పుస్తకం మొత్తం చదవనక్కరలేకుండా కేవలం అట్టల వెనుక ఉన్నది చదివి కూడా ‘సమీక్ష’ రాయొచ్చునని... సాహిత్య ప్రపంచంలో ఒక జోక్. చదవడానికి బద్దకించడం అనేది సర్వ మానవ సమస్య. మన సినిమా రూపొందుతున్నది దీని ఆధారంగానే కాబట్టి దీన్నొకసారి చదవమని ‘ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ’లో సినిమా నటుడి పాత్రధారికి దర్శకుడి పాత్రధారి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ నూరు పేజీల భారీ పుస్తకాన్ని చదవలేక, అందులోని సారాంశం ఏమిటో తన భార్యను చెప్పమంటాడు నటుడు. అలాంటివాళ్ల కోసమే కాబోలు, పుస్తకాలు సంక్షిప్తంగా రావడం మొదలైంది.
కాలం తెచ్చిన మార్పుల్లో వేగం ఒకటి. దేనిమీదా ఎక్కువసేపు ఎవరూ నిలబడటం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. ప్రయాణ సాధనాలు పెరిగి జీవితం వేగవంతం కావడానికీ, పాఠకులు చదవడం తగ్గిపోవడానికీ సంబంధం ఉంది. ఆ పెరిగిన వేగానికి తగినట్టుగా పాఠకులను శ్రోతలుగా మార్చడానికి ఆడియో బుక్స్ మార్కెట్ ప్రయత్నించింది. గంటల తరబడి ఉండే నవలలు యథాతథంగా రికార్డు చేస్తే ఖర్చుతో పాటు అసలుకే మోసం రావొచ్చు.
అలా పుట్టినవే అబ్రిడ్జ్‌డ్ ఆడియో బుక్స్. హెలెన్ కెల్లెర్, ఎడ్గార్ అలెన్ పో, డైలాన్ థామస్ లాంటివారి రచనలు అమెరికాలో తొలుదొలుత ఆడియో బుక్స్‌గా వచ్చాయి. అలాగే అచ్చు పుస్తకాలు ఎన్నో కుదించుకుని అందుబాటులోకి వచ్చాయి. అలా కుదించడం వల్ల కొత్త పాఠకులు సాహిత్యంలో అందుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఇలా వచ్చిన ‘ఏడు తరాలు’, ‘గాన్ విత్ ద విండ్’ లాంటి నవలల అనువాదాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి.
ఎన్నో మేలిమి రచనలను ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రత్యేకించి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించింది. సచిత్ర బొమ్మల భారతం, సచిత్ర బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు మనకు తెలియనివి కాదు. పిల్లల కోసం, పిల్లలంత ఓపిక మాత్రమే ఉన్న పెద్దల కోసం ఎన్నో పుస్తకాలు ఇలా పొట్టిరూపాల్లో వచ్చాయి.
పుస్తకాలను సంక్షిప్తం చేయడం దానికదే ఒక ఎడిటింగ్ స్కిల్. సారం చెడకుండా, టోన్ మారకుండా, ‘అనవసర’ వివరాలు లేకుండా కుదించడం చిన్న విషయమేమీ కాదు. రచయిత ఒక పదం వాడటానికి ఎంతగా ఆలోచిస్తాడో, దాన్ని తొలగించడానికి సంక్షిప్తకుడు అంతే గింజుకుంటాడు. అలాంటి రంగంలోకి కృత్రిమ మేధ జొరబడటమే ఇప్పుడు సాహిత్య లోకంలో సంచలనమైంది.
ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం జూలై నుంచి కొత్త ఏఐ యాప్ ‘మాజిబుక్’ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల క్లాసిక్ రచనలను కుదించడం ఈ యాప్ ప్రత్యేకత. మాబీ డిక్, ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో, క్రైమ్ అండ్ పనిష్‌మెంట్, డ్రాకులా, రాబిన్‌సన్ క్రూసో, ద త్రీ మస్కటీర్స్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద గ్రేట్ గాట్స్‌బీ లాంటి రచనలు ఇందులో ఉన్నాయి.
ఇందులో అత్యధికం తెలుగులోకి అనువాదమైనవే. ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ ప్రారంభ వాక్యాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. ‘ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ద వరస్ట్ ఆఫ్ టైమ్స్.’ (‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’; రెండు మహానగరాలు– తెన్నేటి సూరి అనువాదం.) వీటిని, ‘ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ థింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాడ్’ (‘అదొక చాలా మంచి చాలా చెడ్డల కాలం’) అని ఏఐ కుదించిందని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు.
సంక్లిష్టమైన వాక్య సంచయనానికి లోనుకావడం బౌద్ధిక వృద్ధికి కీలకం అంటారు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ కసాండ్రా జాకబ్స్. రచయితలు తమ పదాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటారనీ, ఏఐ సరళీకృతం చేయడంలో అవి నష్టపోతామనీ ఆమె చెబుతారు. కథకు సంబంధించిన అసలైన అంతరార్థం పోయి, అది తప్పుడు భావనకు దారితీయవచ్చని హెచ్చరిస్తారు. మరో రకమైన విమర్శ భాషకు సంబంధించినది.
పొలిటికల్ కరెక్ట్‌నెస్, తటస్థ మాటల వాడుక పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే శిక్షణ పొందివుండే ఏఐ ‘సహజంగానే’ రచనలోని అసలు మాటల స్థానంలో బోలు మాటలు చేర్చవచ్చు. కొన్నింటిని వివాదాస్పదమైన అంశాలుగా అది చూడవచ్చు. దాంతో రచనలోని భావోద్వేగ తీవ్రతకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అయితే, ‘పుస్తకాలను, వాటి ఆలోచనలను ప్రజాస్వామీకరించడమే’ తమ మిషన్ అని మాజిబుక్ సమర్థించుకుంటోంది. ఆంగ్లం నేర్చుకుంటున్నవారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా డిస్‌లెక్సియా, తీవ్ర ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఇవి ఉపకరిస్తాయని చెబుతోంది.
‘రోబో’ సినిమాలో ‘చిట్టి రోబో’ వందల పుస్తకాలను ఇట్టే స్కాన్ చేయగలుగుతాడు. పుస్తకాలు చదవాలి అనుకుంటూనే చదవలేకపోయే అందరి కల అది. తలగడగా పెట్టుకుంటే వాటికవే అక్షరాలు తలలోకి వెళ్లిపోతే బాగుంటుందని చిన్నతనంలో అనుకోనివాళ్లెవరు? అదంతా ‘కృత్రిమ’ ప్రపంచం. సహజ ప్రపంచంలో మనమే చదువుకోవాలి. సహజంగా చదవలేనప్పుడే కృత్రిమ సాయం అవసరం అవుతుంది. అయితే, రామాయణాన్ని ఆసాంతం చదవనూవచ్చు.
కట్టె కొట్టె తెచ్చె అనేలా విషయమేమిటో తెలుసుకోనూవచ్చు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవడంలో అసలు విషయం మొత్తం రాదనేది రసజ్ఞులందరికీ తెలుసు. విందు భోజనం విందు భోజనమే, రుచి చూడటం రుచి చూడటమే! ఏది కావాలి అనేది మన మేధో కడుపును బట్టి నిర్ణయించుకోవడమే. కానీ ఓసారంటూ రుచి చూడటం కూడా విందు భోజనానికి ఉపక్రమించేలా చేస్తుందేమో! కాకపోతే ఆ రుచి ఆ విందుకు దీటుగా ఉండాలి.
కృత్రిమ సంక్షిప్తం
Published Mon, Aug 26 2024 5:08 AM | Last Updated on Mon, Aug 26 2024 5:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment