నేడు అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం
మన దేశంలో కొత్తగా పెళ్లయిన దంపతులను ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి.
అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కురచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురూ ఒక వరంలా వర్థిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా, కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభి్రపాయాలు.
మీ కూతుళ్లకేం ఇస్తున్నారు?
‘మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉన్నట్లయితే అమ్మాయినే చదివించండి‘ అంటారు పెరియార్. ఆడపిల్లల చదువుప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబన కలిగివుండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కుకున్నాం.
ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వాళ్ల చివరి రోజుల్లో వారి ఆలనా పాలనా నేను చూసుకోగలిగాను. ఇప్పుడు అమ్మాయిలకి కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. ఇంట్లో నేను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు ఎనిమిది వందల మంది కూతుళ్లు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు, ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి తల్లిదండ్రులు సమాజం చేయగలిగినదంతా చేయాలి. నేటితరం కూతుళ్లందరికీ నా శుభాకాంక్షలు.
– ఎం. ప్రగతి, రచయిత్రి, అనంతపురం
కూతురి ప్రపంచంలోకి వెళతాను
ఏలూరు దగ్గర, కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న పెద్దరైతు కుటుంబంలో పుట్టాను. నలుగురాడపిల్లల్లో కడసారిదాన్ని. కూతురుగా ఎట్లా ఉన్నానో, ఉంటున్నానో తరచి చూసుకుంటుంటే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందుకు అమ్మానాన్నల మీద అరిచేదాన్నని అమ్మ చెపుతూ ఉంటుంది. కాని బుద్ధి పెరిగాక ఎపుడూ విసిగించింది లేదు. ‘మగపిల్లలు లేరు, అంతా ఆడమంద’ అని లోకం వెక్కిరించే రోజుల నుంచి ‘మా బిడ్డలు రత్నాలు’ అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకూ కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు. కులాన్ని వదిలి నా పెళ్లి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినపుడూ వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీని ప్రేమమూర్తుల కూతురిని. స్త్రీలకి అన్నిరంగాలలో స్వేచ్చ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు.
నేను నమ్మే వాటికి, పెంపకానికి మధ్య కొన్ని విషయాలలో పేచీలు వచ్చేవి, దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. ‘స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా’ అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏ మాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిపుడు. తనతో గడపడం కోసం నేను ఎదురు చూడడం కాదు, ‘అమ్మా... ముచ్చట్లు చెప్పుకుందామా?’ అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. ‘నా విలువలకి అనుగుణంగా పెళ్లి చేసుకోకపోతే నేను రాను’ అని బెదిరించబోయానా! ‘నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు’ అని గట్టిగానే చెప్పింది. కూతురుగా, కూతురి తల్లిగా నా బొమ్మ వారికి సూపర్ హిట్.
– కె.ఎన్. మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నం
ఏ దేశ కరెన్సీ సరిపోదు
ఫలానా అమ్మాయికి మేము తల్లితండ్రులం అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి ‘అమ్మా! నీలాగా నా జీవితం ఇంటికి, పెళ్లి, పిల్లలకు అంకితం అవ్వకూడదు’ అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీటిని దాచిపెట్టేది. అపుడు అర్థం అయ్యేది కాదు... నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనానికి అర్థం నిస్సహాయత కాదు అది అంతర్మథనం అని నాకు తెలియలేదు.
మా అమ్మ ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. ఇద్దరూ పిన్నులు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్నా ఇంటికే పరిమితం ఐపోయింది. కానీ ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ ఐనా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్తున్నా ఇలా కారణం ఏదైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిన్నులు జీతం సంపాదించే వారు కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేక పోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు..‘ ఇది నాకు కూతురు కాదు... మా అమ్మ అక్కలను కలిపి మళ్లీ పుట్టించాడు దేవుడు’ అని.. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటే ఉద్యోగాలే చెయ్యక్కర్లేదు.. అందరినీ నా వారు అనుకుంటూ కలుపుకుని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించొచ్చు.
ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి, చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది ఇది మా అమ్మ కథ కాదు. కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటిపట్టున మిగిలిపోయాము అని బాధపడే ఆడపిల్లల, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయాము అని బాధ పడుతూ వుంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మ నాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి పంచుతున్నారు, కుటుంబాలను, కలలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెల కట్టి డబ్బు ఇవ్వాలని ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే నా 17 నెలల కూతురు ‘అమ్మ జూచు జూచు’ అనుకుంటూ ఒక గ్లాస్ ను వంకర టింకరగా పట్టుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది.
– ప్రవల్లిక, రచయిత్రి, సికింద్రాబాద్
కూతుళ్లు మేజిక్ చేస్తారు
ఇంటికి ఆడపిల్ల వుండటం గొప్ప వైభవం. నేను ఒక కూతుర్ని, ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతుర్ని కాదు. బహుశా ఇంకొంచం బాగా వుండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో/కుటుంబంతో అనేక విషయాల్లో విభేదిస్తూ, గొడవ పడుతూ, అప్పుడప్పుడూ సర్దుకుపోతూ, నా స్వాతంత్ర కాంక్షను, అభి్రపాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండిమనిషి కాబట్టి చిన్నతనంలో అలవికాని నా అల్లరిని, ఇప్పటికీ నా స్వభావంలో వుండే లోపాల్ని భరిస్తోంది. సున్నితమైన అమ్మైతే చాలా కష్టం అయేది.
కూతురిగా నాకై నేనైతే జస్ట్ పాస్ మార్క్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరకొస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాలకన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్లు, తల్లులకన్నా, తండ్రులకు సన్నిహితంగా వుంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా వుంటుంది. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా, మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఇవాళ మా అమ్మ దగ్గరకువెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని, తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుర్లు అంతే. మురిపిస్తారు. మాజిక్ చేస్తారు.
– ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, రచయిత్రి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment