అలాంటి చంద్రబాబును ఇంకేమని అనాలి: సీఎం జగన్‌ | AP CM YS Jagan Speech Tirupati Naidupeta Memantha Siddham Meeting | Sakshi
Sakshi News home page

మళ్లీ అధికారంలోకి రాగానే వలంటీర్‌ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

Published Thu, Apr 4 2024 6:01 PM | Last Updated on Thu, Apr 4 2024 7:06 PM

AP CM YS Jagan Speech Tirupati Naidupeta Memantha Siddham Meeting - Sakshi

తిరుపతి, సాక్షి:  మరో ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గం మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడతున్నాం. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం సిద్ధమా? అని నాయుడుపేట ప్రజా ప్రభంజనంను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. 

తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు  యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ‘‘ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు.. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండి’’ అని సీఎం జగన్‌ గుర్తు చేశారు. 

.. ‘‘నాయుడుపేటలో ఇవాళ జన ప్రభంజనం కనిపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంత ఓ జన సముద్రం కనిపిస్తోంది ఇక్కడ. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా.. ఇంటింటికి జరిగిన లబ్ధికి అడ్డుతలుగుతున్న దుష్టచతుష్టయం పై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వలు, తాతలు, సోదరుడు స్నేహితులు అందరికీ మీ జగన్‌.. మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఆ దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్‌ గర్జించే గొంతుకతో ప్రశ్నించగా.. సిద్ధం అంటూ అవతలి నుంచి బదులు వచ్చింది. 

చంద్రబాబును హంతకుడు అనలేమా?
ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. అన్ని వర్గాలకు మనం మంచి చేశాం. 75 శాతం నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. పెన్షన్లను మూడు వేల రూపాయాలకు పెంచుకుంటూ వచ్చాం. ఒకటో తేదీన వలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటి వద్దకే అందించాం. అలాంటిది.. తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీన్ని అడ్డుకున్నది చంద్రబాబు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. పేదల భవిష్యత్తు కొరకు.. అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమా? అని అడుగుతున్నా అని సీఎం జగన్‌ మరోసారి ప్రశ్నించారు.

రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే.. అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను.. తాము చెబితేనే చంద్రబాబునాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా?.వలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు.  జూన్‌ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. తొలి సంతకం వలంటీర్‌ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం అని సీఎం జగన్‌ ప్రకటించారు. 

తెలుసా చంద్రబాబు?
తెలుసా చంద్రబాబు.. తెలుసా యెల్లో ముఠా.. మీ జగన్‌ ఏం చెబుతాడో తెలుసా?. జగన్‌కు నా తోబుట్టువులుగా భావించే అక్కచెల్లెమ్మలు ఉన్నారు. నన్ను మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. నన్ను జగన్‌ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు ఉన్నారని గర్వంగా చెబుతాడు ఈ జగన్‌. వీళ్‌లంతా నా వాళ్లు. వీళ్‌ల భవిష్యత్తు మార్చడం కోసం 58 నెలలుగా అడుగులు పడ్డాయి. గర్వంగా ఈ విషయం చెబుతున్నా. 

చంద్రబాబు ఒక మాట అడుగుతున్నా.. 
అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్‌ కదా. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ,  సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?.. (లేదు అనే మాట వినిపించింది). పైగా చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అని సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్‌. మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం. 

గత 58 నెలల్లో మీ బిడ్డ వేసిన అభివృద్ధి, సంక్షేమ విత్తనాలు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వాళ్ల(చంద్రబాబు అండ్‌ కో) మాదిరి పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పని లేదు. మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఓటేయమని అడిగేందుకు మీ ముందుకు రాగలిగాను. కాబట్టే.. మీ జగన్‌ ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనషుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ఆశీస్సులు కోరుతున్నాడు. రాబోయే ఎన్నికల కోసం కూడా అబద్ధాలు చెప్పడు. సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. పేదలపై ఈ జగన్‌కు ఉన్న ప్రేమ.. ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు.. ఉండదు. మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు.. గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్‌ చెప్పారు.ఔ

ఇప్పటికే కొనసాగిస్తున్న పథకాలు కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగే  అవకాశం ఉంటే తప్పక చేస్తాం.  ఈ 58 నెలల పాలనలో చెప్పనివి కూడా చాలా చేశాం.  భవిష్యత్తులో మేనిఫెస్టోలో చేయగలిగిన మంచి అంతా చేస్తాను అని మీకు తెలియజేస్తున్నా. మరి.. మరోసారి బాబును నమ్మొచ్చా? అని ఆలోచించండి.     

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. 
2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ముగ్గురిని తెచ్చుకున్నాడు. స్వయంగా మేనిఫెస్టో కూడా ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికి పంచాడు. ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు... ప్రధాన హామీలంటూ స్వయంగా సంతకాలు చేశాడు.. మరి 

  • పొదుపు సంఘాల పూర్తి రుణమాఫీ అన్నాడు? చేశాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తా అన్నాడు.. చేశాడా?
  • ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
  • రైతులకు రుణమాఫీ అన్నాడు? చేశాడా?
  • మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా?

ఇలా.. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చాడా?. పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చాడా?.. నేను అడిగేది ఒక్కటే. 2014లో ఇదే పెద్ద మనిషి ముఖ్యమైన హామీలంటూ పంపిన ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా చేయని పెద్దమనుషులు మళ్లీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు రంగు రంగుల మేనిఫెస్టోతో కేజీ బంగారం, బెంజ్‌ కారు, సూపర్‌ సిక్స్‌ అంటూ మోసానికి దిగుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరమా?.. 

వీళ్ల మోసాల నుంచి పేదల భవిష్యత్తును కాపాడుకోవడంలో స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి.. ప్రతీ ఇంట్లో నుంచి ఆ స్టార్‌క్యాంపెయినర్లు వందల మందికి విషయాలు చెప్పాలి. అలా చెప్పించడానికి మీరంతా సిద్ధమా?.. సిద్ధమే అయితే.. జేబుల్లోంచి సెల్‌ఫోన్లు బయటకు తీసి టార్చ్‌ లైట్‌ వెలిగించి గట్టిగా చెప్పండి.. పేదవాడి భవిష్యత్తు కోసం.. వారి అబద్ధాలు, మోసాలు, చీకటి రాతల మీద యుద్ధానికి మేమంతా సిద్ధం అని చెప్పండి

విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనం.. మోసాలు, కుట్రలు మరో వైపు యుద్దం జరుగుతోంది. ఈ ఎన్నికలు.. మన ఓటుతో రాబోయే ఐదేళ్లు అధికారం ఇస్తారు. ఈ అధికారంతో మన తలరాతలు మారుతాయి. అందుకే 175కి 175 ఎమ్మెల్యేలు.. 25 పార్లమెంట్‌ సీట్లతో.. డబుల్‌ సెంచరీ కొట్టడానికి సిద్ధమా?. మరో రెండు నెలల్లో మళ్లీ మీ బిడడ​ అధికారం చేపట్టేందుకు మీ దీవెనలు, ఆశీస్సులు కావాలి. 


వెళ్లే ముందు.. 

  • తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి.. నాకు తమ్ముడిలాంటివాడు. మంచివాడు.. సౌమ్యుడు. 
  • సూళురుపేట నుంచి సంజీవయ్యన్న.. నాకు అన్నలాంటివాడు. మంచివాడు.. సౌమ్యుడు
  • తిరుపతి నుంచి అభినయ్‌.. యువకుడు, ఉత్సాహవంతుడు.. మంచి చేయడానికి అడుగులు వేసేందుకు తాను సిద్ధం అని ముందుకు వచ్చాడు. 
  • గూడురు నుంచి మురళన్న.. మీ అందరికి ఇది వరకే పరిచయం ఉన్న వ్యక్తి. సౌమ్యుడు.
  • సత్యవేడు నుంచి రాజేష్‌.. నాకు తమ్ముడిలాంటి వాడు. మంచివాడు. సౌమ్యుడు.  
  • కాళహస్తి నుంచి మధును . చూడడానికి మొరటు.. కానీ, మనిషి మంచోడు. మనసు వెన్న. 
  • వెంకటగిరి నుంచి రాము.. నాకు స్నేహితుడు కూడా. మంచివాడు.. సౌమ్యుడు..  
  • సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి నా సహచరుడు.. అన్ని రకాలుగా దగ్గరివాడు.. అంతకంటే ఎక్కువ. కష్టకాలంలో పార్టీ బాద్యతలు తాను భుజాన వేసుకుని నిలబడ్డాడు గోవర్థనన్న.. 

మీ అందరి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఈ అభ్యర్థులపై ఉంచాలని ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్‌ కోరారు.

మన గుర్తు తెలియనివాళ్లు.. ఎవరైనా మిగిలి ఉంటే.. గుర్తు ఫ్యాన్‌. ప్రతీ ఒక్కరికీ చెబుతున్నా.. ఫ్యాన్‌ మీద వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవాళ్టి మీ బతుకులంటే ఇంకా మంచిగా చేస్తాను అని మాటిస్తున్నా. మీ బిడ్డకు తోడుగా ఉండడండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.. అని నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభ ప్రసంగం ముగించారు సీఎం జగన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement