సాహిత్య సందడి | South Korean author Han Kang won the 2024 Nobel | Sakshi
Sakshi News home page

సాహిత్య సందడి

Published Mon, Nov 11 2024 3:42 AM | Last Updated on Mon, Nov 11 2024 3:42 AM

South Korean author Han Kang won the 2024 Nobel

సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ  సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్‌ మీట్‌ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. 

అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావిడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్‌ ఫెస్టివల్స్‌ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్‌ ఫోకస్‌ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కుకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.

సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్‌ పురస్కార ప్రకటన. అక్టోబర్‌ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌ కాంగ్‌కు నోబెల్‌ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్‌ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్‌ ఏసియన్‌ ఆర్ట్‌ అండ్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్‌ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్‌ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో ‘ఫ్రాంక్‌ఫర్ట్‌ బుక్‌ ఫెయిర్‌’ జరిగింది. 

గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్‌ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్‌ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్‌ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్‌లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్‌ కోసం ఐదు నవలల షార్ట్‌ లిస్ట్‌ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి.

పురస్కార ప్రకటన నవంబర్‌ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్‌ ఫెస్టివల్‌’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్‌ లిస్ట్‌ ప్రకటించింది. విజేతలను డిసెంబర్‌ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్‌ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్‌లో ‘ద డెహ్రడూన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఆరవ ఎడిషన్‌ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్‌ కపూర్, సల్మాన్‌ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్‌ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.

ఇక, ‘ముంబయి లిటరేచర్‌ ఫెస్టివల్‌’ నవంబర్‌ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్‌ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్‌ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్‌’ను ఫోకస్‌ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్‌ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది.

‘ద మెటమార్ఫసిస్‌’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్‌ అమెరికా రచయిత గాబ్రియేల్‌ గార్సియా మార్వె్కజ్‌. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్‌ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. 

తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్‌కు డిజిటల్‌ రిక్రియేషన్‌ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ నవంబర్‌ 29 నుంచి మూడ్రోజుల పాటు డె్రçహాడూన్‌లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్‌ ఝా, సుజయ్‌ ఘోష్, హుస్సేన్‌ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు. 

లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్‌’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్‌స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్‌ ఫెయిర్‌’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement