11, 12 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరులోని రాయల్ ఫంక‌్షన్ హాల్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో దీనికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రగతిశీల రచయితలందరూ ఈ పాఠశాలలో పాల్గొననున్నట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతీయ ఆకాంక్షలు, నోట్ల రద్దు – రాజకీయ ఆర్థిక మూలాలు, ముíస్లింలు, దళితులపై పెరుగుతున్న దాడులు, సామాజిక రంగాల్లో కృషి చేస్తున్న ఆలోచనపరుల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. సాహిత్యంలో వ్యక్తమవుతున్న వివిధ ధోరణులను వస్తుగతంగా, శిల్పపరంగా సమీక్షించనున్నట్లు చెప్పారు. రెండు రోజుల కార్యక్రమంలో కథలు, కవిత్వం, అనువాద సాహిత్యం, చరిత్ర, వర్తమాన సామాజిక వ్యాసాలు వంటి 20 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు వివరించారు. సాహితీ ప్రియులు, విద్యార్థులు, రచయితలు, ప్రజలు, ప్రజా సంఘాల వారు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రచయితలు కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, జింకా సుబ్రమణ్యం, కాశీవరపు వెంకటసుబ్బయ్య, మహమూద్, కొండ్రాయుడు పాల్గొన్నారు.