చలం ఆధ్యాత్మిక జీవితం గురించి కొత్త నవల వెలువడింది. చలం జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వావిలాల సుబ్బారావు ‘చలం నీడ చెప్పిన కథ’ పేరుతో రాశారు. ఆధ్యాత్మిక సాధన కోసం 20 ఏళ్లుగా అరుణాచలంలోని భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో నివసిస్తున్న చలాన్ని ఇంటర్వూ్య చేసేందుకు ఆకాశవాణి తరఫున బాలాంత్రపు రజనీకాంతరావు అక్కడికి వెళ్లారు. ఇంటర్వూ్య అయిన తర్వాత రికార్డింగ్ ఆపేసి, కొన్ని ప్రశ్నలు అడిగారు.
రజని: సహజ పరిణామం కోరుకునే మీరు వైరాగ్యానికీ, నిస్సంగత్వానికీ దారితీసే రమణ మార్గాన్ని ఎందుకు ఇష్టపడ్డారు?
సౌరిస్: రేడియో రికార్డింగు అయిపోయింది గనుక నేను కూడా కూర్చుంటాను.
రజని: అయ్యో ఎంత మాట! చలం గారిని చెయ్యి పట్టుకుని నడిపించారు. మిమ్మల్ని చలం అభిమానులు ఎప్పుడూ గౌరవిస్తారు.
సౌరిస్: చలాన్ని గాక మరొకర్ని నడిపించి ఉంటే నన్ను పెద్దగా అనుకునేవారు కాదని తెలుసు.
రజని: మహర్షి దగ్గరకు మీకంటే నాన్నగారే ముందు వచ్చారు. కానీ మీ ప్రయాణమే ముందుకు సాగింది, ఎందుకని?
సౌరిస్: నాన్నలో తర్కించటం, ప్రశ్నించటం ఎక్కువ. అది విజ్ఞాన శాస్త్రానికి ఉపకరించినంతగా ఆధ్యాత్మిక సాధనకు సహకరించదు. ఇందులో విశ్వాసంతో ముందుకు సాగాలి. నాన్న తన అనుభవాలను తానే అనుమానిస్తాడు. ఇది ఆధ్యాత్మికానుభవమా, భ్రాంతిలో పడుతున్నానా అని సందేహించుకుంటాడు. నడక ముందుకు సాగదు, వెనక్కు నెడుతుంది.
చలం: అవును. నా జీవితమే ప్రశ్నలతో ప్రారంభమయింది. కాకినాడ జీవితం నుండి మొదలు. విశ్వాసంతోనే ఆగివుంటే తెనాలిలో గాయత్రీ జపాల దగ్గరే ఆగిపోయి వుండేవాణ్ని.
రజని: తర్కంతో ప్రశ్నించటం– విశ్వాసంతో ప్రశ్నించకపోవటం–– ఈ రెండు మార్గాలలోనూ మీ ప్రయాణం సాగింది. వాటి లాభనష్టాలు గ్ర హించారు. ఇప్పుడు మాకేది సూచిస్తారు?
చలం: ఇందులో లాభనష్టాలు, బేరసారాలు ఏమీ లేవు. అది ఒక మనోధర్మం. ప్రతివాడిలోను రెండు ఉంటాయి. ప్రేమలో తర్కించటాలు, ప్రశ్నించటాలు వస్తే అనుభవం పోతుంది. ఇప్పుడు నా ప్రయత్నమంతా నిరంతర శాంతి ప్రేమలను పొందటం, ఏ అనుభవానికయినా తర్క పరిశీలన శత్రువే. (పే.205, 206)
చలానికి తన అనుభవమే గీటురాయి, విశ్వాసం కాదు. చలం మొదటిసారి 1936లో తన మిత్రుడు చింతా దీక్షితులు సలహాతో రమణ మహర్షిని దర్శించాడు. కానీ నమ్మకం కలగలేదు. ఇక్కడి నుంచి ఈ నవల మొదలై 1975లో జల్లెళ్లమూడి అమ్మ స్వయంగా రమణాశ్రమం వచ్చి చలాన్ని ఆశీర్వదించి వెళ్లిపోయేదాక సాగుతుంది. స్త్రీలకు లైంగిక స్వేచ్ఛ ఉండాలని విస్తృతంగా రాసిన చలం 1950లో అకస్మాత్తుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోవడం చలం అభిమానులకు మింగుడు పడలేదు. ఈ నవల అటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తుంది. చాలామంది అనుకునేదేమంటే, చలం తన పూర్వ విశ్వాసాలను త్యజించి, ఆధ్యాత్మికవాదిగా మారిపోయి, పరస్పర విరుద్ధ జీవితం భగవాన్ చెంత గడిపాడని. కానీ అది నిజం కాదని ఈ నవల చదివితే తెలుస్తుంది. అయితే చలం రమణాశ్రమంలో ఏం చేశాడు?
టాగోర్ గీతాంజలిని చక్కగా అనువదించాడు.
అన్నిటికంటే మంచి అనువాదంగా అది పేరు పొందింది. భగవద్గీతను సరళంగా అనువదించాడు. బైబిల్‌ను తెలుగులోకి అనువదించాడు. సుధ పేరుతో తన జీవితానుభవాలను కవిత్వీకరించాడు. మద్రాస్ వెళ్లి అనార్కలి సినిమాకు రచన చేశాడు. తన జీవిత కథను డిక్టేట్ చేశాడు. శ్రీశ్రీ చలాన్ని మహర్షి అని పిలిచేవాడు. తనకు మద్రాసులో మనశ్శాంతి లేనప్పుడల్లా చలం వద్దకు వచ్చి రీచార్జి అయి పోయేవాడు. చలం మిత్రులు అనేక మంది– చింతా దీక్షితులు, చిన్నారావు, బీవీ నర్సింహారావు, కే.సభా, సినీనటుడు నాగయ్య చలాన్ని కలిసి ఆధ్యాత్మిక సంభాషణలు సాగించి వెళ్లి పోయేవారు. ఈ నవల చదివిన తర్వాత చలం కడపటి జీవితంపై నాకుండిన సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి.
- కర్ర ఎల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment