కల్లూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మేమంతా సిద్ధం సభలు సూపర్ సక్సెస్
మండేఎండను సైతం లెక్కచేయకుండా ఊరూవాడా
తరలివచ్చిన వైనం పూతలపట్టు, నాయుడుపేట బహిరంగ సభలకు పోటెత్తిన జనం
రెండు జిల్లాల్లో మూడు రోజుల పాటు సాగిన బస్సు యాత్రకు నీరాజనం
సీఎం వైఎస్ జగన్ యాత్ర విజయవంతంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా హారతులు పట్టి, దిష్టితీసి, దీవెనలందించారు. బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘నువ్వే మళ్లీ సీఎం.. మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ముసలి, ముతక, చిన్నాపెద్దా తేడాలేకుండా అభిమాన నేతను చూసి తరించారు. సెల్ఫీలు దిగి సంతోషంతో ఉప్పొంగి పోయారు. కరచాలనానికి పోటీపడ్డారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. గుండెగుడిలో గూడుకట్టుకున్న అభిమానాన్ని రంగరించి ఆత్మీయతను పంచారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్ నింపగా.. కపట కూటమి నేతల్లో వణుకుపుట్టిస్తోంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న అనేక మంది లబ్ధిదారులు బస్సు యాత్రలో దారి పొడవునా జననేతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ ‘నువ్వు సల్లగా ఉండాలి నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా సాగింది.
ఈ బస్సు యాత్రలో మరోసారి పల్లెలను పలుకరిస్తూ.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఈనెల 2న ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చౌడేపల్లి, పుంగనూరు, సదుం, కల్లూరు, పాకాల, ఐరాల, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి, గూడూరు మండలాల మీదుగా సాగింది. బస్సు యాత్ర సాగినంత దూరం సీఎం వైఎస్ జగన్‌ని చూసేందుకు జనం బారులు తీరారు.
సీఎం బస్సు దిగి వారందరినీ ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగతం లభించింది. దామలచెరువుకు ముందే ఉగాది పండుగ వచ్చిందా? అనిపించేలా పండుగ వాతావరణం కనిపించింది.
ఆత్మీయ సమావేశం
కల్లూరు శివారు ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం, చిన్నసింగమాల వద్ద ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని భరోసా కల్పించారు. వారి ఆత్మీయతతో సీఎం వైఎస్ జగన్ పులకరించిపోయారు. ఇదిలా ఉంటే.. కల్లూరులో నిర్వహించిన బస్సు యాత్రకు ముస్లింమైనారిటీ మహిళలు పోటెత్తారు. దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేటలో ట్రాంజెండర్స్ సీఎం వైఎస్ జగన్‌కి గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆశీర్వదించి ముందుకు సాగనంపారు.
బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలు నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని జనం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా.. పనులన్నింటినీ పక్కనబెట్టి జననేతను ఒక్కసారి చూసేందుకు పరితపించిపోయారు. ఆయా పార్లమెంట్ పరిధి నుంచి వచ్చిన వారితో సభా ప్రాంగణం నిండిపోయి జాతీయ రహదారి కూడా కిక్కిరిసిపోయింది. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
పచ్చ కూటమిలో కుదేలు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించడంతో పచ్చ కూటమి నేతల్లో వణుకు పుట్టింది. చంద్రబాబు వెంకటగిరి, గంగాధరనెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, కుప్పంలో నిర్వహించిన అన్ని బహిరంగ సభలకు హాజరైన జనం ఒక ఎత్తైతే.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభ ఒక్కటే ఒక ఎత్తుగా నిలిచిందని జనం చర్చించుకోవడం కనిపించింది.
అదేవిధంగా మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రకు వెళ్లలేని అనేక మంది టీవీలకు అతుక్కుపోయి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన, ప్రసంగాన్ని వినడం విశేషం. మారుమూల గ్రామాల నుంచి మేమంతా సిద్ధం సభలకు తరలిచ్చే జనాన్ని చూసిని జనం, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ‘కూటమి కుదేలవ్వడం ఖాయం’ అని చర్చించుకోవడం గమనార్హం.
ఇవి చదవండి: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర తొమ్మిదో రోజు షెడ్యూల్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment