ఆ దీవి పేరేమిటో అక్కడుంటున్న ప్రజలకు కూడా తెలియదేమో! పదిహేనేళ్లకి పైగా అక్కడ కొన్ని వస్తువులు లేదా వస్తుజాతులు మాయమైపోతున్నాయి. ఉదాహరణకి– పక్షులు, రిబ్బన్లు, గులాబీలు, అత్తరులు లాంటివి. అదృశ్యమైపోవడమే కాదు– వాటి జ్ఞాపకాలు, అనుభూతులుకూడా మాయమైపోతున్నాయి. పక్షులు ఎలా ఉంటాయో, అత్తరు వాసన ఎలా ఉంటుందో ఇప్పుడెవరికీ తెలీదు. కొత్తగా ఏదైనా మాయమైనప్పుడు వాటి ఆనవాళ్లని ప్రజలు ఉంచుకోగూడదు. అన్నింటినీ నాశనం చేసేయాలి. అలా చేయకపోయినా, ఆ జ్ఞాపకాలని పదిలంగా ఉంచుకున్నా ఆ దీవి మీద ఉన్న మెమొరీ పోలీస్ వచ్చేస్తారు. వాళ్లు ప్రతి ఇల్లూ పద్ధతిగా శోధించగలిగిన శక్తిసామర్థ్యాలూ, చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతా ఉన్న అధికారులు. అవసరమయితే అరెస్ట్ చేయగలరు, ప్రశ్నించి నిజాలు రాబట్టగలరు.
తల్లిదండ్రులని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న కథకురాలు ఒక రచయిత్రి. చిన్నప్పటినుంచీ పరిచయమున్న ఒక ముసలాయన మినహా ఆమెకి చెప్పుకోదగ్గ ఆత్మీయులు లేరు. తన నవలల గురించి చర్చించడానికి పబ్లిషింగ్ హౌస్‌లోని ఎడిటర్‌ని మాత్రం అప్పుడప్పుడూ కలుస్తూంటుంది. ‘‘అదృశ్యమైపోతున్నవాటి గురించి మేము పెద్దగా ఆందోళన చెందం. మిగిలున్న వాటితో సరిపుచ్చుకుంటాం’’ అని అభావంగా అంటుంది. కానీ అందరూ ఇలా ఉండరు. పదిహేనేళ్ల క్రితం కథకురాలి తల్లి అలాంటి జ్ఞాపకాలనీ, అదృశ్యమైన వస్తువులనీ పదిలపరచుకున్నప్పుడు మెమొరీ పోలీసులు ఆవిడని తీసుకెళ్లారు. నాలుగు రోజుల తర్వాత ఆవిడ శవాన్నీ, డెత్ సర్టిఫికెట్‌నీ ఇంటికి పంపారు! ఇప్పుడు కథకురాలి ఎడిటర్ కూడా అలాంటి పురాజ్ఞాపకాలు ఉన్నవాడే. పోలీసుల నుంచి కాపాడటం కోసం కథకురాలు అతన్ని తన ఇంట్లో దాచడం, ఆ తర్వాతి పరిణామాలు, ఆ సమాజం ఎక్కణ్నుంచి ఎక్కడికి ప్రయాణించిందీ అనేది మిగిలిన కథ. నవలలో మూగ అమ్మాయి గురించిన ఉపకథ ఒకటి ఉంటుంది– అది కథకురాలు రాస్తున్న నవల. మూగతనం సహజంగా ఉన్నా, అది మనమీద రుద్దబడినా ఫలితం మాత్రం ఒక్కటే అన్నది స్పష్టం చేస్తాయి ఆ కథా, ఈ కథా.
రచయిత్రి యోకో ఒగావా పాతికేళ్ల క్రితం రాసిన జాపనీస్ నవల ‘ద మెమొరీ పోలీస్’ ఇంగ్లిష్ అనువాదం గత సంవత్సరం విడుదలై, బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్–2020 షార్ట్‌లిస్ట్‌లో ఎన్నికైంది. మెమొరీ పోలీస్ గురించిన వివరాలు కానీ, వాళ్లు ఎవరి అధీనంలో పనిచేస్తున్నారన్నది కానీ రచయిత్రి నవలలో ఎక్కడా చెప్పరు. కథ అధివాస్తవిక ఆలెగరీ అని అర్థం అవుతూంటుంది. అబద్ధాలని సైతం నిజాలుగా చూపించో, లేక నిరంకుశత్వాన్ని ప్రదర్శించో నడిచే ప్రభుత్వాల గురించీ, అక్కడి ప్రజల నిమిత్తమాత్రత గురించీ రాయబడ్డదన్న విషయం అర్థం అవుతుంది. కానీ, ఇది అంత తేలిగ్గా ఒక్క అన్వయానికి మాత్రమే సరిపెట్టుకోగల కథ కాదు. ఒక తాత్త్విక తలంలో ఈ ఆలెగరీ వృద్ధాప్యం లేదా మరణం గురించి కూడా అయివుండవచ్చు. జ్ఞాపకాలన్నీ కరిగిపోగా, కావలసినవాళ్లు దూరమై, అవయవాలు స్వాధీనంలో లేని ఒక దశకి మనిషి చేరుకోవడాన్ని ఉద్దేశించినదీ అయివుండవచ్చు.
ఆలోచిస్తే అన్వయాలు ఇంకా తోచే అవకాశం ఉన్న కథ. పాతికేళ్ల క్రితం ఈ నవల వచ్చినప్పుడు, ఇది ఇంటర్నెట్‌ని ఉద్దేశించిన ఆలెగరీ అనుకున్నారట. పాతికేళ్లయినా ఈ నవల కొత్త అర్థాలలో విచ్చుకుంటూ, ప్రాసంగికతని కోల్పోలేదన్నమాట! స్టీవెన్ స్నైడర్ చేసిన అనువాదం సరళంగా ఉండటమే కాకుండా, మూలభాషలోని కథనస్ఫూర్తి ఇదే అనిపించేలా ఉంది. పుస్తకాలు అదృశ్యం అయిన సన్నివేశంలో, మిగిలివున్న పుస్తకాలని అందరూ తగలబెట్టేస్తుంటారు. విసిరేసిన చివరి పుస్తకాన్ని, ఎగిరిపోతూ ఉన్న ఆఖరి పక్షితో పోల్చిన సన్నివేశాన్ని చదువుతున్నప్పుడు– ఉద్వేగభరితమైన క్షణాలని సైతం చాలా మామూలు పదాలతో వర్ణించడం గమనించవచ్చు. కథకురాలి గొంతులోని పాసివిటీ మాత్రం పాఠకుడి మీద ఒత్తిడి పెంచుతుంది. జరుగుతున్న అన్యాయాలకి కథకురాలు స్పందించకుండా ఉండటం ద్వారా పాఠకుడిని అదనపు ఉద్వేగానికి గురిచేయడం రచయిత్రి కథన ప్రతిభే!
నవల: ద మెమొరీ పోలీస్
మూలం: యోకో ఒగావా (1994)
జాపనీస్ నుంచి ఇంగ్లిష్: స్టీవెన్ స్నైడర్ (2019)
- ఎ.వి. రమణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment