్నీ చూశాడు. ఈ దేశంలో నూటికి తొంభై శాతం ఉన్న బీదా బిక్కి జనాల మధ్యతరగతి మనుషుల సమస్త తలపోతలనీ తలకెత్తుకున్నాడు. వాటన్నింటినీ రాశాడు. గురజాడ ప్రేమ్‌చంద్... ఇద్దరికీ సామ్యముంది. ఇద్దరూ దాదాపు ఒకేసారి కథల్లోకి దిగారు. కథల పరమార్థం గ్రహించారు. గురజాడ మౌఢ్యం నుంచి పరివర్తన ఆశిస్తే ప్రేమ్‌చంద్ సంస్కారాల నుంచి పరివర్తన ఆశించాడు. గురజాడ తన తొలి కథ రాయడానికి సరిగ్గా మూడేళ్ల ముందే ప్రేమ్‌చంద్ తన విశ్వవిఖ్యాత కథ ‘నమక్ కా దరోగా (1907) రాశాడు. ఏమిటా కథ? ఒక నిజాయితీపరుడైన యువకుడు. సాల్ట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. బ్రిటిష్ కాలం. నల్ల బజారులో ఉప్పు బంగారంలా అమ్ముడుపోతున్న కాలం. రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ఉప్పు పెద్దవాళ్ల చేతుల్లోకి పోకుండా చూడటమే సాల్ట్ ఇన్స్పెక్టర్ పని. ఉద్యోగంలో చేరి ఎన్నోరోజులు గడవవు. ఆ రాత్రి అతడికి పరీక్షా సమయం ఎదురయ్యింది. ఊరి పొలిమేరల్లో వరుసగా వెళుతున్న ఎడ్లబండ్లలో ఉప్పుమూటలు. ఒకటి కాదు రెండు కాదు... లెక్కలేనన్ని మూటలు. అన్నీ కూడా ఆ ఊరి కామందువి. గుట్టు చప్పుడు కాకుండా పట్నం పోతున్నాయి. పొలిమేర దాటితే ఇక నరుడి కంటికి దొరకనట్టే. కొత్త కుర్రవాడు ఉత్సాహవంతుడు నిజాయితీపరుడు సాల్ట్ ఇన్స్పెక్టర్... పట్టేసుకున్నాడు. గుర్రం మీద వెంబడించి బెబ్బులిలా గాండ్రించి బండ్లన్నీ నిలువరించాడు. ఎంత పెద్ద ఉత్పాతం ఇది. ఉప్పు పోతే పోయింది కాని దీని హక్కుదారుడు ఫలానా కామందు అని చుట్టుపక్కల పరగణాలన్నింటికీ తెలిసిపోతే? పరువేంగాను? కామందు వచ్చాడు. పక్కకు తీసుకెళ్లాడు. ఎంతకావాలో అడుగు అన్నాడు. చిల్లర పైసల ఉద్యోగి సాల్ట్ ఇన్స్పెక్టర్. వేలైనా సరే. లక్షలైనా సరే. పరువు ముఖ్యం. కాని కుర్రవాడు లొంగలేదు. అరెస్ట్ చేశాడు. అయితే పెద్దవాళ్లకెప్పుడూ పది దారులు. కోర్టులో కేసు నిలవలేదు. పైగా అంత పెద్దమనిషిని ఇబ్బంది పెట్టినందుకు ఉల్టా ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడింది. నిజాయితీకి దొరికిన ప్రతిఫలం. కుర్రవాడు ఏం పట్టించుకోలేదు. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఒకరి ముందు తాను ఎలా ఉంటే తనకేమిటి? తన ఆత్మ ముందు తాను వజ్రం! మరో రెండు రోజులు గడిచాయి. ఇన్స్పెక్టర్ ఇంటి ముందు కామందు బండి ఆగింది. లోపలి నుంచి కామందు దిగాడు. తనకు మేనేజర్‌గా పని చేయమని అర్థించాడు. పెద్ద జీతం. పెద్ద దర్జా. బోలెడంత మర్యాద. వజ్రంలాంటి మనిషివి నువ్వు... నాకు కావాలి అన్నాడు. అంతేకాదు. ఇక మీదట దొంగ వ్యాపారాలన్నీ బంద్ చేసి అతడితో ముందుకు నడవడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకు? ఏమీ లేని ఆ కుర్రవాడే అంత నిజాయితీగా ఉంటే అన్నీ ఉన్న తాను ఎంత నిజాయితీగా ఉండాలి? జాతికి కావాల్సిన సంస్కారం అది. పరివర్తన. ప్రేమ్చంద్ది కాయస్త్ల కులం. వీళ్లను ఉత్తరాదిన శ్రీవాస్తవ్లని కూడా అంటారు. వీళ్ల మూలపురుషుడు చిత్రగుప్తుడు. కమ్మరివృత్తి ఒక కులంగా మారినట్టుగా, కుమ్మరివృత్తి ఒక కులంగా వూరినట్టుగా వ్రాయసగాళ్లు ఒక కులంగా మారి కాయస్త్లయ్యారని అంటారు. అయితే ప్రేమ్‌చంద్‌కు రాయడం ఈ వ్రాయసకులం వల్ల ఏర్పడలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి చనిపోతే, మారుతల్లి వేధిస్తుంటే, ఏం చేయాలో తోచక తన ఊరు వారణాసిలో ఎక్కడ పుస్తకాలు దొరికితే అక్కడికల్లా వెళ్లి ఆ అక్షరాల్లో పడ్డాడు. చదివి చదివి కలం చేత పట్టాడు. చిత్రగుప్తుడు వలే అన్ని పాపాలనూ చూసి వాటిని కథలు చేశాడు. ఒకటీ రెండూ అని ఏం చెప్తాం. అన్ని కథలదీ ఒకటే రుచి. కన్నీటి ఉప్పదనం. అతడి ఒక కథ సవాసేర్ ఘెవూ. అంటే సేరుంపావు గోధుమలు. ఏమిటా కథ? ఒక కల్లాకపటం ఎరగని రైతు. హాయిగా బతుకుతుంటాడు. ఒకసారి ఒక సాధువు కాశీకి వెళుతూ ఆ రాత్రికి ఆ రైతు ఇంట బస చేస్తానని అంటాడు. రైతు సంతోషంగా ఒప్పుకుంటాడు. ఇంట్లో జొన్నపిండి ఉంది. కాని సాధువుకు గోధుమ రొట్టెలు చేసి పెడితే మర్యాద కదా అంటుంది భార్య. గోధుమలు లేవు. ఏమిటి దారి? రైతు ఆ ఊరి పురోహితుడి దగ్గరకు వెళ్లి అప్పుగా అని చెప్పి సేరుంపావు గోధుమలు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోతాడు. ప్రతి సంవత్సరం పంట పండాక ఊళ్లో అన్ని కులాల వారికి మేర ఇచ్చినట్టే పురోహితుడికి కూడా ఇస్తున్నాను కదా అన్ని సేర్ల గోధుమలు ఉచితంగా పట్టుకెళుతున్న పురోహితుడికి నా బాకీ చెల్లేసినట్టే కదా అనుకుంటాడు. కాని అతడి లెక్క తప్పు. ఐదేళ్ల పాటు పురోహితుడు ఒక్కమాటా మాట్లాడడు. రైతు కనిపించినా అసలా ప్రస్తావనే ఎత్తడు. ఐదేళ్ల తర్వాత చల్లగా లెక్క తీస్తాడు. ఆనాడు రైతు తీసుకున్న సేరుంపావు గోధుమల ధరను రొక్కంలోకి మార్చి దానికి వడ్డీ వేసి మారువడ్డీ వేసి చక్రవడ్డీ వేసి బండెడు అప్పు తేలుస్తాడు. నీ ఇష్టం. తీర్చకపోతే పైలోకాల్లో దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటాడు. పైలోకాలు ఎలా ఉంటాయో రైతుకేం తెలుసు? దేవుడు సమాధానం కోరితే ఏం చెప్పాలో అంతకన్నా ఏం తెలుసు? అవన్నీ తెలిసింది పురోహితులకే. అయ్యా పురోహితులుగారూ... తమరు చేసింది మోసం. రేపు మీరైనా దేవుడికి సమాధానం చెప్పాలి కదా అనంటే పురోహితుడు లెక్క చేయడు. తాను దైవానికి భయపడను అంటాడు. అలా భయపడాల్సిన పని నోరులేని జనాలదే. ఇక చేసేదేముంది? బంగారం లాంటి రైతు. ఆ అప్పు తీర్చలేక- కేవలం సేరుంపావు గోధుమల అప్పు తీర్చలేక- డబ్బులు చెల్లించీ చెల్లించీ చివరకు పొలాన్ని పోగొట్టుకొని ఆఖరుకు ఆ పురోహితుడి పొలంలోనే వెట్టికి చేరుతాడు. ఈ కథలో రైతు ప్రాణాలతో అయినా మిగిలాడు. మరో కథలో అది కూడా లేదు. ప్రేమ్‌చంద్ రాసిన అతి బీభత్సమైన కథ- సద్గతి. ఒక మాదిగవాడు. జ్వరం నుంచి బయటపడి ఆ పూటే లేస్తాడు. కానీ కూతురి నిశ్చితార్థానికి ఆ రోజే పురోహితుణ్ణి ఇంటికి పిలుచుకుని రావాలి. పురోహితుడొచ్చి ముహూర్తం పెట్టకపోతే ఏ ఇంట ఏ పని జరుగుతుందని? మాదిగవాడు పురోహితుడి ఇంటికి బయలు దేరి- పెద్దవాళ్ల దగ్గరకు ఉత్తచేతులతో పోకూడదు కనుక ఆ నీరసంలోనే గడ్డి కోసి మోపు కట్టి తీసుకెళతాడు. మాదిగవాణ్ణి ముట్టుకోకూడదుగాని అతడు కష్టించి కోసిన గడ్డికి ఏం మైల? పురోహితుడు తీసుకుంటాడు. కాని ఇంటికి మాత్రం రాడు. కాస్త ఆ పని చెయ్ అంటాడు. చేస్తాడు. కాస్త ఈ పని చెయ్ అంటాడు. చేస్తాడు. పెరడంతా ఊడ్చు అంటాడు. ఊడుస్తాడు. ఒక పెద్ద చెట్టు మొద్దు పెరట్లో పడేసి కట్టెలు కొట్టు అంటాడు. పాపం మాదిగవాడు. జ్వరం ఇంకా పోలేదు. కడుపులో పచ్చి మంచినీరు కూడా పడలేదు. కాని తప్పదు. కూతురి నిశ్చితార్థం కోసం, తాను పెట్టుకోలేని ముహూర్తం కోసం ఆ చాకిరి తప్పదు. ఓపిక తెచ్చుకుంటాడు. కాని మొద్దు వాడి గొడ్డలికి లొంగదు. చేతుల్లో బలం చాలదు. ఆకలి. శోష. ఎండిపోతున్న నోరు. నడుమ పురోహితుడి భార్య వచ్చి వాణ్ణి చీదరగా చూసి ఇంట్లో ఒకటి రెండు రొట్టెలు ఉన్నా పెట్టదు. ఏం తల్లీ... రెండు రొట్టె ముక్కలు పెడితే ఏం పోయే... మాదిగవాడు ఏడుస్తాడు. మళ్లీ శక్తి తెచ్చుకొని మొద్దు ఎందుకు లొంగదో చూద్దాం అని... గొడ్డలి విసురుతూ విసురుతూ.. కింద పడిపోయి... గుడ్లు తేలేసి... ఊళ్లో పెద్దగోల అవుతుంది. మాదిగపల్లె ఆడవాళ్లంతా వచ్చి బ్రాహ్మణుడి ఇంట అడుగుపెట్టకూడదు కనుక బయటి నుంచే ఏడ్చి శాపనార్థాలు పెట్టి పోతారు. ఆ కోపంతో శవం తీయడానికి ఎవరూ రారు. వాన మొదలవుతుంది. శవం అలాగే పడి ఉంటుంది. ఇక ఈ మాదిగవాడికి సద్గతి ఏది? పురోహితుడు ఆలోచిస్తాడు. కాసేపటికి ఒక కర్రతో వాడి కాలు ఎత్తి, దానికి తాడుతో ఉచ్చు వేసి దానిని ఏ మాత్రం అంటుకోకుండా లాక్కుంటూ వెళ్లి దూరాన పశువులు చస్తే పారేసే దిబ్బ మీద పారేసి వస్తాడు. మరుసటి రోజు తెల్లారుతుంది. పురోహితుడు యథావిధిగా లేచి ఇల్లంతా సంప్రోక్షణ చేసి నీళ్లు చిలకరించి తన దైనందిన జీవితంలో పడతాడు. కథ ముగుస్తుంది. ఏం కథ ఇది! సద్గతి ఎవరికయ్యా రావాల్సింది? ఈ కులాల వ్యవస్థకి కాదా. ఈ అంటరానితనానికి కాదా. ఈ దోపిడీ ముఠాలకు కాదా. ఈ నీతిమాలిన మనుషులకు కాదా. ఈ కనికరం లేని ఆచారాలకు కాదా. ఇన్నాళ్లు గడిచాయి. పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సంస్కారాన్ని ఆశించాల్సి ఉంది. పని కొనసాగించాల్సి ఉంది. అదిగో- ప్రేమ్‌చంద్ మొదలెట్టిన ఆ పనిని కొనసాగించడానికి- నిబద్ధతతో స్వీకరించడానికి- చాలామంది- నిజంగానే చాలామంది -కథలు రాస్తుంటారు. - ఖదీర్ -
బెంగళూరు బంద్ వాయిదా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ వాయిదా పడింది. ఇదే కార్యక్రమాన్ని ఈ నెల 31న చేపట్టాలని నిర్ణయించినట్లు కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ బుధవారం ఇక్కడ తెలిపారు. కన్నడ సంఘాలతో పాటు చలన చిత్ర పరిశ్రమ, రచయితలు, సాహితీవేత్తలు, పౌర సంఘాలు సహా అందరూ బంద్ విజయం కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఓరుగల్లులో విరసం రాష్ర్ట మహాసభలు
గొంతెత్తిన కవులు, రచయితలు ఆకట్టుకున్న కాగడాల ప్రదర్శన గ్రీన్‌హంట్ పేరుతో సాగుతున్న దురాగతాన్ని కళ్లకు కట్టించిన ‘బాసగూడ’ వరంగల్ డిక్లరేషనే ఉద్యమానికి పునాది అని ప్రకటించిన వక్తలు విప్లవ రచయితల సంఘం (విరసం) 24వ రాష్ర్ట మహాసభలు ఓరుగల్లులో శనివారం ప్రారంభమయ్యాయి. హన్మకొండ అంబేద్కర్ భవన్లో మొదటి రోజు జరిగిన సభ ‘కాళోజీ’ ధిక్కార స్వరాన్ని వినిపించింది. ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్నే విరసం కోరుకుంటోందని గొంతెత్తింది. విరసం లేకుండా తెలంగాణ ఉద్యమం లేదని.. వరంగల్ డిక్లరేషన్‌తోనే తెలంగాణ పోరు ప్రారంభమైందని గుర్తు చేసింది. మానసికంగా ప్రజలను విడదీసి ఉమ్మడిగా దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రతినబూనింది. భౌగోళికంగా విడిపోయిన ప్రజలను మానసికంగా ఏకం చేసి సామ్రాజ్యవాద, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని విప్లవ శంఖం పూరించింది. సుబేదారి, న్యూస్‌లైన్ : ఈ దేశంలో ఖాళీ చేతులను, ఖాళీ డొక్కలను కలిగి ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం మార్క్సిస్ట్ రాజకీయాలేనని, జనతన సర్కార్‌తోనే ప్రజారాజ్యం సాధ్యమవుతుం దని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జి.కల్యాణ్‌రావు అన్నారు. శనివారం రాత్రి హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో(ఆకుల భూమయ్య వేదిక) జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఇస్తే మావోయిస్టులు పెరుగుతారని అన్నారని, ఇలా తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాలు రాయలసీమ, కోస్తాంధ్ర ఇవ్వాలని, అప్పుడు కొత్త రాష్ట్రాలతో మావోయిస్టుల సంఖ్య పెరిగితే ప్రజలకు రక్షణ పెరుగుతుందని అన్నారు. ఈ దేశంలో రెండే రెండు రాజకీయాలు ఉన్నాయని, ఒకటి కాంగ్రెస్ పార్టీ అలయెన్స్‌తో నడిచే రాజకీయాలు, మరొకటి ఎన్డీఏ అలయెన్స్‌తో నడిచే బీజేపీ రా జకీయాలని అన్నారు. అవినీతికి వ్యతిరేక నినాదంతో ముందుకువచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ శతాబ్దంలో పెద్దజోక్ అని అన్నారు. కాంగ్రెస్ రాహుల్‌గాంధీని, బీజేపీ మోడీని, మీడియా, కార్పొరేట్ సంస్థలేమో ఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రివాల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయని, మావోయిస్టు పార్టీ మాత్రం 17 రాష్ట్రాల్లో తన ఉనికిని కలిగి ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో కోస్తాంధ్రలో సముద్రపు ఒడ్డున ఉన్న పాలకూరపాడ్లో తుపాకీ గలాట ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతం ఇప్పటికీ ప్రపంచానికి సందేశం ఇస్తున్న ప్రాంతమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజారాజ్యం ఏర్పడుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం ఆగిపోలేదు : వరవరరావు వరంగల్‌లో బీజప్రాయంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం ఆ గిపోలేదని, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పాకుతూ మరింతగా విస్తరించిందని విరసం సభ్యుడు వరవరరావు అన్నారు. ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిని చూస్తే ఒక లెనిన్‌ను చూసినట్లు అనిపించేదని, ఆయన వేసిన ప్రణాళిక ఫలించి ఇవాళ జనతన సర్కార్ ఏర్పడిందన్నారు. తెలంగాణలో వెయ్యి సంవత్సరాల క్రితమే ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయని, కాకతీయులను ఎదురించి సమ్మక్క, సారలమ్మలు ధిక్కార ప్రత్యామ్నాయాన్ని చూపించారని, అదే విధంగా పాలకుర్తి సోమనాథుడు చాపపుట్టి భోజనాలు ప్రారంభించాడని, కుల రహిత సమాజాన్ని చూపించాడని, కాళోజీ కూడా అదేవిధంగా జీవితమంతా ప్రజాస్వామిక విలువలకు ఒక ప్రత్యామ్నాయంగా నిలిచాడని వరవరరావు అన్నారు. మావోయిస్టులు ప్రజలతో మమేకమై జనతన సర్కారును స్థాపించి ఒక ప్రజా ప్రభుత్వ ప్రత్యామ్నాయాన్ని చూపించారని, చంద్రబాబు వంటి సామ్రాజ్యవాద తొత్తు ప్రపంచ బ్యాంకు నమూనా ప్రత్యామ్నాయాన్ని చూపెట్టారని అన్నారు. దండకారణ్యంలో జనతన సర్కారు ఆధ్వర్యంలో అక్కడ భూమి లేని పేదలు లేరని, అందరికీ భూమి ఉందని, లైంగిక దాడులు లేవని, దోపిడీ లేదని, ఉత్పత్తి రెండున్నర రెట్లు పెరిగిందని చెప్పారు. పోరాడేవారు లొంగిపోరని, ఉసెండి లొంగిపోవడం అనేది జరగలేదని, ప్రసాద్ మాత్రమే లొంగిపోయాడని, ఉసెండి ఎప్పుడు కూడా పోరాట నమునాగా నిలుస్తాడని ఆయన అన్నారు. కొమురం భీం విగ్రహాలను స్థాపించడం కంటే కొమురంభీం ఆశయాలైన జల్ జంగల్ జమీన్ మనదేనన్న నినాదాన్ని స్వీకరించడమే సరైందన్నారు. వరంగల్‌లో మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయని, ఒక్కొక్కరు ఉద్యమంలో ఎదిగిన తీరు తెలిపారు. గంగారామ్, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శ్యాం తదితర అమరవీరులను గుర్తుకుచేసుకున్నారు. తెలంగాణలో ఎందరో తల్లులు కడుపుకోతకు గురయ్యారని అన్నారు. అనంతరం విరసం రాష్ట్ర కార్యదర్శి పి.వరలక్ష్మి మాట్లాడుతూ షరతులు లేని తెలంగాణ ప్రకటించాలని, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, ఆకుల భూమయ్య మరణంపై హైకోర్టు సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని, హిందూ పాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, తిరుపతిలో ఇస్లామిక్ పాఠశాల నిర్మాణాన్ని హిందూ శక్తులు అడ్డుకోవద్దని , నల్లగొండలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఎత్తివేయాలని విరసం సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.రుక్మిణి మాట్లాడుతూ తాను గుంటూరు జిల్లాకు చెందినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. ఈ బహిరంగ సభకు కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు వీఆర్ విద్యార్థి అధ్యక్షత వహించారు. ఉద్యమం ఆగిపోలేదు.. వరంగల్‌లో బీజప్రాయంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం ఆగిపోలేదు. కాకతీయులను ఎదిరించిన సమ్మక్క, సారలమ్మ, కుల రహిత సమాజం చూపించిన పాలకుర్తి సోమనాథుడు, తన జీవితమంతా ప్రజాస్వామిక విలువలకు కాళోజీ దిక్సూచిగా నిలిచి ప్రత్యామ్నాయం చూపించారు. మావోయిస్టులు ప్రజలతో మమేకమై జనతన సర్కారును స్థాపించి ప్రజా ప్రభుత్వ ప్రత్యామ్నాయం చూపించారు. - వరవరరావు సందేశం ఇస్తున్న ‘తెలంగాణ’ తెలంగాణ ఇస్తే మావోయిస్టులు పెరుగుతారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నాడు. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో మావోయిస్టుల సంఖ్య పెరిగితే ప్రజలకే రక్షణ ఉంటుంది. జనతన సర్కార్‌తోనే ప్రజారాజ్యం సాధ్యం. తెలంగాణ ఇప్పటికీ ప్రపంచానికి సందేశం ఇస్తున్న ప్రాంతం. నూతన ప్రాపంచిక దృక్పథాన్ని అందించిన నేల. - కల్యాణ్‌రావు