CM Jagan: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!! | Kommineni Srinivasa Rao Comments On CM Y.S Jagan Mohan Reddy Proddatur Memantha Siddham Public Meeting Full Speech - Sakshi
Sakshi News home page

సీఎం జగన్ ప్రచార గర్జన: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!!

Published Thu, Mar 28 2024 11:59 AM | Last Updated on Thu, Mar 28 2024 2:59 PM

Ksr Comments On Cm Ys Jagan Mohan Reddy Proddatur Public Meeting Full Speech - Sakshi

బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస‍్సార్‌సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం అదిరిన తీరు అదరహో అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అయి ఉండాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా, అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాదానం ఇచ్చారని చెప్పాలి.

విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాన్ని ఆయన బహిర్గతం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీచ్‌లో ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా, సంస్కారవంతమైన విమర్శలు, అర్దవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే..

  • చంద్రబాబు నాయుడు ఈ మద్య కాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలను వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు.
  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ తన పరువు పోగొట్టుకుంటున్నారు.
  • వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్నా, ఆయన తన వైఖరి మార్చుకోవడం లేదు.
  • తాము గతంలో ఏమి చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.
  • ఆయనకు దత్తపుత్రుడుగా పేరొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు.


చంద్రబాబు అసలు పుత్రుడు సంగతి సరేసరి. ఆయన ఎప్పుడూ స్పీచ్‌లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటెన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాలను సవ్యమైన బాషలో వివరించారు. తొలిరోజు ఆయన తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ప్రారంభించారు. 'వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడకు వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు'. ఎప్పటిమాదిరి నుదుట ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస‍్సార్‌సీపీ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి.

అక్కడ నుంచి బయల్దేరి వేంపల్లి, వీరపనాయుని పల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు స్వాగతం చెప్పారు. "కొందరైతే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న బస్‌తో పాటు పరుగులు తీస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టింది". కడప లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన బాబాయి వివేకా హత్య కేసు గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి, చిన్నాన్నను ఎవరో చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలందరికి తెలుసునని అన్నారు. 'వివేకాను చంపి, తానే చంపానని చెప్పుకుంటున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు'. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతలను పేర్లు చెప్పకుండానే వారి గురించి మాట్లాడుతూ, 'రాజకీయ స్వార్దంతో తపిస్తున్న నా చెల్లెళ్లు" అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, చెల్లెళ్లు హంతకులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ఆయన చెల్లెళ్లను తప్పు పట్టారు. ఇదంతా నన్ను దెబ్బతీసే రాజకీయం అని కూడా అంటున్నారంటే.. ఇది కలియుగం అని అనుకోవాల్సి వస్తుందని తాత్వికంగా వ్యాఖ్యానించారు.

దీంతో.. "వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి షర్మిల, సునీత మద్దతు ఇస్తున్నారన్న అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. అలాగే వారిద్దరు తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అవడం, చంద్రబాబు చెప్పినట్లు చేయడం వంటి విషయాలను ఆయన వివరించారు. 'తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ద్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబందించినవారు ఉన్నారని గుర్తించి, దానని కప్పిపుచ్చేందుకు వెంటనే వైఎస్సార్‌సీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు'. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని ఆయన అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు."

  • చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ నలభై ఐదేళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని,
  • వివేకా బతికి ఉంటే శత్రువుగా చూస్తారని,
  • ఆయన చనిపోగానే కొత్త రాగం అందుకుంటారని,
  • ఎన్.టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనవారు, చనిపోయిన తర్వాత ఎన్.టీ రామారావు శవాన్ని లాగేసుకున్నారని,
  • దండలు వేసి, విగ్రహాలు పెట్టారని.. సీఎం ఎద్దేవ చేశారు.

చంద్రబాబు గుణగణాలను ఆయా సందర్భాలలో వివరిస్తూ..

  • చంద్రబాబు నిత్యం అబద్ధాలు, మోసాలపై ఆధారపడి రాజకీయాలను చేస్తారని అని ఆయన ద్వజమెత్తారు.
  • 2014 తెలుగుదేశం మానిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రస్తావించి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ రుణమాఫి తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు.
  • టీడీపీ మానిఫెస్టోని వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా గుర్తు చేశారు.
  • 2014లో ఏ మూడు పార్టీల కూటమి అయితే పోటీచేసి ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కూడా అదే కూటమి పోటీలో ఉందని అన్నారు.
  • చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లపడి పొత్తు పెట్టుకున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవ చేశారు.
  • 2014లోచంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రజలకు చూపిస్తూ, అందులో ఉన్న రుణమాఫీ, నిరుద్యోగ బృతి తదితర హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు.
  • వీరు ముగ్గురు మళ్లీ మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు.
  • ఒకవైపు చంద్రబాబు హామీలలోని డొల్లతనాన్ని వివరిస్తూ.., తాను ఏభైఎనిమిది నెలల్లో అమలు చేసిన వాగ్దానాల గురించి వివరించారు.

ప్రత్యేకించి ఇళ్లవద్దకే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వృద్దాప్య పెన్షన్, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర స్కీములను తాను అమలు చేశానని ప్రజలకు తెలియచేశారు. దిశ యాప్‌తో సహా పాలనతో తీసుకు వచ్చిన సంస్కరణలను, పేదలకు ఇళ్ల స్థలాలు మొదలైనవాటితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను కూడా తెలియచేశారు.17 మెడికల్ కాలేజీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం, కడప తదితర జిల్లాలలో వస్తున్న పరిశ్రమలు మొదలైనవాటి గురించ కూడా వివరించారు.

"దుష్టచతుష్టయంలో బాగంగా ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 ల పాత్రను విమర్శిస్తూ, ఈనాడు రాస్తున్న రోత రాతలు చూశాక 'ఛీ' అని పారేస్తానని" ఆయన చెప్పారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదాకానీ, ఇతరత్రా కొత్త హామీ ఏదైనా సాధించారా అని మూడు పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ మూడు పార్టీల కూటమిని అభివృద్ది నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. 'ఎప్పటి మాదిరి మళ్లీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని వీరు ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవద్దని' వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే తమ కంటిని తమ వేలుతోనే పొడుచుకున్నట్లేనని, ఇప్పుడు అమలు అవుతున్న స్కీములు రద్దు అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. 'ఒక మాటలోచెప్పాలంటే ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్' అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు.

"ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ గంటల తరబడి ఆలస్యం అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను 'సీఎం.., సీఎం..' అంటూ శుభాకాంక్షలు చెప్పిన తీరు కచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్‌గానే ఉంది. ఇది వైఎస‍్సార్‌సీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటే, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి మరింత కంగారు పుట్టిస్తుంది". ఇదే రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన సభలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభతో పోల్చితే చాలా తక్కువ వచ్చినట్లు చెప్పక తప్పదు.

చంద్రబాబు స్పీచ్‌లో కొత్త విషయం ఏమీ ఉండడం లేదు. ఒక అపనమ్మకం కనిపిస్తుంది. అందుకే భయపడి మొదటిసారి కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అర్ధించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్కీముల గురించి ప్రస్తావించడానికి ఆయన వెనుకాడుతున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటి లేని అంశాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదాహరణంగా వివరిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం దూషణలకే పరిమితం అవుతున్నారు. "ఒక పరిశీలకుడు అన్నట్లు చంద్రబాబు ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు". క్రెడిబిలిటి ఆయనకు లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు ఆ ఇబ్బంది లేదు. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా పేదల బవిష్యత్తు కోసం అంతా అండగా నిలబడాలని పిలుపు ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు సభలను చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. 'వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, చంద్రబాబు సభలలో ఆ స్పూర్తి కొరవడినట్లు అనిపిస్తుంది'. చంద్రబాబు నాయుడు మేనేజ్‌మెంట్ వల్లో, ఏమో తెలియదు కానీ, 2019లో మాదిరి తొలి దశలో కాకుండా, ఈసారి నాలుగో దశకు ఎన్నికల తేదీలు వచ్చాయి. అంటే సుమారు నెల రోజులు ఆలస్యంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 'చంద్రబాబు తాను, కూటమి పక్షాలు సర్దుకోవడానికి ఈ టైమ్ అవసరం అని భావిస్తుంటే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఈ టైమ్‌ను తనకు అనుకూలంగా మలచుకుని బస్ యాత్రను పెట్టుకుని జనంలోకి మరింత చొచ్చుకువెళ్లగలిగారు. తద్వారా జనంలో తనకు ఉన్న పట్టు ఏమిటో చూపించగలుగుతున్నారు'. దీని ఫలితంగా వైఎస‍్సార్‌సీపీ ప్రభంజనం మరోసారి రావచ్చన్న అబిప్రాయం కలుగుతోంది.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement